6, ఆగస్టు 2017, ఆదివారం

బాల్యం నుంచి బాధ్యతల చివరంచుల దాకా ......భండారు శ్రీనివాసరావు


“ఘనుడా భూసురుడేగెనో నడుమ మార్గశ్రాంతుడై చిక్కెనో
విని కృష్ణుండది తప్పుగా దలచెనో విచ్చేయునో ఈశ్వరుం
డనుకూలింప దలంచునో దలచడో ఆర్యా మహాదేవియున్
నను బాలింప నెరుంగునో నెరుగదో నా భాగ్యమెట్లున్నదో”

రుక్మిణీ  కళ్యాణంలో  పద్యం శ్రావ్యంగా వినబడుతోంది. పాడుతున్న అమ్మాయికి పన్నెండేళ్ళు వుంటాయేమో. వింటున్న వాళ్లు మాత్రం ఆరుపదులు దాటిన  వాళ్ళే. పుస్తకం అవసరం లేకుండా కంఠతా వచ్చిన పద్యాన్ని రుక్మిణీ దేవే స్వయంగా ఆవహించి పాడుతున్నదా అన్నట్టుగా ఆలపిస్తున్నది మా అన్నపూర్ణక్కయ్య. మధ్యలో మంచంలో చేతిలో తావళంతో మా బామ్మ, కొంత దూరంలో మరో మంచంలో మా  బామ్మ అమ్మ చెల్లాయమ్మ అమ్ముమ్మ. ముక్కాలిపీట  పై కాలు మీద కాలువేసుకుని తన్మయంగా వింటున్న మరో శ్రోత మా లలితమ్ముమ్మ. వొంటింట్లో పనిచేసుకుంటూనే ఓ చెవి ఇటు వేసి వింటున్నది మా అమ్మ.  ఈ దృశ్యం ఆ ఇంట్లో పరిపాటే.
ఆ ఇల్లే నేను చిన్నప్పుడు పుట్టి పెరిగిన ఇల్లు. చిన్నప్పటి ఈ సంగతులు గురించి మా అక్కయ్యలు, అన్నయ్యలు  చెప్పగా వినీ వినీ  అవన్నీ నా మనసులో ముద్రపడి పోయాయి. అరవై ఏళ్ళ కిందటి ముచ్చట్లు, ఏళ్ళు గడిచినా మనసులో అలా పచ్చగా వుండిపోయాయి.
ఇప్పటికీ కుగ్రామంగా వున్న మా వూరు కంభంపాడు అప్పుడు  ఎలావుండి వుంటుందో  వూహించుకోవాల్సిందే.
మా నాన్నగారు వూరికి కరణం. పేరుకు బోలెడు ఆస్తి. వూరిచుట్టూ ఎటు చూసినా ఎంతదూరం వెళ్ళినా మా పొలాలే. ఐదో అక్కయ్య అన్నపూర్ణ అక్కయ్యను పక్కవూరు పెనుగంచిప్రోలు  పెద  కరణం గారి అబ్బాయి అప్పారావుకుకు  ఇచ్చి పెళ్లి  చేశారు. ఈ సంగతి  ఇప్పుడెందుకంటే కొత్త అల్లుడు పొరుగూరు నుంచి  గుర్రం మీద అత్తగారింటికి మా ఊరు  వచ్చినప్పుడు ఆ గుర్రాన్ని మేతకు వొదిలేవారు. ఇక  అది తిరిగి మేసినంత మేరా మా పొలాలే. కానీ ఏం లాభం? వందల ఎకరాల భూమి మీద వచ్చే అయివేజు మాత్రం అంతంత మాత్రమే. కరణీకం మీద వచ్చే జీతం రాళ్ళు నాలుగే, ఇంటి ఖర్చుకు ఆధారం. వర్షాలు లేక పంటలు పండక రైతులు సర్కారుకు శిస్తుకట్టలేక ఇళ్ళూ పొలాలు వొదులుకుని వూళ్ళు వొదిలి వెళ్ళే రోజులవి.
అలాటి రోజుల్లో మా బాల్యం గడిచింది. అలాటి పల్లెటూరిలో మా చిన్నతనం నడిచింది.
మా నాన్నకు  ఏడుగురు ఆడపిల్లలు.  నలుగురు మగపిల్లలం.
ఇంతమందికే కాదు, ఇంకా ఇంతమంది ఇంట్లో  విస్తళ్ళు వేసే సమయానికి భోజనాలకు సిద్ధంగా వుండేవారు. పూటకూళ్ళ ఇల్లు లేని వూరు. ఎవరొచ్చినా చేయి కడిగేది వూరి కరణం గారింట్లోనే.
మా అమ్మా నాన్న, బామ్మ, ఆమె తల్లి గారు, పెనిమిటి వొదిలిపెట్టిన ఒక మేనత్త, ఇద్దరు జీతగాళ్ళు, వచ్చిపోయేవాళ్ళు ఇంతమందికి మా అమ్మే వండి వార్చేది. ఉదయం లేచిన దగ్గరనుంచి రాత్రి పొద్దుపోయేవరకు నడుం వాల్చే వీలు వుండేది కాదు. దీనికి తోడు నిప్పులు కడిగే ఆచారం మా బామ్మది. వూరి పొలిమేరలో చెరువుకట్ట దగ్గర వున్న మంచినీళ్ళ బావినుంచి తడి చీరెకట్టుకుని బిందెలతో నీళ్ళు పట్టుకురావడంతో మా అమ్మ డ్యూటీ మొదలయ్యేది. మైలకు పనికొచ్చే నీళ్ళు ఆడపిల్లలు తీసుకువచ్చేవాళ్ళు.
మా ఇంటి వెనుక ఉసిగె వాగు. దాన్ని ఆనుకుని శివాలయం. అందులోనే హనుమంతుడి గుడి. పక్కనే పూడిపోయిన కోనేరు. దాని వెనుక లక్ష్మయ్య తాతయ్య పొలాలు. దాన్ని ఆనుకుని మా అప్ప పొలం నల్లగడ్డ. దానిపక్కనే తుమ్మల వాగు. ఆ వాగు దాటుకుని వెడితే సుబ్బయ్య తాతయ్య గరప చేను. అందులో స్వాములవారి ఆశ్రమం. శివుడి గుడి. అందులో కాశీ నుంచి తెచ్చి స్వాములవారు ప్రతిష్టించిన శివలింగం.
ఇంట్లో పెద్దవాళ్ళు నా చిన్నతనంలో చెప్పుకునే మాటలు  ఒకటీ అరా అలా గుర్తుండి పోయాయి. పెద్దక్కయ్యలు రాధక్కయ్య, శారదక్కయ్య హిందీ నేర్చుకోవడానికి వూరి పొలిమేరల్లో వున్న స్వామి గారి ఆశ్రమానికి వెళ్ళేవాళ్లు. చిన్నక్కయ్యలు సరస్వతక్కయ్య, అన్నపూర్ణక్కయ్య  బామ్మతో తోటకు వెళ్ళి కూరలు కోసుకువచ్చేవాళ్ళు.  శివరాజు నాగభూషణం గారి అరుగు బడిలోనే అందరి చదువులు. ఆయన పొద్దున్నే లేచి, స్నానాదులు ముగించుకుని –
హరి యను రెండక్షరములు
హరియించును పాతకముల నంబుజనాభా
హరి నీ నామ మహాత్మ్యము
హరి హరి పొగడంగ వశమె హరి శ్రీకృష్ణా|
అంటూ కంచుకంఠంతో కృష్ణ శతకం వూరంతటికీ వినబడేటట్టు ఎలుగెత్తి చదివేవారు.
అదే మా  క్లాసు బెల్లు.
(ఇంకా వుంది)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి