5, ఆగస్టు 2017, శనివారం

శ్రద్ధాంజలి – కృతజ్ఞతాంజలి



ఈ రోజు మా అమ్మగారు శ్రీమతి వెంకట్రావమ్మ గారి ఆబ్దీకం.


ఆమె కాలం చేసి రెండు దశాబ్దాలకు పైగా గడిచిపోయాయి. ఆమె చనిపోయిన రోజు ఇంకా కళ్ళకు కట్టినట్టు వుంది.  శ్రావణ మాసంలో ఆఖరి శుక్రవారం. ఆవిడకు వొంట్లో బాగా లేదని తెలిసి అంతా వచ్చారు. ఇంటి కోడళ్ళు అందరూ శుక్రవారం నోములకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఆవిడ వారి నోములకు, వాయినాలకు ఆటంకం కలిగించకుండా అన్నీ పూర్తయ్యేవరకు వుండి ఆ తరువాత కన్ను మూసింది. దహన సంస్కారాలు పూర్తికాగానే, మా పెద్దన్నయ్య పర్వతాలరావుగారు ఆమె అపరకర్మలు కాశీలో జరపాలని ప్రతిపాదించడం, అన్నాతమ్ముళ్ళు, అక్కాచెల్లెళ్లు, బావగార్లు అందరం వారణాసి వెళ్లి ఆ పవిత్ర ప్రదేశంలో గంగా తీరంలో పిండ ప్రదానాలు చేసి తర్పణాలు విడవడం అంతా ఓ కలలా జరిగిపోయింది.
మా నాన్నగారు రాఘవరావు గారు చనిపోయి అనేక దశాబ్దాలు దొర్లిపోయాయి. నా చిన్నతనంలోనే కన్నుమూయడం వల్ల,  ఆయన రూపం కూడా నాకు గుర్తు లేదు.  ఆయన ఆబ్దీకాలను మా పెద్దన్నయ్య పర్వతాలరావు గారు అత్యంత శ్రద్దాసక్తులతో  ప్రతియేటా క్రమం తప్పకుండా నిర్వహిస్తూ వచ్చారు. మా స్వగ్రామంలో వరుసగా నలభయ్ యాభై ఏళ్ళపాటు జరుగుతూ వచ్చిన  ఈ ఆబ్దీకాలు,  కాలక్రమంలో  వాస్తవంగా ఒక పండుగ మాదిరిగా మారిపోయాయి. ఎక్కడెక్కడి నుంచో చుట్టపక్కాలందరూ ఓ శుభకార్యానికి వచ్చినట్టు హాజరయ్యేవారు. పిల్లలు, వారిపిల్లలు, వారి పిల్లలు  ఇలా అందరూ,  అదొక తద్దినం అనే  కన్నా కూడా నలుగురు కలిసి  పెద్దలను సంస్మరించుకునే ఒక అవకాశంగా భావించి,  ఒకరికొకరు  కూడబలుక్కుని  ఆరోజుకల్లా అంతా ఠంచనుగా ఓ దారీతెన్నూ లేని  ఆ చిన్న పల్లెటూరు మా వూరు  కంభంపాడు చేరుకునేవారు. నిజానికి ఈ యావత్ కార్యక్రమానికి వెన్నుదన్ను మా మూడో అన్నయ్య వెంకటేశ్వరరావు గారు. ఆయన మా వూరు కరణీకం చేసేవారు. ప్రతియేడూ మా నాన్న తద్దినానికి పెళ్ళికి పంపినట్టు అందరికీ పేరుపేరునా  వర్తమానాలు పంపేవారు. మా నాన్న ఆబ్దీకం అంటే మా వూళ్ళో ఓ సందడి. వూరబంతి పెట్టేవాళ్ళు. మా ఇంట్లో ఆడపిల్లల పెళ్ళిళ్ళ కంటే తద్దినాలు ఘనంగా జరిగేవని చెప్పుకునేవారు.
ఇన్నేళ్ళ తరువాత కొన్ని విషయాలు చాలా బాధాకరంగా అనిపిస్తాయి. అన్ని సంవత్సరాలుగా అంత శ్రద్ధగా ఘనంగా మా అమ్మానాన్నల తద్దినాలను బాధ్యతగా  నిర్వహిస్తూ వచ్చిన మా పెద్దన్నయ్య పర్వతాలరావు గారు, మూడో అన్నయ్య వెంకటేశ్వర రావుగారు ఈ నాడు మా మధ్యన లేకపోవడం మేమందరం  తట్టుకోలేకపోతున్న ఓ విషాద పరిణామం. మూడో అన్నయ్య ఏకంగా మా వూరిలో అమ్మానాన్నల గుడినిర్మించి చరిత్రలో నిలిచిపోయారు. ఇప్పుడా గుడి పక్కనే వారిద్దరి స్మారక చిహ్నాలు నిర్మించి మా అన్నయ్య పిల్లలు ఆయన ఋణం కొంతమేర తీర్చుకున్నారు.
పోతే, చావంటే ఏమిటో తెలియని రోజుల్లోనే తండ్రిని పోగొట్టుకుని, తద్దినం అంటే ఏమిటో అర్ధం కూడా తెలియని స్తితిలో పెరుగుతూ వచ్చిన నేను,  వూహ తెలిసే నాటికే తద్దినం పెట్టే కర్త  తమ్ముడి పాత్రలో వొదిగిపోయాను. మా రెండో అన్నయ్య  రామచంద్రరావు గారు దత్తు పోవడం వల్ల, చివరికి మిగిలింది నేనే కావడం వల్ల ఏటా మా అమ్మానాన్నల తద్దినాలు కర్తగా కూర్చుని  పెట్టే అవకాశం, ఒక రకంగా అదృష్టం అనే చెప్పాలి, నాకు లభించింది. దాదాపు కాపురానికి వచ్చింది లగాయతు మా పెద్ద వొదినె గారు శ్రీమతి  సరోజినీ దేవి, రెండో వొదినెగారు శ్రీమతి  విమలాదేవి, మూడో వొదినెగారు శ్రీమతి  అరుణా దేవి మడికట్టుకుని  తడిబట్టలతో ఎంతో శ్రద్ధతో  ఈ పవిత్ర కార్యానికి తోడ్పడుతూ వచ్చారు. గత కొన్నేళ్ళుగా ఈ బాధ్యతను  మా ఆవిడ నిర్మలాదేవి నెత్తికెత్తుకుంది.
దాదాపు   అరవై ఏళ్ళుగా  మా నాన్నగారి ఆబ్దీకం, సుమారు రెండు దశాబ్దాలకు పైగా మా అమ్మగారి తద్దినం క్రమం తప్పకుండా నిర్వహించే భాగ్యం   నా పూర్వజన్మ సుకృతం.  కొన్నేళ్ళ క్రితం అమెరికా వెళ్ళినప్పుడు కూడా మా పెద్దవాడు సందీప్  పూనుకుని ఏర్పాట్లు చేయడం వల్ల అక్కడ కూడా ఏలోటూ రాకుండా ఈ పవిత్ర కార్యాన్ని నిర్వర్తించగలిగాను.
ఇందుకు సహకరిస్తూ వచ్చిన అందరికీ కృతజ్ఞతాంజలి. గతించిన పెద్దలకు శ్రద్ధాంజలి.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి