ఆ
రోజుల్లో ఆడపిల్లలకు పదో ఏటినుంచే పెళ్లి ప్రయత్నాలు చేసేవాళ్ళు. మా ఇంట్లో
పెద్దాడపిల్ల రాధక్కయ్య. ఆమెకు పదేళ్లు నిండకుండానే సంబంధాలు చూడడానికి తొందరపడేవాళ్లు.
ఈ సంగతులు గురించి సరస్వతక్కయ్య కొన్ని
సరదా ముచ్చట్లు చెబుతూ వుండేది. పెళ్లి సంబంధాల వాళ్లు ఎవరు వచ్చినా సరే మా
పెద్దక్కయ్యతో పాటు రెండోది శారదక్కయ్య కూడా పక్కనే కూర్చుని స్వాములవారు చెప్పిన
హిందీ రామాయణం గడగడా చదివేసేది.
మావూరికి
కొద్ది కోసులదూరంలో వున్న ఖమ్మం జిల్లా వల్లభినుంచి ఓ సంబంధం వచ్చింది. వరుడి పేరు
రాంరావు. ఇంటిపేరు అయితరాజువారు. పెద్దమోతుబరులకింద లెక్క. పెళ్ళిచూపుల్లో ఇద్దరు
అక్కయ్యలు కలసి మళ్ళీ హిందీ రామాయణం వినిపించారు. అంత పల్లెటూరులో హిందీ తెలిసిన పిల్లలు వుండడం విచిత్రమనిపించిందో యేమో కాని మొత్తానికి మా రాధక్కయ్యకు
వల్లభి సంబంధమే ఖాయమయింది. అయిదువందల రూపాయల కట్నం, అయిదు రోజుల పెళ్లి వొప్పుకుని
వెళ్ళిపోయారు.
సంబంధం
అయితే కుదిరింది కాని మా నాన్నకు కాలూ చేయీ ఆడని పరిస్తితి. చివరికి మూడెకరాలు
అమ్మి పెళ్ళిచేశారు. పిల్లకు నూటయాభై కాసుల బంగారం పెట్టారు. పల్లెటూరు. దొంగల భయం
ఎక్కువ. అంత బంగారం ఇంట్లో పెట్టుకుని ఎలారా అని మా నాన్న భయపడుతుండేవాడు. మొత్తం మీద ఎలాటి అవాంతరం
లేకుండా పెళ్లి ఘనంగా జరిగిపోయింది.
సంవత్సరం
గడిచింది. రెండో అక్కయ్య శారదక్కయ్యకు పెళ్లి సంబంధాలు అంటూ ప్రత్యేకంగా చూడలేదట.
మేనరికం ఇద్దామనుకున్నారు. మా పెద్ద మేనత్త గారు శారదక్కయ్య పుట్టగానే ‘ఇది నా కోడలు’ అని డిక్లేర్ చేసింది. రాధక్కయ్య పెళ్లి కావడం ఆలస్యం, వాళ్ల పెద్ద
అబ్బాయి రామచంద్రరావుకు శారదను చేసుకుంటానని కబురుచేసిందిట. ఇంట్లో పెళ్లి హడావిడి
మొదలయింది కాని ఏదో గుబులు. ఆ రోజుల్లో శారదా చట్టం వుండేది. చిన్నపిల్లలకు పెళ్లి
చేయకూడదు. ఆరోజుల్లో మా లక్ష్మయ్య తాతయ్యకు మా కుటుంబానికీ నడుమ దాయాది తగాదాలు,
ఏవేవో కీచులాటలు వుండేవి. సంగతి తెలిసి
ఆయన ఏమైనా పిటీషన్ పెడితే గోల అవుతుందనే భయంతో ఖమ్మం జిల్లా రెబ్బారం వెళ్ళి
పెళ్లి చేసుకువచ్చారు. శారదక్కయ్యకు కూడా యాభయ్ కాసుల బంగారం పెట్టారు. పెద్దక్కయ్య
పెళ్ళప్పుడు దొంగల భయం గుర్తు ఉందేమో, ఈసారి నాన్న బెజవాడ వెళ్ళి లల్లూరాం కంపెనీ
వాళ్ల ఇనప్పెట్టె కొనుక్కుని వచ్చాడు.
పెద్ద
రంగయ్య అనే మాస్టారు పొరుగున వున్న
పెనుగంచిప్రోలు నుంచి మా వూరు స్కూలుకు బదిలీపై వచ్చారు. ఆయన దగ్గర కూడా మా అక్కయ్యలు హిందీ నేర్చుకునేవాళ్లట. ప్రాధమిక, మాధ్యమిక హిందీ పరీక్షలు రాయడానికి మా
బామ్మ బండి కట్టించి వాళ్ళను మాచినేనిపాలెం తీసుకువెళ్ళి వచ్చేది. ఆడపిల్లలకు
చదువెందుకు అనేరోజుల్లో మా ఇంట్లో పెద్దవాళ్ళు చదువు గురించి తీసుకున్న
శ్రద్ధాసక్తులు అలాటివి.
మా
పెద్దవాళ్ళు చెప్పిన వివరాల ప్రకారం ఆడపిల్లల పెళ్ళిళ్ళ విషయంలో ఆ తరువాత కొంత
మార్పు వచ్చింది. పిల్ల సంవర్త అయినా పెళ్ళికి తొందరలేదనేవారు. అందువల్ల మా ఇంట్లో
మిగిలిన ఆడ పిల్లల వివాహాలు పదహారేళ్ళు వచ్చిన తరువాతనే జరిగాయి. ఏడుగురు
అక్కయ్యల్లో అయిదుగురి పెళ్ళిళ్ళు నేను పుట్టకమునుపే మా నాన్న చేతుల మీదుగానే
జరిగాయి. ఇంట్లో చిన్నవాడిని కావడంవల్ల అనేక సంగతులు వాళ్ళు చెప్పుకునే ముచ్చట్ల
ద్వారానే నాకు తెలిసాయి.
పెనుగంచిపోలు
నుంచి ఓ పెళ్లి సంబంధం వచ్చింది. అక్కడ చినకరణం గారు కొమరగిరి లక్ష్మీ కాంతారావు
గారు. ఆయనకు ఒక్కడే కొడుకు. వెంకట అప్పారావు. బోలెడు ఆస్తి. అతగాడేమో ఇంట్లో
చెప్పకుండా మిలట్రీలో చేరాడు. చేరినవాడు అక్కడ కాలు నిలవక తప్పించుకుని వచ్చాడు.
మిలట్రీ నుంచి పారిపోయి రావడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. వారంటు జారీ అయింది.
తెలిసిన వాళ్లు కాబట్టి మా నాన్న ఆయన్ని తీసుకుని వెళ్ళి కృష్ణమూర్తి అని పేరు
మార్చి రెబ్బారంలో మా రెండో అక్కయ్య ఇంట్లో వుంచాడు. అక్కడి నుంచి కూడా మార్చి
కొన్నాళ్ళు కేసు ఎత్తివేసేదాకా ఎలకలపల్లి అనే పల్లెటూర్లో పెట్టారు. అప్పారావు
తలిదండ్రులు కాంతయ్య గారు, రంగమ్మ గారు. మా నాలుగో అక్కయ్య సరస్వతిని వాళ్ల
పిల్లవాడికి చేసుకుంటామని కబురు చేశారు. కానీ మా నాన్న సుతరామూ దానికి వొప్పుకోలేదు. ‘కేసు పూర్తిగా
ఎత్తివేసినట్టు గవర్నమెంట్ నుంచి కాగితం వచ్చేదాకా పిల్లనిచ్చేది లేదని, పెళ్లి
ప్రసక్తి తేవద్ద’ని తెగేసి చెప్పాడు.
(ఇంకా వుంది)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి