8, ఆగస్టు 2017, మంగళవారం

బాల్యం నుంచి బాధ్యతల చివరంచుల దాకా ...... (3) - భండారు శ్రీనివాసరావు


తరువాత సరస్వతక్కయ్యకు సంబంధాలు చూడడం మొదలయింది. మా వూరిలో చలువాది నరసింహం అనే షావుకారు వున్నారు. ఆమెకు ఒక్కటే కూతురు. ఆమెతో మా పెద్దక్క య్యలు ఇద్దరికీ తగని స్నేహం. ఆమె పేరు తిరుపతమ్మ. పొద్దునలేచిన దగ్గరనుంచి రాత్రి పొద్దుపోయేదాకా మా ఇంట్లోనే వుండేది. ఆమెను నందిగామ తాలూకాలోని తుర్లపాడు ఇచ్చారు. ఆ వూళ్ళో తిరుపతమ్మ అత్తగారి ఇల్లు, ఆ వూరి కరణం గారయిన  తుర్లపాటి భైర్రాజు గారి ఇల్లు పక్కపక్కనే వుండేవి. ఆ కరణం గారికి ఇద్దరు మగపిల్లలు. పెద్దవాడు సత్యనారాయణకు పెళ్ళయి ముగ్గురు పిల్లలు పుట్టిన తరువాత పొలంలో పాము కరచి చనిపోయాట్ట. రెండోవాడు బియ్యే పాసయి ఎమ్మే చదువుతాను అన్నాట్ట. కాని కరణం గారు మాత్రం ‘నీ చదువు ఇక నా వల్లకాదు, పెళ్లి చేసుకుని మీ మామగారు చదివిస్తే చదువుకో అభ్యంతరం లేదన్నా’రట. చదువు మీది మమకారంతో కరణంగారి ఆ రెండో కొడుకు హనుమంతరావు కారేపల్లి సంబంధం  చేసుకున్నారు. పెళ్ళయిన కొన్నాళ్ళకు  పైచదువుల ప్రసక్తి తండ్రిదగ్గర తెస్తే ‘మన ఇంటి పరిస్థితులు నీకు తెలవనివి కావు కదా. ముందు ఏదన్నా నౌకరీలో కుదురుకుని ఆ తరువాత చదువుకో లేకపోతే మీ మామను అడుగు’ అని సలహా ఇచ్చారట. మామగారిని డబ్బు అడగడం ఇష్టం లేక ఇంట్లో చెప్పకుండా ఆయన సైకిల్ అమ్ముకుని కాశీ వెళ్ళి ప్రైవేట్లు చెప్పుకుంటూ ఎమ్మేలో చేరారు. ఫైనల్ పరీక్షలు దగ్గర పడుతున్న తరుణంలో కారేపల్లిలో గర్భవతిగా ఆయన భార్య పురుడు కష్టమై పెద్ద ఆపరేషన్ చేయించినా ఉపయోగం లేక తల్లీ పిల్లాడు ఇద్దరూ పోయారట. పరీక్షల ముందు ఈ కబురు చెప్పడం ఇష్టం లేక, భార్య చావు కబురు  ఆయనకు తెలవనివ్వలేదు. పరీక్షలు రాసి ఇంటికి వచ్చిన తరువాత చింతపల్లి వేంకటేశ్వర రావు అనే అతడిని పంపి ఆయన్ని కారేపల్లి తీసుకువెళ్ళారు. అక్కడికి పోయినదాకా ఆయనకు ఆ వార్త తెలవదు. ఆ షాకునుంచి కోలుకోవడానికి ఏడాది పట్టింది.
ఇంతలో ఆయన తండ్రి గారు  మాత్రం మళ్ళీ పెళ్ళంటూ వొత్తిడి మొదలు పెట్టారు. కారేపల్లిలో ఈయనకు పిల్లనిచ్చిన రంగారావు గారికి కూడా బాగా చదువుకున్న ఈ అల్లుడు అంటే ఎంతో అభిమానం. ‘మా అల్లుడు కాశీ వెళ్ళి పెద్ద పట్టా ఫస్టుక్లాసులో పాసయాడు తెలుసా’ అని అందరితో గర్వంగా చెప్పుకునే వాడు. చిన్న వయస్సులో భార్యాపిల్లలను పోగొట్టుకున్న ఈయనను చూసి ఆయన జాలిపడి మళ్ళీ   పెళ్ళిచేసుకోమని పోరు పెట్టేవారట. చివరకు భీమవరం అమ్మాయితో ఈయనకు రెండో పెళ్లి జరిగింది. ఆ అమ్మాయికి మనస్తిమితం లేని సంగతి దాచిపెట్టి పెళ్లి చేశారు. ఆమె పుట్టింటి వాళ్లు కూడా ఏదో గతిలేక అబద్ధం చెప్పి పెళ్ళయితే చేశారు కాని వారికీ మనసులో గుబులు అనిపించిందో యేమో ఒకరోజు వచ్చి పిల్లను తీసుకువెళ్ళి పోయారు. వాళ్ళూ మంచివాళ్ళే. ‘మిమ్మల్ని మోసం చేయాలని మాకూలేదు. ఏదో అలా జరిగిపోయింది. పెద్దమనస్సుతో మన్నించడ’నే అన్నారు. కానీ ఇదంతా ఆయన మనస్సును చీకాకు పరిచింది. ఉద్యోగ ప్రయత్నాలకు స్వస్తి చెప్పి, బెజవాడలో ప్లీడరు ప్రాక్టీసు మొదలు పెట్టాలని తీర్మానించుకున్నారు.  మొదట్లో ఓ నాలుగు నెలలు మాచవరంలో తుర్లపాటి సంగమేశ్వర రావు అనే దూరపు బంధువు  దగ్గర పనిచేసి ఆ తరువాత సొంతంగానే ప్రాక్టీసు పెట్టారు. గవర్నర్ పేటలో లక్ష్మీ టాకీసు, జైహింద్ టాకీసు నడుమ రాజగోపాలచారి వీధిలో చక్రవర్తి గారి తెల్లమేడ ఎదురుగా సోవమ్మగారి ఇంట్లో మూడుగదుల వాటా   ఇరవై రూపాయల అద్దెకు మాట్లాడి దిగిపోయారు. సున్నం ఇటుకలతో కట్టిన ఆ ఇంటికి గోడలు గిలాబు కూడా చేయించలేదు. బాతు రూము వుండేదికాదు. నాలుగు వాటాల వాళ్ళకీ కలిపి ఒకటే నీళ్ళ పంపు. బావి లేదు. బోరింగు లేదు. ఆ ఇంట్లో ఆయనా, తుర్లపాడులో తెలిసిన  స్నేహితుడు గురవయ్య కలసి వుండేవారు. ఈయన్ని గురించీ, ఈ ఇంటిని గురించి ఇన్ని వివరాలు మాకు యెలా తెలిసినవన్న అనుమానం రావచ్చు. మా అక్కయ్యకు  పెళ్లి సంబంధం తీసుకువచ్చిన తిరుపతమ్మే  ఈ విషయాలన్నీ మా వాళ్లకు చెప్పిందట.          
తుర్లపాడులో వుండే  ఆ తిరుపతమ్మ మావూరు  వచ్చి ‘మా కరణంగారి అబ్బాయికి పెళ్లి చేస్తారుట. ఇరవైఎనిమిది ఏళ్ళు. బాగా చదువుకున్నాడు. బుద్ధిమంతుడు. బెజవాడలో ప్లీడరీ చేస్తున్నాడు. మీ అమ్మాయిని అయితే తప్పకుండా చేసుకుంటారు’ అని మా నాన్నతో  చెప్పింది. రెండో సంబంధం అనగానే ఆయన ఇష్టపడలేదు.
ఇట్లావుండగానే ఆ తిరుపతమ్మ మొగుడు రమణయ్య,  పిల్లాడి తండ్రి భైర్రాజుగారు మా వూరు వచ్చి షావుకార్ల ఇంట్లో దిగి మా ఇంటికి కబురు పెట్టారు. మా నాన్న  వెళ్ళి వారిని ఇంటికి తీసుకువచ్చారు.
‘అతికితే గతకదు. మీఇంట్లో భోజనం చేసేది లేద’ని  ముందే చెప్పారు. అందుకని మా ఇంటికి పక్క వీధిలో వున్న గూడా రామచంద్రయ్యగారింట్లో వాళ్లకు భోజనం  ఏర్పాట్లు చేశారు. తరువాత  మా అక్కయ్యను చూపించారు. అప్పుడు మా ఇల్లు ఒక పెండ్లివాళ్ళ ఇల్లులాగా వుండేది. మా బామ్మ,  ఆమె తల్లి, మా మేనత్త, మా అమ్మ, పది మంది పిల్లలు. (అప్పటికి మా ఇంట్లో అందరికంటే  చిన్నవాడినైన నేను పుట్టనేలేదు). ఇంకా మా సీతంబామ్మ, సుబ్బయ్య తాతయ్య, జీతగాళ్ళు ఇట్లా ఇంతమందితో ఇల్లంతా ఎంతో సందడిగా వుండేది.  ఇదంతా చూసి  పిల్లాడి తాలూకువాళ్ళు ముఖ్యంగా పిల్లాడి తండ్రి భైర్రాజు గారు ‘ఈ సంబంధం  నాకు నచ్చింది’ అని అక్కడికక్కడే చెప్పేసారు.  ‘మా అబ్బాయిని పంపుతామ’ని చెప్పి వెళ్ళిపోయారు. తరువాత పది  రోజులకు తుర్లపాడు సంబంధం అబ్బాయి వచ్చవాయి వచ్చి జగన్నాధం బాబాయిని,  ఇంగువ రామకృష్ణయ్యగారిని, గురవయ్య గారిని వెంటబెట్టుకుని  కంభంపాడు వచ్చి మా అక్కయ్యను చూసారు. చూసి వెళ్ళిన తరువాత ఆయన తండ్రిగారు ‘మా అబ్బాయికి ఇష్టమయింది’ అని కబురు పంపారు. మా నాన్న వెంటనే బెజవాడ వెళ్ళి దోర్భల శేషాద్రి గారనే ప్లీడరును కలుసుకుని పెళ్లి కుమారుడి గురించి వాకబు చేశారు. ‘పిల్లాడు  మంచివాడు, బుద్ధిమంతుడు, తెలివికలవాడు’ అని ఆయన చెప్పారు. తరువాత కారేపల్లి  వెళ్ళి మొదటి సంబంధం వారిని కూడా మంచి చెడ్డలు కనుక్కున్నాడు. మా బామ్మ పెత్తల్లి కూతుర్ని కారేపల్లి రంగారావుగారి  బాబాయికి  ఇచ్చారుట.  అందుకని కంభంపాడు, కారేపల్లి కుటుంబాల మధ్య రాకపోకలు వుండేవి.  నాన్న  వెళ్ళి ‘తుర్లపాడు కరణంగారి పిల్లాడికి మా అమ్మాయిని ఇద్దామనుకుంటున్నాము’ అని చెప్పగానే వాళ్ళూ ఎంతగానో  సంతోషపడి  ‘వెంటనే వెళ్ళి లగ్గాలు పెట్టుకోండి. మీ అమ్మాయి ఇక మీ అమ్మాయి కాదు మా అమ్మాయి’ అని అన్నారుట.  ఆ భరోసాతో మా నాన్న కంభంపాడు వచ్చి లగ్గం  పెట్టుకోవడానికి రమ్మని తుర్లపాడు కబురు చేశారు. కార్తీక మాసంలో కంభంపాడులోనే ఇంటిముందు పందిరి వేసి పెళ్లి చేశారు. ఆ పెళ్ళికి  కారేపల్లి నుంచి మా బావగారి మొదటి సంబంధం మామగారు  రంగారావు గారు, అనంతరాములు గారు, దుర్గాప్రసాదు గారు అంతా మా వూరు వచ్చారని మా అక్కయ్య చెప్పింది.

(ఇంకా వుంది)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి