రైల్లోనే రెండో రోజు గడిచిపోయింది. మర్నాడు ఉదయమే లేచి మొహాలు కడుక్కున్నాం. మా కంపార్టు మెంటులో మిగిలిన వాళ్ళందరూ హడావిడిగా సామాన్లు సర్దుకుంటున్నారు. అది చూసి ప్రేమ ‘ఢిల్లీ వచ్చిందేమో’ అన్నది. శారదక్కయ్య కిటికీ లో నుంచి చూసి ‘ఢిల్లీలో ఇలా ఖాళీ స్థలాలు వుంటాయా!కాదేమో’ అన్నది సందేహంగా. ఇంతలో శేషు, రంగడు వచ్చి ‘ఢిల్లీ వచ్చింది, పదండి’ అనేసరికి అందరం హడావిడిగా సామాన్లు తీసుకుని కిందికి దిగాము. అక్కడ హిందీ తప్ప మన మాట వినిపించదు. టాక్సీలు మాట్లాడుకుని ఇండియా హోటల్ కు వెళ్ళాము. స్నానాలు ముగించి మధ్యాన్నం ఆంధ్రా భోజనం పెట్టే హోటలుకు వెళ్లి భోజనం చేసాము. నాకూ, ప్రేమకూ మొదటి నుంచి హోటళ్ళలో వాళ్ళు పెట్టే కంచాల్లో అన్నం తినబుద్ది అయ్యేది కాదు. ఒకసారి తమ్ముడు శ్రీనివాసరావు చిన్నవాడయినా మాకు ఓ పెద్ద మాట చెప్పాడు. ‘వాళ్ళు తిన్న కంచం, వీళ్ళు తగిన గ్లాసు అనుకుంటే మనసు పరిపక్వం కాదు. అందరూ భగవత్ స్వరూపులే అనుకున్నప్పుడు ఆ తేడా రాదు. అలాంటివి మనసులోకి రానివ్వకూడదు’. అప్పటి నుంచి ఆ తేడా తీసేసుకుని ఏ కంచంలో అయినా తింటూనే వున్నాను. భోజనాలు అయిన తరువాత ఊరు తిరిగి చూద్దామంటే కళ్ళు తిరిగే ఎండ, వడగాలి. అందుకని హోటల్ కు తిరిగొచ్చి పండుకున్నాము. టాక్సీలో వచ్చేటప్పుడు రంగడు ‘ఇదిగో ఇదే ఇండియా గేట్’ అంటూ చూపించాడు. ఢిల్లీలో మేము చూసిన విశేషం అదొక్కటే. అదీ కారులోనుంచి.
మంచి నిద్ర పట్టింది. ఇంతలో బయట నుంచి ఎవరో తలుపు కొడుతున్నారు. తలుపు తీద్దామంటే రావడం లేదు. కింది గదిలో విమల, ప్రేమ పడుకున్నారు. పైన గదిలో నేనూ, శారదక్కయ్య, సావిత్రి పడుకున్నాము. తలుపు తెరుచుకోలేదు. మాకు భయం వేసింది. పై గది నుండి కింది గదిలోకి ఇనుప మెట్లు వున్నాయి. అది మా అదృష్టం. వెంటనే దిగి కిందికి వెళ్ళాము. విమల తలం తీసింది. బతుకు జీవుడా అని ఊపిరి పీల్చుకున్నాము. తలుపు కొట్టిందెవరో తెలియలేదు.
బదరీ, కేదార్ యాత్రకు ముందుగా మాట్లాడుకున్న బస్సు ఎక్కాము. మేమే పదకొండుమందిమి. ముందుగా బస్సును ఢిల్లీలోని హనుమాన్ మందిర్ వద్దకు తీసుకుపోయారు. కేదార్ యాత్ర కష్టమైంది కదా! భగవదనుగ్రహం కోసం అక్కడ బస్సుకు పూజ చేయించారు. అందరం దిగి గుళ్ళోకి వెళ్లి దర్శనం చేసుకున్నాము. అన్నీ పాలరాతి విగ్రహాలు. సీత, రాముడు, లక్ష్మణుడు, హనుమ విగ్రహాలే కాకుండా వినాయకుడు, కుమారస్వామి, శివుడు, పార్వతి ఇలా అందరూ వున్నారు. సంతోషి మాత, లక్ష్మీనారాయణుడి విగ్రహాలు కూడా వున్నాయి. ఈ యాత్రల్లో మొదలు చూసిన గుడి ఇదే. ఆంజనేయ స్వామి విగ్రహం ఒక వైపు తిరిగి వుంటుంది. అంచేత అయన మోహంలో ఒక కన్నేమనకు కనబడుతుంది. ఇలాంటిదే మా వూరు కంభంపాడు హనుమంతుడి గుడిలో వుంది. ఒక బల్లపరుపు రాతి మీద విగ్రహం చెక్కడం చేత మా వూరి గుడిలో హనుమంతుడికి కూడా ఒక కన్నేకనిపిస్తుంది. మళ్ళీ బస్సెక్కాము. మన వైపు బస్సులే చాలా నయం. అక్కడి బస్సుల్లో ఎందుకో కానీ సీట్లు ఇరుకిరుకుగా వుంటాయి. అయినా సర్దుకుని అలాగే నిద్ర పోయాము. తెల్లారేసరికి ఋషీకేష్ చేరాం. (ఇంకా వుంది)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి