7, జులై 2017, శుక్రవారం

బదరీ కేదార్ యాత్ర (1996) నాలుగో భాగం – కొమరగిరి అన్నపూర్ణ

ఋషీకేశ్ లో బస్సు దిగగానే తొందర తొందరగా కాలకృత్యాలు పూర్తి చేసుకుని గంగా స్నానానికి వెళ్ళాము. వెళ్ళే దారిలో ఎక్కడ చూసినా నున్నటి తళతళ మెరిసే గుండ్రాళ్ళు. మంచి మంచివి  ఎంపికచేసుకుని తీసుకుపోతుంటే వాటికంటే మంచివి కనిపించేవి.  అలా వాటిని ఏరుకుంటూ కుప్ప  పోస్తుంటే గమనించిన ఓ పెద్దాయన, ‘ఆ  గుండ్రాళ్ళు  ఏం చేసుకుంటారు, మంచి  సాల గ్రామాలు దొరుకుతాయి, వెతుక్కోండి’ అని సలహా చెప్పి చక్కా పోయాడు.
గంగలో నీళ్ళు ఫ్రిజ్ నుంచి తీసినట్టు చాలా చల్లగా వున్నాయి. పెద్ద వాళ్ళం అలా ఇగపు నీళ్ళతోనే వణుక్కుంటూ స్నానాలు ముగించాము, స్వర్ణ, భారతి పెద్ద కోడలు మాత్రం ఎంతో ఓపిగ్గా మా తడి బట్టలు ఆరవేయడంలో, సంచులు మోయడంలో సాయపడుతూ వుంది. సురేష్ పెళ్ళయిన తరువాత శారదక్కయ్యకు స్వర్ణతో అంతగా పరిచయం వున్నట్టు లేదు. స్వర్ణను చూసి చాలా ముచ్చట పడింది. అలాంటి కోడలు దొరికిన భారతి అదృష్టవంతురాలని, పెద్ద వాళ్ళను కనిపెట్టుకుని చూసే ఓపిక ఉన్న కోడలు దొరికిందని కితాబు ఇచ్చింది. బట్టలు ఆరిన తరువాత గుండ్రాళ్ళు మోసుకు వద్దామంటే మాకు అలవి కాలేదు. చివరకు ఏరినవన్నీ అక్కడే వదిలేసి శాంపిల్ కు కొన్ని తెచ్చుకున్నాము. బస్సులో శివానంద ఆశ్రమానికి చేరుకున్నాము. అక్కడ కూడా అన్నీ పాలరాతి విగ్రహాలే. రాధాకృష్ణులు, శివానంద, హనుమాన్ విగ్రహాలు ఉన్న ఆ హాలు ఎంతో ప్రశాంతంగా వుంది. ఈ వయస్సులో, ఆరోగ్యం సరిగా లేని స్తితిలో ఇంత దూరాభారంలో ఇలా యాత్రలు చేస్తూ ఇవన్నీ చూడగలుగుతున్నాను అంటే అది కేవలం భగవంతుని కృప వల్లే సాధ్యం.
అక్కడినుండి లక్ష్మణ్ ఝూలా వెళ్ళాము. మధ్యలో స్తంభాలు అనేవి లేకుండా ఆ ఒడ్డు నుండి ఈ ఒడ్డు వరకు తీగెలు బిగించి గంగపై నిర్మించిన వంతెన అద్భుతంగా వుంది. దీనిపై వాహనాలను అనుమతించడం లేదు, కేవలం కాలినడకన వెళ్ళే వాళ్ళు మాత్రమే. మనం వంతెన మీద నడుస్తుంటే అది ఉయ్యాల మాదిరిగా ఊగుతుంది. అందుకే లక్ష్మణ్ ఝూలా అన్నారు. ఝూలా అంటే ఉయ్యాల. కొందరు ‘రాం ఝూలా’ అని కూడా అంటుంటారు. ఆ వంతెన మీద నుంచి కిందికి చూస్తే స్వచ్చంగా పారుతున్న గంగా ప్రవాహం మనోహరంగా కానవస్తుంది. నాకయితే కళ్ళు తిరిగినట్టయింది. మొదట భయం వేసింది కాని తరువాత బాగానే  అనిపించింది.
రంగారావు గారికి రుద్రాక్షలు కొనుక్కోవాలని అంటే బస్సు వాళ్ళు ఓ దుకాణానికి తీసుకువెళ్ళారు.   ఆయన మూడువేలు పెట్టి రుద్రాక్షలు, నవరత్న గొలుసులు, ఉంగరాలు కొన్నారు. అక్కడ చెప్పులు తెగితే వేరే జత కొనుక్కున్నాము. మందులు, గ్లూకోజు వంటివి పెట్టుకోవడానికి వీలుగా వుండే ఓకే చిన్న బ్యాగు నేను కొనుక్కున్నాను, గుర్రం మీద వెళ్ళాల్సి వస్తే బేగ్ అయితే తేలిగ్గా ఉంటుందని.
అక్కడ నుండి టాక్సీ మాట్లాడుకుని మళ్ళీ లక్ష్మణ్ ఝూలా వద్దకు చేరుకున్నాము. అక్కడ ఒక చిన్న హోటల్లో ఇడ్లీ తిని, కాఫీ తాగి త్రిమూర్తుల ఆలయానికి వెళ్ళాము. ఆ గుడి అనేక అంతస్తులతో కట్టారు. త్రిమూర్తులు సకుటుంబంగా అక్కడ కొలువు తీరారు. వారితో పాటు సప్త ఋషులు, సనకసనందనాదులు, నారదుడు విగ్రహాలు అయినా సజీవంగా ఉన్నట్టే కానవచ్చారు. పదమూడు అంతస్తులు ఎక్కితే అక్కడ శంకరాచార్యుల వారున్నారని అన్నారు. కానీ నాకు చేతకాక పోలేదు. విమల, స్వర్ణ ఓపిక చేసుకుని అన్ని మెట్లు ఎక్కారు.
తరువాత దత్తాత్రేయులు, దుర్గాదేవి, సంకట మోచన్ హనుమాన్, విఘ్న వినాశక గణేష్   ఆలయాలు చూసాము. ‘అక్కడ వుండే పాండు రంగడు ఇక్కడ వున్నాడు’ అని అంటారు కానీ యాత్రలకు వెళ్ళినప్పుడు అక్కడి నదులు, దేవాలయాల పవిత్రత, ఆ సమయంలో మనలో కలిగే అనిర్వచనీయమైన అనుభూతి, ఆనందం అనుభవిస్తే కాని అర్ధం కాదు.

(ఇంకా వుంది)               

5 కామెంట్‌లు:

  1. మీ యాత్రా విశేషాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. అయితే ఈ టపాల టైటిల్ లో ప్రారంభం నుండీ కనిపిస్తున్న పేరు శ్రీమతి కొమరగిరి అన్నపూర్ణ గారి ప్రస్తావన ఇంకా రాలేదండి.

    రిప్లయితొలగించండి
  2. ఇది వారు రాసినదే (Narrating in first person)

    రిప్లయితొలగించండి
  3. @విన్నకోట నరసింహారావు : కొమరగిరి అన్నపూర్ణ మా అక్కగారు. కీర్తిశేషులు. 1996 చేసిన యాత్రా విశేషాలను ఆవిడ డైరీలో రాసుకున్నారు. అవే ఇవి.

    రిప్లయితొలగించండి