(PUBLISHED IN 'SURYA' TELUGU DAILY ON 19-07-2015, SUNDAY)
స్త్రీ జాతిని 'ఆకాశంలో సగం' అంటూ పొగడ్తలతో ఆకాశానికి ఎత్తే వాళ్లు నేటి సమాజంలో ఎక్కువగానే కానవస్తారు. చేతల దగ్గరికి వచ్చేసరికి ఈ మాటలు నీటి మూటలుగానే మిగిలిపోవడం కద్దు. ఈ నేపధ్యంలో ఒక వార్త కొన్ని పత్రికల్లో చాలా చిన్నగా వచ్చింది. ఆ వార్తకు ఇవ్వాల్సినంత ప్రాముఖ్యం ఇవ్వలేదేమో, ఆ అంశానికి దొరకాల్సినంత ప్రాచుర్యం లభించలేదేమో అనిపించింది. ఆ వార్త ఏమిటంటే-
ఆన్ లైన్ వ్యాపారం చేస్తున్న ఫ్లిప్ కార్ట్ అనే ఒక సంస్థ
యాజమాన్యం, తమ దగ్గర పనిచేసే మహిళా సిబ్బందికి కొన్ని ప్రోత్సాహకాలు ప్రకటించింది.
ఉద్యోగినులకు ఇచ్చే ప్రసూతి సెలవులను ఇరవై నాలుగు వారాలకు పెంచింది. అంటే సుమారు
ఆరుమాసాలపాటు జీతంతో కూడిన సెలవు. అంతే కాదు, ప్రసూతి సెలవు అనంతరం తిరిగి
విధుల్లో చేరే ఉద్యోగినులకు నాలుగు నెలలపాటు పనివేళల్లో, వారికి వీలయిన సమయాల్లో పనిచేసుకునే
వెసులుబాటు కల్పించింది..
చట్టం ప్రకారం ఉద్యోగినులకు ఇవ్వాల్సిన సెలవుల్ని మించి ఈ
కంపెనీ తమ మహిళా సిబ్బందికి ఈ సదుపాయాలను కల్పించడం విశేషం.
సరే. షరా మామూలుగానే ఈ రాయితీలకు వక్ర భాష్యాలు వెలువడ్డాయి. తమ
సంస్థలో పనిచేసేందుకు అధిక సంఖ్యలో ఆడవారిని ఆకర్షించేందుకు ఫ్లిప్ కార్ట్ కంపెనీ
ఈ నిర్ణయాలు తీసుకుందని వాటి తాత్పర్యం.
వెనుక కమ్యూనిష్టుల ఏలుబడిలో వున్న సోవియట్ యూనియన్ లో ఆడవారికి
ఈ రకమైన రాయితీలు ఇవ్వడం నేను చూసాను. గర్భవతులయిన ఉద్యోగినులకు, గర్భం ధరించిన
సమాచారం తెలియచేసినప్పటి నుంచి, సుఖ ప్రసవం జరిగి, పుట్టిన బిడ్డ బుడి బుడి నడకలు
నడిచే వయస్సు వచ్చేవరకు ఆ బిడ్డ ఆలనా పాలనా కనిపెట్టి చూసుకునేందుకు వీలుగా
తల్లులకు జీతంతో కూడిన సెలవు ఇచ్చేవారు.
నిజానికి గత రెండు దశాబ్దాల కాలంలో మనదేశంలో మహిళలు గణనీయమైన పురోగతి సాధించడం కళ్ళారా చూస్తున్నాం.
ఓ అరవై ఏళ్ళక్రితం ఆడపిల్ల ఇంటి గడప దాటి
అడుగు బయట పెట్టడం కనాకష్టం. 'ఆడపిల్లకు చదువెందుకు, ఇంట్లో ఏవో పద్దులు రాసుకునే
అక్షర జ్ఞానం వుంటే చాలు' అని పెద్దవాళ్ళు అంటూ వుండడం నాకెరుక. నూటికో కోటికో
చదువుకున్న ఆడవాళ్లు కనిపిస్తే విడ్డూరంగా చూసే కాలం గడిచిపోయి ఎన్నో ఏళ్ళు
కాలేదు. సైకిల్ తొక్కే ఆడపిల్లల్ని రౌడీ పిల్లలు అనేవాళ్ళు. లంగా ఓణీ కాకుండా
చుడిదార్ వేసుకుంటే నోటితో కాకపోయినా నొసటితో వెక్కిరించేవాళ్ళు.
మారడం కాల ధర్మం. అందుకే కాలం మారింది. ఇంకా మారుతోంది. మగా ఆడా
తేడా చదువుల్లో లేకుండా పోయింది. కాకపొతే, చదువుకున్న ఒక తరం ఆడవాళ్ళు, చదివిన చదువుకు
సార్ధక్యం లేకుండా మళ్ళీ గృహిణులుగానే ఇంటి పనులకు పరిమితం అయిపోయారు. దానితో, 'చదువుకుని
ఏం చేస్తారు ఉద్యోగాలు చేస్తారా, వూళ్ళు
ఏలాలా?' అనే కొత్త వ్యంగ్యాస్త్రాలు వ్యవహారంలోకి వచ్చాయి.
ముందే చెప్పినట్టు మారుతూ పోవడం కాల ధర్మం. తరువాతి తరం
ఆడపిల్లలు మగ పిల్లలతో పోటీలు పడి చదువుల్లో రాణిస్తూ వస్తున్నారు. ఉద్యోగాలు
చేస్తున్నారు. వేడి నీళ్ళకు చన్నీళ్ళ మాదిరిగా వారి సంపాదనలు కుటుంబ ఖర్చులకు
అవసరం కావడంతో మగవాళ్ళే సర్దుకుపోయి, ఉద్యోగం చేసే ఆడపిల్లలకి పెళ్లి చూపుల్లో ప్రాధాన్యత ఇవ్వడం మొదలు
పెట్టారు. అంతటితో మార్పు ఆగలేదు.
మారుతున్న కాలానికి అనుగుణంగా, ఆర్ధిక సంస్కరణల పుణ్యమా అని రాత్రింబవళ్ళు
పనిచేయాల్సిన కొత్త కొలువులు వచ్చి పడ్డాయి. వాటికి తగ్గట్టే మంచి మంచి జీత
భత్యాలు. పెరుగుతున్న అవసరాలకు తగ్గట్టుగా ఆ జీతాలు కూడా తప్పనిసరి అవసరంగా
మారిపోయాయి. ఈ ఉద్యోగాలు చేస్తున్న ఆడపిల్లలు ఈనాడు లెక్కకు మిక్కిలిగా కనిపిస్తున్నారు.
మగ పిల్లల మాదిరిగానే కన్న తలితండ్రులను, వున్న వూరినీ విడిచి వెళ్ళి పరాయి వూళ్లల్లోనే
కాదు పరాయి దేశాల్లో కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ రీత్యా ఆర్దిక స్వాతంత్రం అయితే ఆడవారికి కొంత వరకు
వచ్చింది. వ్యక్తిగత స్వేచ్ఛ అనేది ఆ మేరకు వారికి లభిస్తోందా అంటే చప్పున జవాబు
చెప్పలేని పరిస్తితి.
ఉదాహరణకు సినీ రంగంలో రాణిస్తున్న తారల సంగతే తీసుకుందాం. ఆదాయం
బాగానే వున్నా మగ తారల మాదిరిగా సంపాదించుకున్న ఆస్తిపాస్తులను కాపాడుకోలేని పరిస్తితి ఆ రంగంలో ఎక్కువ.
అన్నింటికీ ఎవరిమీదనో ఆధారపడాల్సిన స్తితే.
సరే! ఇవన్నీ బాగా చదువుకుని, బాగా సంపాదిస్తూ వున్న మహిళల
సంగతి. కుటుంబ అర్దిక స్తితి గతులు మెరుగు పరచడంలోనే కాదు, దేశ ఆర్ధిక వ్యవస్థ పురోగమనంలో కూడా వీరి పాత్ర తక్కువేమీ కాదు. ఆ
మేరకు వారికి జాతి రుణపడి వుండాలి.
మరో రకం ఆడవారు వున్నారు. నిజానికి వీరి జనాభానే అధికం. వీరు చదువు
సంధ్యలు లేనివాళ్ళు. అధవా చదువుకున్నా ఏదో నాలుగు అక్షరం ముక్కలే. చిన్న చిన్న పనిపాట్లు చేసుకుంటూ పొట్ట పోసుకుంటున్న
వారు. తమ కుటుంబాలకు ఆర్ధికంగా సాయపడుతున్నవారు. సంపాదన వుందన్న మాటే కాని దానిపై
పెత్తనం బొత్తిగా లేనివాళ్ళు. గ్రామాల్లో పొలం కూలీలుగా పనిచేసుకుంటూ, బస్తీల్లో
అయితే నాలుగిళ్లల్లో పాచి పనులు
చేసుకుంటూ, నాలుగు రాళ్ళు పోగేసి మొగుడి చేతిలో పోసి చేతులు దులుపుకునే వాళ్లు. తమ
చెమటతో తడిసిన ఆ సొమ్మును వాళ్లు తాగుడు కోసం తగలేస్తున్నా నోరు తెరిచి అడగలేని
మూగవాళ్ళు. వీరికి బొత్తిగా ఆర్ధిక
స్వాతంత్రం లేదు, పోనీ వ్యక్తిగత స్వేచ్చ వుందా అంటే అదీ లేదు. మరబొమ్మల్లా కాయకష్టం
చేసి నాలుగు డబ్బులు సంపాదించడం తప్ప.
మరో వివక్షకు కూడా వీరు గురవుతున్నారు. చేసేది ఒకే పని అయినా
దినసరి కూలీ డబ్బులు ఆడవారికి వేరే, మగవారికి వేరే. ఆడవాళ్లు చేసే ఇంటి పనిని కూడా
పరిగణనలోకి తీసుకుంటే, బయట పనిపాటుల్లో వారికి ముడుతున్నది నామమాత్రమే.
ఇలాటివారు నేటి సమాజంలో ఎల్లెడలా కనిపిస్తారు. పనికి తగ్గ
వేతనాలు వుండవు. పని వేళలూ వుండవు. రాత్రీ పగలూ తేడా లేకుండా పనిచేస్తారు.
పనిచేసిన రోజున బాగా చేసావు అనేవాళ్ళూ వుండరు, పనికి రాని రోజున 'మా నాగాల రాణి ఇవ్వాళ
రాలేదు, ఎగనామం పెట్టింది' అనే సన్నాయి నొక్కులకు మాత్రం తక్కువ వుండదు. మరి వీరి
జీవితాలు మారేదెన్నడో!
యాభయ్ ఏళ్ళ క్రితం గడప దాటని ఆడవాళ్ళను చూసాను. అదే కళ్ళతో చదువుకుని
ఉద్యోగాలు చేసేవాళ్ళను చూస్తూ వున్నాను.
కాల ధర్మం మీద నమ్మకం వున్నవాడ్ని. చివర చెప్పిన బడుగు బలహీనవర్గాల
ఆడవారికి కూడా మంచి కాలం రాకపోతుందా? నేను
చూడక పోతానా? (16-07-2015)
రచయిత ఈ మెయిల్:
bhandarusr@gmail.com మొబైల్: 98491 30595
NOTE :
Courtesy Image Owner
మీ(మా)కోరిక తీరాలని కోరుకుంటూ,మీ ఆశీస్సులే మాకు శ్రీరామరక్ష !
రిప్లయితొలగించండిధన్యవాదాలు భండారు శ్రీనివాసరావు గారూ !
@నీహారిక - మీకు కూడా ధన్యవాదాలు
రిప్లయితొలగించండి