15, జులై 2015, బుధవారం

ఒక విషాదం - రెండు జ్ఞాపకాలు


(PUBLISHED IN 'SURYA' TELUGU DAILY ON 16-07-2015, THURSDAY)

విషాదం ఎందుకో ఏమిటో విడిగా చెప్పనక్కర లేదు. రెండు రోజులుగా అన్ని  టీవీల్లో అవే దృశ్యాలు.



రాజమండ్రిలో గోదావరి 'మహా' పుష్కరాల కోసం ఏర్పాటుచేసిన స్నానఘట్టం ఒకదానిలో  జరిగిన దుర్ఘటన అందరి మనసులను కలచివేసింది. కారణం ఎవరయినా, మూల కారణం ఏదయినా అనేక నిండు ప్రాణాలు గోదావరి నదీమ తల్లి సాక్షిగా గాలిలో కలిసిపోయాయి. సరే. షరా మామూలుగా రాజకీయ పక్షాల నాయకులు తమ కోణాల్లో, తమదయిన బాణీల్లో ఆరోపణలు, ప్రత్యారోపణల  బాణాలు విసురుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ దుర్ఘటనకు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని టీడీపీ ప్రత్యర్ధులు డిమాండు చేస్తే, కృష్ణా పుష్కరాల దుర్ఘటనకు బాధ్యత తీసుకుని నాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి  యెందుకు రాజీనామా చేయలేదని అధికార టీడీపీ వారు ప్రతి విమర్శలు చేశారు. ఇలాటి సంఘటనలు జరిగినప్పుడు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయడం అనేది నిజానికి  గత కాలపు ముచ్చట. ఈ కాలపు రాజకీయ నాయకులకు కానీ, నేటి యువతకు కానీ తెలియని విషయం. 'నైతిక విలువలు' అనేవి ప్రస్తుత కాలంలో వారి నుంచి ఆశించడం వృధా ప్రయాస. తినే అన్నం  గొంగట్లో అయినప్పుడు వెంట్రుకలు గురించి చింతించడం యెంత విజ్ఞతో ఇదీ అంతే.
జనాలు పెద్ద సంఖ్యలో ఒక చోట గుమికూడిన సందర్భాలలో ఇలాటి దుర్ఘటనలు జరగడానికి అవకాశాలు ఎక్కువ అన్నది అందరికీ తెలిసిందే. దీనికి పలు దృష్ట్యాంతాలు వున్నాయి. అయ్యప్ప దర్శనానికి శబరిమలై వెళ్ళిన భక్తులు అనేకమంది తొక్కిసలాటలో మరణించిన విషయం ప్రజల మనస్సుల్లో ఇంకా పచ్చిగానే వుంది.  పలు ఆధ్యాత్మిక సమ్మేళనాల్లో హఠాత్తుగా సంభవించిన ఇటువంటి దుర్ఘటనలు  అనేక కుటుంబాల్లో కడుపుకోతను మిగిల్చాయి.
రాజమండ్రి దుర్ఘటన కూడా వీటిల్లో ఒకటిగా కొంతకాలం తరువాత జనం చెప్పుకుంటారు. పుష్కరాల మొదటి రోజునే ఇది జరగడం పుష్కర ఏర్పాట్లు ఘనంగా చేస్తున్నామని చెప్పుకుంటున్న ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి ఇబ్బందికర పరిణామమే. సమర్ధింపు కోసం ఎన్ని కారణాలు చెప్పినా, ఎన్ని రకాల వాదనలు చేసినా జనం నమ్మడం కష్టం. నిజానికి ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వం పుష్కర ఏర్పాట్లను శక్తికి మించి చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుష్కర నిర్వహణను ప్రతిష్టాత్మకంగా తీసుకుని సొంత పర్యవేక్షణలో అన్ని  పనులు జరిపించారు. అన్ని చోట్లా తానయి నిలిచారు. ఇది కూడా ఆయన్ని ఆత్మరక్షణలో పడేసింది.  పర్యవేక్షణ పేరుతొ ఆయన అధికారులను పనిచేయనీయలేదని, అందుకే పుష్కర ఏర్పాట్లన్నీ అరకొరగా జరిగాయని ఆంధ్ర ప్రాంతపు కాంగ్రెస్ నాయకులు ఆరోపణల గళం పెంచారు.  
గతంలో ఉమ్మడి రాష్ట్రంలో గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించిన కీర్తి చంద్రబాబు నాయుడు  ఖాతాలో పదిలంగా  వుంది. ఈసారి 'మహా పుష్కరాల'ను  దానికి మించి నిర్వహించి, తన మంచి పేరును మరింత సార్ధకం చేసుకోవాలని తలపోయడం సహజమే. ఈ 'ప్రచార' బలహీనతే  గోదావరి పుష్కరాలను ఉత్తరాది 'కుంభమేళా' ను మించి నిర్వహించాలనే ఆలోచన చేసేలా ఆయన్ని పురికొల్పి వుంటుందని, అదే ఇప్పుడు కొంప ముంచిందని కొందరు అంటున్నారు. ముఖ్యమంత్రి అభీష్టానికి  కొందరు పండితులు చెప్పిన 'మహా పుష్కరాలు' అనే కొత్త కోణం ఆజ్యం  పోసింది. ప్రచారకర్తలు ఎవరో కాని, 'నూట నలభయ్ నాలుగేళ్ల' తరువాత వస్తున్న 'మహా పుష్కరాలు ' అనే ప్రచారం మాత్రం నేల నాలుగు చెరగులా చరచరా పొక్కిపోయింది. ఈ 'సూత్రీకరణ'కు  ప్రాతిపదిక ఏమిటో ఎవ్వరికీ తెలవదు. 'ఎవరో. ఎప్పుడో  అన్నారు, అంతే! అది కార్చిచ్చులా  జనంలో అది పాకిపోయింది.
పన్నెండేళ్ళకోసారి వచ్చే పుష్కర స్నానం చేయాలనే ఉద్దేశ్యంతో   వయస్సు మళ్ళిన వాళ్లు కూడా చేతయినా కాకపోయినా పుష్కర యాత్రకు బయలుదేరుతారు. ఇక 'మహా పుష్కరాలు' అంటూ సాగిన ఉధృత ప్రచారంతో,  అన్ని వయస్సుల వాళ్లు పుష్కర స్నానాల కోసం ఎగబడ్డారు. జీవిత కాలంలో ఒకే ఒక్కసారి దొరికే అవకాశం అంటూ వూదరగోట్టారు.  పుష్కర యాత్రీకులకు రాష్ట్ర ప్రభుత్వం కనీ వినీ ఎరుగని స్థాయిలో ఏర్పాట్లు చేస్తోందనీ, వసతులు కల్పిస్తోందని సాగిన  ప్రచారం భక్తులను లక్షల సంఖ్యలో ఆకర్షించింది. దానితో భారీగా చేసిన ఏర్పాట్లన్నీ వెల్లువెత్తిన భక్తజనంతో గాలికి కొట్టుకుపోయాయి. ప్రచారం పాలు  ఎక్కువయితే వాటిల్లే పర్యవసానాలు  ఇలాగే వుంటాయి.
వీటన్నిటికీ అదనంగా, ఈసారి గోదావరి పుష్కరాలను వాణిజ్య ధోరణులు కమ్మివేసాయి. ఇన్ని లక్షల  ఒక్కచోట జనాలు చేరే చోట,  'కాసుల పంట' పండించుకోవాలని కొన్ని వ్యాపార వర్గాలు పుష్కర యాత్రీకులకు అరచేతిలో స్వర్గం చూపించాయి. ఆధ్యాత్మికతను వినోదంతో ముడిపెట్టి పుష్కర యాత్రను ఒక విహార యాత్రగా మార్చివేశాయి.  ఎన్ని కష్టాలు పడయినా సరే, పుష్కర స్నానం చేసి తమ పూర్వీకులకు పిండ ప్రదానాలు పెట్టి తరిద్దామని అనేక వ్యయప్రయాసలకి ఓర్చి వచ్చే పుష్కర యాత్రీకులకు ఈ కొత్త  'విహార యాత్రీకులు ఈసారి జత కలిసారు. ఏతావాతా పుష్కరాలకోసం గోదావరి బాట పట్టే వారి సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయింది. పుష్కర ముహూర్తం అంటూ సాగిన ప్రచారంతో  తొలిరోజునే పుణ్య స్నానాలు చేసి పుణ్యం మూటకట్టుకోవాలనే కాంక్షతో పుష్కరాల మొదటి రోజుకే లక్షలాదిమంది రాజమండ్రి చేరుకోవడం జరిగింది. పుష్కర ఘాట్ అని ఒక స్నాన ఘట్టానికి పేరు వుండడంతో, నడిచి వెళ్ళడానికి అది  అనువుగా వుండడంతో అందరూ ఆ ఘట్టం వైపే మొగ్గు చూపడం, ముఖ్యమంత్రితో సహా కొందరు ముఖ్యుల కోసం ఆ ఘాట్ ని చాలాసేపు మూసివుంచడం, వీఐపీలు తమ పనులు చక్కబెట్టుకుని వెళ్ళగానే సర్దుబాటు చేసే పోలీసులు తగిన సంఖ్యలో లేకపోవడంతో తొక్కిసలాట జరిగి ఇరవై ఏడుమంది వూపిరి ఆడక చనిపోయారని, ఇంకా చాలామంది గాయాల పాలయ్యారని తొలి వార్తలు తెలిపాయి.
పుష్కర పుణ్యకాలంలో జరగరానిది జరిగిన మాట వాస్తవం. కాస్త ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాద స్థాయి కొంత అదుపులో వుండి వుండేదన్న వాదన కూడా  కొట్టిపారేయలేనిది. ఈ దుర్ఘటన ఇదొక గుణపాఠం వంటిది.  పునరావృతం కాకుండా చూసుకున్నప్పుడే ఆ పాఠం నేర్చుకున్నట్టు అవుతుంది. లేకపోతే, అది షరా మామూలుగా నాయకుల నోటి నుంచి జాలువారే 'ఊతపదం' గా మారుతుంది.                                
ఇక ఈ సందర్భంలో గుర్తుకొచ్చిన జ్ఞాపకాలు ఏమిటంటే......
పాతికేళ్ళ పైచిలుకు మాట
మాస్కోలో భూగర్భ రైలుమార్గం (మెట్రో)లో ప్రయాణించి రేడియో మాస్కో  దగ్గర్లోని  స్టేషన్ లో దిగి,  ఎస్కలేటర్ ద్వారా రోడ్డుమీదకు చేరుకున్నాను. అంతకుముందు ఎప్పుడూ చూడని ఒక దృశ్యం అక్కడ నాకు కనబడింది. స్టేషన్ వెలుపల కొందరు మిలీషియా (పోలీసులు) వాళ్లు, చేతుల్లో పొడవాటి తాళ్ళు పట్టుకుని వున్నారు. అక్కడికి దగ్గర్లో వున్న ఒక పెద్ద స్టేడియం వరకు పోలీసులు అలా తాళ్ళు పట్టుకుని కనిపించారు. నాతొ పాటు వున్న నా సహచర ఉద్యోగి, మలయాళీ న్యూస్ రీడర్ దాసన్,  నా మొహం చూసి అడక్కుండానే వివరాలు చెప్పాడు. ఆ స్టేడియంలో స్కూలు పిల్లలకు   ఆటలపోటీలు జరుగుతున్నాయి. అవి ముగియగానే ఆ స్టేడియంలో వున్న వందలాదిమంది పిల్లలు ఒకేసారి బయటకు వచ్చి  ఇళ్లకు వెళ్ళడానికి మెట్రో వైపు వస్తారు. 'ఆ విషయం ముందుగానే పోలీసులకు తెలియచేస్తారు కాబట్టి, రద్దీ కారణంగా తొక్కిసలాట జరగకుండా, దారిన పోయేవారికి ఇబ్బంది కలగకుండా ఈ ఏర్పాటు' అని చెప్పాడు. అతనన్నట్టుగానే పిల్లలు, అటూ ఇటూ పోలీసులు పట్టుకున్న తాళ్ళ నడుమ ఒక వరుసలో నడుచుకుంటూ హాయిగా స్టేషన్ లోకి వెళ్ళిపోయారు. 'ఇలా కూడా చేస్తారా పోలీసులు' అనిపించింది, అప్పుడే కొత్తగా హైదరాబాదు నుంచి మాస్కో వెళ్ళిన నాకు.



రెండో జ్ఞాపకం కూడా చాలా పాతది. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి. హైదరాబాదు  ఎర్రమంజిల్ కాలనీ నుంచి జూబిలీ హాల్ కు బయలుదేరాను.  అసెంబ్లీ సమావేశాలకు ముందు  స్పీకర్ సంప్రదాయంగా అక్కడ  ఇచ్చే అల్పాహార విందుకు వెళ్ళాలి.  రోడ్డు దాటి అవతల వైపు వెళ్ళి ఆటో పట్టుకోవాలి. ఇవతల ఎక్కుదామంటే ఒక్కడూ రాకపోగా 'సనత్ నగర్ అయితే తీసుకుపోతా' అంటాడు. వాళ్ళతో పనికాదనుకుని సగం రోడ్డు దాటాను. ఇంతలో ముఖ్యమంత్రి వస్తున్న దాఖలాగా పోలీసుల హడావిడి కనిపించింది. ట్రాఫిక్ పోలీసులు ఎక్కడివాళ్ళను అక్కడే నిలిపేశారు. దాంతో నేను  డివైడర్ మీదనే నిలబడిపోయాను. ఈలోగా సీఎం కాన్వాయ్  రావడం, పోవడం క్షణాల్లో జరిగిపోయింది. కాన్వాయ్ వెళ్లడం ఆలశ్యం, రోడ్డుమీద ఎక్కడలేని హడావిడి. అప్పటిదాకా నిలబడిపోయిన వాహనాలన్నీ ఒక్కమారుగా బయలుదేరాయి. అంతా అస్తవ్యస్తం. ఒకదానికొకటి అడ్డం. అడిగే నాధుడు లేదు. అప్పటిదాకా ట్రాఫిక్ కంట్రోల్ చేసిన పోలీసులందరూ మంత్రం వేసినట్టు మాయం అయిపోయారు. సీఎం వెళ్ళగానే తమ డ్యూటీ అయిపోయినట్టు వాళ్ల లెక్క కాబోలు. పోలీసులు మరికొద్ది నిమిషాలు వుండి వాహనాల రాకపోకలు అదుపుచేసి వుంటే ఈ పరిస్తితి వుండేది కాదు. నేను ఆటో పట్టుకుని వెళ్ళేటప్పటికే అల్పాహార విందు మొదలయింది. నేను చొరవతీసుకుని వెళ్ళి సీఎం సెక్యూరిటీ అధికారి ఇక్బాల్ తో అన్నాను, 'మరికొద్ది నిమిషాలు పోలీసులు అక్కడే వుండి సర్దుబాటు చేసివుంటే కొంపలు మునగవు కదా' అని. ఆయన నవ్వుతూ, 'అవును, కాన్వాయి లో వస్తూ డివైడర్ మీద నిలబడి వున్న మిమ్మల్ని చూసాను. మీ సలహా బాగానే వుంది, కమీషనర్ గారితో చెప్పి చూస్తాను' అన్నాడు మర్యాదగా.
సలహా బాగానే వుందన్నారు అందరూ. కానీ, ఇన్నేళ్ళు గడిచినా అది పట్టించుకున్నట్టు నాకయితే అనిపించడం లేదు.
రాజమండ్రి సంఘటనకీ, నా పాత జ్ఞాపకాలకీ సంబంధం అర్ధం అయిందనుకుంటాను.
(15-07-2015)
NOTE : Courtesy Images Owners              


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి