14, జులై 2015, మంగళవారం

ఒక విషాదం రెండు జ్ఞాపకాలు


విషాదం ఏమిటో విడిగా చెప్పనక్కర లేదు. ఈరోజు టీవీల్లో అంతా అవే దృశ్యాలు.
ఇక జ్ఞాపకాలు ఏమిటంటే......
పాతికేళ్ళ పైచిలుకు మాట
మాస్కోలో భూగర్భ రైలుమార్గం (మెట్రో)లో ప్రయాణించి రేడియో మాస్కో  దగ్గర్లోని  స్టేషన్ లో దిగి,  ఎస్కలేటర్ ద్వారా రోడ్డుమీదకు చేరుకున్నాను. అంతకుముందు ఎప్పుడూ చూడని ఒక దృశ్యం అక్కడ నాకు కనబడింది. స్టేషన్ వెలుపల కొందరు మిలీషియా (పోలీసులు) వాళ్లు, చేతుల్లో పొడవాటి తాళ్ళు పట్టుకుని వున్నారు. అక్కడికి దగ్గర్లో వున్న ఒక పెద్ద స్టేడియం వరకు పోలీసులు అలా తాళ్ళు పట్టుకుని కనిపించారు. నాతొ పాటు వున్న నా సహచర ఉద్యోగి, మలయాళీ న్యూస్ రీడర్ దాసన్,  నా మొహం చూసి అడక్కుండానే వివరాలు చెప్పాడు. ఆ స్టేడియంలో స్కూలు పిల్లలకు   ఆటలపోటీలు జరుగుతున్నాయి. అవి ముగియగానే ఆ స్టేడియంలో వున్న వందలాదిమంది పిల్లలు ఒకేసారి బయటకు వచ్చి  ఇళ్లకు వెళ్ళడానికి మెట్రో వైపు వస్తారు. 'ఆ విషయం ముందుగానే పోలీసులకు తెలియచేస్తారు కాబట్టి, ఆ సమయంలో రద్దీ కారణంగా తొక్కిసలాట జరగకుండా, దారిన పోయేవారికి ఇబ్బంది కలగకుండా ఈ ఏర్పాటు' అని చెప్పాడు. అతనన్నట్టుగానే పిల్లలు అందరూ ఒక వరుసలో నడుచుకుంటూ వచ్చి హాయిగా స్టేషన్ లోకి వెళ్ళిపోయారు. 'ఇలా కూడా చేస్తారా పోలీసులు' అనిపించింది, అప్పుడే కొత్తగా హైదరాబాదు నుంచి మాస్కో వెళ్ళిన నాకు.


మరోసారి హైదరాబాదులో  ఎర్రమంజిల్ కాలనీ నుంచి జూబిలీ హాల్ కు బయలుదేరాను. అక్కడ అసెంబ్లీ సమావేశాలకు ముందు  స్పీకర్ సంప్రదాయంగా  ఇచ్చే అల్పాహార విందుకు వెళ్ళాలి.  రోడ్డు దాటి అవతల వైపు వెళ్ళి ఆటో పట్టుకోవాలి. ఇవతల ఎక్కుదామంటే ఒక్కడూ రాకపోగా సనత్ నగర్ అయితే తీసుకుపోతా అంటాడు. వాళ్ళతో పనికాదనుకుని సగం రోడ్డు దాటాను. ఇంతలో ముఖ్యమంత్రి వస్తున్న దాఖలాగా పోలీసుల హడావిడి కనిపించింది. ట్రాఫిక్ పోలీసులు ఎక్కడివాళ్ళను అక్కడే నిలిపేశారు. దాంతో నేను  డివైడర్ మీదనే నిలబడిపోయాను. ఈలోగా సీఎం కాన్వాయ్  రావడం పోవడం క్షణాల్లో జరిగిపోయింది. కాన్వాయ్ వెళ్లడం ఆలశ్యం, రోడ్డుమీద ఎక్కడలేని హడావిడి. అప్పటిదాకా నిలబడిపోయిన వాహనాలన్నీ ఒక్కమారుగా బయలుదేరాయి. అంతా అస్తవ్యస్తం. ఒకదానికొకటి అడ్డం. అడిగే నాధుడు లేదు. అప్పటిదాకా ట్రాఫిక్ కంట్రోల్ చేసిన పోలీసులందరూ మంత్రం వేసినట్టు మాయం అయిపోయారు. సీఎం వెళ్ళగానే తమ డ్యూటీ అయిపోయినట్టు వాళ్ల లెక్క కాబోలు. పోలీసులు మరికొద్ది నిమిషాలు వుండి వాహనాల రాకపోకలు అదుపుచేసి వుంటే ఈ పరిస్తితి వుండేది కాదు. నేను ఆటో పట్టుకుని వెళ్ళేటప్పటికే అల్పాహార విందు మొదలయింది. నేను చొరవతీసుకుని వెళ్ళి సీఎం సెక్యూరిటీ అధికారి ఇక్బాల్ తో అన్నాను, 'మరికొద్ది నిమిషాలు పోలీసులు అక్కడ వుంటే కొంపలు మునగవు కదా' అని. ఆయన నవ్వుతూ,'అవును కాన్వాయి లో వస్తూ డివైడర్ మీద నిలబడి వున్న మిమ్మల్ని చూసాను. మీ సలహా బాగానే వుంది, కమీషనర్ గారితో చెప్పి చూస్తాను' అన్నాడు మర్యాదగా.
సలహా బాగానే వుందన్నారు అందరూ. కానీ, ఇన్నేళ్ళు గడిచినా అది పట్టించుకున్నట్టు నాకయితే అనిపించడం లేదు. (14-07-2015)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి