31, డిసెంబర్ 2014, బుధవారం
30, డిసెంబర్ 2014, మంగళవారం
విగ్రహాలు - వివాదాలు
(PUBLISHED BY 'SURYA' TELUGU DAILY ON 01-01-2015, THURSDAY)
బహిరంగ
ప్రదేశాలలో అనుమమతి లేకుండా ప్రతిష్టించిన రాజకీయ నాయకుల విగ్రహాలను తొలగించే
చర్యలను సత్వరం తీసుకోవాల్సిందని ఆంద్ర ప్రదేశ్, తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వాలను
రెండింటినీ హైకోర్ట్ ఆదేశించింది. వాతావరణ కాలుష్యానికి కారణమవుతూ, పారిశుధ్య
విభాగాలకు సవాలుగా పరిణమిస్తున్న ఫ్లెక్సీల వాడకంపై కూడా కోర్టు కొరడా ఝలిపించింది.
చోటామోటా నాయకుల పుట్టిన రోజులకు సయితం నగర వీధులన్నీ ప్లాస్టిక్ ఫ్లేక్సీలతో, తోరణాలతో నిండిపోతున్నాయి. అసలే చెత్త నగరాలుగా పేరొందిన నగరాలు ఈ ప్లాస్టిక్ చెత్తతో మరింత చెత్తగా తయారవుతున్నాయి. నిజానికి ఇవి నివారించగలిగిన వ్యర్ధాలు. కానీ అడిగే నాధుడు లేక ప్రతిచిన్న కార్యక్రమానికి వందలాది ఫ్లేక్సీలు, వేలాది తోరణాలు తెల్లారేసరికల్లా వీధుల్లో ప్రత్యక్షం. అవి తీసీ తీయకముందే మరో కార్యక్రమం. మళ్ళీ షరా మామూలే. ఈ నేపధ్యంలో న్యాయస్థానం ఉత్తర్వు ఒకింత ఊరట కలిగించేదిగావుంది. అయితే, కోర్టులు ఎన్నో ఆదేశాలు ఇస్తుంటాయి. వాటిలో కొన్నే అమలుకు నోచుకుంటాయి. మరి ఈ తాజా ఉత్తర్వు ఏ జాబితాలోకి చేరుతుందో చూడాలి.
చోటామోటా నాయకుల పుట్టిన రోజులకు సయితం నగర వీధులన్నీ ప్లాస్టిక్ ఫ్లేక్సీలతో, తోరణాలతో నిండిపోతున్నాయి. అసలే చెత్త నగరాలుగా పేరొందిన నగరాలు ఈ ప్లాస్టిక్ చెత్తతో మరింత చెత్తగా తయారవుతున్నాయి. నిజానికి ఇవి నివారించగలిగిన వ్యర్ధాలు. కానీ అడిగే నాధుడు లేక ప్రతిచిన్న కార్యక్రమానికి వందలాది ఫ్లేక్సీలు, వేలాది తోరణాలు తెల్లారేసరికల్లా వీధుల్లో ప్రత్యక్షం. అవి తీసీ తీయకముందే మరో కార్యక్రమం. మళ్ళీ షరా మామూలే. ఈ నేపధ్యంలో న్యాయస్థానం ఉత్తర్వు ఒకింత ఊరట కలిగించేదిగావుంది. అయితే, కోర్టులు ఎన్నో ఆదేశాలు ఇస్తుంటాయి. వాటిలో కొన్నే అమలుకు నోచుకుంటాయి. మరి ఈ తాజా ఉత్తర్వు ఏ జాబితాలోకి చేరుతుందో చూడాలి.
మన
దగ్గర ఇటీవలి కాలంలో పెచ్చరిల్లిపోతున్న రాజకీయ విగ్రహారాధన విష సంస్కృతి నేపధ్యంలో ఈ వార్తకు
ఎంతో ప్రాధాన్యం వుంది. కాకపోతే దీనికి రావాల్సిన ప్రాముఖ్యం, ప్రాచుర్యం మీడియాలో
లభించలేదేమో అనిపిస్తోంది.
ప్రపంచంలో
ఎక్కడా లేని విధంగా రాజకీయ నాయకుల విగ్రహాలు మన రాష్ట్రంలో ఏమూలకు పోయినా
కానవస్తాయి. ఎవరి మీది అభిమానంతో ఈ విగ్రహాలు ప్రతిష్టిస్తున్నారో వారి కనీస పోలికలు
వాటిల్లో మచ్చుకు కూడా కానరావు.
కొన్నింటిని ప్రతిష్టించి ఆవిష్కరించాల్సిన వీఐపీకి తీరుబడి దొరకలేదనే కారణంతో వాటికి
ముసుగుకప్పి నడిబజారులో వొదిలేస్తారు. వారి భక్తి తాత్పర్యాలు విగ్రహం తాలూకు నాయకుడి మీదో, సమయం
దొరకని ప్రస్తుత నాయకుడి మీదో తెలియక దారినపోయే జనం తలలు పట్టుకుంటారు. అలాగే ఆ
విగ్రహాల కారణంగా సామాన్య జనజీవనానికి ఏమైనా అసౌకర్యం కలుగుతోందా అన్న విషయం కూడా
వారికి పట్టకపోవడం మరో దౌర్భాగ్యం. సరిగ్గా ఈ అంశంపైనే హైకోర్టు స్పందించినట్టు
కనబడుతోంది.
'విగ్రహారాధన
కూడదు' అని ప్రబోధించిన గౌతమ బుద్దుడు జన్మించిన పుణ్య భూమి మనది. అయినా విగ్రహాలకు మాత్రం ఏమాత్రం కొరత లేదు. విగ్రహాలు వద్దన్న బుద్దుడి విగ్రహాలే భారీ సైజుల్లో దేశం నలుమూలల్లో
కానవస్తాయి. ఇక ప్రసిద్ధ హిందూ ఆలయాల్లో కొలువై వున్న దేవతా విగ్రహాలు చాలావరకు
స్వయంభూ విగ్రహాలుగా అవతరించాయని చెబుతారు. ఇవి కూడా జన సంచారానికి దూరంగా అధిక భాగం
కొండలు, కోనల్లో వెలిశాయి. కాలక్రమేణా ప్రసిద్ధ ఆలయాలుగా ప్రాచుర్యం పొందాయి.
లౌకిక వ్యవస్థకు పెద్ద పీట వేసిన స్వతంత్ర భారతంలో ఆయా మత విశ్వాసాలకు తగిన ఆలయాలు
అనేకం వున్నాయి. దైవానికి ఒక రూపం అంటూ లేదని నమ్మే మతాలవారు కూడా విగ్రహాలు లేని
ప్రార్ధనా మందిరాలు అనేకం ఏర్పాటుచేసుకున్నారు. ఈ ఆలయాలను సందర్శించే యాత్రీకుల సయితం సంఖ్య నానాటికీ బాగా పెరుగుతూ వస్తోంది. గతంలో
ఎన్నడూ లేని విధంగా రాజకీయాల పుణ్యమా అని కుల మతాలకు ప్రాధాన్యం పెరుగుతోంది. తమ
అవసరాలకోసం రాజకీయ పార్టీలు కూడా ఈ సంస్కృతిని పెంచి పోషిస్తున్నాయి. మతం అనేది ఒక
జీవన విధానంగా రూపుదిద్దుకున్న దేశంలో, ఈనాడు మతం దేశాన్ని ముక్కలుచేసే ప్రతీప
శక్తిగా మారుతూ వస్తోంది. రాజకీయాల రణగొణ ధ్వనుల్లో ఈ సంకేతాల సవ్వడులు వినరాకుండా
పోతున్నాయి.
మత
ప్రాతిపదికగా దేవాలయాల్లో వుండే ఈ విగ్రహాలవల్ల జనాలకు కలిగే ఇబ్బంది ఏమీ లేదు.
కానీ రాజకీయ నాయకుల విగ్రహాలు అనేవే ఇటీవలి కాలంలో వివాదగ్రస్తం అవుతున్నాయి.
ఒకప్పుడు మూడుపూలు ఆరుకాయలుగా ప్రాభవం పొంది
మహనీయులుగా, మానవీయులుగా వెలుగొందిన
వ్యక్తుల విగ్రహాలు తదనంతర కాలంలో వారు నడిపిన రాజకీయాలకు కాలం చెల్లగానే, ఆ
విగ్రహాలు కూడా చెల్లని కాసుల్లా తయారవుతున్నాయి. మన దేశంలోనే కాదు ప్రపంచంలో అనేక దేశాల్లో ఇటువంటి పరిణామాలు
పలుచోట్ల చోటు చేసుకున్న సందర్భాలు వున్నాయి. మునుపటి సోవియట్ యూనియన్ లో, స్టాలిన్ శకంలో ఊరూరా వెలిసిన అయన విగ్రహాలకు
తదనంతర కాలంలో పట్టిన దుస్తితి చరిత్ర రికార్డుల్లో నమోదయివుంది. ఆఖరికి లెనిన్ మసోలియంలో అయన భొతిక కాయం సరసనే భద్రపరచిన
స్టాలిన్ శరీరాన్ని వెలికి తీసి వేరే చోట ఖననం చేయడం కూడా జరిగింది. కేవలం అధికారాన్ని
అడ్డుపెట్టుకుని అడ్డగోలుగా రాజకీయాలు చేసిన వాళ్ళకు వర్తమానం మినహా భవిష్యత్తు
ఉండదని చరిత్రచెప్పే పాఠాలు తలకెక్కించుకునే విజ్ఞత లోపిస్తోంది. కొందరు మరణించిన తరువాత కూడా జీవిస్తారు.
కొందర్ని జీవించి ఉండగానే జనం జ్ఞాపకాల్లో వారి ఆనవాళ్ళు లేకుండా చేస్తారు. రాజకీయానికి జాలీ దయా వుండవు.
మాయావతి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నకాలంలో 'విగ్రహారాధన'
అంబరాన్ని తాకింది. నాటి గౌతమ బుద్దుని నుంచి మొదలుకుని బడుగు బలహీన వర్గాల నాయకులు రవిదాస్, నారాయణ
గురు, జ్యోతీరావు పూలే, షాహూజీ మహారాజ్, పెరియార్ రామస్వామి, బాబా సాహెబ్
అంబేద్కర్, బీ.ఎస్.పీ. సంస్థాపకుడు కాంషీరామ్ విగ్రహాలను కూడా మాయావతి ప్రభుత్వ
ఖర్చుతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాలలో నెలకొల్పారు. మరీ విచిత్రం ఏమిటంటే తన
విగ్రహాల ఏర్పాటు పట్లకూడా మాయావతి మక్కువ ప్రదర్శించడం. 2007 నుంచి రెండేళ్ళ కాలంలో మాయావతి ఈ నాయకుల స్మారక చిహ్నాల నిర్మాణాలపై వందలకోట్లు ఖర్చు
చేసారు.
ఇక మీరట్ లో అఖిల భారత హిందూ మహాసభ, ఓం శివ మహాకాల్ సేవా సమితి
కలిసి ఏకంగా నాధూరాం గాడ్సే విగ్రహ స్థాపనకు నడుం బిగించాయి. మహాత్మా గాంధీని హత్య
చేసిన గాడ్సే విగ్రహం ఏర్పాటు అయితే అది మొత్తం దేశంలోనే మొట్టమొదటి గాడ్సే
విగ్రహం అవుతుంది. మీరట్ లో ఇందుకు సంబంధించి
భూమి పూజ కార్యక్రమం పోలీసు బందోబస్తు నడుమ
ఇటీవల పూర్తయింది కూడా.
కేరళ
లోని కోజికోడ్ పట్టణానికి ఏకంగా విగ్రహాల నగరం అనే పేరు కూడా వుంది.
ప్రస్తుతం తెలంగాణా రాష్ట్రానికి రాజధాని నగరంగా వున్న
హైదరాబాదు ఒకప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు కూడా రాజధాని. తెలుగుదేశం పార్టీ
వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా వున్న కాలంలో ఆయనకు ఒక భారీ బుద్ధ
విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనే సంకల్పం కలిగింది. హుస్సేన్ సాగర్ సరస్సు మధ్యలో
జిబ్రాల్టర్ రాక్ అనే పేరు కలిగిన ఒక రాతి గుట్ట మీద ఆ విగ్రహాన్ని
ప్రతిష్టించాలని సంకల్పించారు. ఇందుకోసం జిబ్రాల్టర్ రాక్ పై పదిహేను అడుగుల
ఎత్తులో ఒక వేదికను నిర్మించారు. భారీ విగ్రహానికి కావాల్సిన ఏకశిలను నల్గొండ జిల్లాలో స్థపతులు ఎంపికచేసి విగ్రహ
నిర్మాణం మొదలు పెట్టారు. వందలాదిమంది పనివారలు, శిల్పుల సాయంతో అయిదేళ్లపాటు
శ్రమించి స్థపతి గణపతి ఆ రాతిని తొలిచి యాభై ఎనిమిది అడుగులు ఎత్తయిన భారీ బుద్ధ విగ్రహాన్ని
చెక్కారు. అనేక వ్యయప్రయాసల అనంతరం మూడువందల యాభై టన్నుల బరువున్న ఆ విగ్రహం
సుమారు నలభై మైళ్ళు ప్రయాణించి హైదరాబాదు చేరుకుంది. విగ్రహ ప్రతిష్టాపనకు అవసరమైన
భారీ క్రేన్లు స్థానికంగా లభ్యం కాకపోవడంతో వాటిని ముంబై నుంచి తెప్పించారు.
ఈలోగా సంభవించిన రాజకీయ పరిణామాల ఫలితంగా విగ్రహ వ్యూహకర్త
ఎన్టీ రామారావు పదవి నుంచి దిగిపోయారు. కొత్త ప్రభుత్వం దీనిపట్ల పెద్ద ఆసక్తి
చూపలేదు. విగ్రహ ప్రతిష్టాపన కాంట్రాక్ట్ తీసుకున్న ఏబీసీ కంపెనీ ఈ పని పూర్తిచేసే
పనికి పూనుకుంది. 1990, మార్చి పదో తేదీన విగ్రహాన్ని హుస్సేన్ సాగర్ జలాలమీదుగా
తరలిస్తుండగా వంద గజాల దూరం దాటకుండానే ప్రమాదవశాత్తు విగ్రహం నీటిలో పడిపోయింది.
ఈ దుర్ఘటనలో పదిమంది మరణించారు. దానితో బుద్దవిగ్రహ ప్రతిష్టాపన వాయిదా పడింది.
కల్మషం ఎరుగని బుద్ధ భగవానుడు కల్మష జలాలలో దాదాపు రెండేళ్ళు ఉండిపోయాడు.
చిట్టచివరకు 1992 డిసెంబరు ఒకటో తేదీన తధాగతుడు
జలసమాధి నుంచి బయటపడి తనకోసం సిద్ధంగా వుంచిన విశాలమైన వేదికమీద నిటారుగా నిలబడగలిగాడు.
2006 లో బౌద్ధ గురువు దలై లామా బుద్ధుడి విగ్రహానికి
సంప్రోక్షణ నిర్వహించారు.
హైదరాబాదు టాంక్ బండ్ మీద ఎన్టీయార్ హయాములోనే
తెలుగువెలుగుల విగ్రహాలు వెలిశాయి. మొత్తం ముప్పై మూడు విగ్రహాలను ఒకే వరుసలో
రాకపోకలకు అంతరాయం కలగని రీతిలో ఏర్పాటు చేసిన విధానం హర్షణీయం. అనుసరణీయం. అయితే
ఆ విగ్రహాలకు ఎంపిక కూడా వివాద గ్రస్తం అయింది. ఒక ప్రాంతానికి చెందిన గొప్ప
వ్యక్తులను పట్టించుకోలేదన్న విమర్శలు తారాస్థాయికి చేరాయి. ప్రత్యెక రాష్ట్ర
ఉద్యమ సమయంలో మరోసారి ఈ అంశం వెలుగులోకి రావడమే కాకుండా విభజనవాదులు వాటిల్లో
కొన్నింటిని విధ్వసం చేసేవరకు విషయం ముదిరిపోయింది.
అభివృద్ధి చెందిన అనేక దేశాల్లో రోడ్ల కూడళ్ళలో కాకుండా రహదారికి ఒక
పక్కగా విగ్రహాలు ఏర్పాటు చేస్తారు.
దీనివల్ల ట్రాఫిక్ అంతరాయాలు లేకపోవడమే కాకుండా చూపరులకు కంటికి విందు గొలుపుతాయి.
అద్భుతమైన శిల్ప సౌందర్యం ఉట్టిపడే విగ్రహాలు ప్రపంచంలో వివిధనగరాలకు ప్రధాన పర్యాటక ఆకర్షణలుగా విలసిల్లుతున్నాయి.
విగ్రహాలకు సుదీర్ఘ చరిత్ర వుంది. పాత రాతి యుగం నుంచి
విగ్రహారాధన ఏదో ఒక రూపంలో సాగుతూనే వస్తోంది. అతి పురాతన విగ్రహం ముప్పయి వేల
సంవత్సరాల నాటిదని చరిత్ర కారులు గుర్తించారు. ఇప్పటివరకు ప్రపంచం మొత్తంలో
ఎత్తయిన విగ్రహం, అదీ గౌతమ బుద్దుడి విగ్రహం చైనాలో వుంది. ప్రస్తుతం ఆ రికార్డు
సొంతం చేసుకునే పనిలో మోడీ ప్రభుత్వం పనిచేస్తోంది. గుజరాత్ లో అతి ఎత్తయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం
ఏర్పాటుకు అంకురార్పణ చేసింది కూడా. నర్మదా డామ్ ఎదురుగా ఏర్పాటవుతున్న ఈ స్టాట్యూ
ఆఫ్ యూనిటీ విగ్రహం పూర్తయినాడు అదే యావత్
ప్రపంచంలో అతి ఎత్తయిన విగ్రహం అవుతుంది.
అనేక చారిత్రిక ఘట్టాలకు ఆనవాలుగా విగ్రహాలను
ప్రతిష్టించడం ఆనవాయితీగా వస్తోంది. అలాగే సమాజాన్ని బాగా ప్రభావితం చేసిన మహనీయుల
పట్ల గౌరవ సూచకంగా విగ్రహాలను ప్రతిష్టించడం పరిపాటి. అమెరికా అధ్యక పదవి రేసులో దేశాన్ని
చుట్టబెడుతున్న రోజుల్లో ప్రెసిడెంట్ ఒబామా ఇలినాయిస్ రాష్ట్రంలోని, మెట్రోపాలిస్ నగరంలో ఏర్పాటు చేసిన హాలీవుడ్ చిత్ర కధానాయకుడు 'సూపర్
మ్యాన్' విగ్రహం ఎదుట నిలబడి ఫోటో తీయించుకుని మరీ తన ముచ్చట తీర్చుకున్నారు. న్యూయార్క్
లోని స్టాట్యూ ఆఫ్ లిబర్టీ పర్యాటక ఆకర్షణకు మరో మచ్చు తునక. లండన్
లో వున్న మైనపు విగ్రహాల మ్యూజియం సంగతి చెప్పక్కరలేదు. అందులో తమ బొమ్మ
చూసుకోవడానికి ఎందరెందరో సెలబ్రిటీలు ఎంతో ముచ్చటపడుతుండడం కద్దు.
(31-12-2014)
NOTE: Photo
Courtesy Image Owner
నిలబెట్టుకోలేని మాట
ఈ మాట అనగానే రాజకీయుల వాగ్దానాలు గుర్తొస్తే చేసేదేమీ
లేదు.
నేను చెప్పబోయే 'ఈ మాట' ఎవరికి వారు
ఇచ్చుకునేమాట. కొత్త ఏడాదిలో 'ఇది చేస్తాం అది మానేస్తాం' అంటూ మనకు మనమే
ఇచ్చుకునే మాట అన్నమాట.
ఈ మాట్లాట మానేసి అసలు విషయానికి వద్దాం.
న్యూ ఇయర్ రిజల్యూషన్స్ పేరుతో ఎన్నో చేయాలని
అనుకుంటాం. అదేం పాపమో ఏడాది మొదట్లోనే వాటికి పురిటి సంధి కొడుతుంది.
చాలామంది మగ పురుషులు ప్రతిఏడాది కామన్ గా తమకుతాము
ఇచ్చుకునే వాగ్దానం కామన్ గా ఒకటుంది. అదేమిటంటే మందు మానేస్తాం, సిగరెట్లు తాగడం
ఆపేస్తాం అని. కానీ, కామన్ గా జరిగేది ఏమిటంటే మర్నాడు సీను షరా మామూలే. హాల్లో పీఠం
వేసుకుని, విలాసంగా సిగరెట్టు వెలిగించి,
మందహాసంతో మందు గ్లాసు పట్టుకున్న తరువాత కూడా ఎందుకో ఏమిటో ఈ మాట
అస్సలు గుర్తురాదు. ఆవిళ్ళు (ఆవిడలు అనగా భార్యలు)
పనిగట్టుకుని గుర్తుచేయబోయినా 'ఆ మాట నిరుడు కదా చెప్పాను' అనేస్తారు అదేదో పూర్వ
జన్మ వృత్తాంతం అన్నట్టు. కావున, కావుకావుమని చెప్పేదేమిటంటే, ఎన్నికల్లో చేసిన
వాగ్దానాలు అధికారంలోకి వచ్చిన తరువాత నిలబెట్టుకోలేదెందుకని రాజకీయ నాయకులను నిలదీసే హక్కు మనకు బొత్తిగా లేదని.
మనం మాట తప్పడానికి కూడా ఓ కారణం వుంది. ఈ కొత్త ఏడాది
పాతపడి గిర్రున ఏడాది తిరిగి మరో కొత్త ఏడాది మళ్ళీ వస్తుందని.
వాళ్ళు మాట తప్పడానికి కూడా దాదాపు అదే కారణం.
అయిదేళ్ళ తరువాత మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు
అప్పుడు మరో మాట ఇస్తే పోలా అని.
కావున, అల్లా ఆలోచించి ఎన్నికల్లో ఇచ్చిన పాత మాటలన్నీ
(వోట్ల వొట్లు అన్నమాట) మూటగట్టి మన గట్టునే పెట్టి వెడుతున్నారు.
అదన్న మాట.
NOTE: Courtesy Cartoonist
29, డిసెంబర్ 2014, సోమవారం
ప్రపంచమే ఒక నాటక రంగం
స్వామి చిత్రానంద లేచి వెళ్లి టీవీ ఆఫ్ చేసి వచ్చి
కూర్చుని చెప్పారు.
'చూశారు కదా! అందుకే అన్నారు, ప్రపంచమే ఒక నాటక
రంగం అనీ, మనమందరం ....'
శిష్యులలో ఒకడు తొందర పడి అన్నాడు 'మనమందరం నటీ నటులం'
'కాదు నాయనా మనలో చాలామందిమి ప్రేక్షకులం. కొందరే
నటులు. ఇప్పటిదాకా టీవీలో వారినే కదా చూశారు'
అన్నారు స్వామి చిత్రానంద.
పేరుకు తగ్గట్టే ఆయన చాలా చిత్రమైన మనిషి.
శిష్యులకు బోధించే తీరు కూడా అలాగే విలణంగా వుంటుంది.
టీవీలో వస్తున్న ప్రోగాం గురించి ఆయన చెప్పారు.
'అందులో ఇంటర్వ్యూ ఇచ్చిన శాల్తీని గుర్తుపట్టారు కదా!'
'గుర్తుపట్టాము గురువు గారు. ఆయగారేమో నిన్నమొన్నటి దాకా ఓ పార్టీ అధికార ప్రతినిధిగా
ఉంటూ ప్రత్యర్ధి పార్టీని అయినదానికీ కానిదానికీ ఉతికి ఆరేస్తూ, చెరిగేస్తూ గంట క్రితమో అరగంట క్రితమో అదే పార్టీలోకి
దూకేసినవాడు. కదా! గురువు గారు'
'కదా! పాత్ర మారిన తరువాత మాట తీరు కూడా ఎలా
మారిపోయిందో చూశారు కదా!. ఇప్పటికయినా అర్ధం అయిందా మనమందరం ఎలాటి ఘనాపాటీ నటీ నటుల మధ్య బతికేస్తున్నామో'
'మరే గురువు గారు. మా చిన్నప్పుడు సావిత్రీ
ఎంటీయారు ఓ సిన్మాలో ప్రేయసీ ప్రియులుగా ప్రేమ
పాటలు పాడే సుకుని, మరో చిత్రంలో అన్నాచెల్లెళ్ళుగా
కావిలించుకుని కన్నీళ్లు పెట్టుకుంటుంటే అబ్బ యెంత గొప్పగా పాత్రల్లో వొదిగిపోయారో
అనిపించేది'
'అలాటి సినిమాలు మ్యాట్నీ ఒక హాల్లో, మొదటాట ఇంకో
హాల్లో చూసి మతులు పోగొట్టుకునే వాళ్ళం కూడా' ఇంకో శిష్యుడు అందుకున్నాడు.
'ఇందాక
టీవీలో పాత పార్టీ నాయకుడ్ని పొగిడేస్తూ,
కొత్తగా చేరిన కొత్త పార్టీ నాయకుడ్ని చెరిగేస్తూ గతంలో తాను చేసిన కామెంట్ల పాత క్లిప్పింగులు మధ్య మధ్యలో చూపిస్తుంటే ఆ నాయకుడి మోహంలో రంగులు ఎలా మారతాయో చూద్దామని ఉగ్గబట్టి
చూశాను గురువుగారు. కానీ అదేం చిత్రమో ఆయన
మోహంలో రంగులు మారలేదు సరికదా, టీవీలో చూపిస్తున్నది తనని కాదు వేరే ఎవర్నో అన్నంత దిలాసాగా
కనిపించేసరికి నేనే బిత్తరపోయాను గురువుగారు. వీరి నటన చూస్తుంటే ఆస్కారు కూడా
వీరికి తక్కువ అవార్డేమో అనిపించింది'
'గతంలో ఆ పార్టీ అధినేత కుటుంబం నడిపే కంపెనీ పాలు
విషపూరితం, కేసు పెట్టి అరెస్టు చేయాలి అంటూ
తాను గతంలో ఇచ్చిన స్టేట్ మెంట్ పాత క్లిప్పింగులు ఓ పక్క చూపిస్తుంటే, ఆయన మాత్రం
నిర్వికారంగా మా ఇంట్లో అప్పుడూ ఇప్పుడూ ఆ పాలే తాగుతాం,
చంటివాడికి ఉగ్గు పాలకింద ఆ కంపెనీ పాలే పడతాం అనే తీరులో ఎంతో ధీమాగా చెబుతుంటే వీళ్ళ నటన ముందు సినిమా నటులు కూడా బలాదూరు అనిపించింది'
శిష్యుల వ్యాఖ్యానాలు విని స్వామి చిత్రానంద
చివరగా అనుగ్రహ భాషణ చేశారు.
'మనిషి నాలుకకు నరం లేదు. నరం లేని నాలిక
ఎటువైపేనా తిరుగుతుంది. ఇక రాజకీయ నాయకుల మాటలు గురించి చెప్పేదేముంది. వారు తమ
అవసరాన్నిబట్టి పార్టీ మారతారు. పార్టీ అవసరాన్నిబట్టి మాటలు మారుస్తారు. కాబట్టి
వాళ్ళు చెప్పేదంతా నిజం అనుకోకూడదు. అలాఅని మనం కూడా బయట పడరాదు సుమీ. నమ్మినట్టు
నటిస్తే ఓ పనయిపోతుంది. ఎందుకంటె ఎన్నాళ్ళు ప్రేక్షకులుగా వుండిపోతాం చెప్పండి.
మనమూ ఎదగాలి కదా! సరే! ఈపూటకి ఈ పాఠం చాలు. రేపు మరో కొత్త సంగతి చెప్పుకుందాం'
అని శిష్యులకు సెలవిచ్చారు స్వామి చిత్రానంద.
NOTE: Courtesy Cartoonist
NOTE: Courtesy Cartoonist
27, డిసెంబర్ 2014, శనివారం
కేసీయార్ విశ్వ నగర నిర్మాణం
(Published by 'SURYA'. telugu daily in its Edit Page on 28-12-2014, SUNDAY)
కొన్ని ముచ్చట్లు వింటుంటే ఎంతో ముచ్చట అనిపిస్తుంది. ఇలాటి ముచ్చటగొలిపే
ముచ్చట్లు చెప్పడంలో సిద్ధహస్తులు తెలంగాణా ముఖ్యమంత్రి శ్రీ చంద్రశేఖర
రావు. బంగారు తెలంగాణ గురించి ఆయనకు ఎన్నో కలలు వున్నాయి. ఆ కలలను సాకారం చేయడం
కోసం ఆయన నిరంతరం తపిస్తున్నట్టుగానే కానవస్తారు. వాటిని నిజం చేసుకోగల బంగారు
అవకాశం కూడా ఆయనకు ముఖ్యమంత్రి పదవి రూపంలో లభించింది. అందుకే కేసీయార్
ప్రతిరోజు ఎన్నెన్నో గంటలపాటు అధికారులతో సుదీర్ఘ సమీక్షలు జరుపుతున్నట్టు అనుదినం
పత్రికల్లో వార్తలు వస్తుంటాయి. ముందే చెప్పినట్టు ఆయన చెబుతుంటే వినేవాళ్ళు
మంత్రముగ్ధులు అవ్వడం అనేది తధ్యం. ఇది అతిశయోక్తి అనిపించినా అది పచ్చి నిజం.
ముఖ్యంగా హైదరాబాదు గురించి అయితే, ఆయన ఆలోచనలు అంబరాన్ని తాకుతుంటాయి. హుస్సేన్ సాగర్ లోని
కాలుష్య జలాలను తోడేసి, దాన్ని మంచి నీటి సరస్సుగా
తయారుచేయడం వాటిల్లో ఒకటి. రెండు నగరాల నడుమ అంత పెద్ద తటాకం వున్న మరో మహా
నగరం మన దేశంలోనే లేదంటారు. భాగ్యనగరాన్ని విశ్వ నగరంగా తీర్చి దిద్దడానికి
అందుబాటులో వున్న ప్రధాన ఆకర్షణ కూడా హుస్సేన్ సాగరే. తెలంగాణకు ఎట్లాగు సముద్ర
తీరం లేదు. కాబట్టి సిద్ధంగా వున్న సాగర తీరాన్ని పర్యాటక కేంద్రంగా మార్చుకోవాలన్నది
టీ ఆర్ యస్ అధినేత అంతరంగం కావచ్చు. ఆ ప్రాంతంలో ప్రపంచంలో కెల్లా ఎత్తయిన వంద
అంతస్తుల భవన నిర్మాణం ద్వారా ప్రపంచ దృష్టిని ఆకట్టుకోవాలన్నది ఆయన ఉద్దేశ్యం
కావచ్చు. రికార్డులకెక్కే ఇటువంటి బృహత్తర నిర్మాణాలను కళ్ళారా చూడాలనే పర్యాటకుల
సంఖ్య అన్ని దేశాల్లో తక్కువేమీ కాదు. పర్యాటకం ద్వారా గుర్తింపు, అదే సమయంలో ఆర్ధిక పరమైన లబ్ది పొందడం ద్వారా దాన్ని ఉభయతారకం చేసుకోవడం
తెలంగాణా ముఖ్యమంత్రి ఆలోచన కావచ్చు. కేసీయార్ ఇటువంటి ఆలోచనలను పంచుకునేటప్పుడు
వాడే భాషా చమత్కారం కూడా బహు రంజకంగా ఉంటుందని విన్నవాళ్ళు చెప్పే మాట. అయితే,
ఆ మాయతెర తప్పుకున్న తరువాత ఆయన చెప్పినదంతా ఆచరణ
సాధ్యమయ్యే పనేనా అని కూడా అనిపించవచ్చు. కానీ ఆయన మాత్రం ఇటువంటి
సందేహాత్ములను అస్సలు పట్టించుకోరు. లెక్కచెయ్యరు. తను అనుకున్న పద్దతిలోనే
ముందుకు సాగుతున్నట్టు స్పష్టమైన సంకేతాలు ఇస్తారు. అంతేకాదు, బంగారు తెలంగాణా ఎలా వుండాలని తాను కోరుకుంటున్నారో వాటిని గురించి
కలలు కనడం కూడా మానరు. వాటిల్లో కొన్నింటిని సాకారం చేయగలిగితే మాత్రం
బంగారు తెలంగాణా ఆవిష్కృతం కావడం తధ్యం. అందులో సందేహం లేదు. అలా జరిగిన నాడు
ఆయన్ని అపర భగీరధుడు అని పొగిడినా ఆశ్చర్యం లేదు.
సరే! హైదరాబాదును విశ్వనగరంగా తీర్చిదిద్దే బృహత్తర కార్యక్రమాన్ని
ముఖ్యమంత్రి భుజాలకెత్తుకున్నారు. అహరహం దాన్ని గురించే ఆలోచిస్తున్నారు. నేర రహిత
నగరంగా, ట్రాఫిక్
ఝంఝాటాలు లేని నగరంగా, చక్కని ఉద్యానవనాలు, పచ్చని ప్రకృతితో అలరారే నగరంగా మార్చాలన్న సత్సంకల్పంతో ముందుకు
సాగుతున్నారు. మాఫియాలబారి నుంచి, భూకబ్జాదారుల కోరలనుంచి,
దళారుల కబంధ హస్తాల నుంచి నగరాన్ని విముక్తం చేయాలని కంకణం
కట్టుకుని పనిచేస్తున్నారు. ఇలాటి ఆలోచనలు చేసేవాళ్ళని ఎవ్వరూ తప్పుపట్టలేరు.
ఇలాటి ప్రతి చర్యను ప్రతిఒక్కరు ఆహ్వానిస్తారు కూడా. కోడలు కంటాను అంటే వద్దనే
అత్త ఉండదని సామెత.
ఇవన్నీ ఒకెత్తు. స్కై స్క్రేపర్లు (ఆకాశహర్మ్యాలు), స్కైవేలు (ఆకాశ
వీధులు) ఇలా అత్యాధునిక నిర్మాణాలతో మరో ఇరవై ఏళ్ళ కాలానికి సరిపడే విధంగా
ప్రణాళికలు తయారుచేయిస్తున్నారు.
ఆయన చెప్పడానికి, ఇతరులు వినడానికి అంతా బాగానే వుంది. మరి ఇవన్నీ ఎలా
సాధ్యం. ఇన్నిన్ని ప్రాజక్టులు ఒకే పర్యాయం అమలుచేయాలంటే ఎన్ని నిధులు
కావాలి, అవి ఎక్కడినుంచి వస్తాయి అనే ప్రశ్నలు ఉత్పన్నం
కావడం కూడా తధ్యం. ఎందుకంటె ఒకటీ అరా పనులకు సరిపడే డబ్బును ఎల్లాగో అల్లా
సర్దుబాటు చేసుకోవచ్చు. కానీ ఒకేసారి ఇన్ని తలకెత్తుకోవాలంటే తలకు మించిన
భారమే అవుతుంది. అన్ని నిధులు ఎలా సమకూరుతాయి ? అన్ని వనరులు
ఎక్కడ వున్నాయి? అధికారులకి ఇవన్నీ జవాబు లేని
ప్రశ్నలు. ఆయన రాజకీయ ప్రత్యర్ధులకు మాత్రం ఇవన్నీ అనుకోకుండా అందివచ్చే
అస్త్రశస్త్రాలు.
మనసుండాలే కాని మార్గం అదే దొరుకుతుందని మామూలుగా రాజకీయ నాయకులు వల్లె
వేసే మాట.
నిజమే. మాజీ రాష్ట్రపతి కలాం గారు చెప్పినట్టు కనే కలలు పెద్దవిగానే
వుండాలి. వాటిని సాకారం చేసుకునే ప్రయత్నం కూడా అంతే పెద్దగా వుండాలి.
బహుశా కేసీయార్ ప్రస్తుతం చేస్తున్నది అదే కావచ్చు. ప్రజలిచ్చిన
అయిదేళ్ళ వ్యవధానంలో ఆరునెలల కాలం అప్పుడే గతంలోకి జారిపోయింది.
మిగిలినకాలంలో కొన్నయినా సాధించాలంటే కాలంతో పరిగెత్తక
తప్పదనుకున్నారేమో!
హైదరాబాదును విశ్వ నగరం చేయడం మంచి ఆలోచన. కానీ చాలామంది నగర ప్రేమికులు, నగర రూపురేఖలు
మార్చినా పరవాలేదు కాని హైదరాబాదు నగరానికి వున్న సంస్కృతీ సంప్రదాయాల మూలాలు
ధ్వంసం కాకుండా చూడాలని కోరుకుంటున్నారు. మొత్తం దేశంలో హైదరాబాదుకు కొన్ని ప్రత్యేకతలు వున్నాయి. అభివృద్ధి పేరుతొ వాటిల్లో
అనేకం ఇప్పటికే రూపుమాసి పోయాయి. పాత హైదరాబాదు మళ్ళీ కావాలని చాలామంది కోరుకుంటున్నారు.
ఇది చేయడానికి నిధులు అక్కరలేదు. కొంచెం చిత్తశుద్ధి, మరి
కొంచెం పట్టుదల వుంటే సరిపోతుంది.
మార్పు అనివార్యం. దానికి మోకాలడ్డడం వివేకం అనిపించుకోదు. మార్పును
స్వాగతిస్తూ, మూలాలను
పదిలం చేసుకుంటూ పధకాలు సమన్వయం చేసుకోగలిగితే ఫలితాలు ఫలవంతంగా వుంటాయి.
ఉదాహరణకు, ఒకప్పటి హైదరాబాదు ఇప్పటి హైదరాబాదులా లేదు. ఇప్పటి
హైదరాబాదు మరొకప్పటి హైదరాబాదులా వుండదు. నిజామ్ కాలంనాటి నగర జీవనం
ఎలావుండేదో ఆ చిత్తరువులు కొన్ని అక్కడక్కడా (ఉదాహరణకు బెల్లావిస్టా
ఎడ్మినిస్త్రేటివ్ స్టాఫ్ కాలేజీ, ప్రెస్ క్లబ్ ను అనుకునే
వుంటుంది) కనిపించినప్పుడు వొళ్ళు పులకరిస్తుంది. ఇటీవలి కాలంనాటి అంటే ఓ
యాభై అరవై సంవత్సరాల హైదరాబాదు ఫోటోలు కలికానికి కూడా దొరకవు, వున్నా అవి ఏ కలిగినవాళ్ళ లోగిళ్ళకొ, అయిదు
నక్షత్రాల హోటళ్ళకో పరిమితమయిపోయాయి.
హైదరాబాదు గురించి, దాని సంస్కృతీవైభవాలు గురించి నరేంద్ర లూధర్ దగ్గర నుంచి
ఉడయవర్లు వరకు ఎందరో ఎన్నో పుస్తకాలు రాసారు.
శిష్ట్లా లక్ష్మీపతి శాస్త్రి గారు రాసిన 'హైదరాబాదు నాడు నేడు' అనే పుస్తకంలో 1935 ప్రాంతాలనాటి కొన్ని విశేషాలు రాసారు. ఇలాటివి చదివినప్పుడు మళ్ళీ అలనాటి
నగరాన్ని ఎవరయినా తెచ్చి ఇవ్వగలిగితే యెంత బాగుంటుంది అనిపిస్తుంది. వాటిల్లో
కొన్ని ముచ్చట్లు.
"బెజవాడ నుంచి సికిందరాబాదుకు నైజాం బండిలో (నిజాం స్టేట్ రైల్వే వారు
నడిపే రైలు) టిక్కెట్టు మూడు రూపాయల పదమూడు అణాలు.
" దబీర్ పురావైపు మలక్ పేట రైల్వే వంతెన కిందనుంచి వెడితే మూసీ
నది మీద చాదర్ ఘాట్ బ్రిడ్జ్, మధ్యలో కొంచెం ఎత్తు, అటూ ఇటూ పల్లం.
చాలా అందంగా వుండేది. మంచి తారు రోడ్డు. బ్రిడ్జ్ మధ్యలో కాలిదారి మీద ఒక బీద
పకీరు కూర్చుని 'అల్లా రహమ్ కరదే, మౌలా
హుకుం దే' అని చక్కని స్వరంతో పాడుతూ ఉండేవాడు. ట్రూప్
బజారులో ఓ పక్క విశాలమైన ఆవరణలో 'ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్
ఇండియా', తరువాత సాగర్ టాకీసు, జిందా
తిలిస్మాత్ దుకాణం, ఆపైన ఆబిడ్స్, అదే బజారులో రెండు ఇనుప కటకటాల ఆవరణలు ఉండేవి. ధన రాజ్ గిరి, ప్రతాప్ గిరిజీలవి అవి. ప్రతాప్ గిర్జీ మార్వాడీల గురువు. ఏటా వారి
పుట్టిన రోజున ఊళ్ళోని మార్వాడీలు అందరూ కలిసి
వారి ఎత్తు బంగారం తూచి కానుకగా ఇచ్చేవారట. నిజాం నవాబు కన్నా వీరు
ధనవంతులని చెప్పుకునేవాళ్ళు, నవాబుగారు ఒక రోల్స్
రాయిస్ కారు కొంటే, వీళ్ళు రెండు కొనేవారట.
"ఆబిడ్స్ లో 'కెఫే కరాచీ'. అందులో అమృతప్రాయమైన
చాయ్ మూడు హాలీ పైసలు. మలై వాలా చాయ్ ఒక అణా. నిజాం రాజ్యంలో హాలీ కరెన్సీ వాడుకలో
వుండేది. నూరు రూపాయలు బ్రిటిష్ కరెన్సీకి నూటపదహారు రూపాయల పది అణాల
ఎనిమిది పైసలు హాలీ డబ్బులు ఇచ్చేవాళ్ళు.
"ఆబిడ్స్ లో జమ్రుద్ మహల్ సినిమాహాలు వుండేది. దేవికారాణి నటించిన 'జవానీకి హవా' అనే సినిమా చూడడానికి నిజాం నవాబు ఆ హాలుకు వెళ్ళారు. ఆ సినిమాహాలులో అప్పుడప్పుడు సంగీత కచ్చేరీలు కూడా జరిగేవి. ఒకసారి
ముసునూరి సుబ్రహ్మణ్యం గారి పాట కచ్చేరీ జరిగింది. కాచీగూడా తుల్జా భవన్ లో ఓసారి
వారం రోజులపాటు సంగీతసభ జరిపారు. చౌడయ్య సోదరులు 'హరి కాంభోజి రాగంలో 'దీనామణీ వంశ - తిలక- లావణ్య -
దీన శరణ్య' అని ఫిడేలుపై వాయిస్తుంటే అంతా పరవశులైపోయారు. ఆ
రోజుల్లోనే ఆబిడ్స్ కార్నర్ లో ప్యాలెస్ టాకీసు కట్టారు. 'సత్య
హరిశ్చంద్ర' తెలుగు టాకీ వేసారు. గౌలి గూడాలో ఒక మూకీ సినిమా
హాలు వుండేది. దానికి తెర లేదు. తెల్లని గోడ మీద బొమ్మలు నడిచేవి. 'వివేక వర్ధని' పేరుతొ మరో సినిమా హాలు
వుండేది."
ఇలాటి జ్ఞాపకాలు ఎందరెందరి మనసుల్లోనో గూడుకట్టుకుని ఉండిపోయాయి. ఎవరో
ఎందుకు తెలంగాణా ముఖ్యమంత్రి కేసీయార్ ఒక్కరు చాలు ఇటువంటి మధుర స్మృతులను
గుర్తుచేయడానికి.
అందుకే మళ్ళీ మళ్ళీ చెబుతోంది.
హైదరాబాదుని విశ్వ నగరం చేయండి! ఏమీ అభ్యంతరం లేదు.
అయితే, ఆ
నగరానికి వున్న 'ఆత్మ'ను కాపాడండి. (27-12-2014)
NOTE: Photo Courtesy Image Owner
26, డిసెంబర్ 2014, శుక్రవారం
పాతైదరబాదు
వూరుమారిపోతోంది. అలా మారడం దాని ధర్మం. కాని ఆ
మార్పుల ఆనవాళ్ళు దాచుకోకపోవడం ఆ వూరివాళ్ళ ఖర్మం.
ఒకప్పటి హైదరాబాదు ఇప్పటి హైదరాబాదులా లేదు.
ఇప్పటి హైదరాబాదు మరొకప్పటి హైదరాబాదులా వుండదు. పాత నిజామ్ కాలంనాటి నగర జీవనం ఎలావుండేదో ఆ చిత్తరువులు కొన్ని
అక్కడక్కడా (ఉదాహరణకు బెల్లావిస్టా ఎడ్మినిస్త్రేటివ్ స్టాఫ్ కాలేజీ, ప్రెస్ క్లబ్
అనుకునే వుంటుంది) కనిపించినప్పుడు వొళ్ళు
పులకరిస్తుంది. ఇటీవలి కాలం నాటి అంటే ఓ యాభై అరవై సంవత్సరాల హైదరాబాదు ఫోటోలు
కలికానికి కూడా దొరకవు, వున్నా అవి ఏ కలిగినవాళ్ళ లోగిళ్ళకొ, అయిదు నక్షత్రాల హోటళ్ళకో
పరిమితమయిపోయాయి.
హైదరాబాదు గురించి, దాని సంస్కృతీ వైభవాలు
గురించి నరేంద్ర లూధర్ దగ్గర నుంచి ఉడయవర్లు వరకు ఎందరో ఎన్నో పుస్తకాలు రాసారు. 'నమస్తే తెలంగాణా' వంటి పత్రిక మళ్ళీ వాటిల్లో కొన్నింటిని అయినా
సామాన్య పాఠకుల చెంతకు తెస్తే బాగుంటుంది.
వింటున్నారా కట్టా శేఖర రెడ్డి గారు. చాలా ఏళ్ళ
క్రితం జర్నలిష్టు అనుభవాలను గ్రంధస్తం చేసే పనిలో, ఎన్నో సార్లు అనేకమంది
జర్నలిష్టులకి ఫోన్లు చేసి, నావంటి సహజ బద్దకస్తుల చేత కూడా వ్యాసాలు రాయించిన పట్టుదల,
కట్టా వారిది. ఇదంతా ఎందుకంటె, శిష్ట్లా లక్ష్మీపతి
శాస్త్రి గారు రాసిన ఓ పుస్తకం చదివిన వేళా విశేషం.
శిష్ట్లా లక్ష్మీపతి శాస్త్రి గారు రాసిన 'హైదరాబాదు
నాడు నేడు' అనే పుస్తకంలో 1935
ప్రాంతాలనాటి కొన్ని విశేషాలు రాసారు.
వాటిల్లో కొన్ని ముచ్చట్లు.
"బెజవాడ నుంచి సికిందరాబాదుకు
నైజాం బండిలో (నిజాం స్టేట్ రైల్వే వారు నడిపే రైలు) టిక్కెట్టు మూడు రూపాయల
పదమూడు అణాలు.
" దబీర్ పురావైపు మలక్
పేట రైల్వే వంతెన కిందనుంచి వెడితే మూసీ
నది మీద చాదర్ ఘాట్ బ్రిడ్జ్, మధ్యలో కొంచెం ఎత్తు, అటూ ఇటూ పల్లం. చాలా అందంగా
వుండేది. మంచి తారు రోడ్డు. బ్రిడ్జ్ మధ్యలో కాలిదారి మీద ఒక బీద పకీరు కూర్చుని
'అల్లా రహమ్ కరదే, మౌలా హుకుం దే' అని చక్కని స్వరంతో పాడుతూ ఉండేవాడు. ట్రూప్
బజారులో ఓ పక్క విశాలమైన ఆవరణలో 'ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా', తరువాత సాగర్ టాకీసు, జిందా తిలిస్మాత్ దుకాణం, ఆపైన
ఆబిడ్స్, అదే బజారులో రెండు ఇనుప కటకటాల
ఆవరణలు ఉండేవి. ధన రాజ్ గిరి, ప్రతాప్ గిరిజీలవి అవి. ప్రతాప్ గిర్జీ మార్వాడీల గురువు. ఏటా వారి పుట్టిన రోజున ఊళ్ళోని మార్వాడీలు అందరూ కలిసి వారి ఎత్తు బంగారం తూచి కానుకగా ఇచ్చేవారట. నిజాం నవాబు కన్నా వీరు ధనవంతులని చెప్పుకునేవాళ్ళు, నవాబుగారు
ఒక రోల్స్ రాయిస్ కారు కొంటే, వీళ్ళు
రెండు కొనేవారట.
"ఆబిడ్స్ లో 'కెఫే
కరాచీ'. అందులో అమృతప్రాయమైన చాయ్ మూడు హాలీ పైసలు. ఒక అణా పెడితే 'మలై వాలా చాయ్' నిజాం రాజ్యంలో హాలీ కరెన్సీ వాడుకలో
వుండేది. నూరు రూపాయలు బ్రిటిష్ కరెన్సీకి
నూటపదహారు రూపాయల పది అణాల ఎనిమిది పైసలు హాలీ డబ్బులు ఇచ్చేవాళ్ళు.
"ఆబిడ్స్ లో
జమ్రుద్ మహల్ సినిమాహాలు వుండేది. దేవికారాణి నటించిన 'జవానీకి హవా' అనే సినిమా
చూడడానికి నిజాం నవాబు ఆ హాలుకు వెళ్ళారు.
ఆ సినిమాహాలులో అప్పుడప్పుడు సంగీత కచ్చేరీలు కూడా జరిగేవి. ఒకసారి ముసునూరి
సుబ్రహ్మణ్యం గారి పాట కచ్చేరీ జరిగింది. కాచీగూడా తుల్జా భవన్ లో ఓసారి వారం
రోజులపాటు సంగీతసభ జరిపారు. చౌడయ్య సోదరులు 'హరి కాంభోజి రాగంలో
'దీనామణీ వంశ - తిలక- లావణ్య - దీన శరణ్య' అని ఫిడేలుపై వాయిస్తుంటే అంతా పరవశులైపోయారు.
ఆ రోజుల్లోనే ఆబిడ్స్ కార్నర్ లో ప్యాలెస్ టాకీసు కట్టారు. 'సత్య హరిశ్చంద్ర'
తెలుగు టాకీ వేసారు. గౌలి గూడాలో ఒక మూకీ సినిమా హాలు వుండేది. దానికి తెర లేదు.
తెల్లని గోడ మీద బొమ్మలు నడిచేవి. 'వివేక వర్ధని' పేరుతొ మరో సినిమా హాలు వుండేది."
ఈ పుస్తకం రాసిన
శాస్త్రి గారిది ప్రకాశం జిల్లా అనమనమూరు
గ్రామం. 1922 లో జన్మించిన శాస్త్రి గారు కేంద్ర ప్రభుత్వ సైనిక
లేఖనియంత్రణ శాఖలో వివిద హోదాల్లో దేశ విదేశాల్లో అనేక చోట్ల పనిచేశారు. 'హైదరాబాదు
నాడు నేడు' అనే పేరుతొ ఆయన రాసిన ఈ పుస్తకాన్ని 2008 లో మొదటి సారి
ముద్రించారు. వెల యాభై రూపాయలు. నవోదయ బుక్ హౌస్ లో దొరికే అవకాశం వుంది.
24, డిసెంబర్ 2014, బుధవారం
'భారత రత్న' అటల్ బిహారీ వాజ్ పేయీ
మరవతగని మనిషి మరపున
పడుతున్నారా!
(బీజేపీ అగ్రనాయకుడు శ్రీ
వాజ్ పేయీ కి మోడీ ప్రభుత్వం 'భారత రత్న' పురస్కారం ప్రకటించిన సందర్భంలో గుర్తుకు
వచ్చిన 15-4-2014 నాటి
పాత వ్యాసం)
యాభయ్ ఐదేళ్ల పైమాటే.
అప్పటికి ఆ పార్టీ పేరు జనసంఘ్. ప్రమిదె గుర్తు. బెజవాడలో ఎన్నికలప్పుడు ఏదో ఒక
మూల గోడలమీద ఈ గుర్తు కనబడేది. కానీ జనం గుర్తు పెట్టుకునే వాళ్లు కాదు. ఆరోజుల్లో
గాంధీనగరం మునిసిపల్ స్కూలు ఆవరణలో ఢిల్లీ నుంచి ఒక పెద్దాయన వస్తున్నాడు, సాయంత్రం మీటింగు అంటూ
వూళ్ళో టముకు వేసారు. తెలిసీ తెలియని వయసు. అయినా పెద్దవాళ్ళతో కలిసి వెళ్లాను.
కాసేపటి తరువాత ఆ వచ్చినాయన మాట్లాడడం మొదలు పెట్టాడు. శుద్ధ హిందీ. ఒక్కరికీ
అర్ధం అయినట్టు లేదు. మాటల జడివాన మొదలయింది. పిడుగులు పడ్డట్టుగా ప్రసంగం
సాగింది. ఒక్క ముక్క అర్ధం కాకపోయినా స్పీచ్ అంటే ఇలా వుండాలి అని అనిపించింది.
వచ్చిన వాళ్ళల్లో చాలామంది ఆయనకు అప్పటికప్పుడే అభిమానులు అయిపోయారు. ఆయన ఎవరో
కాదు, తదనంతర
కాలంలో దేశానికి అయిదేళ్ళు సుస్తిర పాలన అందించిన ప్రధాని వాజ్ పాయ్.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా
ఎన్నికల సర్వేలు, రాజకీయ
విశ్లేషకులు బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమి గెలుపు తధ్యం అని కోడై కూస్తున్న
సమయంలో ఒకనాడు అ పార్టీకి పెద్దదిక్కు అయిన వాజ్ పాయ్ ఇప్పుడు ఎక్కడ వున్నారు, యెలా వున్నారు అన్నది జనంలో
చాలామందికి తెలియని విషయం. తెలుసుకుంటే మరింత బాధ కలిగించే ఈ సంగతులను గత
నెలలో టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక ప్రచురించింది. ఆ కధనాన్ని సంక్షిప్తం చేస్తే:
ఢిల్లీ లోని అశోకా రోడ్డులో
భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యాలయం వుంది. ఎప్పుడూ నాయకులు, కార్యకర్తలతో సందడిగా వుండే
ఆ ప్రదేశానికి అయిదే అయిదు నిమిషాల నడక దూరంలో కృష్ణ మీనన్ మార్గ్ లోని ఓ
బంగ్లా ఎస్పీజీ కాపలాలో కానవస్తుంది. అందులోకి వెళ్ళేవాళ్ళు చాలా
తక్కువ. బయటకు వచ్చేవాళ్ళు అంతే. నీరవ నిశ్శబ్ధం తాండవించే ఆ భవనంలో చక్రాల
కుర్చీలో కూర్చుని ఒక వృద్ధుడు టీవీలో వార్తలు చూస్తూ, పత్రికల్లో ప్రధాన
శీర్షికలు చదువుతూ కానవస్తారు. తన వాగ్దాటితో ప్రత్యర్ధులను ఆకట్టుకున్న ఒకనాటి
నేత వాజ్ పాయ్ ఆయనే అంటే ఒక పట్టాన నమ్మడం కష్టమే.
ఆయన ఏదో కష్ట జీవితం
గడుపుతున్నారని కాదు కానీ ఆయన
ప్రస్తుత జీవన శైలి గమనించినప్పుడు ఎవరికయినా మనసు కష్టపడుతుంది.
వాజ్ పాయ్ కవితలు రాస్తారు.
వాటిని వినడానికి ఒకప్పుడు పార్టీ నాయకులు ఎగబడేవారు. ఇప్పుడు ఆ ఇంటి గడప
తొక్కేవారే కరువయ్యారు. క్రమం తప్పకుండా వచ్చేది ఇద్దరే ఇద్దరు. ఒకరు వాజ్
పాయ్ కి అరవై ఏళ్ళుగా తెలిసిన ఎన్ ఎం గటాతే కాగా మరొకరు బీజేపీ
మూలస్థంభాల్లో ఒకరయిన ఎల్ కే అద్వానీ. పార్టీ నేత, ఉత్తరాఖండ్ మాజీ
ముఖ్యమంత్రి అయిన బీ సీ ఖండూరీ కూడా అప్పుడప్పుడు వచ్చి వాజ్ పాయ్ ఆరోగ్యం గురించి
ఆయన కుమార్తెను అడిగి తెలుసుకుంటూ వుంటారు. పోతే, మాజీ ప్రధాని జన్మదినాన్ని గుర్తుపెట్టుకుని వచ్చి
పుష్పగుచ్చం ఇచ్చి వెళ్ళే వ్యక్తి మరొకరు వున్నారు. ఆయనే ప్రధాని డాక్టర్ మన్మోహన్
సింగ్.
వారానికి ఒకటి రెండు సార్లు
వచ్చి వెళ్ళే ఆయన స్నేహితుడు గటాతే చెప్పేదాని ప్రకారం ప్రస్తుతం వాజ్
పాయ్ రోజువారీ దినచర్యలో ఎక్కువ సమయం ఫిజియో తెరపిష్టులతో గడిచిపోతుంది. మాట
సరిగా రాకపోవడం వల్ల సంభాషణల్లో పాలుపంచుకోలేరు. పత్రికలు చదవరు కానీ హెడ్ లైన్స్
తిరగేస్తారు.
భాష అర్ధం కాని
వారిని సయితం తన వాగ్ధాటితో కట్టిపడేసిన ఆయనకు మాట పడిపోవడం ఏమిటో
విధి వైచిత్రం కాకపొతే.
(టైమ్స్ ఆఫ్ ఇండియా
సౌజన్యంతో)
23, డిసెంబర్ 2014, మంగళవారం
బీజేపీలో విజయోత్సాహం ఎటు దారి తీస్తుంది ?
PUBLISHED BY'SURYA'TELUGU DAILY IN ITS EDIT PAGE ON 25-12-14,THURSDAY
(Revised Copy after poll results)
(Revised Copy after poll results)
జార్ఖండ్, కాశ్మీర్ ఎన్నికల ఫలితాలు, దేశ వ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలకు ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలను పాలిస్తున్న ప్రాంతీయ పార్టీల అధినేతలకు 'వేక్ అప్ కాల్స్' (అలారం గంటలు, లేదా వార్నింగ్ బెల్స్ అని అర్ధం చెప్పుకోవచ్చు) వంటివి. జార్ఖండ్ రాష్ట్రంలో బీజేపీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయగలదని, కాశ్మీర్లో ఎవరూ ఊహించలేని విధంగా రెండో పెద్ద పార్టీగా అవతరించగలదని ఎక్జిట్ పోల్ సర్వేలు ముందస్తుగానే వెల్లడించాయి. కొంచెం అటూ ఇటూగా అసలు ఫలితాలు కూడా ఆ ఊహాగానాలకు దగ్గరగానే వున్నాయి. కాశ్మీర్ లోని 'దాల్ సరస్సులో కమలాలు పూయించాలని' బీజేపీ పెద్ద ప్రయత్నమే చేసింది. అనేక దఫాలుగా జరిగిన ఈ ఎన్నికల సమయంలోనే కాదు, ప్రధాని పదవిని స్వీకరించిన తరువాత మోడీ ఎన్నిసార్లు కాశ్మీర్ లోయని సందర్శించింది అందరికీ తెలుసు. ప్రయత్నాలు పూర్తిగా ఫలించకపోయినా, కాశ్మీర్ లో కమల దళాలు విభ్రమం కలిగించే రీతిలోనే విచ్చుకున్నాయని వొప్పుకోక తప్పదు. పీడీపీ అతిపెద్ద పార్టీగా, తరువాతి స్థానంలో రెండో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించాయి కాబట్టి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సివస్తే ఈ రెంటి మధ్యనే పొత్తు కుదరాలి. ఎందుకంటె కాంగ్రెస్ ఎట్లాగు బీజేపీకి మద్దతు ఇవ్వలేదు, అల్లాగే, నేషనల్ కాంగ్రెస్ పీడీపీకి కొమ్ముకాయదు.
ఫలితాలు ఓ పక్క వెలువడుతూ ఉండగానే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ఎన్నికలు జరిగిన రెండు రాష్ట్రాల్లో కూడా తమ పార్టీ ప్రభుత్వాలు ఏర్పాటుచేస్తుందని చెప్పినట్టు వార్తలు వచ్చాయి. జార్ఖండ్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల కనీస సంఖ్యాబలం వుంది కాని కాశ్మీర్ లో ఏపార్టీకి సొంతంగా సర్కారు ఏర్పాటుచేసే బలం సమకూరలేదు. పేరుకు బీజేపీ రెండో అతిపెద్ద పార్టీగా అవతరించిది కాని గెలుచుకున్న పాతిక సీట్లు అందుకు ఏమాత్రం సరిపోవు. అయినా ప్రభుత్వం ఏర్పాటుపై స్వయానా బీజేపీ అధ్యక్షుడే ప్రకటన చేయడం సంకీర్ణం పట్ల ఆశలు పెంచింది. పీడీపీ ఇరవై ఎనిమిది స్థానాలతో మొదటి స్థానంలో వుంది కాని మేజిక్ సంఖ్య నలభై నాలుగుకు అది చాలా తక్కువ. కేంద్రంలో అధికారంలో వుంది కాబట్టి ప్రభుత్వాలు ఏర్పాటు చేయడానికి అవసరమైన పొత్తుల విషయంలో బీజీపీదే సహజంగా పై చేయి అయ్యే అవకాశం ఎలాగూ వుంటుంది.
జమ్మూ కాశ్మీర్ లో వోట్ల శాతం తో పాటు సీట్ల సంఖ్య కూడా పెరగడం భారతీయ జనతా పార్టీకి ఊరట కలిగించే విషయమే. 'ఏకే ఫార్టీ సెవెన్లు కాదు ప్రతి కాశ్మీరీ చేతిలో ఆండ్రాయిడ్ ఫోన్లు చూడాలని ఉందంటూ' మోడీ చేసిన ప్రసంగాలు కొన్ని దశాబ్దాలుగా కాల్పులు, ప్రతి కాల్పులతో అట్టుడుకి పోతున్న అక్కడి ప్రజల్లో కొంత ఆలోచన కలిగించాయని అనుకోవచ్చు. పాతిక సీట్లు ఏపాటి అని ఇతర రాజకీయ పార్టీలు అనుకోవచ్చు కాని కాశ్మీర్ వంటి రాష్ట్రంలో మాత్రం బీజేపీకి అది పెద్ద విజయమే. కాశ్మీర్ అసెంబ్లీ లో కాలుమోపడం అనేది అంత విస్తృత స్థాయిలో జరగడం నిజంగా గొప్ప విషయమే.
ఈ ఏడాది మొదట్లో జరిగిన ఎన్నికల్లో తమ పార్టీలను అధికార అందలం ఎక్కించిన నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు, చంద్రశేఖరరావుల నడుమ సాపత్యం గురించి కూడా ఇంకో ఆసక్తికరమైన వ్యాఖ్యానం వినబడుతోంది.. దక్కిన అధికారం కలకాలం నిలుపుకోవాలని కోరిక ఉండడంలో ఆశ్చర్య పడాల్సింది లేదు కాని, వీరు మువ్వురు అధికార పగ్గాలు చేపట్టిన మరుక్షణం నుంచి వేరే ధ్యాస లేకుండా అయిదేళ్ళ తరువాత 2019 లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీలను తిరిగి గెలిపించుకోవడం ఎల్లాగా అన్న ఒకే ఒక్క లక్ష్యం మీదనే దృష్టి పెట్టారన్నది బహిరంగ రహస్యం. ఇందుకోసం వారు ఏ మార్గాన్ని ఎంచుకున్నా ఆశ్చర్య పోవాల్సింది ఏమీ ఉండదు. కిందటి ఎన్నికల్లో పొత్తులు, సీట్ల సర్దుబాట్ల విషయంలో ఆయా పార్టీలు అనుసరించిన విధానాలే అయిదేళ్ళ తరువాతి ఎన్నికల్లో పునరావృతం కాకపోవచ్చని, రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోవచ్చు కూడా. ఈ మాటలు చెప్పడానికి కొమ్ములు తిరిగిన రాజకీయ విశ్లేషకులే అవసరం లేదు. తెలుగు రాష్ట్రాల రాజకీయం గురించి కనీస అవగాహన కలిగిన ఎవ్వరయినా ఇదే సంగతి తడబాటు లేకుండా చెప్పగలుగుతారు. విశేషం ఏమిటంటే ఈ మూడు పార్టీల నాయకులకీ ఈ విషయం బాగా తెలుసు. కానీ గుంభనగా ఉండిపోతున్నారు. అది వారి రాజకీయ జాణతనంలో ఒక భాగం.
బీజేపీ ముందు దృష్టి పెట్టేది అసలే బలహీన పడిన ప్రధాన రాజకీయ ప్రత్యర్ధి కాంగ్రెస్ పార్టీని మరింత బలహీన పరచడం. ఈ క్రమంలో కొన్ని రాష్ట్రాలలో ముఖ్యంగా దక్షిణాదిలో ప్రాంతీయ పార్టీలను, లేదా బలమైన ప్రాంతీయ నాయకులను దగ్గరకు తీసి తానూ క్రమేపీ బలాన్ని పెంచుకోవడం. ప్రస్తుత రాజకీయాల్లో ఇది పెద్ద తప్పూ కాదు, తప్పు పట్టాల్సిందీ లేదు.
ప్రధాన ప్రతిపక్షం హోదా కూడా దక్కని రీతిలో గత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించిన విజయంతో సరిపెట్టుకోవాలని బీజేపీ అనుకుంటున్నట్టు లేదు. ఈ అపూర్వ విజయాన్ని మరింత పదిలం చేసుకుని ఉత్తరోత్తరా జరిగే ఎన్నికల్లో ఇదేవిధమైన విజయాలను తమ ఖాతాలో వేసుకోవాలని మోడీ-అమిత్ షా ద్వయం వువ్విళ్ళూరుతున్నట్టుగా వారి వ్యూహాలు చెప్పకనే చెబుతున్నాయి. తమ పార్టీ కొంత బలహీనంగా వున్న దక్షిణాది రాష్ట్రాలలో కూడా పాగా వేయాలనే ఉద్దేశ్యంతో వారు పావులు కదుపుతున్నారన్నది బహిరంగ రహస్యం. 2019 లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఎవరిమీదా ఆధారపడకుండా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని రాష్ట్రాలలో కమల వికాసం పూర్తిస్థాయిలో జరగాలని ఆ పార్టీ అగ్రనేతల అభిప్రాయంగా కానవస్తోంది. ఇలాటి లక్ష్యాలను ఏ రాజకీయ పార్టీ పెట్టుకున్నా అందులో ఆక్షేపించే అంశం ఏమీ వుండదు. కాకపోతే ఈ లక్ష్య సాధన దిశలో వేసే అడుగులు ఎలాటివన్నదే చర్చనీయాంశం. విధానాల ద్వారా విజయం సాధించాలని అనుకోవడం ఒక పద్దతి. విజయం ఒక్కటే పరమావధిగా విధానాలను మార్చుకోవడం మరో పద్దతి. ఇంతవరకు సిద్దాంతాలకు, విధానాలకు కట్టుబడి వ్యవహరించే అతి కొద్ది పార్టీలలో బీజేపీ ఒకటి. ఆ పార్టీ సిద్దాంతాలను వ్యతిరేకించే రాజకీయ ప్రత్యర్ధులు సయితం, సిద్దాంతాలు, సూత్రాలపట్ల బీజేపీకి వున్న నిబద్దతను అంగీకరిస్తారు. మరి అద్యతన భావిలో విజయం, విస్తరణ అనే రెండింటినే ప్రధానంగా పెట్టుకుని ఆ పార్టీ తన సాంప్రదాయ మార్గం నుంచి కొంత వైదొలుగుతుందా అన్నదే ఈ నాటికి జవాబు దొరకని ప్రశ్న. ఒక వేళ మోడీ- అమిత్ షా ద్వయం ఆ మార్గాన్నే ఎంచుకుంటే రెండు తెలుగు రాష్ట్రాలలో వచ్చే ఎన్నికలనాటికి ప్రస్తుతం వున్న రాజకీయ సమీకరణలు పూర్తిగా తారుమారయ్యే అవకాశాలే ఎక్కువ.
అందుకే చెప్పింది రెండు తెలుగు ప్రాంతీయ పార్టీలకి ఇవి ఒకరకంగా వేక్ అప్ కాల్స్. అలారం గంటలు. అందులో అనుమానం లేదు.
అయితే వాటికి సమయం ఇంకా మించి పోలేదు. ఎన్నికలకు ఇంకా నాలుగున్నరేళ్ళ వ్యవధానం వుంది. కాలు కూడదీసుకోవడానికి సమయం వుంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు పోలవరం మంచి తురుపు ముక్క. రాజధాని నిర్మాణం అంతగా కలిసొస్తుందో తెలియని మరో ట్రంప్ కార్డు. ఏదో ఒకటి చేసి,సర్వశక్తులు ధారపోసి ఎన్నికల ఘడియ దగ్గర పడేలోగా పోలవరం ప్రాజెక్టుకు ఒక స్వరూపం ఇవ్వగలిగితే ఆయనకు రాజకీయంగా చాలా కలిసివస్తుంది. కానీ అదేం దురదృష్టమో తెలియదు కాని ఆ ప్రాజెక్టు నత్త నడక నడుస్తోంది. పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేలోగా సముద్రంలోకి వృధాగా పోతున్న అపర గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు మళ్ళిస్తామని చంద్రబాబు అసెంబ్లీలో ఒక ప్రకటన చేసారు. అన్నింటికంటే ఈ అంశానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వగలిగితే అక్కడి రైతాంగం మెప్పుకోళ్ళు ఆయన ఖాతాలో జమపడతాయి.
అల్లాగే తెలంగాణాలో ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ఎన్నికల సమయంలో ఒక అద్భుతమైన వాగ్దానం చేసారు. మామూలుగా బలహీన వర్గాలకు కట్టించే ఇళ్ళు కూడా అంతే బలహీనంగా వుంటాయి.
'ఒకే ఒక్క గది కడితే, పెళ్ళీడుకొచ్చిన పిల్లలు ఎక్కడ పడుకుంటారు, మేకలూ బర్రెలూ ఇంట్లోనే కట్టేసుకోవాలి? ఈ ఖర్మ ఇక ముందు వుండదు. చక్కగా రెండు గదుల ఇల్లు, వంటిల్లు, మరుగుదొడ్డి, ఇలా అన్ని సదుపాయాలతో ఇళ్ళు కట్టిస్తామని ఎన్నికల సమయంలో జనంలో ఎన్నో ఆశలు రేకెత్తించారు.
'సేద్యానికి పనికి రాని బంజరు భూములు ఇవ్వడం ఏం గొప్ప, మంచి అనువయిన మూడెకరాల భూమిని ప్రభుత్వమే కొని ఎస్సీలకు ఎస్టీలకు ఇస్తుందని భరోసాగా చెప్పారు. ఇటువంటి హామీలను వూరికి ఒకటి చొప్పున అన్నా, రానున్న కాలంలో నెరవేరుస్తూ పొతే, ఎన్నికల నాటికి 'తెలంగాణా సెంటిమెంటుకు తోడుగా టీ.ఆర్.యస్. కు గ్రామీణ ప్రాంతాలలో గట్టి వోటు బ్యాంకు తయారవుతుంది. జాతీయ పార్టీలను దీటుగా ఎదుర్కోవాలంటే ప్రాంతీయ పార్టీలకు ఇలాటి బలమయిన అస్త్ర శస్త్రాలు వుండి తీరాలి. ఆకాశ హర్మ్యాలు, సింగపూరులు ఎన్నికల్లో అక్కరకు వచ్చే బాణాలు కావు. రెండు రాష్ట్రాలలోని ప్రాంతీయ పార్టీల అధినేతలిద్దరు యెంత త్వరగా ఈ వాస్తవాన్ని గుర్తిస్తే అంత మంచిది.
అందుకే చెప్పింది, కాశ్మీర్, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు రెండు తెలుగు ప్రాంతీయ పార్టీలకి ఒకరకంగా వేక్ అప్ కాల్స్. అలారం గంటలు. అందులో అనుమానం లేదు.
(23-12-2014)