PUBLISHED BY'SURYA'TELUGU DAILY IN ITS EDIT PAGE ON 25-12-14,THURSDAY
(Revised Copy after poll results)
(Revised Copy after poll results)
జార్ఖండ్, కాశ్మీర్ ఎన్నికల ఫలితాలు, దేశ వ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలకు ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలను పాలిస్తున్న ప్రాంతీయ పార్టీల అధినేతలకు 'వేక్ అప్ కాల్స్' (అలారం గంటలు, లేదా వార్నింగ్ బెల్స్ అని అర్ధం చెప్పుకోవచ్చు) వంటివి. జార్ఖండ్ రాష్ట్రంలో బీజేపీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయగలదని, కాశ్మీర్లో ఎవరూ ఊహించలేని విధంగా రెండో పెద్ద పార్టీగా అవతరించగలదని ఎక్జిట్ పోల్ సర్వేలు ముందస్తుగానే వెల్లడించాయి. కొంచెం అటూ ఇటూగా అసలు ఫలితాలు కూడా ఆ ఊహాగానాలకు దగ్గరగానే వున్నాయి. కాశ్మీర్ లోని 'దాల్ సరస్సులో కమలాలు పూయించాలని' బీజేపీ పెద్ద ప్రయత్నమే చేసింది. అనేక దఫాలుగా జరిగిన ఈ ఎన్నికల సమయంలోనే కాదు, ప్రధాని పదవిని స్వీకరించిన తరువాత మోడీ ఎన్నిసార్లు కాశ్మీర్ లోయని సందర్శించింది అందరికీ తెలుసు. ప్రయత్నాలు పూర్తిగా ఫలించకపోయినా, కాశ్మీర్ లో కమల దళాలు విభ్రమం కలిగించే రీతిలోనే విచ్చుకున్నాయని వొప్పుకోక తప్పదు. పీడీపీ అతిపెద్ద పార్టీగా, తరువాతి స్థానంలో రెండో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించాయి కాబట్టి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సివస్తే ఈ రెంటి మధ్యనే పొత్తు కుదరాలి. ఎందుకంటె కాంగ్రెస్ ఎట్లాగు బీజేపీకి మద్దతు ఇవ్వలేదు, అల్లాగే, నేషనల్ కాంగ్రెస్ పీడీపీకి కొమ్ముకాయదు.
ఫలితాలు ఓ పక్క వెలువడుతూ ఉండగానే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ఎన్నికలు జరిగిన రెండు రాష్ట్రాల్లో కూడా తమ పార్టీ ప్రభుత్వాలు ఏర్పాటుచేస్తుందని చెప్పినట్టు వార్తలు వచ్చాయి. జార్ఖండ్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల కనీస సంఖ్యాబలం వుంది కాని కాశ్మీర్ లో ఏపార్టీకి సొంతంగా సర్కారు ఏర్పాటుచేసే బలం సమకూరలేదు. పేరుకు బీజేపీ రెండో అతిపెద్ద పార్టీగా అవతరించిది కాని గెలుచుకున్న పాతిక సీట్లు అందుకు ఏమాత్రం సరిపోవు. అయినా ప్రభుత్వం ఏర్పాటుపై స్వయానా బీజేపీ అధ్యక్షుడే ప్రకటన చేయడం సంకీర్ణం పట్ల ఆశలు పెంచింది. పీడీపీ ఇరవై ఎనిమిది స్థానాలతో మొదటి స్థానంలో వుంది కాని మేజిక్ సంఖ్య నలభై నాలుగుకు అది చాలా తక్కువ. కేంద్రంలో అధికారంలో వుంది కాబట్టి ప్రభుత్వాలు ఏర్పాటు చేయడానికి అవసరమైన పొత్తుల విషయంలో బీజీపీదే సహజంగా పై చేయి అయ్యే అవకాశం ఎలాగూ వుంటుంది.
జమ్మూ కాశ్మీర్ లో వోట్ల శాతం తో పాటు సీట్ల సంఖ్య కూడా పెరగడం భారతీయ జనతా పార్టీకి ఊరట కలిగించే విషయమే. 'ఏకే ఫార్టీ సెవెన్లు కాదు ప్రతి కాశ్మీరీ చేతిలో ఆండ్రాయిడ్ ఫోన్లు చూడాలని ఉందంటూ' మోడీ చేసిన ప్రసంగాలు కొన్ని దశాబ్దాలుగా కాల్పులు, ప్రతి కాల్పులతో అట్టుడుకి పోతున్న అక్కడి ప్రజల్లో కొంత ఆలోచన కలిగించాయని అనుకోవచ్చు. పాతిక సీట్లు ఏపాటి అని ఇతర రాజకీయ పార్టీలు అనుకోవచ్చు కాని కాశ్మీర్ వంటి రాష్ట్రంలో మాత్రం బీజేపీకి అది పెద్ద విజయమే. కాశ్మీర్ అసెంబ్లీ లో కాలుమోపడం అనేది అంత విస్తృత స్థాయిలో జరగడం నిజంగా గొప్ప విషయమే.
ఈ ఏడాది మొదట్లో జరిగిన ఎన్నికల్లో తమ పార్టీలను అధికార అందలం ఎక్కించిన నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు, చంద్రశేఖరరావుల నడుమ సాపత్యం గురించి కూడా ఇంకో ఆసక్తికరమైన వ్యాఖ్యానం వినబడుతోంది.. దక్కిన అధికారం కలకాలం నిలుపుకోవాలని కోరిక ఉండడంలో ఆశ్చర్య పడాల్సింది లేదు కాని, వీరు మువ్వురు అధికార పగ్గాలు చేపట్టిన మరుక్షణం నుంచి వేరే ధ్యాస లేకుండా అయిదేళ్ళ తరువాత 2019 లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీలను తిరిగి గెలిపించుకోవడం ఎల్లాగా అన్న ఒకే ఒక్క లక్ష్యం మీదనే దృష్టి పెట్టారన్నది బహిరంగ రహస్యం. ఇందుకోసం వారు ఏ మార్గాన్ని ఎంచుకున్నా ఆశ్చర్య పోవాల్సింది ఏమీ ఉండదు. కిందటి ఎన్నికల్లో పొత్తులు, సీట్ల సర్దుబాట్ల విషయంలో ఆయా పార్టీలు అనుసరించిన విధానాలే అయిదేళ్ళ తరువాతి ఎన్నికల్లో పునరావృతం కాకపోవచ్చని, రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోవచ్చు కూడా. ఈ మాటలు చెప్పడానికి కొమ్ములు తిరిగిన రాజకీయ విశ్లేషకులే అవసరం లేదు. తెలుగు రాష్ట్రాల రాజకీయం గురించి కనీస అవగాహన కలిగిన ఎవ్వరయినా ఇదే సంగతి తడబాటు లేకుండా చెప్పగలుగుతారు. విశేషం ఏమిటంటే ఈ మూడు పార్టీల నాయకులకీ ఈ విషయం బాగా తెలుసు. కానీ గుంభనగా ఉండిపోతున్నారు. అది వారి రాజకీయ జాణతనంలో ఒక భాగం.
బీజేపీ ముందు దృష్టి పెట్టేది అసలే బలహీన పడిన ప్రధాన రాజకీయ ప్రత్యర్ధి కాంగ్రెస్ పార్టీని మరింత బలహీన పరచడం. ఈ క్రమంలో కొన్ని రాష్ట్రాలలో ముఖ్యంగా దక్షిణాదిలో ప్రాంతీయ పార్టీలను, లేదా బలమైన ప్రాంతీయ నాయకులను దగ్గరకు తీసి తానూ క్రమేపీ బలాన్ని పెంచుకోవడం. ప్రస్తుత రాజకీయాల్లో ఇది పెద్ద తప్పూ కాదు, తప్పు పట్టాల్సిందీ లేదు.
ప్రధాన ప్రతిపక్షం హోదా కూడా దక్కని రీతిలో గత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించిన విజయంతో సరిపెట్టుకోవాలని బీజేపీ అనుకుంటున్నట్టు లేదు. ఈ అపూర్వ విజయాన్ని మరింత పదిలం చేసుకుని ఉత్తరోత్తరా జరిగే ఎన్నికల్లో ఇదేవిధమైన విజయాలను తమ ఖాతాలో వేసుకోవాలని మోడీ-అమిత్ షా ద్వయం వువ్విళ్ళూరుతున్నట్టుగా వారి వ్యూహాలు చెప్పకనే చెబుతున్నాయి. తమ పార్టీ కొంత బలహీనంగా వున్న దక్షిణాది రాష్ట్రాలలో కూడా పాగా వేయాలనే ఉద్దేశ్యంతో వారు పావులు కదుపుతున్నారన్నది బహిరంగ రహస్యం. 2019 లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఎవరిమీదా ఆధారపడకుండా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని రాష్ట్రాలలో కమల వికాసం పూర్తిస్థాయిలో జరగాలని ఆ పార్టీ అగ్రనేతల అభిప్రాయంగా కానవస్తోంది. ఇలాటి లక్ష్యాలను ఏ రాజకీయ పార్టీ పెట్టుకున్నా అందులో ఆక్షేపించే అంశం ఏమీ వుండదు. కాకపోతే ఈ లక్ష్య సాధన దిశలో వేసే అడుగులు ఎలాటివన్నదే చర్చనీయాంశం. విధానాల ద్వారా విజయం సాధించాలని అనుకోవడం ఒక పద్దతి. విజయం ఒక్కటే పరమావధిగా విధానాలను మార్చుకోవడం మరో పద్దతి. ఇంతవరకు సిద్దాంతాలకు, విధానాలకు కట్టుబడి వ్యవహరించే అతి కొద్ది పార్టీలలో బీజేపీ ఒకటి. ఆ పార్టీ సిద్దాంతాలను వ్యతిరేకించే రాజకీయ ప్రత్యర్ధులు సయితం, సిద్దాంతాలు, సూత్రాలపట్ల బీజేపీకి వున్న నిబద్దతను అంగీకరిస్తారు. మరి అద్యతన భావిలో విజయం, విస్తరణ అనే రెండింటినే ప్రధానంగా పెట్టుకుని ఆ పార్టీ తన సాంప్రదాయ మార్గం నుంచి కొంత వైదొలుగుతుందా అన్నదే ఈ నాటికి జవాబు దొరకని ప్రశ్న. ఒక వేళ మోడీ- అమిత్ షా ద్వయం ఆ మార్గాన్నే ఎంచుకుంటే రెండు తెలుగు రాష్ట్రాలలో వచ్చే ఎన్నికలనాటికి ప్రస్తుతం వున్న రాజకీయ సమీకరణలు పూర్తిగా తారుమారయ్యే అవకాశాలే ఎక్కువ.
అందుకే చెప్పింది రెండు తెలుగు ప్రాంతీయ పార్టీలకి ఇవి ఒకరకంగా వేక్ అప్ కాల్స్. అలారం గంటలు. అందులో అనుమానం లేదు.
అయితే వాటికి సమయం ఇంకా మించి పోలేదు. ఎన్నికలకు ఇంకా నాలుగున్నరేళ్ళ వ్యవధానం వుంది. కాలు కూడదీసుకోవడానికి సమయం వుంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు పోలవరం మంచి తురుపు ముక్క. రాజధాని నిర్మాణం అంతగా కలిసొస్తుందో తెలియని మరో ట్రంప్ కార్డు. ఏదో ఒకటి చేసి,సర్వశక్తులు ధారపోసి ఎన్నికల ఘడియ దగ్గర పడేలోగా పోలవరం ప్రాజెక్టుకు ఒక స్వరూపం ఇవ్వగలిగితే ఆయనకు రాజకీయంగా చాలా కలిసివస్తుంది. కానీ అదేం దురదృష్టమో తెలియదు కాని ఆ ప్రాజెక్టు నత్త నడక నడుస్తోంది. పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేలోగా సముద్రంలోకి వృధాగా పోతున్న అపర గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు మళ్ళిస్తామని చంద్రబాబు అసెంబ్లీలో ఒక ప్రకటన చేసారు. అన్నింటికంటే ఈ అంశానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వగలిగితే అక్కడి రైతాంగం మెప్పుకోళ్ళు ఆయన ఖాతాలో జమపడతాయి.
అల్లాగే తెలంగాణాలో ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ఎన్నికల సమయంలో ఒక అద్భుతమైన వాగ్దానం చేసారు. మామూలుగా బలహీన వర్గాలకు కట్టించే ఇళ్ళు కూడా అంతే బలహీనంగా వుంటాయి.
'ఒకే ఒక్క గది కడితే, పెళ్ళీడుకొచ్చిన పిల్లలు ఎక్కడ పడుకుంటారు, మేకలూ బర్రెలూ ఇంట్లోనే కట్టేసుకోవాలి? ఈ ఖర్మ ఇక ముందు వుండదు. చక్కగా రెండు గదుల ఇల్లు, వంటిల్లు, మరుగుదొడ్డి, ఇలా అన్ని సదుపాయాలతో ఇళ్ళు కట్టిస్తామని ఎన్నికల సమయంలో జనంలో ఎన్నో ఆశలు రేకెత్తించారు.
'సేద్యానికి పనికి రాని బంజరు భూములు ఇవ్వడం ఏం గొప్ప, మంచి అనువయిన మూడెకరాల భూమిని ప్రభుత్వమే కొని ఎస్సీలకు ఎస్టీలకు ఇస్తుందని భరోసాగా చెప్పారు. ఇటువంటి హామీలను వూరికి ఒకటి చొప్పున అన్నా, రానున్న కాలంలో నెరవేరుస్తూ పొతే, ఎన్నికల నాటికి 'తెలంగాణా సెంటిమెంటుకు తోడుగా టీ.ఆర్.యస్. కు గ్రామీణ ప్రాంతాలలో గట్టి వోటు బ్యాంకు తయారవుతుంది. జాతీయ పార్టీలను దీటుగా ఎదుర్కోవాలంటే ప్రాంతీయ పార్టీలకు ఇలాటి బలమయిన అస్త్ర శస్త్రాలు వుండి తీరాలి. ఆకాశ హర్మ్యాలు, సింగపూరులు ఎన్నికల్లో అక్కరకు వచ్చే బాణాలు కావు. రెండు రాష్ట్రాలలోని ప్రాంతీయ పార్టీల అధినేతలిద్దరు యెంత త్వరగా ఈ వాస్తవాన్ని గుర్తిస్తే అంత మంచిది.
అందుకే చెప్పింది, కాశ్మీర్, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు రెండు తెలుగు ప్రాంతీయ పార్టీలకి ఒకరకంగా వేక్ అప్ కాల్స్. అలారం గంటలు. అందులో అనుమానం లేదు.
(23-12-2014)
కూస్తంత పోటీ వచ్చి ప్రజలకి ఉపయోగమేనా జరుగుద్ది కానివ్వండి.
రిప్లయితొలగించండి