మరవతగని మనిషి మరపున
పడుతున్నారా!
(బీజేపీ అగ్రనాయకుడు శ్రీ
వాజ్ పేయీ కి మోడీ ప్రభుత్వం 'భారత రత్న' పురస్కారం ప్రకటించిన సందర్భంలో గుర్తుకు
వచ్చిన 15-4-2014 నాటి
పాత వ్యాసం)
యాభయ్ ఐదేళ్ల పైమాటే.
అప్పటికి ఆ పార్టీ పేరు జనసంఘ్. ప్రమిదె గుర్తు. బెజవాడలో ఎన్నికలప్పుడు ఏదో ఒక
మూల గోడలమీద ఈ గుర్తు కనబడేది. కానీ జనం గుర్తు పెట్టుకునే వాళ్లు కాదు. ఆరోజుల్లో
గాంధీనగరం మునిసిపల్ స్కూలు ఆవరణలో ఢిల్లీ నుంచి ఒక పెద్దాయన వస్తున్నాడు, సాయంత్రం మీటింగు అంటూ
వూళ్ళో టముకు వేసారు. తెలిసీ తెలియని వయసు. అయినా పెద్దవాళ్ళతో కలిసి వెళ్లాను.
కాసేపటి తరువాత ఆ వచ్చినాయన మాట్లాడడం మొదలు పెట్టాడు. శుద్ధ హిందీ. ఒక్కరికీ
అర్ధం అయినట్టు లేదు. మాటల జడివాన మొదలయింది. పిడుగులు పడ్డట్టుగా ప్రసంగం
సాగింది. ఒక్క ముక్క అర్ధం కాకపోయినా స్పీచ్ అంటే ఇలా వుండాలి అని అనిపించింది.
వచ్చిన వాళ్ళల్లో చాలామంది ఆయనకు అప్పటికప్పుడే అభిమానులు అయిపోయారు. ఆయన ఎవరో
కాదు, తదనంతర
కాలంలో దేశానికి అయిదేళ్ళు సుస్తిర పాలన అందించిన ప్రధాని వాజ్ పాయ్.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా
ఎన్నికల సర్వేలు, రాజకీయ
విశ్లేషకులు బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమి గెలుపు తధ్యం అని కోడై కూస్తున్న
సమయంలో ఒకనాడు అ పార్టీకి పెద్దదిక్కు అయిన వాజ్ పాయ్ ఇప్పుడు ఎక్కడ వున్నారు, యెలా వున్నారు అన్నది జనంలో
చాలామందికి తెలియని విషయం. తెలుసుకుంటే మరింత బాధ కలిగించే ఈ సంగతులను గత
నెలలో టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక ప్రచురించింది. ఆ కధనాన్ని సంక్షిప్తం చేస్తే:
ఢిల్లీ లోని అశోకా రోడ్డులో
భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యాలయం వుంది. ఎప్పుడూ నాయకులు, కార్యకర్తలతో సందడిగా వుండే
ఆ ప్రదేశానికి అయిదే అయిదు నిమిషాల నడక దూరంలో కృష్ణ మీనన్ మార్గ్ లోని ఓ
బంగ్లా ఎస్పీజీ కాపలాలో కానవస్తుంది. అందులోకి వెళ్ళేవాళ్ళు చాలా
తక్కువ. బయటకు వచ్చేవాళ్ళు అంతే. నీరవ నిశ్శబ్ధం తాండవించే ఆ భవనంలో చక్రాల
కుర్చీలో కూర్చుని ఒక వృద్ధుడు టీవీలో వార్తలు చూస్తూ, పత్రికల్లో ప్రధాన
శీర్షికలు చదువుతూ కానవస్తారు. తన వాగ్దాటితో ప్రత్యర్ధులను ఆకట్టుకున్న ఒకనాటి
నేత వాజ్ పాయ్ ఆయనే అంటే ఒక పట్టాన నమ్మడం కష్టమే.
ఆయన ఏదో కష్ట జీవితం
గడుపుతున్నారని కాదు కానీ ఆయన
ప్రస్తుత జీవన శైలి గమనించినప్పుడు ఎవరికయినా మనసు కష్టపడుతుంది.
వాజ్ పాయ్ కవితలు రాస్తారు.
వాటిని వినడానికి ఒకప్పుడు పార్టీ నాయకులు ఎగబడేవారు. ఇప్పుడు ఆ ఇంటి గడప
తొక్కేవారే కరువయ్యారు. క్రమం తప్పకుండా వచ్చేది ఇద్దరే ఇద్దరు. ఒకరు వాజ్
పాయ్ కి అరవై ఏళ్ళుగా తెలిసిన ఎన్ ఎం గటాతే కాగా మరొకరు బీజేపీ
మూలస్థంభాల్లో ఒకరయిన ఎల్ కే అద్వానీ. పార్టీ నేత, ఉత్తరాఖండ్ మాజీ
ముఖ్యమంత్రి అయిన బీ సీ ఖండూరీ కూడా అప్పుడప్పుడు వచ్చి వాజ్ పాయ్ ఆరోగ్యం గురించి
ఆయన కుమార్తెను అడిగి తెలుసుకుంటూ వుంటారు. పోతే, మాజీ ప్రధాని జన్మదినాన్ని గుర్తుపెట్టుకుని వచ్చి
పుష్పగుచ్చం ఇచ్చి వెళ్ళే వ్యక్తి మరొకరు వున్నారు. ఆయనే ప్రధాని డాక్టర్ మన్మోహన్
సింగ్.
వారానికి ఒకటి రెండు సార్లు
వచ్చి వెళ్ళే ఆయన స్నేహితుడు గటాతే చెప్పేదాని ప్రకారం ప్రస్తుతం వాజ్
పాయ్ రోజువారీ దినచర్యలో ఎక్కువ సమయం ఫిజియో తెరపిష్టులతో గడిచిపోతుంది. మాట
సరిగా రాకపోవడం వల్ల సంభాషణల్లో పాలుపంచుకోలేరు. పత్రికలు చదవరు కానీ హెడ్ లైన్స్
తిరగేస్తారు.
భాష అర్ధం కాని
వారిని సయితం తన వాగ్ధాటితో కట్టిపడేసిన ఆయనకు మాట పడిపోవడం ఏమిటో
విధి వైచిత్రం కాకపొతే.
(టైమ్స్ ఆఫ్ ఇండియా
సౌజన్యంతో)
>భాష అర్ధం కాని వారిని సయితం తన వాగ్ధాటితో కట్టిపడేసిన ఆయనకు మాట పడిపోవడం ఏమిటో విధి వైచిత్రం కాకపొతే.
రిప్లయితొలగించండినిజమేనండీ. చాలా దురదృష్టం.
బహుశః, భగవంతుడు అనుగ్రహించిన వాక్సంపద అంతా ఆయన ఇప్పటికే పంచిపెట్టేశా రనుకుంటాను. అందుకే ఆయన ఇంక మాట్లాడరు.
ఆయన ఆరోగ్య కారణాల రీత్యా ఎక్కువగా విసిగించకుండా ఉండేందుకే తక్కువమందిని అనుమతిస్తున్నారనుకుంటాను. వాజిపేయి ప్రత్యర్ధులను సైతం ఆకట్టుకునే విలక్షణ నేత.
రిప్లయితొలగించండిఆయన ఆరోగ్య కారణాల రీత్యా ఎక్కువగా విసిగించకుండా ఉండేందుకే తక్కువమందిని అనుమతిస్తున్నారనుకుంటాను. వాజిపేయి ప్రత్యర్ధులను సైతం ఆకట్టుకునే విలక్షణ నేత.
రిప్లయితొలగించండిఆయనని వాజపేయి అనడం కన్నా భాజపాయి అనడం చాలా సముచితం!
రిప్లయితొలగించండిభాజపా ఈనాటి స్థాయికి యెదగటానికి ఆయనే అసలైన మూల కారణం?