27, డిసెంబర్ 2014, శనివారం

కేసీయార్ విశ్వ నగర నిర్మాణం

(Published by 'SURYA'. telugu daily in its Edit Page on 28-12-2014, SUNDAY)

కొన్ని ముచ్చట్లు వింటుంటే ఎంతో ముచ్చట అనిపిస్తుంది. ఇలాటి ముచ్చటగొలిపే  ముచ్చట్లు చెప్పడంలో సిద్ధహస్తులు తెలంగాణా ముఖ్యమంత్రి శ్రీ చంద్రశేఖర రావు. బంగారు తెలంగాణ గురించి ఆయనకు ఎన్నో కలలు వున్నాయి. ఆ కలలను సాకారం చేయడం కోసం ఆయన నిరంతరం తపిస్తున్నట్టుగానే కానవస్తారు. వాటిని నిజం చేసుకోగల బంగారు అవకాశం కూడా ఆయనకు ముఖ్యమంత్రి  పదవి రూపంలో లభించింది. అందుకే కేసీయార్ ప్రతిరోజు ఎన్నెన్నో గంటలపాటు అధికారులతో సుదీర్ఘ సమీక్షలు జరుపుతున్నట్టు అనుదినం పత్రికల్లో వార్తలు వస్తుంటాయి. ముందే చెప్పినట్టు ఆయన చెబుతుంటే వినేవాళ్ళు మంత్రముగ్ధులు అవ్వడం అనేది తధ్యం. ఇది అతిశయోక్తి అనిపించినా అది పచ్చి నిజం. ముఖ్యంగా హైదరాబాదు గురించి  అయితే, ఆయన ఆలోచనలు అంబరాన్ని తాకుతుంటాయి. హుస్సేన్ సాగర్ లోని కాలుష్య  జలాలను తోడేసి, దాన్ని మంచి నీటి సరస్సుగా తయారుచేయడం వాటిల్లో ఒకటి. రెండు నగరాల నడుమ అంత పెద్ద తటాకం వున్న మరో మహా  నగరం మన దేశంలోనే లేదంటారు. భాగ్యనగరాన్ని విశ్వ నగరంగా తీర్చి దిద్దడానికి అందుబాటులో వున్న ప్రధాన ఆకర్షణ కూడా హుస్సేన్ సాగరే. తెలంగాణకు ఎట్లాగు సముద్ర తీరం లేదు. కాబట్టి సిద్ధంగా వున్న సాగర తీరాన్ని పర్యాటక కేంద్రంగా మార్చుకోవాలన్నది టీ ఆర్ యస్ అధినేత అంతరంగం కావచ్చు. ఆ ప్రాంతంలో ప్రపంచంలో కెల్లా ఎత్తయిన వంద అంతస్తుల భవన నిర్మాణం ద్వారా ప్రపంచ దృష్టిని ఆకట్టుకోవాలన్నది ఆయన ఉద్దేశ్యం కావచ్చు. రికార్డులకెక్కే ఇటువంటి బృహత్తర నిర్మాణాలను కళ్ళారా చూడాలనే పర్యాటకుల సంఖ్య అన్ని దేశాల్లో తక్కువేమీ కాదు. పర్యాటకం ద్వారా గుర్తింపు, అదే సమయంలో ఆర్ధిక పరమైన లబ్ది పొందడం ద్వారా దాన్ని ఉభయతారకం చేసుకోవడం తెలంగాణా ముఖ్యమంత్రి ఆలోచన కావచ్చు. కేసీయార్ ఇటువంటి ఆలోచనలను పంచుకునేటప్పుడు వాడే భాషా చమత్కారం కూడా బహు రంజకంగా ఉంటుందని విన్నవాళ్ళు చెప్పే మాట. అయితే,   ఆ మాయతెర తప్పుకున్న తరువాత ఆయన చెప్పినదంతా ఆచరణ  సాధ్యమయ్యే పనేనా అని కూడా అనిపించవచ్చు. కానీ ఆయన మాత్రం ఇటువంటి సందేహాత్ములను అస్సలు పట్టించుకోరు. లెక్కచెయ్యరు. తను అనుకున్న పద్దతిలోనే ముందుకు సాగుతున్నట్టు స్పష్టమైన సంకేతాలు ఇస్తారు. అంతేకాదు,   బంగారు తెలంగాణా ఎలా వుండాలని తాను  కోరుకుంటున్నారో వాటిని గురించి కలలు కనడం కూడా  మానరు. వాటిల్లో కొన్నింటిని  సాకారం చేయగలిగితే మాత్రం బంగారు తెలంగాణా ఆవిష్కృతం కావడం తధ్యం. అందులో సందేహం లేదు. అలా జరిగిన నాడు  ఆయన్ని అపర భగీరధుడు అని పొగిడినా ఆశ్చర్యం లేదు.


సరే! హైదరాబాదును విశ్వనగరంగా తీర్చిదిద్దే బృహత్తర కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి భుజాలకెత్తుకున్నారు. అహరహం దాన్ని గురించే ఆలోచిస్తున్నారు. నేర రహిత నగరంగా, ట్రాఫిక్ ఝంఝాటాలు లేని నగరంగా, చక్కని ఉద్యానవనాలు, పచ్చని ప్రకృతితో అలరారే నగరంగా మార్చాలన్న సత్సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. మాఫియాలబారి నుంచి, భూకబ్జాదారుల కోరలనుంచి, దళారుల కబంధ హస్తాల నుంచి  నగరాన్ని విముక్తం చేయాలని కంకణం కట్టుకుని పనిచేస్తున్నారు. ఇలాటి ఆలోచనలు చేసేవాళ్ళని ఎవ్వరూ తప్పుపట్టలేరు. ఇలాటి ప్రతి చర్యను ప్రతిఒక్కరు ఆహ్వానిస్తారు కూడా. కోడలు కంటాను అంటే వద్దనే అత్త ఉండదని సామెత.
ఇవన్నీ ఒకెత్తు. స్కై స్క్రేపర్లు (ఆకాశహర్మ్యాలు), స్కైవేలు (ఆకాశ వీధులు) ఇలా అత్యాధునిక నిర్మాణాలతో మరో ఇరవై ఏళ్ళ కాలానికి సరిపడే విధంగా ప్రణాళికలు తయారుచేయిస్తున్నారు.  
ఆయన చెప్పడానికి, ఇతరులు వినడానికి అంతా బాగానే వుంది. మరి ఇవన్నీ ఎలా సాధ్యం. ఇన్నిన్ని  ప్రాజక్టులు ఒకే పర్యాయం  అమలుచేయాలంటే ఎన్ని నిధులు కావాలి, అవి ఎక్కడినుంచి వస్తాయి అనే ప్రశ్నలు ఉత్పన్నం కావడం కూడా తధ్యం. ఎందుకంటె ఒకటీ అరా పనులకు  సరిపడే డబ్బును ఎల్లాగో అల్లా సర్దుబాటు చేసుకోవచ్చు. కానీ ఒకేసారి ఇన్ని తలకెత్తుకోవాలంటే  తలకు మించిన భారమే అవుతుంది. అన్ని నిధులు ఎలా సమకూరుతాయి ? అన్ని వనరులు ఎక్కడ వున్నాయి?  అధికారులకి ఇవన్నీ జవాబు లేని ప్రశ్నలు. ఆయన రాజకీయ ప్రత్యర్ధులకు మాత్రం ఇవన్నీ అనుకోకుండా అందివచ్చే  అస్త్రశస్త్రాలు.
మనసుండాలే కాని మార్గం అదే దొరుకుతుందని మామూలుగా రాజకీయ నాయకులు వల్లె వేసే మాట.
నిజమే. మాజీ రాష్ట్రపతి  కలాం గారు చెప్పినట్టు కనే కలలు పెద్దవిగానే  వుండాలి. వాటిని సాకారం చేసుకునే ప్రయత్నం కూడా అంతే  పెద్దగా వుండాలి. బహుశా  కేసీయార్ ప్రస్తుతం  చేస్తున్నది అదే కావచ్చు. ప్రజలిచ్చిన అయిదేళ్ళ వ్యవధానంలో ఆరునెలల కాలం  అప్పుడే గతంలోకి జారిపోయింది. మిగిలినకాలంలో  కొన్నయినా సాధించాలంటే కాలంతో  పరిగెత్తక తప్పదనుకున్నారేమో!
హైదరాబాదును విశ్వ నగరం చేయడం మంచి ఆలోచన. కానీ చాలామంది నగర ప్రేమికులు, నగర రూపురేఖలు మార్చినా పరవాలేదు కాని హైదరాబాదు నగరానికి వున్న సంస్కృతీ సంప్రదాయాల మూలాలు  ధ్వంసం కాకుండా చూడాలని కోరుకుంటున్నారు. మొత్తం  దేశంలో  హైదరాబాదుకు కొన్ని ప్రత్యేకతలు వున్నాయి. అభివృద్ధి పేరుతొ వాటిల్లో అనేకం ఇప్పటికే రూపుమాసి పోయాయి. పాత హైదరాబాదు మళ్ళీ కావాలని చాలామంది కోరుకుంటున్నారు. ఇది చేయడానికి నిధులు అక్కరలేదు. కొంచెం చిత్తశుద్ధి, మరి కొంచెం పట్టుదల వుంటే సరిపోతుంది.
మార్పు అనివార్యం. దానికి మోకాలడ్డడం వివేకం అనిపించుకోదు. మార్పును స్వాగతిస్తూ, మూలాలను పదిలం చేసుకుంటూ పధకాలు సమన్వయం చేసుకోగలిగితే ఫలితాలు ఫలవంతంగా వుంటాయి.  


ఉదాహరణకు, ఒకప్పటి హైదరాబాదు ఇప్పటి హైదరాబాదులా లేదు. ఇప్పటి హైదరాబాదు మరొకప్పటి హైదరాబాదులా వుండదు.  నిజామ్  కాలంనాటి నగర జీవనం ఎలావుండేదో ఆ చిత్తరువులు కొన్ని అక్కడక్కడా (ఉదాహరణకు బెల్లావిస్టా ఎడ్మినిస్త్రేటివ్ స్టాఫ్ కాలేజీ, ప్రెస్ క్లబ్ ను అనుకునే వుంటుంది)  కనిపించినప్పుడు వొళ్ళు పులకరిస్తుంది. ఇటీవలి కాలంనాటి అంటే ఓ యాభై అరవై సంవత్సరాల హైదరాబాదు ఫోటోలు కలికానికి కూడా దొరకవు, వున్నా అవి ఏ కలిగినవాళ్ళ లోగిళ్ళకొ, అయిదు నక్షత్రాల హోటళ్ళకో  పరిమితమయిపోయాయి.
హైదరాబాదు గురించి, దాని సంస్కృతీవైభవాలు గురించి నరేంద్ర లూధర్ దగ్గర నుంచి ఉడయవర్లు వరకు ఎందరో ఎన్నో పుస్తకాలు  రాసారు.
శిష్ట్లా లక్ష్మీపతి శాస్త్రి గారు రాసిన 'హైదరాబాదు నాడు నేడు' అనే పుస్తకంలో 1935 ప్రాంతాలనాటి కొన్ని విశేషాలు రాసారు. ఇలాటివి చదివినప్పుడు మళ్ళీ అలనాటి నగరాన్ని ఎవరయినా తెచ్చి ఇవ్వగలిగితే యెంత బాగుంటుంది అనిపిస్తుంది. వాటిల్లో కొన్ని ముచ్చట్లు.  
"బెజవాడ నుంచి సికిందరాబాదుకు నైజాం బండిలో (నిజాం స్టేట్ రైల్వే వారు నడిపే రైలు) టిక్కెట్టు మూడు రూపాయల పదమూడు అణాలు.
" దబీర్ పురావైపు మలక్ పేట రైల్వే  వంతెన కిందనుంచి వెడితే మూసీ నది మీద చాదర్ ఘాట్ బ్రిడ్జ్, మధ్యలో కొంచెం ఎత్తు, అటూ ఇటూ పల్లం. చాలా అందంగా వుండేది. మంచి తారు రోడ్డు. బ్రిడ్జ్ మధ్యలో కాలిదారి మీద ఒక బీద పకీరు కూర్చుని 'అల్లా రహమ్ కరదే, మౌలా హుకుం దే' అని చక్కని స్వరంతో పాడుతూ ఉండేవాడు. ట్రూప్ బజారులో ఓ పక్క విశాలమైన ఆవరణలో 'ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా',  తరువాత సాగర్ టాకీసు, జిందా తిలిస్మాత్ దుకాణం, ఆపైన  ఆబిడ్స్, అదే బజారులో రెండు ఇనుప కటకటాల ఆవరణలు ఉండేవి. ధన రాజ్ గిరి, ప్రతాప్ గిరిజీలవి అవి. ప్రతాప్ గిర్జీ మార్వాడీల  గురువు. ఏటా వారి పుట్టిన రోజున  ఊళ్ళోని మార్వాడీలు అందరూ  కలిసి వారి ఎత్తు బంగారం తూచి కానుకగా  ఇచ్చేవారట. నిజాం నవాబు  కన్నా వీరు ధనవంతులని చెప్పుకునేవాళ్ళు, నవాబుగారు  ఒక రోల్స్ రాయిస్ కారు కొంటే, వీళ్ళు రెండు కొనేవారట.
"ఆబిడ్స్ లో 'కెఫే కరాచీ'. అందులో అమృతప్రాయమైన చాయ్ మూడు హాలీ పైసలు. మలై వాలా చాయ్ ఒక అణా. నిజాం రాజ్యంలో హాలీ కరెన్సీ వాడుకలో వుండేది.  నూరు రూపాయలు బ్రిటిష్ కరెన్సీకి నూటపదహారు రూపాయల పది అణాల ఎనిమిది పైసలు హాలీ డబ్బులు ఇచ్చేవాళ్ళు.   
"ఆబిడ్స్ లో జమ్రుద్ మహల్ సినిమాహాలు వుండేది. దేవికారాణి నటించిన 'జవానీకి హవా' అనే సినిమా చూడడానికి నిజాం నవాబు ఆ హాలుకు వెళ్ళారు.  ఆ సినిమాహాలులో అప్పుడప్పుడు సంగీత కచ్చేరీలు కూడా జరిగేవి. ఒకసారి ముసునూరి సుబ్రహ్మణ్యం గారి పాట కచ్చేరీ జరిగింది. కాచీగూడా తుల్జా భవన్ లో ఓసారి వారం రోజులపాటు  సంగీతసభ  జరిపారు. చౌడయ్య సోదరులు 'హరి కాంభోజి రాగంలో 'దీనామణీ వంశ - తిలక- లావణ్య - దీన శరణ్య' అని ఫిడేలుపై వాయిస్తుంటే అంతా పరవశులైపోయారు. ఆ రోజుల్లోనే ఆబిడ్స్ కార్నర్ లో ప్యాలెస్ టాకీసు కట్టారు. 'సత్య హరిశ్చంద్ర' తెలుగు టాకీ వేసారు. గౌలి గూడాలో ఒక మూకీ సినిమా హాలు వుండేది. దానికి తెర లేదు. తెల్లని గోడ మీద బొమ్మలు నడిచేవి. 'వివేక వర్ధని' పేరుతొ  మరో  సినిమా హాలు వుండేది."
ఇలాటి జ్ఞాపకాలు ఎందరెందరి మనసుల్లోనో గూడుకట్టుకుని ఉండిపోయాయి. ఎవరో ఎందుకు తెలంగాణా ముఖ్యమంత్రి కేసీయార్ ఒక్కరు చాలు ఇటువంటి మధుర స్మృతులను గుర్తుచేయడానికి.
అందుకే మళ్ళీ మళ్ళీ చెబుతోంది.
హైదరాబాదుని విశ్వ నగరం చేయండి! ఏమీ అభ్యంతరం లేదు.

అయితే, ఆ నగరానికి వున్న 'ఆత్మ'ను కాపాడండి. (27-12-2014)
NOTE: Photo Courtesy Image Owner

1 కామెంట్‌: