3, అక్టోబర్ 2014, శుక్రవారం

పరిశుద్ధ భారతం

(Published by 'SURYA' telugu daily in its Edit page dated 05-10-2014, SUNDAY)

ఎప్పుడో యాభయ్ ఏళ్ళక్రితం పత్రికల్లో వచ్చిన వార్త.
1960లో అనుకుంటాను. నాటి సోవియట్  యూనియన్  అధినేత నికితా కృశ్చెవ్ భారత దేశంలో అధికార పర్యటన నిమిత్తం మాస్కో నుంచి న్యూ ఢిల్లీ చేరుకున్నారు. అప్పటి పాలం విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన భారత ప్రధమ ప్రధాన మంత్రి జవహర లాల్ నెహ్రూ, రష్యన్ నాయకుడిని వెంటబెట్టుకుని ఉదయపు వేళలో కారులో వస్తుంటే, తోవలో అక్కడక్కడా కొందరు ఆడామగా మోకాళ్ళ మీద కూర్చుని వుండడం కృశ్చెవ్ కంటబడింది. ఆయన ఉత్సుకత ఆపుకోలేక నెహ్రూ వైపు సాలోచనగా  చూసారు. సమాధానం చెప్పలేక నెహ్రూ గారి మొహం పాలిపోయింది. ఈ పేద దేశంలో అధిక సంఖ్యాకులు ఇలా బహిర్భూములలోనే బహిరంగంగా కాలకృత్యాలు తీర్చుకోవాల్సిన దుస్తితి గురించి బయటకు చెప్పుకోలేక  ఆయన ఎంతో ఇబ్బంది పడ్డారని నాటి వార్తల సారాంశం.
ఇది జరిగి యాభయ్ నాలుగేళ్ళు దాటుతోంది. దేశంలో పరిస్తితి ఏమైనా మారిందా అంటే చప్పున అవునని జవాబు చెప్పలేని స్తితిలోనే ఉన్నాము. ఒకానొక రోజుల్లో యావత్ ప్రపంచానికి నాగరీకం నేర్పిన దేశంగా మన దేశానికీ పేరు. మరిప్పుడో! మురికి కూపంగా చూపాల్సివస్తే విదేశీ మీడియాకు ముందు కనబడేది మన దేశమే. దీనికి ఎవ్వరు కారణం? పాలకులా? పాలితులా? విధానాలా? వాటి అమలు తీరా?


వీటికి జవాబులు చెప్పలేకే, ఈ నెల రెండో తేదీన భారత ప్రభుత్వం మొదలెట్టిన స్వచ్చ భారత్ ఉద్యమం. మోడీ మార్క్ తరహాలోనే అట్టహాసంగా మొదలయింది. రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, గవర్నర్లు, కేంద్ర మంత్రులు, రాష్ట్రాల మంత్రులు, ప్రధాన కార్యదర్శులు, ఉన్నతాధికారులు చీపుర్లు చేతబట్టి ఈ ఉద్యమంలో మహోద్యమంగా పాల్గొన్న చిత్రాలు, దృశ్యాలు  మీడియాలో దర్శనమిచ్చాయి. మోడీ గారు షరా మామూలుగానే తనదయిన పద్దతిలోనే ఈ స్వచ్చ భారత్ ప్రయోగం గురించి వివరణ ఇచ్చారు. దేశాన్ని శుభ్రం చేసే పని ఒక్కడివల్ల అయ్యేది కాదనీ, ప్రజలందరూ పాలుపంచుకుని సహకరిస్తేనే ఫలితాలు ఉంటాయనీ అన్నారు. ఎర్రకోట నుంచి పంద్రాగష్టున చేసిన ప్రసంగంలో కూడా ప్రధానమంత్రి ఇదే విషయాన్ని ప్రస్తావించారు. దానికి కొనసాగింపుగానే ఈ ఉద్యమానికి అంకురార్పణ జరిగిందని అనుకోవాలి.


ఇన్నేళ్ళ స్వతంత్ర భారతం ఎలాటి అభివృద్ధికి నోచుకోలేదని చెప్పడం కాదు. అయితే, అనేక విషయాల్లో ఇతర అగ్రరాజ్యాలకు పోటీగా ముందుకు దూసుకుపోతున్న భారత దేశం  ఈ ఒక్క విషయంలోనే ఎందుకు వెనుకబడి వున్నది అన్న ప్రశ్నను మోడీ వేసుకున్నారు. కానీ వాస్తవానికి ఇది నూరుకోట్లు దాటిన మన యావత్ భారత జనాభా వేసుకోవాల్సిన ప్రశ్న. సమాధానం అన్వేషించుకోవాల్సిన ప్రశ్న. ఈనాడు అందివచ్చిన అన్ని అవకాశాలను అందిపుచ్చుకుంటూ మన దేశం నుంచి ఏటా లక్షలాదిమంది ఇతర దేశాలకు ఉపాధుల నిమిత్తం వలస పోతున్నారు. సరే. మంచిదే. కానీ,  ఒక జీవితానికి సరిపడా సంపాదించుకున్న వాళ్ళు సయితం ఎందుకు తిరిగి స్వదేశానికి రావడానికి విముఖత చూపుతున్నారు?
"ఇక్కడ రోడ్లు బాగుండవు. స్వచ్చమైన నీళ్ళు దొరకవు. పరిశుద్ధమైన గాలి కలలో మాట. ఇక ఇళ్ళూ వాకిళ్ళూ, వాటి  పరిసరాలు అపరిశుభ్రతకు నిలయాలు. మేము వద్దామని అనుకున్నా మా పిల్లలకు ఎవ్వరికీ  దేశంలోని ఈ పరిస్తితులు నచ్చడం లేదు. అందుకే రావాలని వున్నాకూడా  రాలేని పరిస్తితి" ఇవీ వాళ్ళు ఇచ్చే  సంజాయిషీ.
" భారత దేశానికి రండి. వచ్చి  పరిశ్రమలు పెట్టండి. మేక్ ఇన్ ఇండియా అని పేరుపడేలా చేయండి' ఈ  నినాదాలు వినడానికి బాగానే వుంటాయి. మరి వచ్చేవారికి, వద్దామనుకున్నవారికి  వసతుల  విషయం?  వాళ్ళ మెదళ్ళను ప్రధానంగా తొలుస్తున్న పారిశుధ్యం విషయం? వీటికి జవాబు చెప్పకుండా నినాదాలకు ప్రతిస్పందన ఆశించడం వృధా.
అందుకే  కాబోలు మోడీ గారు 'స్వచ్చ భారత్ నినాదం' అందుకున్నారు. ఉద్దేశ్యం మంచిదే. ఇది విజయవంతం అయితే లాభపడేది కూడా దేశంలోని సాధారణ జనమే. కలిగినవాళ్ళు ఎట్లాగు మురికికీ,  మాలిన్యాలకూ దూరంగానే వుంటారు. లేనివాళ్ళకు ఉపయోగపడే ఇటువంటి ప్రయోగాలు ఎప్పటికీ ఆహ్వానించతగినవే.
'పచ్చదనం, పరిశుభ్రం' అనే పదాలు మనకు కొత్తవేం  కావు కాని, వీటిని గురించి మాట్లాడుకునేటప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వినబడే పేరు ఒక్కటే. అది సింగపూరు. మన దేశం లాగానే ఆ చిన్ని దేశం కూడా చాలా ఏళ్ళు బ్రిటిష్ పాలనలో మగ్గింది. మనకు  స్వతంత్రం వచ్చిన పదహారేళ్ళ తరువాతనే  ఆ దేశం  స్వేచ్చావాయువులు పీల్చగలిగింది. స్వేచ్చావాయువులతో పాటు  స్వచ్చమైన గాలిని పీల్చగలగడం, మరింత పరిశుద్ధమైన నీటిని తాగ గలగడం, కాలుష్య రహిత నగరంగా పేరు తెచ్చుకోవడం అనతికాలంలోనే జరిగిపోయింది కూడా.  సిగరెట్ పీకెలు, బస్సు టిక్కెట్లు, ప్లాస్టిక్ సంచులు రోడ్లమీద పారేయడం, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడం  అక్కడ నిషిద్దం. అలాటివారికి విధించే జరిమానాలు కూడా చాలా భారిగా వుంటాయి.  అందుకే అక్కడి రోడ్లు ఎలాటి చెత్తా చెదారం లేకుండా మిలమిలా మెరిసిపోతుంటాయి.
కానీ ఈ మార్పు ఒక్కరోజులో రాలేదు. అలాగని ఏళ్ళతరబడి సమయం తీసుకోలేదు. పరిశుభ్రత అన్నది జనం జీవితంలో భాగంగా మారిపోవడానికి అక్కడి ప్రభుత్వాలు ఎంతో ప్రాధాన్యత ఇచ్చాయి. దానికి పౌరుల సహకారం తోడయింది.
సింగపూరులో ఉంటున్న ఒక హైదరాబాదీ చెప్పిన ఒక ఉదంతం ప్రస్తావనకు అర్హమైనది.
ఆ దేశంలో ఒక దృశ్యం నిత్యకృత్యం.
అదేమిటంటే - ప్రతిరోజూ సింగపూరులో ఎక్కడో ఒక చోట ఒక సమూహం బయలుదేరుతుంది. వారి చేతుల్లో చెత్తాచెదారం శుభ్రం చేసే పరికరాలు వుంటాయి. పారిశుధ్య పనివారు ధరించే పై దుస్తులు (యాప్రాన్లు) ధరించి వారు నిర్దేశించిన ప్రాంతంలో కొన్ని గంటలపాటు శ్రమించి పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహిస్తారు. పబ్లిక్ టాయిలెట్లు బాగుచెయ్యడం దగ్గర నుంచి, వీధుల్ని శుభ్రం చేయడం వరకు అన్నిరకాల కార్యక్రమాల్లో పాల్గొనే వాళ్ళు,  నిజానికి పారిశుధ్య కార్మికులు కాదు. అలాగని స్వచ్చంద సంస్థల కార్యకర్తలూ కాదు. వారిలో పెద్ద ఉద్యోగస్తులు వుంటారు. వ్యాపారస్తులు వుంటారు. చదువుకునే యువతీ యువకులూ వుంటారు. పరిశుభ్రతకు సంబంధించిన నియమ నిబంధనలను ఉల్లంఘించి చట్టానికి చిక్కిన వాళ్ళు వారు. అలాటి వారికి జరిమానాలతో పాటు అదనంగా విధించే శిక్షలు ఇవి. పనంతా  పూర్తయిన తరువాత వారికి ఒక శీతల పానీయం ఇచ్చి,  నిబంధనలు పాటించడం వల్ల పౌరులకు, సమాజానికి వొనగూరే ప్రయోజనాలు గురించి వివరించి చెప్పి  మరీ సాగనంపుతారు.
అంచేత మన  దేశాన్ని 'మురికిలేని పరిశుద్ధ భారతం'గా తయారుచేయాలన్న మోడీ గారి సంకల్పం విజయవంతం కావాలని కోరుకుంటూనే, సింగపూరు వంటి చిన్న దేశాలు ఈ విషయంలో సాధించిన పురోగతిని ఓ కంట గమనించాలని కూడా ఆశిద్దాం. (03-10-2014)
NOTE : Courtesy Image Owner 

1 కామెంట్‌:

  1. దీనికి ఎవ్వరు కారణం? పాలకులా? పాలితులా? విధానాలా? వాటి అమలు తీరా?

    అనుమానం లేకుండా పాలితులే ఎక్కువ కారణం. పాలితులు కారణం కాదనుకోవటం సమస్యనుంచి పారిపోవటమే అని నా ఉద్దేశ్యం. ఒకప్పుడు యధా రాజా, తథా ప్రజా. ఇప్పుడు అది తల్లకిందులై, యథా ప్రజా, తధా రాజా. ప్రజాస్వామ్యం కదా మరి!

    రిప్లయితొలగించండి