3, అక్టోబర్ 2014, శుక్రవారం

ఊసరవెల్లులు

  

‘పెద్దయ్యాక ఏమవుదామనుకుంటున్నావు?’  అనేది చిన్నప్పుడు స్కూల్లో అడిగే ప్రశ్న.
‘తెలుగు మాస్టారు’ ఠకీమని సమాధానం.
ప్రశ్న అడిగిన లెక్కల మాస్టారుకి ఎక్కడ కాలాలో అక్కడే కాలేది. తరువాత ఏదో తప్పువెతికి పట్టుకోవడం, చెయ్యి చాపమనడం, చాచిన చేతిని తిరగేయించడం,  దానిమీద డష్టరు తిరగేయడం - అది వేరే కధ.



తమదగ్గర  చదువుకునే పిల్లల్లో ఐ.ఏ.ఎస్. లు ఎంతమంది అవుతారన్నది వారికొచ్చిన  డౌటేహం కావచ్చు. వాళ్ళల్లో రాజకీయనాయకులు, జర్నలిస్టులు కొంతమంది అయినా కాకపోతారా అనే నమ్మకం కావచ్చు. అందుకే కాబోలు,  పిల్లలకు   వక్తృత్వపోటీలు పెట్టి, ‘కలం గొప్పదా? కత్తి గొప్పదా?’ – ‘అణ్వస్త్రాలు కావాలా?  అన్నవస్త్రాలు కావాలా?’ అని ప్రతి అంశానికి అనుకూలంగా ప్రతికూలంగా రెండు విధాలుగా చెప్పించేవారు. అప్పుడర్ధంయ్యేది కాదు కానీ ఇప్పుడు టీవీ చర్చల తీరుతెన్నులు, రాజకీయ నాయకుల ప్రకటనలు గమనిస్తుంటే  అందులోని తత్వం  నెమ్మది నెమ్మదిగా తలకెక్కుతోంది. విషయం ఒకటే అయినా, తమ పార్టీకి అనుకూలంగా, ప్రతిపక్షానికి వ్యతిరేకంగా  ఎలా మాటలు తిరగేసి మాట్లాడొచ్చు అనే దానిలో అందరూ  మాస్టర్స్ డిగ్రీ సాధించేశారు. నరం లేని నాలుక ఏవిధంగానయినా మాట్లాడుతుందంటారు చూడండి. అలా రాజకీయ నాయకులు ‘మొన్న ఏం మాట్లాడాం, నిన్న ఏం చెప్పాం’ అన్నదానితో నిమిత్తం లేకుండా ‘ఈరోజు చెప్పిందే ఫైనల్’ అన్న పద్ధతిలో  బల్లగుద్ది వాదిస్తున్న విధం చూస్తుంటే 'రాజకీయాల్లో సోషలిజం, కమ్యూనిజం, క్యాపిటలిజం   కాకరకాయా ఏమీలేదు వొట్టి అవకాశవాదం తప్ప' అని  అనిపిస్తే ఆశ్చర్యపోవాల్సింది ఏమీ వుండదు. అలాగే, నిన్న కప్పుకున్న పార్టీ కండువా తెల్లారేకల్లా మార్చేసి అందుకు తగ్గట్టుగా మాటల ఘాటు పెంచడం చూస్తేమాత్రం ఆశ్చర్యపోకా  తప్పదు. విశ్వనాధవారు అన్నట్టు ఇదో వైచిత్రం. 

NOTE: Courtesy Image Owner 

1 కామెంట్‌:

  1. >విశ్వనాధవారు అన్నట్టు ఇదో వైచిత్రం.

    ఈ‌ భండారువారు విశ్వనాథ ప్రసక్తిని తీసుకొని వచ్చుట దేని కనియో బోధ పడుచున్నది కాదు. నిజమునకు వారు వ్రాసిన వాక్యము తప్పు. 'ఇదో వైచిత్రం' బనుట యెట్టి తెనుగన వలెను? అదో ఇదో యనునట్టి వాడుకలు విశ్వనాథ ప్రయోగించునా? వైచిత్రం బనుట యెట్టి వెఱ్ఱిమాట? నిజమునకు పైవాక్యములో వైచిత్రి యనవలెను. ఈ విషయము భండారు వారికి తెలియకపో వచ్చును. ఈ‌ నాటి కాలము వారికి తెలుగుపత్రికలలో ప్రచురించుటకు తెలుగక్షరములు వచ్చిన చాలు ననున ట్లున్నది. ఇక పదముల యొక్క స్వరూపములను గూర్చి కాని యే పదమును యే సందర్బములో నే రూపమున బ్రయోగించవలె నన్నది కాని తెలియవలసిన పనియే లేదు. వారెట్లు వ్రాసికొన్నను విశ్వనాథకు వచ్చునదియు లేదు పోవునదియు లేదు. అది వేఱు సంగతి. విచారించవలసిన విషయ మేమనగా నీ పాత్రికేయులవారు విశ్వనాధ యిట్లు వ్రాయునని యపభ్రంశస్వరూపములతో కూడిన వాక్యమును వ్రాయుట. నేటి కాలమున విశ్వనాథను చదువు వారి సంఖ్యయే లెక్కకు వ్రేళ్ళు చాలునన్న ట్లున్నది. అట్టి కాలములో విశ్వనాధ పథ్థతి యని తప్పులు వ్రాసిన విశ్వనాథ యేమి చేయును. విశ్వనాథ యేమి చేయున్నన్నది యొక యెత్తు కాగా తెలుగు భాష యేమి చేయు నన్నది యసలైన ప్రశ్న. ఈ‌ యంతర్జాలము పుణ్యమా యని యందరును చదువరులును వ్రాయసకాండ్రునై చెలరేగుచున్నారు. ఇకపై వారు మెచ్చునదియును వ్రాయునదియును మాత్రమే తెనుగుగా ప్రచార మగును. సరియైన తెలుగుతోడనే పని లేని కాలములో గతించిన విశ్వనాథ యేమి చేయునని యడిగి ప్రయోజనము కలదా? కానిండు. రే పింకొకండు తానే విశ్వనాథ ననునేమో. కావచ్చును. ఆనాడు కొత్తవిశ్వనాథ దెబ్బకు తెలుగు మఱుగైన కావచ్చును. అట్టి ఘనకార్యమును ఆ రాబోవు కాలము వారు మిక్కిలి హర్షించినను విస్తుబోవలసి నదియు నుండదు. కానిండు సర్వమును కాలాధీనము.

    రిప్లయితొలగించండి