29, సెప్టెంబర్ 2013, ఆదివారం

మళ్ళీ జరిగిన నా పెళ్లి


అరవై ఎనిమిదో ఏట నాకీ సాయంత్రం మరో  పెళ్ళిచేశారు. అదీ మా ఆవిడ సమక్షంలో.
ఈ పుణ్యం కట్టుకుంది ఎవరో కాదు, మా మేనకోడలి మొగుడు రాంపా గారు. రాయడం, రాసిన వాటిని పుస్తకాలు వేయడం వాటిని బంధు మిత్రుల సమక్షంలో ఆవిష్కరించడం అన్నీ ఓ వేడుకగా జరుపుకోవడం ఆయనకో సరదా. కానీ ఈసారి ఆయనకు యెందుకు అనిపించిందో తెలియదు కాని  మాట మాత్రం ముందు  చెప్పకుండా తెలిసిన నలుగుర్నీ  పిలిచి  ఆయన తాజాగా రాసిన ‘కొస విసుర్లు’ ఓ పుస్తకాన్ని నాకు ఏకంగా  అంకితం ఇచ్చేసాడు. పుస్తకాలు అంకితం తీసుకోవడానికి నేను చిన్న సైజు భోజరాజును, కృష్ణదేవరాయల్నీ కాదు. అయినా నన్నే యెందుకు ఎన్నుకున్నట్టు. ఎన్నుకొనెనుబో, ఆ వేడుకను ఓ పెళ్లి మాదిరిగా జరిపి మా దంపతులతో ఏడడుగులు నడిపించి తన కావ్య కన్నికను నా చేతిలో పెట్టి సలక్షణంగా అంకిత మహోత్సవాన్ని నిర్వహించడం యెందుకు. యెందుకు అంటే ఏం చెబుతాం. రాంపా గారి తీరే అంత.


మొత్తానికి ఏమయితేనేం నాలుగు దశాబ్దాల క్రితం  తిరుపతిలో  జరిగిన నా గుళ్ళో పెళ్లిని  ఎవరు చూడలేకపోయారు కాని ఈ రోజు ‘నవ్య’ వారపత్రిక  సంపాదకులు జగన్నాధ శర్మ గారితో సహా రాతల్లో, గీతల్లో చేయి తిరిగిన చాలామంది రచయితలు, కార్టూనిస్టులు అయిన ఘనాపాఠీలు  సాక్షి సంతకాలు చేశారు. అంటే ఈ తతంగానికి ప్రత్యక్ష సాక్షులు అన్నమాట. ఎవరెవరని చెప్పుదు అందరినీ. కానీ వారిలో కొందరు ఎవరయా అంటే- సినీ ప్రముఖులు జనార్ధన మహర్షి, అల్లాణి శ్రీధర్, రచయితలు కవనశర్మ, జీ ఆర్ మహర్షి, పొత్తూరి విజయలక్ష్మి, చిల్లర భవానీ దేవి, శంకర నారాయణ, జేఎల్ నరసింహం, కార్టూనిష్టులు సుభానీ, సరసి, లేపాక్షి, బాచీ, అరుణ్, కృష్ణ, అన్వర్, పినిశెట్టి,  వరంగల్ నుంచి తీరిక చేసుకుని వచ్చిన క్షణం తీరుబడిలేని డాక్టర్ అంజనీదేవి.    
అప్పటి అసలు పెళ్ళికి ఫోటోలు ఎట్లాగు లేవు. ఈ పెళ్లి ఫోటోలన్నా రేపు పోస్ట్ చేస్తారేమో చూడాలి.
షరా మామూలుగానే, ఆవిష్కరణ కార్యక్రమం రాంపా స్టైల్ లోనే జరిగింది. స్టేజి మీద ఓ చిన్న సైజు  గిలక  బావి సెట్టింగు పెట్టారు.  అందులోనుంచి జగన్నాధశర్మ  గారు, సభికుల కరతాళధ్వనుల నడుమ  చేంతాడుతో ‘కొస విసుర్లు’ పుస్తకాన్ని లాగి బయటకు తీశారు.


ప్రసంగాలు లేవు కాని ముచ్చట్లు చెప్పమన్నారు. అవి కూడా ఓ మోస్తరు ఉపన్యాసాల మాదిరిగానే సాగాయి. కాకపొతే వక్తలు మరికాసేపు మాట్లాడితే బాగు అన్నట్టుగా పసందుగా వున్నాయి.  ‘నవ్వుల సాయంత్రం’  అన్న రాంపా ఉద్దేశ్యం నెరవేరినట్టే అనిపించింది.
వచ్చిన సభికుల పేర్లతో చీటీలు రాసి డ్రా తీసి ఎనిమిది మందికి రాయల ఆస్థానంలోని అష్టదిగ్గజాలను గుర్తుకు తెస్తూ చిన్న చిన్న ఇత్తడి ఏనుగు ప్రతిమలను బహుకరించడం కొసమెరుపు.

(29-09-2013) 

1 కామెంట్‌: