రాజుగారు
ఉద్యానవనంలో వాహ్యాళి ముగించుకుని తిరిగి రాజప్రాసాదంలో అడుగిడే ముందు అతడు వున్నట్టుండి
ఎదురుపడ్డాడు. చూడబోతే బిక్షగాడి మాదిరిగా వున్నాడు. బాగా ఉల్లాసంగా వున్న రాజుగారికి అతగాడికి ఏదయినా సాయం చేయాలని అనిపించింది.
‘ఏం
కావాలి నీకు ? కోరుకో! ఏదయినా సరే ఇస్తాను’ అన్నాడు రాజుగారు రాజసం వొలక బోస్తూ.
‘రాజా!
తొందరపడి అలా అనకు. అనేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకో’
అలా
ధైర్యంగా నిలదీసే మనిషి రాజుగారికి ఇంతవరకు తారసపడలేదు. అతడు అల్లాటప్పా రాజు
కాదు. అనేక యుద్ధాల్లో ఆరితేరిన వాడు. అరివీరభయంకరులయిన శత్రురాజులను
మట్టికరిపించి సువిశాల సామ్రాజ్యం నిర్మించుకున్న మహా చక్రవర్తి. అలాటి వాడు, ‘కోరుకో ఇస్తాను అంటే ఆలోచించుకో అనే మనిషి మామూలువాడు
అయివుండడు’
అలా
ఆలోచించుకున్న రాజు అన్నాడు అతడితో.
‘పరవాలేదు
అడుగు. సంశయించాల్సిన పనిలేదు. ఇచ్చిన మాట తప్పే అలవాటు మా ఇంటావంటా లేదు.’
‘సరే!
రాజా! చూసారుగా నా చేతిలోని ఈ బిక్షాపాత్ర. ఇందులో ఏం వేస్తారో వేయండి. దీన్ని
నింపండి. నాకంతే చాలు. అయితే మళ్ళీ చెబుతున్నాను మళ్ళీ ఒకసారి ఆలోచించుకోండి’
రాజు
విలాసంగా నవ్వాడు. నవ్వి అన్నాడు.
‘ఈ
పాత్ర నింపడానికి అంతగా ఆలోచించుకోవాల్సిన అవసరం వుందనుకోను’
రాజు
అతడిని వెంటబెట్టుకుని రాజ ప్రాసాదంలోకి తీసుకువెళ్ళాడు. పరివారాన్ని పిలిచి
అత్యంత విలువైన మణి మాణిక్యాలతో ఆ పాత్రను నింపమని ఆదేశించాడు.
కృష్ణ
తులాభారం మాదిరిగా సన్నివేశం మారిపోయింది. ఒకటికి రెండుసార్లు యెందుకు
ఆలోచించుకోమన్నాడో రాజుకు క్రమంగా అవగతమవుతోంది. ఆ పాత్రలో ఏమి వేసినా, ఎన్ని
వేసినా ఇట్టే అదృశ్యం అయిపోతున్నాయి. ఆ బిక్షాపాత్ర తిరిగి ఖాళీ అవుతూనే వుంది.
రాజదర్బారులో
జరుగుతున్న ఈ వింత గురించి తెలిసి జనం తండోపతండాలుగా అక్కడికి చేరుకున్నారు.
ఖజానాలోని
సమస్త ధనరాసులు, స్వర్ణాభరణాలను భటులు
గంపలకొద్దీ తెచ్చి ఆ బిక్షాపాత్రలో
వేస్తున్నారు. చిత్రం! వేసినవి వేసినట్టే మాయం అవుతున్నాయి. పాత్ర ఖాళీ అవుతూనే
వుంది.
రాజుగారిలో
పట్టుదల పెరిగింది. ముందూ వెనకా చూడకుండా తనకున్న సమస్తాన్ని ధారపోశాడు. ఫలితం
శూన్యం.
చివరకి
జరిగినదేమిటంటే సాయంత్రానికల్లా రాజ దర్బారులో ఇద్దరు బిక్షగాళ్ళు మిగిలారు.
ఒకడు ఆ
వచ్చినవాడు. రెండోవాడు రాజుగారు.
సర్వం
పోగొట్టుకున్న తరువాతగాని రాజుకు గర్వం దిగిరాలేదు. ఆగంతకుడి ముందు సాగిలపడి
అన్నాడు.
‘మహానుభావా!
నా అహంకారాన్ని మన్నించండి. నేను మీమాట పెడచెవిన పెట్టాను. ఇంతకీ ఈ బిక్షాపాత్ర
సంగతి చెప్పండి. ఇందులోని మర్మం ఏమిటో సెలవివ్వండి’
ఆగంతకుడు
రాజును మించిన విలాసం ప్రదర్శిస్తూ మందహాసం చేసాడు.
‘రాజా!
నిజానికి ఇది బిక్షాపాత్ర కాదు. మానవ కపాలం. నేను దాన్ని మెరుగు పెట్టి పాత్ర
మాదిరిగా కనబడేట్టు చేసాను. ఇందులో ఎన్ని వేసినా, ఏం వేసినా అంతే! ఏమీ మిగలదు. అధికారం, సిరి సంపదలు ఎన్ని వున్నా ఇది ఇంకా
ఇంకా కావాలని కోరుకుంటుంది. దీని ఆశకు అంతు లేదు. ఎన్ని ఇచ్చినా వద్దనదు. యెంత
ఇచ్చినా కాదనదు. మనుషులకు, ఈ ఆశ అనండి, అత్యాశ అనండి కాటికి పోయినదాకా అది వాళ్ల వెంటే
వుంటుంది. ఆ వాస్తవం బోధపరచడానికే ఇదంతా’
మాయమయిన
ధనరాసులు, సిరి సంపదలు రాజుకు మళ్ళీ దక్కాయి. వాటితో పాటు అదనంగా ఒక జీవిత సత్యం కూడా ఆయన ఖాతాలో చేరింది.
‘దిల్
మాంగే మోర్’
(ఇంగ్లీష్
కధకు స్వేచ్చానువాదం)
I want more stories like this.any wrong?
రిప్లయితొలగించండి