4, ఆగస్టు 2012, శనివారం

నృత్య దాన కర్ణుడు


నృత్య దాన కర్ణుడు
ఇటీవల కన్నుమూసిన నృత్య దాన కర్ణుడు వెంపటి చిన సత్యం గారి గురించి ఆర్ వీ వీ కృష్ణారావు గారు కలబోసుకున్న తలపుల్లో కొన్ని.  


వెంపటి చిన్న సత్యం గారు పోయారని టీవీ చానల్స్ లో స్క్రోల్లింగ్ చూడగానే కొంత సేపు మా ఇంట్లో స్తభ్ధత ఏర్పడింది.  మా ఆవిడ నేను కొంతసేపు బాధ పడ్డాము. క్రితం ఏడాది వో ప్రోగ్రాములో
చూసినప్పుడు బాగా పండి పోయి కనిపించారు. ఎప్పుడేనా రాలి పోయేలా కనపడ్డారు. జ్ఞాపకం కూడా బాగా తగ్గినట్టు అనిపించింది.
"చిన సత్యం గారితో  సాన్నిహిత్యం నా సుకృతం. నేను బెజవాడలో పనిచేసే రోజుల్లో   వో పదిహేను  సంవత్సరాలకు పైగా చిన్న సత్యం గారితో చాలా సన్నిహితంగా  మెలిగాను. ఆయన బెజవాడ వచ్చారంటే చాలు మళ్ళీ ఆయన తిరిగి వెళ్ళే వరకు ఆయనతోటే వుండేవాడిని, భోజనం పడకతో సహా.  ఎప్పుడు వచ్చినా  మమత హోటల్ లోనే  దిగే వారు. ఎన్నెన్నో విషయాలు,  నాకు సంబంధం లేనివి కూడా  నాతో చెబుతుండేవారు. బెజవాడలో మా కొక సభ వుండేది,   త్యాగరాజ సంగీత కళా సమితి అని.  మాస్టారు ప్రోగ్రాములన్నీ అక్కడ పెట్టేవాళ్ళం.  మొదటిసారిగా  నేను చిన్న సత్యం గారిని కలిసింది రైల్లో. 1971 లో   వుద్యోగంలో చేరిన కొత్తల్లో  వో సారి ఢిల్లీ నుంచి  జీ టీ ఎక్స్ ప్రెస్ లో  హైదరాబాద్ వస్తున్నప్పుడు కలిసాం. పొద్దుటి నుంచి రాత్రి పడుకోబోయే వరకు  ఏదో మాట్లాడుకుంటూనే  వున్నాము.  ఆ తర్వాత రెండు మూడు రోజులకు రవీంద్ర భారతిలో హేమ మాలిని డాన్స్  ప్రోగ్రాం. మాస్టారు నట్టువాంగం.  మీరూ  రండి’ అని పిలిచారు.  ప్రోగ్రాం కి  వెళ్ళాను. చాలా మంది జనం వున్నారు.  సత్యం గారిని పట్టుకోవడం  కష్టమే.  పైగా టికెట్ కొనకుండా వూరికే చూడడానికి వచ్చిన ప్రేక్షకుడిని.  మొత్తానికి మాస్టర్ గారికి కబురు పెట్టడం ఆయన బయటకు వచ్చి నన్ను తీసుకెళ్ళి కూర్చో పెట్టడం నాకు బాగా గుర్తు.  తరవాత నాలుగేళ్ళకు మళ్ళీ కలిసాం.  అప్పుడు ఆయన,  ‘శోభ నాయుడు ప్రోగ్రాం  బెజవాడ  మీ సభలో పెట్టండి’ అని కోరారు.  అల్లాగే కానీ, మా దగ్గర డబ్బులు పెద్దగా లేవ’ని చెప్పాను.
‘డబ్బు వద్దు. మీరు మంచి పబ్లిసిటీ ఇవ్వండి. ఆ అమ్మాయికి మంచి భవిష్యత్తు వుంది’ అని అన్నారు.  మద్రాస్ నుంచి పోస్టర్లు కొట్టించి పంపారు. మేము చాలా బాగా ఆర్గనైజ్ చేశామనే చెప్పాలి.   మంచి కవరేజే వచ్చింది.  తర్వాత  శోభానాయుడు చాలా గొప్ప కూచిపూడి డాన్సర్  అయ్యారు. మాస్టారుకి  చాలా ఇష్టమయిన స్టూడెంట్  శోభానాయుడనే చెప్పాలి. ఆ అమ్మాయికి తన విద్వత్ అంతా ధార  పోశారు. ఆమె చేత  ఆంధ్ర మెట్రిక్  కట్టించి బెజవాడలోనే   పరీక్ష రాయించారుతన తదనంతరం  కూచిపూడి అకాడెమికి ఆమెను వారసురాలిని చెయ్యాలనుకున్నారు కూడా.   కానీ,  శోభానాయుడు తర్వాత హైదరాబాద్ లో  వేరే అకాడెమి పెట్టుకొన్నారు.  మాస్టారుకి అదో పెద్ద షాక్.
"తదాదిగా, నేను మాస్టారుతో మమేకం  అయ్యాను. బెజవాడ  వస్తే మా ఇంటికి వచ్చేవారు. వోపూట   భోజనం చేసే వారు కూడా.  శ్రీనివాస కళ్యాణం,  రుక్మిణి కళ్యాణం,  క్షీరసాగర మధనం, హరవిలాసం, చండాలిక నృత్య రూపకాలతో పాటు, ఆయన శిష్యుల సోలో పెర్ఫార్మెన్సులు ఎన్నో పెట్ట్టించాము.   ఎప్పుడూ ఇంత ఇవ్వమని అడగలేదు. మా దగ్గర ప్రోగ్రాం  చేస్తే ఆయనకు రెండు మూడు వందల కంటే మిగిలేది కాదన్న విషయం నాకూ  తెలుసు. బెజవాడలో ప్రోగ్రాం అంటే  కూచిపూడి నుంచి ఆయన బంధు మిత్రులందరూ వచ్చేవారు.  వాళ్ళనందరినీ వూరికి  పంపించమని అడగడానికి ఎంతో మొహమాట పడేవారు. 
సభ నిర్వహించడం నాకు తెలుసు. మా వాళ్ళందరికీ నా ప్రోగ్రాం  చూడాలని వుంటుంది. ఇక్కడ కంటే ఇంకో చోట ఆవకాశం లేదు. మీరు వాళ్ళందరిని హాల్ లోకి పంపారు.  నాకు మీరు ఏమిచ్చినా  పర్వాలేదు’ అని ఎంతో వినమ్రంగా చెప్పే వారు. ప్రోగ్రాం  అయిన తర్వాత వాళ్ళంతా గ్రీన్ రూంలోకో లేదా ఆయన బస చేసిన చోటికో  వచ్చే వారు.  వాళ్ళ బాధలన్నీ ఆయనతో చెప్పుకొనే వారు.  సత్యం గారు మేము ఇచ్చిన  పారితోషికంలో చాలా మటుకు అక్కడికక్కడే  వాళ్లకు పంచి పెట్టడాన్ని నేను కళ్ళారా  చూసాను.  వాళ్ళు వెళ్లిన తర్వాత నాతో అనే వారు. ‘మా వాళ్ళు చాలా పేద వాళ్ళు.  నాకు వాళ్ళందరిని పైకి  తీసుకు రావాలని వుంది’.   అనడమే కాదు అలా చేసేవారు కూడా.
సత్యం గారికి కూచిపూడి అన్నా, కూచిపూడి వారన్నా  ప్రాణం.  మద్రాస్ వెళ్ళినా కూచిపూడి కోసం తహ తహలాడేవారు.  కూచిపూడి డాన్సు పైకి  వస్తే మా వాళ్ళంతా బాగు పడతారని ముప్ఫయి ఏళ్లుగా తపన పడుతూ వచ్చారు. ఈవేళ కూచిపూడికి  అంతర్జాతీయ ప్రాముఖ్యం వచ్చింది.  కూచిపూడి భాగవతులుగా వొకప్పుడు గర్భ దారిద్ర్యం అనుభవించిన  వారంతా ఈవేళ కూచిపూడి డాన్సు మాస్టర్లు గా పేరు పొందారు.  మాష్టారు ఎప్పుడు బెజవాడ  వచ్చినా  ఏదో టైం చూసుకొని కూచిపూడి వెళ్లి వచ్చే వారు.  అందర్నీ పలకరించి రావడం, సిద్ధేంద్రక్షేత్రాన్ని అభివృద్ధి పరచడం, వారి కుల దేవత బాల త్రిపుర సుందరి అమ్మవారి గుడి బాగు చెయ్యడం - వీటిల్లోనే   ఆయన తల మునకలు అయ్యే వాళ్ళు. ‘మా  వాళ్ళలో వొకరికి మరొకరికి పడదు. కొట్టుకు చస్తూ  వుంటారు  చెప్పినా వినడం లేదు’ అని బాధ పడే వారు. కూచిపూడి వెళ్లినప్పుడల్లా వొకరిద్దర్ని తనతో పాటు   మద్రాస్ తీసుకు వెళ్ళే వారు. చిన్న సత్యం గారు మద్రాస్ వెళ్ళే సమయానికి అక్కడ వేదాంతం రాఘవయ్య, వెంపటి పెద్ద సత్యం, పసుమర్తి కృష్ణ మూర్తి వంటి కూచిపూడి వాస్తవ్యులు సినిమా రంగంలో ఉన్నత స్థితిలో వున్నారు.  పేరుతో పాటు డబ్బుకూడా సంపాదించుకొన్నారు.  అయినా వాళ్ళెవరికీ  పట్టలేదు, కూచిపూడి గురించి కాని కూచిపూడి నృత్యం గురించి  కాని.  చిన్న సత్యం వొక్కరే  నిలబడ్డారు.  తన స్కూల్ కి ‘కూచిపూడి ఆర్ట్ అకాడెమి’ అని పేరు పెట్టుకొన్నారు. అది ఎందరికి నాట్య బిక్ష పెట్టిందంటే, ఇప్పుడు  కేవలం డాన్సు మీద ఆధార పడ్డ వాళ్ళయినా, సినిమా వాళ్లయినా సరే, ప్రతివారూ తాము  కూచిపూడి ఆర్ట్ అకాడెమి చిన్న సత్యం గారి శిష్యులమని చెప్పుకునే వారే.


కేంద్ర సంగీత నాటక అకాడెమి 1965 ప్రాంతంలో కూచిపూడి డాన్సును ప్రోత్సహించేందుకు  పాతిక వేల రూపాయిల గ్రాంట్ ఇచ్చి వో నృత్య రూపకం చెయ్యమని కోరింది.  అప్పట్లో బెజవాడ  రేడియో స్టేషన్ లో పనిచేస్తున్న బందా కనకలింగేశ్వర రావు గారి  కృషి ఫలితంగా లభించిన ఈ అవకాశాన్ని అప్పట్లో అందరిలోకి చిన్నవాడయిన చిన్న సత్యంగారికి  అప్పగించారు. దేవుల పల్లి కృష్ణ శాస్త్రి గారు ఇందుకోసం క్షీర సాగర మధనం రూపొందించారు. రజని కాంతరావు  గారు సంగీతం సమకూర్చారనుకొంటా.   మహంకాళి సత్యనారాయణ, వేదాంతం సత్యనారాయణ శర్మ, చింతా కృష్ణ మూర్తి వంటి ఉద్దండులు ఇందులో పాత్రధారులు. బీసెంట్ రోడ్ లోని మోడరన్  కేఫ్ లో వీరందరికీ బస ఏర్పాటు చేసి రిహార్సల్ చేయించే వారు. రోజు వీరంతా వెళుతుంటే లక్ష్మి జనరల్ స్టోర్స్ శిష్ట్లా లక్ష్మీపతి శాస్త్రి గారు కూచిపూడి భాగవతులను  చూసి ‘ఇంత గొప్పవారు చిరిగిన శాలువాలు వేసుకోవడం ఏమిట’ని కొత్త సిల్క్ శాలువాలు ఇచ్చారుట. వీళ్ళంతా కొత్త శాలువాలు  ట్రంక్ పెట్టెల్లో పెట్టుకొని మళ్ళీ చిరిగిన  శాలువాలే వేసుకొని బీసెంట్ రోడ్లో తిరిగేవారుట. ‘అంత అమాయకులు. మావాళ్ళకి ఏమీ తెలియదు’ అంటూ వాపోయే వారు చిన్న సత్యం మాష్టారు.
ఓ సారి శ్రీనివాస కళ్యాణం ప్రోగ్రాం  పెట్టాం మొదటిసారిగా బెజవాడలో. అప్పటికే ఆ నృత్య నాటకానికి ఎంతో పేరు వచ్చింది. రేపు ప్రోగ్రాం  అనగా మాకు ఫోన్ వచ్చింది. ‘పద్మావతి పాత్ర వేసే శోభానాయుడుకి వంట్లో బాగో లేదు. ప్రోగ్రాం పోస్ట్ పోన్ చేసుకోవాల్సింద'ని.  మేమంతా కుదేలయిపోయాము. కొందరేమో 'ఇదో నాటకం' అని తిట్టిపోశారు కూడా.  నెల రోజులు పోయిన తర్వాత పెట్టుకోమన్నారు.  ఈ సారి ఇంకో మార్పు.  శ్రీనివాసుడు వేసే మంజు భార్గవి రావడం లేదు అని. అప్పటికే ఆవిడ సినీ  స్టార్ అని కొంత గ్లామర్  వుంది. ఆవిడా,  శోభానాయుడు అయితేనే ఆ ప్రోగ్రాం  బావుంటుంది.  కాని మాస్టర్ గారికి ఎందుకో ఓ  సినిమాలో ఆవిడ వేషం నచ్చ లేదుట. మంజు భార్గవి కాక క్షేమవతి వేస్తుంది అని చెప్పారు.  మా నిర్వాహకులలో కొందరికి ఈ మార్పు నచ్చలేదు.
‘ప్రోగ్రాం  వద్దే వద్దు’ అన్నారు. కాని ఇది చిన్న సత్యం గారి ప్రోగ్రామాయే. ఎవరు వేసారన్నది ముఖ్యం కాదని ఒప్పించాము. మొత్తం మీద  చాలా చాలా బాగా వచ్చింది.  వేదవతి ప్రభాకర రావు గారు కూడా కనకదుర్గతో కలసి పాడారు. దృశ్య కావ్యం అంటే ఏమిటో చూపించారు.  అయిన తర్వాత మాష్టారు గారికి పది వేల రూపాయిలు ఇస్తే ‘వొద్దు మీ సభకి కార్పస్  ఫండ్ గా వుంచండి’ అని తిరిగి ఇచ్చేసారు.
మళ్ళీ ఎనిమిదేళ్ళ  తర్వాత ‘మంజు భార్గవి శ్రీనివాసుడుగా కావాలన్నారు కదా ఈసారి వేద్దాం’ అన్నారు.  అయితే ఈ సారి శోభానాయుడు లేదు. అలా బెజవాడ  అభిమానులకు శోభానాయుడు మంజు భార్గవి చిన్న సత్యం కాంబినేషన్ లో శ్రీనివాస కళ్యాణం చూసే భాగ్యం కలగలేదు.”  (04-08-2012)


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి