కదిలింది జగన్నాధ రధము
కలయో వైష్ణవ మాయయో అన్నట్టు ప్రభుత్వంలో ఏదో
కదలిక. దాదాపు రెండేళ్ళకు పైబడి నిర్వికారంగా, నిస్తేజంగా, నిస్సత్తువుగా, చేష్టలుడిగి నిష్క్రియాపరత్వానికి నిలువెత్తు నిదర్శనంగా
వున్న రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంలో చిన్న కదలిక.
ఉప ఎన్నికల కదన రంగంలో వరుస పరాజయ పరంపరతో
చావుదెబ్బలు తిని, కన్నులొట్టబోయిన కాంగ్రెస్ పార్టీకి పూర్వ జవసత్వాలు కలిగించే
సంకల్పంతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి
మొదలు పెట్టిన ఇందిరా పల్లె బాటకు జనాలనుంచి నీరాజనాలు లభించకపోయినా
వ్యతిరేకత కూడా పెద్ద స్తాయిలో ఎదురుకాకపోవడం
చాలాకాలం తరువాత కిరణ్ సర్కారుకు దక్కిన ఊరట.
బహుశా రాష్ట్ర కాంగ్రెస్ చరిత్రలో మున్నెన్నడు
కనీ వినీ ఎరుగని స్వేచ్ఛనూ, వాక్స్వాతంత్ర్యాన్ని కాంగ్రెస్ వాదులు
ఈనాడు అనుభవిస్తున్నారనుకోవాలి. పార్టీకి
చెందిన సీనియర్ ఎంపీలు లగడపాటి రాజగోపాల్,
పొన్నం ప్రభాకర్ లు ఇటీవల టీవీ తెరలపై చేసిన మాటల యుద్ధం చూసిన వారికి ఈ అభిప్రాయం కలగడం
సహజం. మెడలో వేసుకున్న మువ్వన్నెల
కాంగ్రెస్ కండువాలను మినహాయిస్తే, వారిద్దరెవరో
తెలియని వారికి ఆ ఇద్దరు ఒకే పార్టీకి చెందినవారంటే నమ్మకం కుదరడం
కష్టం.
రోశయ్యను మార్చి ఆ స్థానంలో కొత్త ముఖ్యమంత్రిని
ఎంపిక చేయాల్సివచ్చినప్పుడు అధిష్టానదేవతలు తెలిసి చేశారో, తెలియక చేశారో కాని
వైఎస్సార్ మంత్రివర్గంలో పనిచేసిన వారికెవ్వరికీ అవకాశం ఇవ్వకుండా అసెంబ్లీ
స్పీకర్ గా వున్న కిరణ్ కుమార్ రెడ్డికి ఆ అవకాశం ఇచ్చారు. ముఖ్యమంత్రిగా వై.ఎస్. తీసుకున్న కొన్ని నిర్ణయాలు
భవిష్యత్తులో పార్టీని డెబ్బతీస్తాయన్న అనుమానంతోనే వై.ఎస్. వద్ద పనిచేసిన మంత్రులెవ్వరికీ రోశయ్య స్తానంలో ముఖ్యమంత్రి
పదవి అప్పగించలేదని భాష్యం చెబుతున్నవాళ్ళు కూడా
వున్నారు.
కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేయడానికి
అధిష్టానం పరిగణన లోకి తీసుకున్న యువకుడు, విద్యాధికుడు అన్న రెండు అంశాలను –
రుజువు చేసుకోవడంలో ఆయన చాలావరకు వైఫల్యం
చెందారనే చెప్పాలి. ఆయనకు ముందు ముఖ్యమంత్రులుగా పనిచేసిన చంద్రబాబు నాయుడు,
రాజశేఖర రెడ్డి వ్యవహార శైలితో పోల్చి చూసుకుని
కిరణ్ పని తీరును అంచనావేయడం సహజంగా జరుగుతుంది. రాష్ట్రంలో ఎక్కడ ఏ
విపత్తు సంభవించినా, ఏ చిన్న సంఘటన జరిగినా - వారిద్దరూ తక్షణం
హెలికాప్టర్ లో రెక్కలు కట్టుకుని వాలిపోయేవారు. ఇలా చేయడం వల్ల సమస్యలు
పరిష్కారమవుతాయా అన్నది సందేహమే. కానీ, ఈ ఆకస్మిక పర్యటనల ద్వారా వారిరువురికీ
ప్రజాదరణ అనే రాజకీయ లబ్ది లభించింది. ప్రజలకు సంబంధించిన ప్రతి అంశం పట్ల వెంటనే
స్పందిస్తారన్న నమ్మకం జనంలో ఏర్పడింది. యువకుడయిన కిరణ్ కుమార్ రెడ్డి
మాత్రం ఈ విషయంలో
అధిష్టానం తన మీద వుంచిన భరోసాను
నిలబెట్టుకోలేకపోయారనే చెప్పాలి. ఇటీవలి కాలాన్ని మినహాయిస్తే , ముఖ్యమంత్రిగా
బాధ్యతలు స్వీకరించిన తరవాత ఆయన ఎక్కువ సమయం సచివాలయంలో, సీ.ఎం. క్యాంప్
కార్యాలయంలోనే గడుపుతూ వచ్చారు. అధికారులతో సమీక్షా సమావేశాలు జరుపుతూ పాలన
సాగిస్తున్నారని ఆయన పార్టీవారే ఎద్దేవా చేస్తుంటారు. క్షేత్ర స్తాయిలో సమాచారం
తెలుసుకోవడానికి ఆయన అధికారులమీదనే ఎక్కువ ఆధారపడతారని కాంగ్రెస్ నాయకులు
బాహాటంగానే చెబుతారు.
నిజానికి ఆయన మంచి సమయంలో ముఖ్యమంత్రి అయ్యారు.
చిన్న వయస్సులో అధిష్టానం ఆయనకు పెద్ద
పదవిని అయాచితంగా అప్పగించింది. ఎన్నికలకు ఇంకా మూడేళ్ళ వ్యవధానం వున్న తరుణంలో
ముఖ్యమంత్రి కావడం వల్ల అనుకున్న పనులు అనుకున్న వ్యవధిలో పూర్తిచేసే అవకాశం
వుంటుంది. పైగా అధిష్టానం మద్దతు పూర్తిగా వుంది. ఏ కాంగ్రెస్ ముఖ్యమంత్రికయినా
ఇది గొప్ప వరం. కిరణ్ ఈ వరాన్ని చక్కగా వినియోగించుకున్న దాఖలాలు లేవని ఆయన సన్నిహితులే పరోక్ష సంభాషణల్లో వొప్పుకుంటూ
వుంటారు.
ఏతావాతా జరిగింది అనవసర కాలయాపన. పుణ్యకాలం
కాస్తా ఉపఎన్నికలతోనే గడిచిపోయింది. ఈ ఉపఎన్నికలకు మూలకారణం వై ఎస్ ఆర్ పార్టీ
అయినప్పటికీ, వాటిని నివారించి, ఘోర పరాభవాన్ని పార్టీ మూటగట్టుకునే అవకాశాన్ని
చేజేతులా కిరణ్ కుమార్ రెడ్డి కల్పించారని ఆయన పార్తీవాళ్ళే అపవాదు వేస్తున్నారు.
ఏ లెక్క ప్రకారం చూసినా వైఫల్య ముఖ్యమంత్రి అనే కితాబును కిరణ్ కు
ఇవ్వకతప్పదని అంటున్నారు. అధిష్టానానికీ ఈ విషయం తెలుసు. కానీ, ముఖ్యమంత్రిని
మార్చడం వల్ల వచ్చే లాభం కన్నా మార్చడం వల్ల ఒనగూడే నష్టం ఎక్కువ అన్న వాస్తవం
తెలుసు కనుక వాళ్ళూ కిమ్మిన్నాస్తిగా వుండిపోతున్నారు. అధిష్టానం నిస్సహాయత, ప్రధాన
ప్రతిపక్షం అయిన తెలుగు దేశం నిష్క్రియాపరత్వం కలసి వచ్చి ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారని కొందరు
భాష్యం చెబుతున్నారు.
నిజమే. ఇప్పుడు
ఆయన ఎదుర్కుంటున్న సమస్యలు అన్నీ ఇన్నీ కావు. కానీ, నమ్మి అధికారం
వొప్పగించిన ప్రజల సమస్యల మాటేమిటి? ప్రజలకు సమస్యలను దూరం చేస్తే వారు పాలకులకు దగ్గరవుతారు. ఇది
చరిత్ర చెప్పే సత్యం.
పదవి తాత్కాలికం అనుకున్నప్పుడు పదిమందికి
శాశ్వితంగా పనికొచ్చేపనులు పదవిని లెక్కచేయకుండా
ధైర్యంగా చేయడానికి వీలుంటుంది. పదవినే శాశ్వితం చేసుకోవాలనుకున్నప్పుడు
నలుగురికీ పనికొచ్చే పనులు చేయడానికి అవసరమయిన సంకల్పం కొరవడుతుంది.
ఇది దృష్టిలో
వుంచుకుంటే సమర్ధవంతమయిన పాలన
సాగించేందుకు మార్గం సులువవుతుంది. (02-08-2012)
సుదూరం లో మంచి జరిగే సావకాశాలు కనపడటం లేదండి.
రిప్లయితొలగించండి