5, ఆగస్టు 2012, ఆదివారం

వెంపటి చిన సత్యం గారి గురించిన మరి కొన్ని విశేషాలు


వెంపటి చిన సత్యం గారి గురించిన మరి కొన్ని విశేషాలు


వెంపటి చిన్న సత్యం గారు చాలా బాగా పాడతారు. మంచి చిత్రకారుడు కూడా. మాస్టర్ గారికి వో బలమైన కోరిక వుండేది, కూచిపూడి నాట్యం మీద  ప్రామాణికమయిన ఓ మంచి  పుస్తకం రాయాలని.  కూచిపూడి నృత్య భంగిమలు, ముద్రలు అన్నీ చాలా బాగా వేసి  నేర్చుకొనే వారికి అర్ధమయ్యేలా ఓ క్రమంలో  పెట్టారు. వాటి ఆధారంగా కూచిపూడి చరిత్ర, నృత్యంపై  పుస్తకం రాయాలని చాలా తపన పడ్డారు.  నాకు ఇంగ్లీష్ రాదు, తెలుగులో చెప్తాను, దాన్ని ఇంగ్లీష్ లో రాయించాలి’ అని నాతో చెప్పారు. ఎస్ ఆర్ ఆర్ కాలేజీలో మా గురువు గారు అండవల్లి సత్యనారాయణ  గారు ఇంగ్లీష్ లో గొప్పగా రాస్తారు కాబట్టి ఆయనే ఇందుకు సమర్ధులని చిన్న సత్యం గారు అనుకొన్నారు. అండవల్లి మాస్టర్ కు సంగీతం డాన్సులో కూడా ఆసక్తి  వుండడంతో ఆయన కూడా ముందుకు వచ్చారు. మరో వ్యక్తి పెమ్మరాజు సూర్యారావు గారు.  బెజావాడ మ్యూజిక్ కాలేజీ ప్రిన్సిపాల్ గా చేసి రిటైర్ అయ్యారు.హిందూ పత్రికకు మ్యూజిక్ రివ్యూ లు రాస్తారు . అలాగే చెన్నై నుంచి వచ్చే శృతి ఇంగ్లీష్ మాస పత్రికకు సీనియర్ కరస్పాండెంట్  కూడా.  అండవల్లి గారు, సూర్యారావు గారు మంచి మిత్రులు.  ఇద్దరు నాకు సన్నిహితులే. సూర్యారావు గారు  వెంపటి వారి టీమ్ లో ‘వోకల్’  పాడే వారు. ఇద్దరు కలసి చిన్న సత్యం గారితో రోజుల తరబడి చర్చలు జరిపే వారు. మద్రాసు బీచ్ లో  కూర్చొని పుస్తకం ఎలా రాయాలా అని తర్జన భర్జనలు పడ్డారు.  మాస్టర్ కోరిక తీరక పోయినప్పటికీ,  అండవల్లి గారు, సూర్య రావు గారు కలసి  చిన్న సత్యం గారి పై ఓ అద్భుతమయిన పుస్తకం ఇంగ్లీష్ లో రాసారు. అదే Mastero with a mission. మాస్టర్ అభిమతానికి అనుగుణంగా అంతర్జాతీయ ప్రమాణాల స్థాయిలో పుస్తకం వచ్చింది.
చిన్న సత్యం గారు నట్టువాంగంతో పాటు అప్పుడప్పుడు మిగతా వారితో కలసి పాడే వారు. ఆయన స్వరం ఎంతో శ్రావ్యంగా వుండేది.   సారి హైదరబాద్  కేశవ్ మెమోరియల్ స్కూల్లో ‘శ్రీనివాస కళ్యాణం’ ప్రోగ్రాం కి పాడవలసిన గోపాలంగారు రాలేదు.  చిన్న సత్యం గారే మొత్తం పాడేసారు,   అప్పుడప్పుడు నట్టువాంగం బాధ్యతని మహంకాళి  మోహన్ కి అప్పచెప్పి. ఏ వెలితి కనపడలేదు. చిన్న సత్యం గారు స్వతహాగా శాంతస్వభావులయినా ప్రోగ్రాం విషయం లో చాలా కఠినంగా వుండేవారు. ఆయన్ని చూస్తే  మొత్తం ఆర్టిస్టులంతా భయభక్తులతో మెలిగే వారు. నలభయిమంది టీంలో ఇరవయి మంది ఆడపిల్లలు వుండేవారు. చాలా మంది పెద్ద ఇంటి పిల్లలే.  మాస్టర్ మీద భరోసాతో ఆడ పిల్లల్ని పంపించే వారు. ఎక్కడా  క్రమశిక్షణకు భంగం కలిగేది కాదు. ఏదయినా  పొరపాటు ఆయన దృష్టికి వస్తే వెంటనే పంపించేసేవారు. ఎవరయినా సరే.  మల్లిక్బి గోపాలం, లోకనాథశర్మ, సూర్యారావు  ఆయన టీంలో పాడేవారు. ఓసారి లోకనాథ శర్మ శ్రద్ధగా పాడలేదని వదిలేసుకొన్నారు. భుజంగరాయ శర్మ పట్రాయని సంగీత రావుగారు, చిన్న సత్యంగారితో చివరిదాక వున్నారు. నృత్యనాటకాలన్నిటికీ  భుజంగరాయ శర్మ స్క్రిప్ట్ అయితే సంగీత రావు గారు మ్యూజిక్ సమకూర్చే వారు. స్క్రిప్ట్ , సంగీతం ఇంటికి వచ్చిన వారందరికీ వినిపించి వారి సలహాలు తీసుకొనే వారు. కనకదుర్గతో పాటు అప్పడప్పుడు వేదవతి ప్రభాకర రావు గారు కూడా పాడే వారు. ఫ్లూట్  నాగరాజన్,  మృదంగం గోవిందరాజన్, సంగీతరావు వీణతో  ఆర్కెస్ట్రా నిర్వహిస్తూ  ప్రోగ్రాంకి ప్రాణం పోసేవారు.  అలాగే మేకప్, లైటింగ్  విషయంలో కూడా రాజీపడేవారు కాదు. చిన్న సత్యం గారు వచ్చేంత  వరకు కూచిపూడి నృత్యాలు చాలా క్రూడ్ గా  ఉండేవి. ఆహార్యం, లైటింగ్, సంగీతం ఇవన్నీ పాత కాలం నాటి పధ్ధతి లోనే. ఎవరికీ పట్టేది కాదు. చిన్న సత్యం గారు కూచిపూడి తుప్పు వదలగొట్టారు.  భరతనాట్యం, ఒదేస్సి, మణిపురి నృత్యాల కంటే  పైమెట్టులో ఉంచారు.  ఆయన చేసిన ప్రయోగాలన్నీ కూచిపూడి గౌరవాన్ని, ఖ్యాతిని పెంచినవే.  మొదట్లో ఆయన్ని విమర్శించిన వారంతా ఇప్పుడు ఆ పద్ధతులే ఫాలో అవుతున్నారు. కూచిపూడి మూల పురుషుడు సిద్ధేంద్ర యోగి ఆయినా చిన్న సత్యం పేరే భావి తరాలకు గుర్తుండి పోతుంది. (శ్రీ ఆర్ వీ వీ కృష్ణారావు గారు.)

2 కామెంట్‌లు:

  1. సంతోషం.
    మీరు ఇక్కడ ప్రచురించిన ఫొటో విజయవాడ త్యాగరాజ కళాసమితి వారి ఉత్సవాలలో తీసినది. ఆ సంవత్సరం వెంపటివారికి సన్మానం చేశారు. మరునాడు ఉదయం వారు సోదాహరణ ప్రసంగం చేశారు. నేను ఉన్నాను ఆ సభలో.

    రిప్లయితొలగించండి
  2. @నారాయణ స్వామి.ఎస్. - ధన్యవాదాలు. ఈ రచన చేసిన ఆర్ వీ వీ గారికి మీ స్పందన తెలియచేస్తాను.-భండారు శ్రీనివాసరావు

    రిప్లయితొలగించండి