6, ఆగస్టు 2012, సోమవారం

సంగీత ధృవ నక్షత్రం – డాక్టర్ శ్రీపాద పినాకపాణి


సంగీత ధృవ నక్షత్రం – డాక్టర్ శ్రీపాద పినాకపాణి 



డాక్టర్లకే పాఠాలు చెప్పే డాక్టర్. కర్నాటక సంగీతాన్ని ఆపోసన పట్టిన ఘనాపాఠీలకే గుగ్గురువు. బాడీ బిల్డర్. వెయిట్ లిఫ్టర్. ఇలా ఒక్కొక్క రంగంలో నిష్ణాతులయిన వాళ్లు కానవస్తూనే వుంటారు. అయితే వీటన్నింటినీ పుణికి పుచ్చుకుని అందరిచేతా ఔరా అనిపించుకుంటూ నిండు నూరేళ్ళ జీవితాన్ని గడుపుతున్న  అరుదయిన వ్యక్తే  డాక్టర్ శ్రీపాద పినాకపాణి. బహుముఖ ప్రజ్ఞాశాలి. తెలుగుగడ్డ గర్వించదగిన  పదహారణాల తెలుగుబిడ్డ.
ఆగస్టు మూడోతేదీ శుక్రవారం నాడు కర్నూలు పట్టణంలో ఈ శతవసంత సంగీతకారుడి సత్కార కార్యక్రమం ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్తానం తరపున ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ ఎల్ వీ సుబ్రహ్మణ్యం  అక్షరాలా పదిలక్షల వెయ్యినూటపదహార్ల చెక్కును పినాకపాణి గారికి అందించారు. ‘గాన విద్యా వారధి’ అనే బిరుదుతో సత్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున న్యాయశాఖ  మంత్రి శ్రీ ఏరాసు ప్రతాపరెడ్డి, సాంస్కృతిక వ్యవహారాల శాఖ డైరెక్టర్ శ్రీ రాళ్ళబండి కవితాప్రసాద్ – శ్రీ పినాక పాణికి స్వర్ణ కంకణం బహుకరించారు.  శ్రీయుతులు నేదునూరి కృష్ణ మూర్తి, మల్లాది సూరిబాబు వంటి సంగీత విద్వాంసులు అనేకమంది శ్రీ పాద పినాకపాణి శత వసంత ఉత్సవంలో పాల్గొన్నారు. కొంత ఆలస్యంగా అయినా సంగీత ధృవ నక్షత్రాన్ని గుర్తించి గౌరవించిన  సందర్భాన్ని పురస్కరించుకుని శ్రీ పినాకపాణితో తన అనుభూతులను శ్రీ ఆర్ వీ వీ కృష్ణారావుగారు మననం చేసుకుంటున్నారిలా.            
“మీకు సంగీతం బాగా ఇష్టం కదా.  తెలుగు నాట మీకు ఏ విద్వాంసులు ఇష్టం అని వో సారి వొకాయన నన్ను అడిగారు. వెంటనే డాక్టర్ శ్రీపాద పినాక పాణి అని చెప్పాను.  పాణి గారు ఎంత గొప్పవారో మాటల్లో చెప్పడం కష్టం. నేను మొదటి సారి పాణి గారిని చూసింది 1968  లో.
“రాజధానీ నగరంలో  రెండు సంగీత కళాశాలలు వున్నాయి. ఒకటి సికింద్రాబాద్ లో, రెండోది హైదరాబాద్ లో. సికింద్రాబాద్ కాలేజీకి నూకల చిన్న సత్యనారాయణ గారు ప్రిన్సిపాల్ అయితే, హైదరాబాద్ కాలేజీకి హిందుస్తానీ విద్వాంసులు దంతాలే గారు ప్రిన్సిపాల్. అప్పట్లో రెండు  కాలేజీలు కలసి రవీంద్రభారతిలో  త్యాగరాజ స్వామి ఉత్సవాలు చేసేవారు.  ఉదయం నుంచి ప్రసిద్ధ విద్వాంసుల కచేరీలు మొదలయ్యేవి. ఇక రోజంతా అక్కడే గడపడం. పక్కనే వున్న  గోపి హోటల్లో టిఫినూ, భోజనమున్నూ. 
“ఈ ఉత్సవాల్లో ఓ  రోజు సంక్రాంతి వచ్చింది.  ఆవేళ  ఉదయం పదకొండు గంటలకు కోటి శ్రీ కృష్ణదేవరాయ ఆడిటోరియం లో పినాకపాణి గారి సోదాహరణ ప్రసంగం,  కర్ణాటక సంగీతంలో  నెరవు (అరవంలో నెరవల్) స్వరకల్పన  ఈ రెండింటిపై . ఆ రోజు హాజరు కాని సంగీత అభిమానులది దురదృష్టమనే చెప్పాలి.  నాలుగు గంటలకు పైగా పాణి గారు అద్భుతమైన  ప్రసంగం చేసారు.  కళ్యాణి రాగంలో ‘మది దేహి’ అనే కీర్తనలో ‘పతిత పావన’ అనే చోట  నెరవు, స్వరకల్పన గురించి.  నిజంగా అమ్మవారు ప్రత్యక్షమైన  అనుభూతి కలిగింది అందరికి.  పండగ విందు అక్కడే దొరికింది.  ఇల్లస్ట్రేటెడ్  వీక్లీ  పినాక పాణి మీద కవర్ పేజి స్టొరీ ఇచ్చింది.  జి ఎన్ ఎస్ రాఘవన్ గారు రాసారు. తదనంతర కాలంలో  ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసులో చేరిన నాకు రాఘవన్  దగ్గర పని చేసే అవకాశం లభించింది.  ఆయన ఆకాశవాణి  వార్తా విభాగానికి డైరెక్టర్ గా పని చేసారు.  ఆయనకు పినాకపాణి సంగీతం అంటే అమిత ఇష్టం.  టూర్ వేసుకొని ఆంధ్రకు వచ్చి కర్నూలు  వెళ్లి ఆయనతో గడిపే వారు.
“మ్యూజిక్ అకాడెమి పాణి గారిని  ‘సంగీత కళానిధి’ బిరుదుతో సత్కరించింది. భారత ప్రభుత్వం ‘పద్మ విభూషణ్’ పురస్కారంతో గౌరవించింది.   పినాక పాణి గారికి రావలసిన సత్కారాలన్నీ వచ్చాయి. దీనితో పాటు  భగవదనుగ్రహం కూడా.   నూరేళ్ళు పూర్ణాయుర్దాయం  లభించింది.  నేదునూరి, నూకల, వోలేటి, గోపాలరత్నం వంటి శిష్యులు, మల్లాది సూరిబాబు, శ్రీరామ్, రవి కుమార్ వంటి ప్రశిష్యులు ఆయన బాణీ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఇంతకన్న  కావల్సినదేముంటుంది ?  1990 లో ఆయనకు  తొంభయి ఏళ్ళు పూర్తయిన సందర్భంలో కర్నూలులో  కొంత మంది విద్వాంసులు వెళ్లి ఆయనకు పాద పూజ చేసారు. ఆయన పాడిన ఓ  కచేరి సీడీగా తెచ్చారు.
“పినాకపాణి గారికి కొన్ని నిర్దిష్టమయిన  ప్రమాణాలు వున్నాయి. వాటితో రాజీపడే వారు కారు.  బెజవాడలో  మా సభ త్యాగరాజ సంగీత కళా సమితి  తరఫున ఆయన్ని  1986 లో ఘనంగా సత్కరించాము.  అప్పుడు ఆయన ధర్మపురి రామమూర్తి తో కలసి కర్నూలు  నుంచి బస్సులో వచ్చారు. సన్మానం అయిన తర్వాత  సుధారఘునాథన్ కచేరి పెట్టాము.  చివరి దాక కూర్చున్నారు.  మర్నాడు కూడా వున్నారు.  ఆ రోజు మరో ప్రసిద్ధ విద్వాంసులు మహారాజపురం సంతానం కచేరి. కచేరీకి  రమ్మనమని పిలిచాం. రానని మొండి కేసారు. ఎందుకని అడుగుతే ‘వాడు డబ్బు మనిషి. విద్వత్తుని  నిర్మొహమాటం గా అమ్ముకుంటున్నాడు. వాడు ఎంత గొప్పగా పాడినా అనవసరం’ అని అన్నారు. ఇక సంగీతానికి వస్తే ‘అసలయిన సంగీతం   కావేరి నది వొడ్డున వుంది’ అని చెప్పారు.  అందుకనే కాబోలు  ‘పాణి  గారిది తంజావూరు బాణీ’ అంటారు. ‘మీ గురువు ఎవర’ని అడిగితే ‘నా తల్లి’ అని చెపుతూ వుంటారు.  చిన్నప్పుడు తల్లి పాడే తరంగాలు, ఆధ్యాత్మ రామాయణ కీర్తనలే,   డాక్టర్ అయిన తనని సంగీతం వయిపు లాక్కుని వెళ్లాయని పాణి గారు చెపుతూ వుంటారు. సంగీతం ఆంధ్ర దేశంలో వ్యాప్తి చెందాలంటే వొకే వొక సూత్రం ఉందంటారు పాణి గారు. ప్రతి వూళ్ళో దేవాలయంలో ప్రాతః కాలంలో నాదస్వరం వాయిద్యం విని పించాలన్నది ఆయన కోరిక. నాదస్వరానికి మించింది మరోటి లేదన్నది ఆయన విశ్వాసం. ఉదయం పూట నాదస్వరం వింటే సంగీతంపై  అభిమానం కలుగుతుందని,  అప్పుడే తెలుగు నాట కర్నాటక సంగీతం వైభవంగా పరిఢవిల్లుతుందని అనే వారు. 
‘శతాయుష్మాన్ భవ’ అని దీవిస్తారు. కోటికి వొకరి కూడా లభ్యం కాని ఆ అదృష్టం పినాకి పాణి గారికి భగవంతుడు ప్రసాదించాడు. దానితో పాటే మనందరికీ మరో వరం అనుగ్రహించాడు. అదేమిటంటే ఆయనకు సమకాలికులుగా మనగలిగిన మహద్భాగ్యం. (06-08-2012)

5 కామెంట్‌లు:

  1. పోస్ట్ శ్రీపాద వారిది ఫోటో నేదునూరి వారిది. ఫోటో క్రింద వారి పేరు వుంటే పాఠకులు పొరపడుతారు.

    రిప్లయితొలగించండి
  2. @Alapati ramesh Babu - క్షంతవ్యుడిని.నలభయ్ ఏళ్ళ నాటి ఇల్లస్త్రేటెడ్ వీక్లీ కవర్ పేజీ ఫోటోకోసం జరిగిన వెతుకులాటలో జరిగిన పొరబాటది.- భండారు శ్రీనివాసరావు

    రిప్లయితొలగించండి
  3. @sbmurali and @ subbalakshmi chepuru - ధన్యవాదాలు.- భండారు శ్రీనివాసరావు

    రిప్లయితొలగించండి