నీతి కధలో నీతి
లోక్ సభలో ప్రభుత్వ పనితీరుపై చర్చ జరుగుతోంది.
పాలక పక్షానికి చెందిన సభ్యుడు ప్రభుత్వాన్ని
ప్రశంసిస్తూ అనర్ఘళంగా ప్రసంగిస్తున్నాడు.
‘మేడం స్పీకర్! మీ అనుమతితో నేనొక చిన్న కధ
చెప్పదలచుకున్నాను.
‘అనగనగా ఓ ఊర్లో
ఓ తండ్రి. అతడికి ముగ్గురు కొడుకులు. కొడుకుల ప్రయోజకత్వాన్ని పరీక్షించడానికి
తండ్రి ముగ్గురు కుమారులకు తలా వంద రూపాయలు ఇచ్చాడు. ఇచ్చి చెప్పాడు.
‘ఇదిగో ఈ
వందా తీసుకువెళ్ళి ఏదయినా సరుకు కొనుక్కు రండి. మీరు తెచ్చిన దానితో ఈ గది
నిండిపోవాలి సుమా!’ అని షరతు కూడా పెట్టాడు.
‘పెద్దవాడు
వెంటనే వెళ్లి ఆ వందతో వరిగడ్డి
కొనుక్కుని తెచ్చాడు. వాస్తవానికి ఎక్కువే
వచ్చింది కాని అతడు తెచ్చిన గడ్డితో ఆ గది
పూర్తిగా నిండలేదు.
‘రెండోవాడు
వంద రూపాయలు పెట్టి బోలెడు దూది పట్టుకు
వచ్చాడు. కానీ దానితో కూడా గది పూర్తిగా
నిండలేదు. కొంత ఖాళీ మిగిలి పోయింది.
‘మూడోవాడు
తన తెలివిని ఉపయోగించి వంద రూపాయల్లో ఒకే ఒక రూపాయి ఖర్చుచేసి ఒక కొవ్వొత్తి
కొనుక్కుని తెచ్చాడు. దాన్ని వెలిగించగానే ఆ వెలుతురుతో గది నిండిపోయింది.’
కధ పూర్తిచేసిన కాంగ్రెస్ సభ్యుడు మరో వాక్యంతో తన
ప్రసంగాన్ని ముగించాడు.
‘చూశారా! దేనికయినా తెలివితేటలు కావాలి. మన ప్రధాని కూడా అచ్చం ఈ
కధలోని మూడో కుమారుడిలాటివాడు. ఆయన పదవీ ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుంచి
మనదేశం యావత్తూ ఆయన మేధస్సు వెలిగించిన
కాంతి సంపదతో నిండిపోతోంది.”
సాటి పాలక సభ్యుల హర్షధ్వానాల నడుమ ఆయన కాలరు
ఎగరేస్తూ తన సీటులో కూర్చోబోతున్న తరుణంలో
సభలో ఒక మూలనుంచి ఎవ్వరో సన్నగా గొణిగారు.
“దేశం వెలిగిపోవడం సంగతి సరే! మరి మిగిలిన తొంభయి తొమ్మిది రూపాయలు
ఏమయినట్టు? ఎవరి జేబులోకి వెళ్లినట్టు?”
(07-05-2012)
:)
రిప్లయితొలగించండి