కాశీ సమారాధన - 1
(కొత్త సీరియల్
ప్రారంభం – ఆదివారం స్పెషల్)
మా బామ్మ గారు
రుక్మిణమ్మ గారు ఏ వయసులో కాశీ యాత్ర చేసివచ్చారో తెలియదు కాని అప్పుడు నేను చాలా చిన్నవాడిని. ఆవిడ రెండోసారి వెళ్లి
వచ్చినప్పుడు మాత్రం నన్ను వెంట తీసుకువెళ్ళకుండా మా మూడో అన్నయ్య శ్రీ వేంకటేశ్వర
రావును తోడు తీసుకు వెళ్లడం, నాకు కోపం
వచ్చి వాళ్లు వెడుతున్న ఎడ్లబండికి అడ్డం
పడుకోవడం, కాసేపటికి మా పెద్దన్నయ్య శ్రీ పర్వతాలరావు వచ్చి గదమాయించి నన్ను
ఇంటికి తీసుకుపోవడం బాగా గుర్తు. మా బామ్మ గారు కాశీ యాత్ర చేసి తిరిగివచ్చిన తరువాత
నేరుగా ఇంటికి రాకుండా వూరి నడుమ వున్న ముత్యాలమ్మ గుడి రావి చెట్టు వద్ద విడిది
చేసేవారు. వూళ్ళోని వాళ్లందరూ గుమికూడి ఆమెను, ఆమె వెంట కాశీ వెళ్లి వచ్చిన వారిని
మేళ తాళాలతో వూరేగింపుగా ఇంటికి తీసుకువచ్చేవారు. తరువాత కాశీ సమారాధన చేసి
వూరబంతి (వూళ్ళోని వారందరికీ సామూహిక భోజనం) పెట్టి యాత్రావిశేషాలను పూసగుచ్చినట్టు
చెప్పేవారు. వూరిజనమంతా వొళ్ళంతా చెవులు చేసుకుని వింటూ వారే కాశీ పోయివచ్చినంతగా
మహాదానందపడేవారు.
ఆ తరువాత కాశీ
గురించి విన్నది, కన్నది ఏనుగుల వీరాస్వామయ్య గారు రాసిన కాశీ యాత్ర పుస్తకంలోనే.
అది ఎన్నివందల సార్లు చదివిందీ నాకే గుర్తులేదు. ముఖ్యంగా శ్రీశైలం అడవిబాటలు, ఆనాటి
హైదరాబాదు విశేషాలు చదువుతున్నప్పుడు అంత కష్టపడి యాత్ర చేసింది ఆ పుస్తకం చదివే మన
అందరికోసం అనిపించింది. అప్పటి సంగతులను
కళ్ళకు కట్టినట్టు అందులో రాసిన విధానం ఎంతగానో ఆకట్టుకునే తీరుగా వుంది. ‘ఏదో
తిరిగాము, తిన్నాము’ అన్నట్టుగా కాకుండా ఆ నాటి ఆచార వ్యవహారాలను, సాంఘిక
స్తితిగతులను విడమరచి చెప్పడం ద్వారా యాత్రాకధనాలకు ఆయన ఒక విశిష్టతను ఆపాదించి
పెట్టారు.
దరిమిలా మరో రెండు
సార్లు కాశీ వెళ్లాను. మా బావగారు కౌటూరు కృష్ణ మూర్తి గారు చనిపోయినప్పుడు
అస్తికలను గంగలో కలపడానికి ఆయన పెద్ద
కుమారుడు దుర్గాప్రసాదరావుతో పాటు నేను కూడా తోడుగా కాశీ వెళ్లాను. 1993 శ్రావణ మాసంలో మా
అమ్మగారు వెంకట్రావమ్మగారు పరమపదించినప్పుడు మరోసారి కాశీ వెళ్లాను. నిజం
చెప్పాలంటే ఆ యాత్ర మా జీవితంలో నభూతో నభవిష్యతి. ఆమె చనిపోయిన రెండో రోజే కర్మకాండ గురించిన చర్చల్లో మా పెద్దన్నయ్య
కీర్తిశేషులు భండారు పర్వతాలరావు గారు కాశీ ప్రసక్తి తేవడం, అందరం మరో మాట లేకుండా
ఆయన మాటకు సరే అనడం, అమ్మ సంతానానికి చెందిన సుమారు ముప్పై మందిమి కాశీ బయలుదేరడం అంతా
ఓ కలలా జరిగిపోయింది. అంతమందికి అంత తక్కువ వ్యవధిలో రైలు రిజర్వేషన్లు దొరకడం,
పదహారేళ్లనుంచి పండు ముదిమిలో వున్నవారివరకు వెనుకంజ వేయకుండా కాశీ యాత్రకు సంసిద్ధులు
కావడం, ఎలాటి ఇబ్బందీ ఎదురుకాకుండా అందరం కాశీ, ప్రయాగ, గయ మొదలయిన పుణ్య
క్షేత్రాలను సందర్శించి మా అమ్మగారికి సంబంధించిన కర్మ కాండలను అన్నింటినీ
సక్రమంగా పూర్తిచేసుకుని భద్రంగా ఇళ్లకు చేరడం, మొదటి మాసికాన్ని మా వూరు
కంభంపాడులో మా మూడో అన్నయ్య, కీర్తిశేషులు భండారు వేంకటేశ్వర రావు గారు తన సంకల్ప
బలంతో, అత్యల్ప స్వల్ప వ్యవధానంలో నిర్మించిన ‘అమ్మా నాన్నల గుడి’ వద్దే, సమస్త వూరిజనం నడుమ, వివిధ ప్రాంతాలలోనె
కాకుండా, అనేక రాష్ట్రాల్లో స్తిరపడ్డ అశేష బంధు జనం సమక్షంలో ‘ఒక పెళ్లి వేడుక’
మాదిరిగా నిర్వహించడం అంతా ‘అమ్మ’ చలవ వల్లే సాధ్యపడింది. ఆ సందర్భంలో మేనల్లుడు
కౌటూరు దుర్గాప్రసాదరావు ప్రచురించిన ‘అమ్మ’ పుస్తకంలో చిన్నా పెద్దా అందరూ రాసిన
సంస్మరణ కవితలు అబ్బుర పరిచేవిగా వున్నాయి. ఈ పుస్తకంలోనే మా ఐదో అక్కయ్య కొమరగిరి
అన్నపూర్ణ ‘కాశీ యాత్రా విశేషాలను’ కళ్ళకు కట్టినట్టు రాసిన కధనాన్ని పొందుపరచడంతో
ఆ పుస్తకానికి ఎక్కడలేని ఆదరణ లభించింది. అందుకే ఏ కొలమానాన్నిబట్టి చూసినా ‘ధన్యజీవి’ మా అమ్మ.
ఇప్పుడు ఇన్నేళ్ళ
తరువాత, మళ్ళీ - ఆకాశవాణి పూర్వ సంచాలకులు వేమూరి విశ్వనాధ
శాస్త్రి దంపతుల పూనికపై, వారి సారధ్యంలోనే కిందటి నెలలో నేనూ మా ఆవిడా ఇంకోసారి
కాశీ యాత్ర చేసే అవకాశం లభించింది. కాకపొతే ఈ సారి కాశీతో పాటు, కలకత్తా, అయోధ్య,
బైధ్యనాద్ వంటి ప్రదేశాలను కూడా సందర్శించడం జరిగింది.
ఆ విశేషాలు
తెలియచెప్పే ఉద్దేశ్యంతోనే – ఇదిగో ఈ ‘కాశీ సమారాధన.’
(గమనిక – ఈ అంశంపై
ఆసక్తి కలిగిన పాఠకుల సౌలభ్యం కోసం, ‘కాశీ సమారాధన’ తాజా భాగాలను ‘ప్రతి ఆదివారం’
పోస్ట్ చేస్తుంటాను.- భండారు శ్రీనివాసరావు)
చక్కటి ప్రయత్నం చేస్తున్నారు. మీకు కృతజ్ఞతలండి.
రిప్లయితొలగించండి@anrd - ధన్యవాదాలు - భండారు శ్రీనివాసరావు
రిప్లయితొలగించండినేను చిన్నప్పుడు చదివాను , పలివెల సుబ్బారావు పెద్దనాన్న వాళ్ళ ఇంట్లో . This very nice travellog with all relatives photos
రిప్లయితొలగించండి@Krupal Kasyap - ధన్యవాదాలు. శ్రీ పలివెల సుబ్బారావు గారి భార్య జయ నా మేనకోడలు. ఆమె 'అమ్ముమ్మ'ను గురించి రాసిన కవిత కూడా ఆ పుస్తకంలో వుంది. - భండారు శ్రీనివాసరావు
రిప్లయితొలగించండిచాలా బాగుంది. మీరు పేర్కొన్న అమ్మ పుస్తకం లోని రచనలన్నీ కూడా మాకు చదివే అవకాశం కల్పించగలరా? మా చిన్నప్పుడు మా తాతగారూ నాయనమ్మా వాళ్లూ (1945 ప్రాంతంలో) కాశీ యాత్రనుంచి తిరిగి వచ్చినప్పుడు బేండు మేళాలతో ఊరేగిస్తూ వారిని స్టేషను నుంచి తీసుకు రావడం తర్వాత జరిగిన కాశీ సమారాధన నాకు లీలగా గుర్తున్నాయి
రిప్లయితొలగించండిమా అమ్మమ్మా వాళ్ళు వెళ్ళి వచ్చినప్పుడు ఈ కాశీ సమారాధన చేశారు. అప్పుడు చూశాను. కాలభైరవ పూజ, గోదావరీ పూజ (గంగను గోదావరిలో కలపటం) అన్నీను. అన్నట్టు కాశీ వెళ్ళి వచ్చిన వాళ్ళ కాళ్ళకి (వాళ్ళు కాళ్ళు కడుక్కోకుండా) నమస్కారం చేస్తే మనకి కూడా కాశీ వెళ్ళి వచ్చినంత ఫలితం అంటారు కదూ!
రిప్లయితొలగించండి