31, మార్చి 2012, శనివారం

మార్పు చూసిన కళ్ళు – మాస్కో అనుభవాలు


మార్పు చూసిన కళ్ళు – మాస్కో అనుభవాలు

ఆస్తాంకినో టీవీ టవర్



అక్టోబర్ విప్లవం యాభయ్యవ వార్షికోత్సవానికి గుర్తుగా 1772 అడుగుల ఎత్తయిన ఈ ఆస్తాంకినో టవర్ ను మాస్కో రేడియో, టెలివిజన్ లకోసం  మాస్కోలో నిర్మించారు. దీని నిర్మాణం 1963  లో మొదలయి 1967   లో పూర్తయింది. అప్పట్లో ఎత్తయిన నిర్మాణాల్లో మొదట చెప్పుకునే అమెరికన్ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ కన్నా ఎత్తులో ఇది 43 అడుగులు పెద్దది. తొమ్మిదేళ్ళ తరువాత కెనడాలో సీఎన్ టవర్ నిర్మించేంతవరకు ఈ రికార్డ్ ఆస్తాంకినో ఖాతాలోనే వుండిపోయింది. ఆ తరువాత ఎత్తయిన నిర్మాణాలు అనేక దేశాల్లో మొదలయి ఆస్తాంకినో రికార్డ్ మరుగున పడిపోయింది. ప్రచండమయిన పెనుగాలు వీచే పరిస్థితుల్లో ఈ టవర్ పై భాగం కొన్ని మీటర్లు అటూ ఇటూ వొరిగిపోతూ మళ్ళీ సర్దుకునే విధంగా దీని నిర్మాణాన్ని డిజైన్ చేశారు.  పొడవాటి తాటిచెట్లు విపరీతమయిన గాలి తాకిడికి అటూ ఇటూ వూగిపోతూ వుండడం చూసిన వారికి దీనిలోని ప్రత్యేకత సులభంగా అర్ధమవుతుంది. ఈ టవర్ ను కొన్ని విభాగాలుగా చేసి మధ్య మధ్యలో రెస్టారెంట్లు మొదలయినవి ఏర్పాటు చేశారు. మా కుటుంబం భారత దేశానికి తిరిగి వస్తున్న సందర్భంలో హిందుస్తానీ సమాజ్ వారు అంత ఎత్తున వీడ్కోలు విందు ఏర్పాటు చేయడం మరపురాని మరో అనుభూతి.


మబ్బుల్ని చీల్చుకుని కానవస్తున్న టీవీ టవర్ 


ఈ రెస్టారెంట్లలో టేబుల్ ముందుగా బుక్ చేసుకోకపోతే ప్రవేశం దుర్లభం. అక్కడి ధరలు సాధారణమయినవే కాని అంత ఎత్తులో విందు చేయడం అన్నది ఒక మహత్తర అనుభూతి కాబట్టి  వాటికి పర్యాటకుల  తాకిడి ఎక్కువగానే వుంటుంది. కాకపోతే మాస్కో రేడియోలో పనిచేసే  విదేశీయులు తమ ఆఫీసు ద్వారా బుకింగ్ చేసుకునే సౌలభ్యం వుంది.
‘ఎవరూ ఎక్కువ తక్కువ కాదు. అందరూ సమానమే కాకపొతే వారిలో కొంతమంది ఎక్కువ సమానం’ అన్న ఆనిమల్ ఫాం రచయిత సోవియట్ల సమానత్వం గురించి చేసిన వ్యాఖ్యలో కొంత నిజం లేకపోలేదు. డాలర్లు చెల్లించే విదేశీయులకోసం  కోసం మాస్కోలో ప్రత్యేక హోటళ్ళు వున్నాయి. పాశ్చాత్య దేశాల్లోని హోటళ్లకు తగ్గట్టుగా అవి చాలా డాబుసరిగా వుంటాయి. అందులో పనిచేసేవారు ఇంగ్లీష్ తెలిసిన రష్యన్లు. సాధారణ రష్యన్ పౌరులు అందులో వాటిల్లో అడుగు పెట్టే వీలు లేదు. విదేశీ అతిధులను  తీసుకువచ్చే టాక్సీ డ్రైవర్లు కూడా హోటల్ గుమ్మం దగ్గరే ఆగిపోవాలి. అల్లాగే సోవియట్ యూనియన్ సందర్శనకు వచ్చే ఇతర దేశాల కమ్యూనిస్ట్ నాయకులు షాపింగ్ చేయడం కోసం ప్రత్యేక దుకాణాలు వున్నాయి. ప్రపంచంలో దొరికే అన్నిరకాల వస్తువులు అక్కడ అమ్ముతారని చెప్పుకునే వారు. పైగా వాటిని విదేశీ కరెన్సీ లో కాకుండా స్తానిక కరెన్సీలో కొనుగోలు చేసుకునే సౌలభ్యం వుంది. అయితే,  వాటిల్లో  ప్రవేశం అంత సులభం కాదు. ప్రత్యేకించి రష్యన్లకి. కొందరికే కొన్ని కాకుండా అందరికీ అన్నీ అనే సిద్ధాంతంతో మొదలయిన సామ్యవాదం చివరికి కాలక్రమంలో భ్రష్టు పట్టడానికి ఇలాటి అవకరాలన్నీ దోహదం చేసాయని అక్కడ చాలాకాలంగా వుంటున్న వారు చెప్పుకోగా విన్నాను.         

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి