1, ఏప్రిల్ 2012, ఆదివారం

మాస్కోలో చలిమంటలు


మాస్కోలో చలిమంటలు

ముందు గొయ్యి వెనుక నుయ్యి అనే సామెత ఒక రోజు మాకు అనుభవంలోకి వచ్చింది. ఆ రాత్రి మేము భోజనం చేసి టీవీ లో మహాభారతం కేసెట్ వేసుకుని చూస్తుంటే పై అంతస్తులో వున్న జస్వంత్ సింగు గారి భార్య ఫోను చేసి ఓ కబురు చెవిలో వేసింది. వినగానే యెగిరి గంతు వేయాల్సిన విషయం కాదు కానీ నిజంగానే  ఇంటినుంచి గంతు వేయాల్సి వచ్చింది. ఇంతకీ  ఆవిడ అందించిన సమాచారం ఏమిటంటే- రేడియో మాస్కో భవనం అంటే మేముంటున్న అపార్ట్ మెంటు లో అగ్నిప్రమాదం జరిగిందట. మంటలను ఆర్పేందుకు సిబ్బంది వచ్చారట. పైకి నిచ్చెనల మీదుగా వచ్చి కిటికీ తలుపు మీద కొట్టినప్పుడు వాటిని తీస్తే మమ్మల్నిజాగ్రత్తగా  కిందకు దింపుతారట. ఇదెక్కడి గోలరా అనుకుంటూ ఆదరాబాదరాగా పిల్లల్ని లేపుతుంటే మళ్ళీ ఫోను. కంగారులో వున్నపలాన  కిందికి  దిగేయకండి. బయట గడ్డకట్టే చలి. వీధిలోకి పోయేటప్పుడు యెలా వెడతామో ఆ మాదిరిగా  అన్ని ఉన్ని దుస్తులు   వేసుకుని, కోట్లూ టోపీలు ధరించి   సిద్ధంగా వుండండని  మరో హెచ్చరిక.
ఒకవైపు నిప్పంటుకున్నదని భయపడాలా లేక పెళ్ళికి వెడుతున్నట్టు తయారు కావాలా. ఏదయితేనేం భయపడ్దంత ఏమీ జరగలేదు. ఆ భవనంలో ఎక్కడో ఏదో చిన్నపాటి అగ్గి రాజుకుని పొగ రావడం, దాన్ని పసికట్టిన అలారం దగ్గర్లో వున్న  ఫైర్ స్టేషన్లో మోగడం, వాళ్లు హడావిడిగా  రావడం జరిగింది. బహుశా అప్పుడప్పుడలా వూహించని  దుర్ఘటనలు సంభవిస్తే యెలా సంసిద్ధంగా వుండాలో పౌరులకు నేర్పే ప్రక్రియలో భాగంగా అలా చేసారో కూడా తెలియదు.





ఎవరెడీ


ఆ రోజు ఏమీ జరక్కపోయినా మాస్కో జీవితంలో మరో కోణం మాకు దృగ్గోచరమయింది. పౌరుల ప్రాణాల పట్ల అక్కడి పాలకులు తీసుకుంటున్న శ్రద్ధ ఈ సంఘటన రూపంలో మరోమారు ఆవిష్కృత మయింది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి