30, మార్చి 2012, శుక్రవారం

మార్పు చూసిన కళ్ళు - (అలనాటి మా మాస్కో అనుభవాలు-పద్దెనిమిదో భాగం) – భండారు శ్రీనివాసరావు


మార్పు చూసిన కళ్ళు (అలనాటి మా మాస్కో అనుభవాలు-పద్దెనిమిదో భాగం) – భండారు శ్రీనివాసరావు
పాలయినా పెట్రోలయినా ఒకటే ధర 
ఎముకలు కొరికే చలిలో ఏమి చెయ్యాలనిపిస్తుంది నాకయితే ఇంట్లో కూర్చుని వేడి వేడి పకోడీలు తింటూ రేడియోలో పాత పాటలు వినాలనిపిస్తుంది.




 కానీ రష్యన్లు చలి ముదురుతున్న కొద్దీ చల్లటి బీరు తాగాలనోఇంకా చలచల్లటి ఐస్ క్రీములు తినాలనో ఉత్సాహపడతారు. మంచుకురిసే వేళలో  ఆపాదమస్తకం ఉన్ని దుస్తులు ధరించి ఐస్ క్రీములకోసం ఆడామగాపిల్లాపెద్దా తేడాలేకుండా వీధి దుకాణాల ముందు ఆరుబయట  బారులుతీరి నిలబడే రష్యన్లను చూసి ఆశ్చర్యపోయేవాళ్ళం. ఆనాటి మాస్కోలో ఎక్కడికిపోయినా ముందు కనిపించేవి పెద్ద పెద్ద క్యూలే. ఆఖరికి  పాలుకొనాలన్నాపెరుగుకొనాలన్నా క్యూలను తప్పించుకోలేము. ధరాభారం లేకపోవడంవల్లనోమళ్ళీ ఈ చలిలో బయటకు రావడం ఎందుకనో, అవసరంవున్నా లేకపోయినా ప్రతివస్తువును దొరికినప్పుడే కొనుక్కోవడం మంచిదనో  కారణం ఏదయితేనేమి కానీ ప్రతిచోటా పెద్ద పెద్ద క్యూలు దర్శనమిస్తాయి. ఉత్పాదక  వ్యయంతో నిమిత్తం లేకుండా ప్రజల అవసరాలనుబట్టి ధరలను బాగా అదుపులో వుంచడంవల్ల  కొనుగోలు శక్తి బాగా పెరిగిపోయివారు చేసే అనవసర కొనుగోళ్ళతో కృత్రిమ కొరతలు ఏర్పడిఏది ఎప్పుడు దొరుకుతుందో తెలియని పరిస్తితి ఏర్పడిందని మాస్కోలో చాలా కాలం నుంచి వుంటున్న మా తోటి ఉద్యోగులు చెబుతుండేవారు. మాటవరసకు పాల విషయమే తీసుకుందాం. ప్రతి నివాసానికి చేరువలోనే పాలుపాల ఉత్పత్తులు అమ్మే ప్రోదుక్తి’ దుకాణం వుంటుంది. పాలు లీటరు ముప్పయి కోపెక్కులు. ఇంత చలిలో మళ్ళీ ఏం వస్తామనుకునే బద్దకస్తులు అవసరానికి మించి కొనుగోలుచేసేవారు. వాడకానికి పోను మిగిలిన పాలను డస్ట్ బిన్ లో పారేసి మర్నాడు  మళ్ళీ కొనుక్కునేవాళ్లను చూసాము. ధర బహు తక్కువగా వుండడం వల్ల ఇలా దుబారా జరుగుతోందని చెప్పుకునేవాళ్ళు. అలాగే పెట్రోలు. లీటరు పాల ధరలీటరు పెట్రోలు ధర ఒకటే విధంగా వుండడం ఆ దేశంలోనే చెల్లు. ట్యాంకు నిండిన తరవాత పెట్రోలు లీటర్లకు లీటర్లు కారిపోతున్నా చోద్యం చూస్తూ నిలబడేవాళ్ళు, ఒకటో రెండో రూబుళ్ళు అదనంగా విదిలిస్తే పోలా అనుకునేవాళ్ళు అక్కడే కానవస్తారు.
అక్కడ ప్రతివారు ఒక చేతి సంచిని సిద్ధంగా దగ్గరవుంచుకుంటారు. వీధిలోకి వెడితే ఎప్పుడు ఏది దొరుకుతుందో తెలవదు. క్యూ పొడుగ్గావుంటే చాలు అక్కడ ఏమి అమ్ముతున్నారన్నదానితో నిమిత్తం లేకుండా వెంటనే అందులో దూరిపోతారు. జనం బాగా వున్నారంటే క్యూబానుంచి దిగుమతి చేసుకున్న అరటి పండ్లో లేక ఇంకా అపురూపమయిన టమాటాలో అక్కడ అమ్మకానికి పెట్టారనుకోవచ్చు. టమాటాలు కనబడితే  కిలోలకు కిలోలు కొనేస్తారు. వాటిని ఇంటికి చేర్చడానికి పడే ప్రయాస ఆ క్షణంలో ఎవరికీ గుర్తు వుండదు.ఎందుకంటె అవి ఏడాది పొడుగునా దొరికేవికావు. ప్రతి ఇంట్లో రిఫ్రిజిరేటర్ తో పాటు పెద్ద పెద్ద డీప్  ఫ్రిజ్ లు కూడా వుంటాయి. ఇలా కొనుక్కొచ్చిన టమాటాలను వాటిల్లో భద్రం చేస్తుంటారు. అవి గట్టిపడి రాళ్ళ మాదిరిగా తయారవుతాయి. టమాటాలు  దొరకని రోజుల్లో వాటిని బయటకు తీసి వేడి నీటిలో ఉడకపెట్టుకుని వంటల్లో వాడుకుంటూ వుంటారు.
ఇక ఇండియన్లకు, ప్రత్యేకించి దక్షిణాది  శాకాహారులకు సంబంధించి ప్రధాన సమస్య రోజూ తినే బియ్యం. రష్యన్ బియ్యం బాగా మొద్దుగా వుంటాయి. చూడడానికి ఇంపుగా వుండకపోవడమే కాకుండా వాటితో వండిన అన్నం నోటికి హితవుగా వుండదు. అందుకే ఏ షాపులోనయినా ఇండియా నుంచి వచ్చిన బియ్యం అమ్ముతున్నారని తెలిస్తే  అందరూ ఒకరికొకరు ఫోన్లు చేసుకుని ఆ షాపుపై ఎగబడేవారు.దీనికి సంబంధించి ఒక జోకు ప్రచారంలో వుండేది. మాస్కోలోని బారత రాయబారి కార్యాలయానికి కొత్తగా ఓ ఉన్నతాధికారి వచ్చారు. ప్రతి రోజూ ఉదయం జరిగే అధికారుల సమావేశానికి ఒకరు ఆలస్యంగా వచ్చారు. కొత్త అధికారి పాత అధికారిని ఆలస్యానికి కారణం అడిగారుట. దోవలో ఒక షాపులో బియ్యం అమ్ముతున్నారని తెలిసి అక్కడ ఆగడం వల్ల ఆలస్యం అయిందని ఆయన వివరణ ఇచ్చారుట. అంతేఆ మీటింగులో ఒక్కరు వుంటే ఒట్టు. అందరూ ఒక్క పెట్టున లేచి పొలోమని ఆ దుకాణం వైపు పరిగెత్తారట. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి