26, డిసెంబర్ 2011, సోమవారం

పాటా పద్యం కలబోస్తే ఈలపాట రఘురామయ్య


పాటా పద్యం కలబోస్తే ఈలపాట రఘురామయ్య
–ఆర్వీవీ కృష్ణారావు, భండారు శ్రీనివాసరావు

షణ్ముఖి ఆంజనేయ రాజు అని తణుకులో వుండేవారు.  జీళ్ళపాకం సంగీతం’ అని కొందరు విమర్శించినా ఆయన పద్యం వినడం కోసం వేలాదిమంది  తహతహలాడేవారు.  గరికిపాటి  నరసింహరావు గారు ఈ మధ్య ‘భక్తి ఛానల్’లో ‘భారతం’ ఫై ప్రసంగిస్తూ, షణ్ముఖికి గొప్పగా నివాళులర్పించారు. ‘ఆయన నాటకాలు చూడడానికి   తాడేపల్లి గూడెం నుంచి సైకిళ్ళు వేసుకొని భీమవరం వెళ్లడం బాగా గుర్తు. రాయబారం సీనులో  ఆంజనేయరాజు పాడే ఆ నాలుగు పద్యాల కోసం వెళ్లి  ఒన్స్ మోర్ లు కొడుతూ  మళ్ళీ మళ్ళీ పాడించుకొనేవాళ్లమ’ని ఆయన గుర్తు చేసుకున్నారు.



ఈల పాట రఘురామయ్య గారు సినిమాల్లో  కృష్ణుడుగా, నారదుదుగా పేరుతెచ్చుకున్న నటుడు. కురుక్షేత్రంలో మొదటి కృష్ణుడుగా వేసేవారు. 'బావా ఎప్పుడు వచ్చితీవు’  ఎక్కడ నుండి రాక’ అనే పద్యాలు చాలా బాగా పాడే వారు. పాండవుల సందేశం తీసుకొనే సీన్ లో ' అయినను పోయి రావలయు హస్తినకు' అన్న పద్యాన్ని పాపులర్  చేసింది రఘురామయ్య గారే. నాటకంలో  ఆయన పోర్షన్ అయిపోయిన తర్వాత స్టేజి మీదకు వచ్చి పది పదిహేను నిమిషాల సేపు  ఈల పాట వినిపించేవారు,  కుడిచేయి మధ్య వేలు నోట్లో  పెట్టుకొని.  ఇప్పుడు శివ ప్రసాద్ ఈల పాట కచ్చేరీలు చెయ్యడానికి ప్రేరణ బహుశః ఇదే కావచ్చు. వేమూరు గగ్గయ్య గారి కుమారుడు  రామయ్య కూడా చాలా రోజులు కృష్ణ వేషం వేసేవారు. రామయ్య మొదటి కృష్ణుడుగా, అబ్బూరి రెండో కృష్ణుడుగా, పృథ్వీ వెంకటేశ్వరరావు మూడో కృష్ణుడుగా చాలాకాలం ఆడేవారు. అబ్బూరి ‘ఆంధ్రా ఆర్టిస్ట్  అసోసియేషన్’ పేరిట సొంత సమాజం నడిపారు.  తర్వాత  కర్ణుడి పాత్ర మీద శ్రద్ధ చూపి కర్ణుడిగా  పేరు పొందారు.  కర్ణ సందేశం’ లో పీసపాటి కృష్ణుడు, రామయ్య కర్ణుడు వేషాలు వేసి చాలామందిని మెప్పించారు.
ఏ.వీ. సుబ్బారావు తెనాలికి చెందిన నటుడు. కుప్పా సూరి,  కుప్పా గాంధీ అని ఇద్దరు సోదరులు వుండే వారు. సూరిగారు హరిశ్చంద్ర వేసేవారుట.  సుబ్బారావు గారు తెనాలి నుంచి ప్రస్తానం ప్రారంభించి టాప్ నటుడుగా పేరు పొందారు.  సుబ్బారావు గారి చేత మొదట వేషం కట్టించింది నేనే’ అని గాంధి వో సారి చెప్పారు. ఈ గాంధీ తర్వాత నాటకాలు మానేసి బెజవాడ బావాజీ మఠంలో గుమస్తాగా చేరాడు. కెనాల్ రోడ్డులో ఈ మఠానికి చాలా ఆస్తులు ఉండేవి .  సత్యనారాయణ పురం దగ్గర బావాజీ పేట అనే పేట  వుండేది. అక్కడ వుండే ఇళ్ళ నుంచి రెండు మూడు రూపాయిలు అద్దెగా వసూలు చేసే వాడు. తర్వాత అక్కడ  ఇళ్లు కట్టుకున్న వాళ్లకు ఆ  స్థలాలు అమ్మేసారు. బావాజీ మఠం ఆస్తులన్నీ పోయాయి, గవర్నమెంట్ నిర్వాకం వల్ల. (26-12-2011)

3 కామెంట్‌లు:

  1. షణ్ముఖి ఆంజనేయ రాజు గారి పద్యాలంటే నాకు ప్రాణం! మా నాన్నగారికి రంగస్థల నాటకానుభవం, కళా కారుల కోసం,నాటకాల కోసం డబ్బు ఖర్చు పెట్టడం అలవాటుగా ఉండేది. అందువల్ల మా ఇంట్లో షణ్ముఖి గారి పద్యాల కాసెట్లు నిత్యం మోగుతూ ఉండేవి. పాండవోద్యోగ విజయాలు లో షణ్ముఖి పాడిన "తమ్ముని కొడుకులు సగపాలిమ్మనిరి" పద్యం వింటుంటే ఇప్పటికీ నాకు అప్పుడే మొదటి సారి వింటున్నట్లు పులకించి కళ్ల వెంట నీళ్ళొచ్చేస్తాయి. అంత ప్రాణం ఆ కృష్ణుడి పద్యాలంటే!

    ఎప్పటికైనా ఆయన్నిచూడాలని అనుకుంటూ ఉండేదాన్ని చిన్నప్పుడు. అది జరగకుండానే వారు గతించారు. లక్షమణ రావు గారి గురించి కూడా రాయండి శ్రీనివాస రావు గారూ! (రామాంజనేయ యుద్ధంలో ఆంజనేయుడు). ఆ శృతి అందుకోవడం ఎవరి వల్లా కాదు

    రఘురామయ్య గారి పద్యాలు,తారా శశాంకంలో సూరిబాబు గారి పద్యాలు రేడియోలో తరచుగా వేసేవారండీ! ఇప్పుడు అవేమీ లేవనుకుంటాను. ఎందుకంటే ఇప్పుడుకూడా నేను రేడియో వింటూనే ఉన్నాను!

    రిప్లయితొలగించండి
  2. @సుజాత- ధన్యవాదాలు - భండారు శ్రీనివాసరావు

    రిప్లయితొలగించండి
  3. @ సుజాత గారికి
    మీరు పేర్కొన్న లక్ష్మణ రావు గారు చాలా గొప్ప నటులు. గోదావరి ప్రాంతంలోని సంపత్ నగర్ లక్ష్మణ రావు గారు ఆంజనేయుడి వేషానికి ప్రసిద్ధులు. ఆయన, షణ్ముఖి కలసి రామాంజనేయ యుద్ధం నాటకం చాలా కాలం ఆడారు. కోస్తాజిల్లాల్లో వీధి నాటకాల్లో అంటే దేవుడి కల్యాణాల్లో
    లక్ష్మణ రావు గారి నాటకం తప్పనిసరిగా వుండేది. పద్యం కంటే రాగం ఎక్కువ. రాగం తీసేటప్పుడు హార్మనీ తో పాటు షహనాయి లాటి మరో వాయిద్యం సిద్ధంగా వుంచుకునేవారు.(ఆర్వీవీ కృష్ణారావు,భండారు శ్రీనివాసరావు)

    రిప్లయితొలగించండి