26, డిసెంబర్ 2011, సోమవారం

అలనాటి నటుల్లో మరో ఘనాపాటి – శ్రీ పులిపాటి


అలనాటి నటుల్లో మరో ఘనాపాటి – శ్రీ పులిపాటి 
-ఆర్వీవీ కృష్ణారావు, భండారు శ్రీనివాసరావు 

పులిపాటి వెంకటేశ్వర్లు అర్జున పాత్ర కోసమే పుట్టాడా! అనిపించేలా అద్భుతంగా నటించే వాడు. 'హరిశ్చంద్ర' లో నక్షత్రకుడు, 'చింతామణి'లో భవాని  శంకరుడు వేసే వారు.  ఓసారి బెజవాడ  రామ్మోహన్ గ్రంధాలయం హాల్లో పీసపాటి కృష్ణుడుగా, పులిపాటి అర్జునుడుగా ‘గయోపాఖ్యానం’ వేసారు.కృష్ణార్జున సంవాదంలో భాగంగా వొకరి నొకరు దెప్పి పొడుచుకొనే పద్యాలు పోటాపోటీగా ఆలపించి అందర్నీ అలరింపచేశారు.


శ్రీ పులిపాటి 

బీవీ రంగారావు బెజవాడ మునిసిపాలిటీలో  పని చేస్తూ  నాటకాలు వేసేవారు. అర్జున వేషంతో పాటు ‘రాయబారం సీను’లో  అశ్వథామ వేసేవారు.  అదిగో ద్వారక’  పద్యం ఈయన పాడితేనే వినాలి సుమా  అన్నట్టుగా పాడేవారు. 'హరిశ్చంద్ర' కూడా వేసేవారు.బెజవాడ  జింఖాన గ్రౌండ్స్ లో చేనేత సప్తాహాలు జరిగేవి. చేనేత వస్త్రాలు ప్రదర్శించేవారు.  జనం రావడం కోసం రోజుకో నాటకం వేయించే వారు.  సారి రంగారావు 'హరిశ్చంద్ర' పెట్టారు. ప్రేక్షకులకు వెసులుబాటు ఏమిటంటే నాటకం ఆరుగంటలకే మొదలెట్టే వారు.  రంగారావుతో పాటు పులిపాటి కూడా వున్నారు.  కాటి సీనులో  'మాయా మేయ జగంబు, ఇచ్చోటనే కదా, చతురంభోది పయోధి’ పద్యాలు ఎంతో హృద్యంగా పాడారు. దాదాపు  నాలుగైదు వేలమంది అలా నిశ్శబ్దం గా కూర్చొని నాటకం చూసారు.
ఏలూరు దగ్గర  కలపర్రు వెంకటేశ్వర్లు - పద్యాలు వినీ వినీ  నటుడుగా మారిన  కోవలోకి  వస్తారు. అర్జునుడు వేసేవారు. 'కురుక్షేత్రం' ఆఖరి సీనులో  అభిమన్యుడు చనిపోయినట్లు తెలిసిన తర్వాత అర్జునుడు పాడే పద్యాలు, కృష్ణుడి   ఊరడింపుల మధ్య  పగ తీర్చుకొంటానని చేసిన ప్రతిజ్ఞలు బాగా పాడేవారు.
అలాగే కొచ్చెర్లకోట సత్యనారాయణ అని చాలా ముందు తరం నటుడు.  అర్జునుడు, కృష్ణుడు, రాముడు వేసేవారు. షణ్ముఖితో కలసి  ద్వారక సీను   రికార్డు ఇచ్చారు.


శ్రీ అద్దంకి శ్రీరామమూర్తి

సంగీత విద్వాన్ అద్దంకి శ్రీరామ మూర్తి గారు ధర్మరాజు వేషానికి ప్రసిద్ధులు.  'కురుక్షేత్రం'తో పాటు 'పాదుకా పట్టాభిషేకం' కూడా ఈయనకి పేరు తెచ్చి పెట్టింది.  తొలి తరం సినిమాల్లో కూడా వేశారు. మంగళంపల్లి బాల మురళీకృష్ణకి ముందు పారుపల్లి రామకృష్ణయ్య గారి దగ్గర సంగీతం నేర్చుకొన్నారు.  గాంధీ నగరం సెంటర్ లో ‘యెర్నేని మాన్షన్’  పక్క బిల్డింగ్ వీరిదే.  గేటు దగ్గర ‘సంగీత విద్వాన్ అద్దంకి శ్రీ రామమూర్తి’ అనే బోర్డు వుండేది. వేమూరి విమలాదేవికి అమ్మేసారు.
పి. సూరిబాబు, రాజేశ్వరి రంగస్థల నటులలో భార్యాభర్తలు. సూరిబాబు కంఠం అదోరకంగా వుంటుంది. కంచు కంఠం  అనేవారు. చాలా సినిమాల్లో వేషాలు వేసారు. ఎక్కువగా నారదుడిగా.  స్టేజి మీద  ఆయన ధర్మరాజు వేసేవారు. పాచికలు ఆడే సీనులో  తమ్ములను, ద్రౌపదిని వొక్కొక్కరినీ పణంగా  పెట్టి వోడిపోతున్న ఘట్టంలో  పద్యాలు గొప్పగా ఉండేవి.  రాజేశ్వరితో కలసి ‘తారాశశాంకం’ ఆడేవారు.బెజవాడలో శరభయ్య గుళ్ళకు ఎదురుగా  రైలు పట్టాలకు ఆవతలి వయిపు  రాజేశ్వరి మేడ’ వుండేది. కందుకూరి చిరంజీవి రావు మరో ధర్మరాజు.  రేడియోలో స్టాఫ్ ఆర్టిస్ట్ గా వుండేవారు. పద్యంతో పాటు నటనకు ప్రాధాన్యం ఇచ్చేవారు. (27-12-2011)

3 కామెంట్‌లు:

  1. నమస్కారం సార్, తెలుగు వికీపీడియాలో అద్దంకి శ్రీరామమూర్తి గారి వ్యాసం విస్తరిస్తున్నాను. అంతలో మీ బ్లాగులో ఆయన ఫోటో కనిపించింది. మీరు అనుమతిస్తే ఈ ఫోటోను తెలుగు వికీపీడియాలో వాడుకొంటాము.
    ధన్యవాదాలు
    రవి వైజాసత్య (వికీ నిర్వాహకుడు)

    రిప్లయితొలగించండి
  2. @అజ్ఞాత: ఇలా రాసేటప్పుడు 'అజ్ఞాత' అని కాకుండా పూర్తి మెయిల్ ఐ డి రాస్తే వెంటనే మిమ్మల్ని సంప్రదించడానికి వీలుంటుంది కదా! కాస్త ఆలోచించండి. ఒకవేళ ఇది మీరు చూడడం తటస్తిస్తే ఫోటో వాడుకోండి.-భండారు శ్రీనివాసరావు

    రిప్లయితొలగించండి
  3. నమస్కారం సార్, మీ బ్లాగు నుండి అద్దంకి శ్రీరామమూర్తి చిత్రాన్ని తెలుగు వికీపీడియా లో నిర్వహిస్తున్న "తెలుగు ప్రముఖుల జీవిత చరిత్రల ప్రాజెక్టు" లో భాగంగా చేర్చితిమి. దీనికి అవకాశం యిచ్చినందుకు ధన్యవాదాలు. కె.వి.రమణ.(వికీపీడియా సభ్యులు).
    kvr.lohith@gmail.com

    రిప్లయితొలగించండి