25, డిసెంబర్ 2011, ఆదివారం

మరోసారి తెరలేచిన ‘నాటకం’



మరోసారి తెరలేచిన ‘నాటకం’ – ఆర్వీవీ కృష్ణారావు,భండారు శ్రీనివాసరావు

కురుక్షేత్రం లో  శ్రీ కృష్ణ పాత్రధారి అనగానే అందరికి గుర్తు వచ్చే పేరు పీసపాటి నరసింహ మూర్తి గారు.



శ్రీ పీసపాటి 


విజయనగరం దగ్గర రాముడు వలస అనే చిన్న వూళ్ళో వుండేవారు.  ఎక్కడకి వెళ్ళాలన్న అక్కడ నుంచే. సాంప్రదాయ మైన బ్రాహ్మణ కుటుంబం కావడంతో సంస్కృతం, తెలుగు భాషల్లో మంచి పట్టు వుండేది.ఆజాన బాహుడు. అవసరమైన వరకే సంగీతం పద్యంలో చొప్పించి పాడే వారు. ఎంత గొప్పగా ఉండేదో.
ఆయన నాటకం చూడలేకపోతే జీవితంలో వో మంచి అవకాశం  పోగొట్టుకున్నట్టే.  రెండేళ్ళు అయిందేమో ఆయన పోయి.  తెలుగు వారంతా బ్రహ్మరథం పట్టడంతో పాటు నటుడిగా ఆయనకు రావల్సిన గౌరవాలన్నీ దక్కాయి వొక్క పద్మ అవార్డు మినహా.



శ్రీ పీసపాటికి సన్మానం 

ఆంధ్ర విశ్వ విద్యాలయం కళా ప్రపూర్ణ, కేంద్ర సంగీత నాటక అకాడెమి ఫెలో షిప్, తెలుగు విశ్వ విద్యాలయం విశిష్ట పురస్కారం, రాజా లక్ష్మి ఫౌండేషన్ అవార్డు వగైరా.  వోసారి  తిరుపతి వెంకట కవుల సమక్షంలో ‘ఉద్యోగ విజయాలు’ పోటీలు జరిగాయి.  అందులో కృష్ణ పాత్రధారి  పీసపాటి బంగారు కీరీటం బహుమతిగా పొందారు. 'మామా సత్యవతీ పౌత్రా!  ధాత్ర రాష్ట్రులకు పాండవులకు సంధి చేసి ఈ రాజలోకమ్మును కాపాడుమని యాచించుటకయి పాండవదూతగా నీ వద్దకు వచ్చితి’ అంటూ ఆయన రాయబారం సీన్ లో ప్రవేశించడం వో మధురాతి మధురమైన జ్ఞాపకం. పతితులు కారు నీయెడల భక్తులు శుంఠలు కారు విద్యలన్ చతురులు’ అని పాండవుల గొప్పతనం గురించి కౌరవుల సభలోచెప్పడం కూడా ఎంతో రమ్యంగా వుండేది.  ఒన్స్ మోర్’ లు పట్టించుకునే వారు కాదు. ఇక తప్పని సరి అయితే సంభాషణలు మార్చి కొత్తదనంతో అదే పద్యాన్ని కొద్దిగా మార్చి పాడేవారు.  ప్రేక్షకులంతా హర్ష ధ్వానాలు చేసేవారు.



తెలుగు సంస్కృతిని సుసంపన్నం చేసిన తెలుగు నాటకం 


పాతికేళ్ళ పాటు తెలుగు నాటక రంగాన్ని ఏలిన మరో వ్యక్తి అబ్బూరి వరప్రసాద రావు గారు. పద్యాన్ని రాగ యుక్తంగా పాడడం ఈయనతో ఒక మోడల్ గా మారిందని  చెప్పొచ్చు. ఆయన చనిపోయినప్పుడు ‘ఆంధ్ర జ్యోతి’  తెలుగు దిన పత్రిక సంపాదకీయం రాసిందంటే ఆయన ఎంత గొప్పవాడో  అర్థ మవుతుంది.  ఒకేరోజు  రోజు మూడు చోట్ల వేషాలు వేసేవాడు.బెజవాడలో  ద్వారక సీను,, మంగళగిరిలో రాయబారం, పెద కాకానిలో మూడో కృష్ణుడు ఇలా వుండేది ఆయన బిజీ షెడ్యూలు. ‘చెల్లియో చెల్లకో, అలుగుటయే యెరుంగని, జెండాఫై కపిరాజుసంతోషమ్మున  సంధి సేయవో’ అనే ఆయన పద్యాలు గ్రామ ఫోన్  రికార్డులు గా వచ్చాయి. పదిహేను రోజులకోసారి రేడియోలో మధ్యాహ్నం ‘కార్మికుల కార్యక్రమం’ లోనో, సాయంత్రం ‘గ్రామ సీమల కార్యక్రమం’ లోనో ఈ రికార్డు వేసేవారు. అప్పట్లో అందరి ఇళ్ళల్లో రేడియోలు వుండేవి కావు. వినాలనుకున్నవాళ్లు  రాఘవయ్య పార్కుకు వెళ్లి వినేవాళ్ళు. లేదా ‘మాతా కేఫ్  హోటల్’  రేడియోలోనో  వినేవాళ్లు.
యెంత పేరొచ్చినా, జనం నీరాజనాలు పట్టినా  నాటకాల్లో వేసేవారు ఎలా చెడిపోతారో అనడానికి  ‘అబ్బూరి వారి  జీవితం ఓ ఉదాహరణ’.  మద్యానికి బానిస కావడంవల్ల ఆరోగ్యం చెడింది. మదనపల్లి శానిటోరియంలో ‘టీబీ’కి  వైద్యం చేయించుకున్నా కొన్నాళ్ళకు అది మళ్ళీ తిరగ బెట్టింది.  ఎలా సంపాదించాడో అల్లాగే పోయింది ఆయన డబ్బంతా. (25-1202011)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి