31, జులై 2010, శనివారం

అమెరికా అనుభవాలు - 20

అమెరికా అనుభవాలు - 20




సీ వరల్డ్

నీటిలో చేప - చేప నోటిపై భామ  


ఆ తరవాత మజిలీ సీ వరల్డ్ ఎడ్వెంచర్ పార్క్. ఇది శాన్ డియాగో లో వుంది. కొన్ని వందల ఎకరాల విస్తీర్ణంలో దీన్ని ఏర్పాటు చేసారు. వేల్స్ , డాల్ఫిన్స్ ఇంకా అనేక జలచరాల అద్భుత విన్యాసాలను ఇక్కడ చూడవచ్చు.

గాలిలో వేల్   విన్యాసం

షామూ అనే వేల్ ప్రదర్శన ప్రత్యెక ఆకర్షణ. వీటిని చూపించడానికి ఓపెన్ ఎయిర్ ఆడిటోరియాలు అనేకం వున్నాయి. ప్రేక్షకుల గేలరీకి, వేదికకూ నడుమ జలరాశి వుంటుంది. వేదికకు రెండువైపులా నీటిలో వున్న గేట్లను తెరవగానే వేల్స్, డాల్ఫిన్స్ ఎంతో వేగంగా వచ్చి రకరకాల ఫీట్లతో ప్రేక్షకులను రంజింపచేస్తాయి. సుమారు డెబ్బయి అడుగుల ఎత్తువరకు గాలిలోకి ఎగిరి మల్ళీ నీటిలోకి జంప్ చేస్తాయి.

చేపా చేపా ఎగరకే  

అప్పుడు ఎగసిపడే నీటి తుంపర్లతో గేలరీల్లో వున్నవాళ్ళు తడిసిముద్దయిపోతారు. అందుకని రైన్ కోట్లు తప్పనిసరి. వీటిని అక్కడ సప్లయి చేస్తారు. శిక్షకులు చెప్పే మాటలను, సూచనలను అర్ధం చేసుకుంటూ డాల్ఫిన్లు కడుపుబ్బ నవ్వేలా విన్యాసాలు చేస్తాయి. కోతుల్ని, పాముల్ని, గంగిరెద్దులను ఆడించే వాళ్ళని చూసాము కానీ ఇక్కడ ఎలుకలు, ఉడతలకు కూడా ట్రెయినింగ్ ఇచ్చి వాటితో అనేక విన్యాసాలు చేయించడం చూసి ఆశ్చర్య పోయాము. సర్కస్ లో బఫూన్ల మాదిరిగా ఇవి అప్పుడప్పుడు స్టేజీ మీదకు వచ్చి ట్రెయినర్లతో పోటీ పడి నటించడమే కాకుండా తమ చేష్టలతో వీక్షకులను నివ్వెరపరుస్తాయి.

మంచు వెలుగులో ఎలుగులు

 ఉత్తర ధ్రువ ప్రాంతాన్నిఅక్కడ కృత్రిమంగా సృష్టించి - ధ్రువ ప్రాంతాలలో మాత్రమే మనగలిగే తెల్లని ఎలుగుబంట్లను అక్కడ ప్రదర్శిస్తున్నారు. అలాగే పారదర్శకంగా వుండే పెద్ద గాజు ట్యూబు లో వెడుతూ చుట్టూవున్న నీటిలో - సముద్ర జలాల్లో సంచరించే జీవరాసులను చూడగలగడం మరో అనుభూతి.



NOTE: All images in this blog are copy righted to their respective owners

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి