31, జులై 2010, శనివారం

అమెరికా అనుభవాలు – 19

అమెరికా అనుభవాలు – 19

హాలీవుడ్


కళాకారుల కలల గమ్యం


ఆ రాత్రి హోటల్లో గడిపి – మర్నాడు లాస్ ఏంజెల్స్ డౌన్ టౌన్ మీదుగా యావత్ సినీ ప్రపంచానికి రాజధాని అయిన హాలీవుడ్ కి వెళ్ళాము. అక్కడ అతి పెద్ద సినీ స్టుడియో – ‘యూనివర్సల్ స్టుడియో’ ని చూసాము. సందర్శకులనందరినీ అధునాతన టూరిష్టు బస్సుల్లో కూర్చోబెట్టి గైడ్లు స్టుడియో అంతా తిప్పి విశేషాలను వివరిస్తారు. ఇదొక మాయామేయ ప్రపంచం. సినిమాల్లో చూసిన దానికన్నా ఇక్కడ చూసిన వింతలూ విశేషాలే మరెంతో గొప్పగా వున్నాయి. వరదలు, భూకంపాలు, అగ్ని ప్రమాదాలు అన్నీ కృత్రిమమే. కానీ ఎంతో స్వాభావికంగా వుండి గగుర్పాటు కలిగిస్తాయి.




మనల్ని బస్సులో తీసుకువెడుతుంటారు. సెట్లోకి వెళ్ళగానే ఎదురుగా ఒక రైలు వస్తుంటుంది. పట్టాలు తప్పి వంతెన మీదుగా నదిలోకి ఒరిగిపోతుంది. బోగీలు నీళ్ళలో కొట్టుకుపోతుంటాయి. ఇంజను వంతెన మీదుగా వేళ్ళాడుతుంటుంది. హాహాకారాలు-ఆర్తనాదాలు. నిమిషాల్లో అంతా గందరగోళం. కొద్దిసేపటిలో అన్నీ మామూలే. రైలు రైలు లాగే వుంటుంది. ఇంజనూ,బోగీలు యధాస్తానాలలోకి వస్తాయి. మనం వొళ్ళు జలదరిస్తుండగా బస్సులో బయటకు వస్తాము

రైలు పడిపోతున్నదా - కాదు వారి మాయలో మనమే పడిపోతున్నాము

మరో స్టుడియోలోకి తీసుకు వెడతారు. రెండు వైపులా ఎత్తయిన భవంతులు. లోపల దీపాలు వెలుగుతుంటాయి. ఆకస్మికంగా భూకంపం వచ్చినట్టు చప్పుడు. కరెంటు పోతుంది. అంతా అంధకారం. ఇళ్లు పేక మేడల్లా కూలిపోతుంటాయి. నిమిషాల్లో అంతా మామూలే. కూలిన భవంతులు ఎక్కడివక్కడ అతుక్కుని తిరిగి యధాతధంగా నిలబడతాయి.
అలాగే మరో దృశ్యం.

మంటలు కావు - మాయలు

పెద్ద భవనానికి మంటలు అంటుకుంటాయి. విపరీతమయిన గాలి వీస్తుంటుంది. తలుపులు కిటికీల నుంచి అగ్నికీలలు మనవైపు దూసుకు వస్తాయి. మంటల వేడికి వాతావరణం అంతా వేడెక్కుతుంది. మళ్ళీ షరా మామూలే! క్షణాల్లో ఎక్కడి మంటలు అక్కడే హుష్ కాకి. భవనం చెక్కుచెదరకుండా దర్శనమిస్తుంది.

జురాసిక్ పార్క్

గతంలో ఈ స్టుడియోలో నిర్మించిన భారీ చిత్రాల సెట్టింగులను అలాగే వుంచేసి సందర్శకులకు చూపిస్తున్నారు. మేము ప్రయాణిస్తున్న బస్సు ఒక బరాజ్ పక్కగా ఆగింది. ఆనకట్టకు పగులుపడి కొద్ది కొద్దిగా నీరు బయటకు వస్తోంది. నిమిషాల్లో గండి పెద్దదయింది. రిజర్వాయర్లో నీరంతా ఒక్కసారిగా వరదలా ముంచెత్తింది. ఇది కూడా సినీ ‘మాయే’.

ఓస్ ! జాస్ అంటే ఇదేనా!



సందర్శకుల వినోదం కోసం ఈ స్టుడియోలో అనేక థీం పార్కులు ఏర్పాటుచేశారు. సమయాభావం వల్ల కొన్ని మాత్రమె చూడగలిగాము. జురాసిక్ పార్క్ పేరుతొ ఏర్పాటు చేసిన థీం పార్క్ ఎంతో బాగుంది. వేగంగా ప్రవహించే నీటి వాగు లో బోటులో కూర్చోబెట్టి తీసుకువెడతారు. నీటి తుంపరలు పడి దుస్తులు తడిసిపోకుండా రెయిన్ కోట్లు ధరించాల్సి వుంటుంది.

నవరసాల సమ్మేళనం   
మనం ఎక్కిన బోటు వేగంగా వెడుతూ, సుళ్ళు తిరుగుతూ కొండలు కోనల నడుమ ప్రయాణిస్తూ వుంటుంది. అడవులలోని చెట్ల మధ్య నుంచి భీకరమయిన డైనాసిరస్ లు మెడలు సాచి మనల్ని కొరుక్కుతినాలని చూస్తుంటాయి.

ఇక ఇంతే సంగతులు - చిత్తగించగలరు   

 ఇంతలో మన బోటు ఒక జలపాతం పై అంచుకు చేరి కొన్ని క్షణాలు ఆగుతుంది. ఎదుటినుంచి ఒక పెద్ద డైనాసిరస్ తల వేగంగా మన వైపు దూసుకు వస్తుంది. కోరలు సాచి మనల్ని పట్టుకునేలోగా బోటు అమాంతం ఎనభయి అడుగుల ఎత్తునుండి కిందకు జారిపోతుంది. బోటుతో సహా కిందవున్న నీటి చలమలో పడిపోతాము.

అమ్మయ్య వొడ్డున పడ్డాము

 యెంత గుండె ధైర్యం వున్న వారికయినా సరే ఒక్కసారి వొళ్ళు జలదరిస్తుంది. జలపాతంలోకి జారిపోయేటప్పుడు భయంతో కేకలు పెట్టే సందర్శకుల మొహాల్లోని హావభావాలను ఫోటోలు తీసి ఇస్తారు. కొంత ధర చెల్లించాలనుకోండి.

పిల్లల ప్రపంచం

మునుపటి సోవియట్ యూనియన్ లో మాదిరిగానే అమెరికాలో కూడా పిల్లలకు ప్రత్యెక ప్రాధాన్యత వుంది. వాళ్ళు వాడే సబ్బులు, క్రీములు, ఆహార పదార్ధాలు, బొమ్మలు అన్నీ ప్రత్యేకంగా వుంటాయి. వాటిని వారి వారి వయస్సులను బట్టి ప్రత్యేకంగా తయారుచేస్తారు. అలాగే పిల్లల కోసం విడిగా టీవీ చానల్స్ వున్నాయి. వారి అభిరుచుల ప్రకారం కార్యక్రమాలను వినోదభరితంగా, విజ్ఞాన సహితంగా రూపొందిస్తారు. ఇటీవల విడుదలయిన ష్రెక్ చలనచిత్రం పిల్లల కోసమే నిర్మించారు. పూర్తిగా కంప్యూటర్ పరిజ్ఞానంతో రూపొందించిన ష్రెక్ చిత్రాన్ని చిత్రీకరించిన విధానాన్ని వివరించే డాక్యుమెంటరీలు కూడా విడుదలయ్యాయి. రికార్డు స్తాయిలో కలెక్షన్లు సాధించిన ష్రెక్ చిత్రం పై రూపొందించిన 4-D చిత్రాన్ని యూనివర్సల్ స్టుడియోలో చూసాము.


 3-D చిత్రం కన్నా దీనిలో ఎఫెక్ట్ లు ఎక్కువ. సినిమాలో కానవచ్చే చిన్న చిన్న విచిత్రజీవులు సినిమా చూస్తున్న ప్రేక్షకుల శరీరాలపై పాకుతున్న అనుభూతిని కలిగించారు. పాము ఛివాలున పడగ విసిరితే అది మన మొహం దాకా వచ్చి విషం చిమ్మినట్టు నీటి తుంపరలు పడతాయి. అలాగే ఉత్తర ధృవానికి చిన్న విమానంలో ప్రయాణిస్తూవుంటాము. మధ్యలో ఇంజిన్ చెడిపోతుంది. మంచు అఖాతాల నడుమగా విమానం ఒంకర్లు తిరుగుతూ వేగంగా దూసుకుపోతూ వుంటుంది. మనం కూర్చున్న కుర్చీలు కూడా విమానం లాగే ఒంకర్లు తిరిగిపోతుంటాయి. ఇలాటి ఎన్నో వింత వింత అనుభూతుల్ని మనసులో పదిలపరచుకుంటూ హాలీవుడ్ కూ, లాస్ ఏంజెల్స్ కూ గుడ్ బై చెప్పాము.

NOTE: All images in this blog are copy righted to their respective owners

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి