31, జులై 2010, శనివారం

అమెరికా అనుభవాలు – 18

అమెరికా అనుభవాలు – 18

తెలుగు పూజారి

లాస్ వెగాస్ గురించిన జ్ఞాపకాలు మనస్సులో సుళ్ళు తిరుగుతూ వుండగానే ఆ మరుసటి వీకెండ్ లాస్ ఏంజెల్స్ ప్రయాణమై వెళ్ళాము. రోడ్డుమార్గంలో మరో అయిదువందల మైళ్ళు. ఈసారి లాస్ ఏంజెల్స్ లో ప్రవేశిస్తూనే ముందు సెవెన్ హిల్స్ అనే ప్రాంతానికి వెళ్ళాము. అక్కడ శ్రీ వెంకటేశ్వర దేవాలయం వుంది. భారత దేశానికి చెందిన ఏ గుడినయినా సరే – ఇక్కడ హిందూ టెంపుల్ అనే అంటారు. ఈ దేవాలయంలో పూజారి మన తెలువారే. విశాలమయిన ప్రాంగణంలో నిర్మించిన ఈ దేవాలయం ఎంతో ప్రశాంతంగా వుంది. మన వైపు గుళ్ళతో పోలిస్తే మరెంతో పరిశుభ్రంగా కూడా వుంది.

ఏడు సముద్రాల ఆవల ఏడుకొండలవాడు



స్వామి దర్శనం చేసుకున్న అనంతరం నగరం పొలిమేరల్లో వున్న డిస్నీలాండ్ కు బయలుదేరాము. అమెరికా వచ్చిన తరవాత ఇన్ని రోజుల్లో ఏనాడూ కూడా ట్రాఫిక్ జామ్ అనేది చూడలేదు. మొదటిసారి లాస్ ఏంజెల్స్ లో ట్రాఫిక్ జామ్ అనుభవంలోకి వచ్చింది.

కారు దారుల్లో కారుల బారులు

 ప్రపంచంలోని కార్లన్నీ లాస్ ఏంజెల్స్ లోనే వున్నాయా అన్నట్టు వాహనాలన్నీ కట్టగట్టుకుని ఆ నగరం రోడ్లపై కానవచ్చాయి. ముందూ వెనుకా, అటూ ఇటూ, ఎటు చూసినా కారుల బారులే. అప్పటికే చేకటి పడినట్టుంది- మా పక్క మార్గంలో ఎడుతివైపునుంచి వస్తున్న వాహనాల హెడ్ లైట్లు – ప్రశాంతమయిన సరస్సు నీటిపై తేలి ఆడుతున్న కార్తీక దీపాల మాదిరిగా మెలమెల్లగా కదులుతున్నాయి. మేము వెడుతున్న వైపు చూస్తె – వరుసలు వరుసలుగా వెడుతున్న కార్ల టెయిల్ లైట్లు ఎర్రటి ధగ ధగ లతో కాంతులీనుతున్నాయి. గంటకు వంద మైళ్ల చొప్పున ప్రయాణించి వచ్చిన మా కారు వేగం పది,పదిహేను మైళ్లకు పడిపోవడంతో మా హోటల్ కు గంటన్నర ఆలస్యంగా చేరాము.

డిస్నీలాండ్

మేము దిగిన రెడిసన్ హోటల్ డిస్నీలాండ్ కు దగ్గర్లో వుంది. మరునాడు ఉదయమే బయలుదేరి డిస్నీలాండ్ లో సాధ్యమైనన్ని వేసేశాలు రోజంతా చూద్దామని వెళ్ళాము. సుమారు మూడువేల కార్లు నిలిపే పార్కింగ్ లాట్ వుంది. మేము వెళ్లేసరికే అది అగానికిపైగా నిండిపోయింది. కారు పార్కు చేసిన చోట వున్న నంబరును జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. లేకపోతె, తిరిగివచ్చేటప్పుడు మన కారును వెతుక్కుని గుర్తించడం కష్టమవుతుంది. ఇక అప్పుడు మేము ప్రారంభించిన మా నడక రాత్రి పదిగంటల వరకూ సాగింది. ప్రవేశ ద్వారం దాటగానే కనిపించిన డిస్నీలాండ్ నిర్మాత విగ్రహం దగ్గర ఫోటోలు తీసుకుని ఆ నవ లోకి అడుగు పెట్టాము.

పిల్లల గుండెల్లో చిరంజీవి

అదిగో నవలోకం


ఈ బొమ్మలు తెలియని పిల్లలెవ్వరు?



ఒక్కసారి టిక్కెట్టు చూపి లోనికివెడితే చాలు అక్కడ వున్న అనేకానేక ఎట్రాక్షన్స్ అన్నీ ఉచితంగా చూడవచ్చు. అయితే జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని వెడితేనే వీటిల్లో చాలావరకు చూడగలుగుతాము. ప్రతి షోకు కొన్ని నియమిత సమయాలు వుంటాయి. ప్రతి చోటా ఫాస్ట్ పాస్ మిషన్లు ఏర్పాటుచేశారు. మన ఎంట్రీ టికెట్ ను అందులో ఇన్సర్ట్ చేస్తే ఆ షోని చూసే సమయం ముద్రించిన ఫాస్ట్ పాస్ మన చేతికి వస్తుంది. అప్పుడు పొడవాటి క్యూలలో నిలబడి వేచిచూసే అవసరం లేకుండా ఫాస్ట్ పాస్ ప్రవేశ ద్వారం ద్వారా లోపలకు వెళ్ళవచ్చు. ఉదాహరణకు ‘రివర్స్ ఆఫ్ అమెరికా’ చూడాలని వెళ్ళామనుకుందాం. మనం అక్కడికి చేరేసరికే మనం ఎక్కాల్సిన నౌక వెళ్లి పోయివుంటే – ఫాస్ట్ పాస్ తీసుకుని – మనకిచ్చిన టైం దాని మీద రాసి వుంటుంది కాబట్టి - అక్కడే వేఛివుండి సమయం వృధా చేసుకోకుండా – ఆ లోపల చుట్టుపక్కల మరికొన్ని వింతలను చూసి తిరిగి రావచ్చు. అంటే ఒకరకంగా తిరుపతిలో కట్టే కంకణం లాటిదన్నమాట.

ఈ నౌకలో ప్రయాణం - కడు ఉత్కంట భరితం

 ‘రివర్స్ ఆఫ్ అమెరికా’ అంటే ఒక నౌకలో ఎక్కించి కృత్రిమంగా సృష్టించిన దట్టమయిన అడవుల మధ్య పారే నదిలో తిప్పుతారు. ఈ నౌక రెండతస్తుల భవనం అంత పెద్దగా వుంటుంది. ఒకేసారి మూడు,నాలుగు వందలమంది ప్రయాణం చేయవచ్చు. పూర్వకాలంలో రెడ్ ఇండియన్ల (ఈ మాటని ఇప్పుడు నిషేధించారని విన్నాను. నేటివ్ అమెరికన్లని అనాలట) ఆటవిక జీవితాన్ని కళ్ళకు కట్టేలా ఆ నాటి వాతావరణాన్ని కృత్రిమంగా సృష్టించారు. అంతా హాలీవుడ్ సినిమా సెట్టింగ్ లా వుంటుంది. అడవుల్లో దాగిన బందిపోట్లు గుర్రాలమీద స్వారీ చేస్తూ మనం ప్రయాణిస్తున్న నౌకపై తుపాకులు పేలుస్తూ భీభత్సం సృస్టిస్తారు. అంతా సహజంగా కానవచ్చే మాయాజాలం ఇది.

అలాగే మిక్కీ టూన్ టౌన్.



సందర్శకులను చిన్న చిన్న బోట్లపై తిప్పుతారు. వేగంగా పారే నీటి కాలువల్లో ఈ చిన్ని పడవలు ఎలాటి యంత్రాల సాయం లేకుండా మొత్తం టూన్ టౌన్ అంతా కలయ తిప్పుతాయి. దోవలో అటూ ఇటూ కానవచ్చే కాల్పనిక జగత్తు – వాల్ట్ డిస్నీ ఊహాసంపత్తికి అద్దం పడుతుంది.

పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా అందర్నీ సంభ్రమాశ్చర్యాలతో ముగ్ధుల్ని చేసే అనేక ఆకర్షణలు డిస్నీలాండ్ లో అనేకం వున్నాయి. ‘ఫైర్ వర్క్స్’ వీటిల్లో ప్రధానమయినది. ‘బాణసంచా’ అనేమాట వీటికి సరిపోదేమో. ఇందులో బాణ సంచా వాడారో లేక అత్యాధునిక లేజర్ పరిజ్ఞానం వాడారో అర్ధం కాదు. సుమారు ఒక గంట సేపు ఆకాశమంతా అందమయిన హరివిల్లులా మారిపోతుంది.


 నింగిలోకి దూసుకు వెళ్ళే తారాజువ్వలు వివిధ వర్ణాలతో వినువీధిలో రంగు రంగుల రంగవల్లులు తీర్చి దిద్దుతాయి. లేజర్ షో లో- విచిత్ర ఆకారాలు కలిగిన వింత వింత పాత్రలు గగన మండలంలో చేసే విన్యాసాలను మెడలు సాచి చూడాల్సిందే. కొండ శిఖరం పైనుంచి జాలువారే నీటితో పాటు మనం కూడా అదాటున కిందకు జారిపడడం, చీకటి గుహల్లో ప్రయాణించడం, ఎంతో ఎత్తులో రోలర్ కోష్టర్ పై వొళ్ళు జలదరించే వేగంతో సుళ్ళు తిరగడం, కిందా పైనా అద్దాలు బిగించిన మోనో రైలులో అన్నివైపులా చూస్తూ డిస్నీ ల్యాండ్ అంతా కలయ తిరగడం- దేనికది ఒక మరపురాని అనుభూతే.

ఆకాశవీధి నుంచి అద్భుతలోకం

 వయస్సుని మరచిపోయి చిన్నపిల్లలుగా మారిపోయి ఉత్సాహంతో ఉరకలు వేయాలంటే- చిన్నారులని దృష్టిలో వుంచుకుని రూపకల్పన చేసిన ఈ డిస్నీలాండ్ లో ఒక్కసారయినా అడుగు పెట్టి తీరాలి.

NOTE: All images in this blog are copy righted to their respective owners

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి