30, జులై 2010, శుక్రవారం

అమెరికా అనుభవాలు – 17

అమెరికా అనుభవాలు – 17



కొలొరాడో లోయలు

ఈ రంగుల రాళ్ళలో ఏ గుండెలు దాగెనో



అటు సంపన్నులకూ ఇటు సామాన్యులకూ ఆహ్లాదాన్ని అందించే లాస్ వెగాస్ నుంచి బయలుదేరి గ్రాండ్ కేనియాన్ వెళ్లి అక్కడి ఇంటూరిస్ట్ హోటల్లో బస చేసాము. ఆ రాత్రి ఐమాక్స్ ధియేటర్లో గ్రాండ్ కేనియాన్ గురించిన డాక్యుమెంటరీ చూసాము. కళ్ళు గిర్రున తిరిగే ఆ లోయల్లో కొన్ని వందల అడుగుల లోతుకు హెలికాప్టర్ లో దూసుకు వెళ్ళిన దృశ్యాలను తాటి ప్రమాణం కలిగిన విశాలమయిన వెండి తెరపై చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాము.



కొన్ని లక్షల సంవత్సరాలకు పూర్వం కొలరాడో నది వేగంగా పారుతూ, వొడ్డులను వొరుసుకుంటూ ఉధృతంగా ప్రవహించిన కారణంగా ఈ లోయలు సహజసిద్దంగా ఏర్పడ్డాయని చెబుతారు.

ఇది ప్రకృతి చెక్కిన శిల్పం  




గ్రాండ్ కేనియన్ లో సూర్యోదయ దృశ్యాన్ని చూడడానికి టూరిస్టులు ఉత్సాహపడతారు. ఇందుకోసం పొద్దుపొడ వకముందే నిద్దర్లు లేచి, సుప్రభాత సేవకు వెళ్ళేవారిమాదిరిగా తయారయి ఆ లోయలవద్దకు చేరుకున్నాము. ఇంకా అప్పటికి చీకటి తెరలు తొలగలేదు. వందలాదిమంది గుంపులు గుంపులుగా చేరిపోయి ఆ అపూర్వ దృశ్యాన్ని తమ కెమెరాలలో బంధించడానికి వీలుగా అనువైన ప్రదేశాన్ని ఎంచుకుని సిద్దంగా ఎదురుచూస్తున్నారు. జపాన్ నుంచి వచ్చిన స్కూలు విద్యార్దుల బృందం కూడా వారిలోవుంది. క్షణాలు లెక్కిస్తూ అందరం సూర్యోదయ ఘడియ కోసం నింగిలోకి నిక్కి నిక్కి చూస్తున్నాము. ఎదురుచూస్తున్న క్షణం దగ్గరపడినట్టుగా లోయకు ఆవల తూరుపు దిక్కు ఎర్రబడసాగింది. అందరూ కెమెరాలను మరోసారి సర్డుకునేలోపల దృశ్యం మారిపోయింది. ఎర్రబడుతున్న ఆకాశంలో తిరిగి చిమ్మ చీకటి కమ్ముకుంది. వున్నట్టుండి మంచు రేకలు రేకలుగా రాలడం మొదలయింది. చూస్తుండగానే పరిసరాలన్నీ తెల్ల దుప్పటి కప్పుకున్నట్టుగా మంచుతో నిండిపోయాయి. అడుగు అవతల ఏమున్నదో కనిపించనంతగా మంచువర్షం. సూర్యోదయాన్ని చూద్దామని వచ్చినవారంతా నిరాశతో వెనుదిరిగారు. మేము మాత్రం మా మాస్కో రోజుల్ని గుర్తుకు తెచ్చుకుంటూ మంచుతో బంతులు తయారుచేసుకుని ఒకరిపై మరొకరం రువ్వుకుంటూ ఆనందంగా కాసేపు గడిపి హోటల్ కు చేరుకొని తిరుగు ప్రయాణపు పనిలో పడ్డాం.


NOTE: All images in this blog are copy righted to their respective owners

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి