31, జులై 2010, శనివారం

అమెరికా అనుభవాలు – 21



అమెరికా అనుభవాలు – 21




అతిధి దేవోభవ

రండి బాబూ రండి


శాన్ ఫ్రాన్సిస్కో లో వున్న రోజుల్లోనే ఒక రోజు నాపా వ్యాలీకి వెళ్ళాము. వైన్ తయారీకి ప్రపచ ప్రసిద్ధి పొందిన ప్రదేశాల్లో ఇదొకటి. ఎక్కడ చూసినా వందల వేల ఎకరాలలో ద్రాక్ష తోటలే కనిపించాయి. వైన్ తయారుచేసే కంపెనీలు డజన్ల కొద్దీ వున్నాయి. వీటిని చూడడానికి సందర్శకులను అనుమతిస్తారు. అంతే కాదు, ప్రత్యేకంగా గైడ్లను వెంట పంపి – కర్మాగారంలోని వివిధ విభాగాలను చూపిస్తూ - వైన్ తయారు చేయడంలో ఇమిడివున్న అనేక అంశాలను విశదంగా వివరిస్తారు. తరువాత వైన్ టెస్టింగ్ రూములకు తీసుకువెళ్ళి వారు తయారు చేసే ప్రసిద్ధ బ్రాండుల వైన్ ని మచ్చుకు రుచి చూపిస్తారు.

"యెంత రుచి యెంత రుచి  యెంత రుచిరా"

 ఇవన్నీ ఉచితమే. కొనాలనే నిబంధన ఏమీ లేదు. కాకపోతే, ఈ కంపెనీలు తమ ఉత్పత్తుల ప్రచారం – మార్కెటింగ్ వ్యూహాల్లో భాగంగా ఇలాటివన్నీ చేస్తాయని చెప్పుకుంటారు.

మంచులో షికారు.



ముంచెత్తిన మంచులో...

కొత్త సంవత్సరం తొలిరోజుల్లో సియాటిల్ లో మంచు విపరీతంగా కురిసింది. మంచు కురవడం అన్నది ఈ నగరానికి కొత్తేమీ కాకపోయినా, ఇంత మంచుని గత రెండు దశాబ్దాలుగా చూడలేదని స్తానికులే చెప్పారు. ఇళ్లూ వాకిళ్ళూ, రహదారులు, కాలిబాటలూ అన్నీ మంచుతో కప్పుకుపోయాయి. జన జీవనం అస్తవ్యస్తం అయింది. పిల్లల బడులకు సెలవు ప్రకటించారు. మంచు రోడ్లపై కార్లు నడపడం కష్టం అనుకున్న వాళ్ళు ఆఫీసులకు ఎగనామం పెట్టారు. మాస్కోలో దాదాపు అయిదేళ్ళ పాటు ఇలాటి వాతావరణానికి నిత్యం అలవాటు పడిన ప్రాణాలు కాబట్టి నేనూ మా ఆవిడా బయటపడ్డాము. తెల్లటి పూలరేకుల మాదిరిగా మంచు కురుస్తోంది. రోడ్లమీద కార్ల సంచారం పూర్తిగా తగ్గిపోయింది. అరకొరగా కానవస్తున్న వాహనాలు కూడా నెమ్మదిగా, జాగ్రత్తగా సాగుతున్నాయి. రోడ్లమీద గీతలు మంచువల్ల కానరాకుండా పోవడంతో వాహనదారులకు దిక్కుతోచడం లేదు. మేమిద్దరం కానరాని కాలిబాటపై – మడి మెల వరకు మంచులో కూరుకుపోతున్న కాళ్ళను పైకి లాక్కుంటూ – జారిపడకుండా చూసుకుంటూ- రెండు మైళ్ల దూరంలో వున్న ఫాక్తోరియా మాల్ అనే పెద్ద షాపింగ్ సెంటర్ కు వెళ్ళాము.
మరో ప్రపంచం ఒకే కప్పుకింద ఒకే ఆవరణలో వున్న వివిధ దుకాణాల సముదాయం ఇది. సుమారు వెయ్యి కార్లు ఎలాటి ఇబ్బందీ లేకుండా పార్క్ చేసుకోవడానికి వీలయిన పార్కింగ్ లాట్ వుంది. నలువైపులా ప్రవేశ ద్వారాలున్న ఈ మాల్ లో ప్రపంచ ప్రసిద్ధి చెందిన దుస్తులు, పాదరక్షలు, నగలు, పుస్తకాలు, ఔషధాలు, ఎలెక్ట్రానిక్ వస్తువులు, పిల్లల బొమ్మల దుకాణాలు, బ్యూటీ పార్లర్లతోపాటు పోలీస్ స్టేషన్, పోస్ట్ ఆఫీస్, బ్యాంకులు, ఏటీఎం లు వున్నాయి. తాజా కూరగాయలు, పాలు, మాంసం విక్రయించే దుకాణాలున్నాయి. ఓ డజనుకు పైగా రెష్టారెంట్లు వున్నాయి. వివిధ దేశాలకు చెందిన ఆహార పదార్ధాలు లభిస్తాయి. ఇలాటి పెద్ద మాల్స్ సియాటిల్ లో పాతికకు పైగా వున్నాయి. వీటిని చూడాలన్నా, షాపింగ్ చేయాలన్నా - డబ్బు మాటేమో గానీ గంటలకొద్దీ సమయం ఖర్చు చేయాల్సివుంటుంది.




మాయా మహలు కాదిది- కేవలం మాలే

 ఐకియా, బెస్ట్ బై, కాస్ట్ కో వంటి పెద్ద పెద్ద మాల్స్ అనేకం వున్నాయి. వీటిల్లో షాపింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు పిల్లలను వదలడానికి రిక్రియేషన్ సెంటర్లు వుంటాయి. దేశవ్యాప్తంగా ఇలాటి మాల్స్ అన్ని నగరాల్లో, పట్టణాలలో కనిపిస్తాయి. వీటి ఆవిర్భావంతో రిటైల్ మార్కెట్లు అంతరించిపోతున్నాయంటారు.

NOTE: All images in this blog are copy righted to their respective owners

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి