13, సెప్టెంబర్ 2025, శనివారం

అయాం ఎ బిగ్ జీరో (216) భండారు శ్రీనివాసరావు

  నిఘానేత్రం

నా బెడ్ రూమ్ లో పిల్లలు పెట్టించిన కన్సీల్ద్ కెమెరా కనెక్షన్ తొలగించాను.
ప్రతి ఒక్కరికీ జీవితంలో చెప్పుకునే విషయాలు, చెప్పుకోలేని విషయాలు వుంటాయి.
మా ఇంటా బయటా కూడా ఇలాంటి దొంగకళ్లు వున్నాయి. నేనిక్కడ హైదరాబాదులో ఎలా వున్నానో, ఎక్కడో వున్న మా పిల్లలు తెలుసుకోవడం కోసం ఈ ఏర్పాటు.
నాకు బెడ్ రూమ్ అంటే కేవలం బెడ్ రూమ్ కాదు.
నాకదే డైనింగ్ రూమ్. నాకదే రాసుకునే ఆఫీసు రూమ్. నాకదే చదువుకునే రీడింగ్ రూమ్. బార్ రూమ్ కూడా. దీనికి అటాచ్డ్ గా బాత్ రూమ్ వుంది.
కాలు బయట పెడితే గొప్ప. లిఫ్ట్ లో ఎప్పుడైనా కనబడితే ఇరుగు పొరుగూ, ఊరెళ్ళి ఎప్పుడు వచ్చారు అన్నట్టు చూస్తారు. (ఇప్పుడా గోల లేదనుకోండి, లిఫ్ట్ చెడి కూర్చుని చాలా రోజులయింది)
ఇంట్లో మిగతా గదులు ఖాళీ, రాముడు లేని అయోధ్యలాగా దిగాలుగా వుంటాయి. పౌర్ణమికో అమావాస్యకో ఎప్పుడైనా స్నేహితులు వస్తే బయట హాలులో కూర్చొంటాము. మర్నాడు పిల్లల ఫోన్లు, ఇలాగే హాయిగా రోజూ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయండి అని.
సమస్తమూ బెడ్ రూమ్ లోనే కాబట్టి దానికి వున్న నిఘా కెమెరా తొలగించడానికి నా కారణాలు నాకున్నాయి.
నాకున్న మతిమరపు గురించి ఎప్పుడు రాసినా, ఎన్నిసార్లు రాసినా ఎవరూ నమ్మడం లేదు. అయినా నా మతిమరపు సంగతి నేను మరచిపోలేను కదా! అందుకే నా జాగ్రత్తలో నేను వుంటాను. అందుకు తగిన ఏర్పాట్లు నేను చేసుకుంటాను. అవి ఎవరి కంటా పడకూడదు అనే కనెక్షన్ తీసేసాను.
అప్పుడెప్పుడో ఒక పెద్ద హిట్ మూవీలో హీరో ప్రతి విషయం ఎప్పటికప్పుడు మరచిపోతుంటాడు. చూసింది చూసినట్టు మెదడులో బల్క్ ఎరేజ్ అయిపోతూ వుంటుంది. అందుకే ప్రతి చిన్న సంగతి చిన్న చిన్న కాగితాలపై రాసి గోడకు అంటిస్తూ ఉంటాడు.
సరిగ్గా నేను అదే చేస్తుంటాను.
వర్క్ మెయిడ్ మమత వచ్చి పని అయిపోయింది వెడుతున్నాను అని చెప్పి వెళ్ళిపోతుంది. వలలి అంతే! మా ఆవిడ ఉన్నప్పటి నుంచి వాళ్ళే ఈ పనులు చేస్తూ వస్తున్నారు. ఎవరి వేళకు వాళ్ళు వస్తుంటారు. పోతుంటారు. వచ్చి పనులు పూర్తి చేసుకుని వెళ్ళేవరకు వాళ్లకు చెబుదామని అనుకున్న పనులు గుర్తుకు రావు. పెద్ద పనులేమీ కాదు.’ ఫ్రిడ్జ్ లో పెరుగు గిన్నెలు చాలా వున్నాయి. వాటిని పారేయండి. దేవుడి దగ్గర దీపం వెలిగించడానికి వెండి ప్రమిదను కడిగి వుంచండి, అప్పుడప్పుడూ ఎవరైనా వస్తూ తెచ్చి ఇచ్చిన స్వీట్ బాక్సులు తీసుకువెళ్ళండి, గ్యాస్ సిలిండరు ఖాళీ అయితే వెంటనే చెప్పండి’ ఇలాంటి విషయాలు అన్నమాట. మొదట్లో వీటిని ఒక కాగితం మీద రాసిపెట్టుకునే వాడిని. కాగితం ఎక్కడ పెట్టానో మరచిపోతాను. ఇవేవీ కొంపలు మునిగే సంగతులు కావు. అయినా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత గుర్తుకు వచ్చి అరెరే అనుకుంటాను. మర్నాడు వాళ్ళు వచ్చినప్పుడు ఇవేవీ జ్ఞాపకం రావు.
మా పిల్లల చిన్నతనంలో మా ఆవిడ ఒకసారి నాతొ అన్నది.
‘పిల్లలు చిన్నబుచ్చుకుంటున్నారు. ‘నాన్న మరీ అమ్మా! సందీప్ ని సంతోష్ అని పిలుస్తారు. నేను కనిపిస్తే సందీప్ అంటారు. మా పేర్లు కూడా ఆయనకి గుర్తుండవా’ అని అడిగాడు చిన్నవాడు. పిల్లల పేర్లు కూడా గుర్తుండకపోవడం ఇదెక్కడి విడ్డూరం’
‘విడ్డూరమే అయినా ఇది నిజమే కదా!’ అన్నాను ఏమనాలో తెలియక.
అప్పుడెప్పుడో ఒకరోజు , ఏరోజో, ఎప్పటిమాటో గుర్తులేదు, చాలా ఏళ్ళ కిందటే.
సాయంత్రం ఎటూ పోవాలని అనుకోలేదు. కానీ సాయంత్రం అవుతుండగానే ఒక ఫ్రెండ్ నుంచి ఫోను ‘ జింఖానాలో కలుద్దామా’ అని. ఇంటికి పంపేసిన డ్రైవర్ ని మళ్ళీ పిలిపించుకుని వెళ్లాను. అక్కడ కూర్చుని అవీ ఇవీ మాట్లాడుకుంటూ వుంటే ఒకాయన వచ్చి ‘నేను శేఖర్ రెడ్డినండీ’ అన్నాడు. ఎక్కడో చూసినట్టు వుంది కానీ చప్పున గుర్తుకు రాలేదు. పైకి మర్యాదకు ‘బాగున్నారా రెడ్డి గారూ’ అని అన్నానే కాని, మనిషిని పోల్చుకోలేక పోయాను. నాకున్న బలహీనతల్లో ఇదొకటి. ఎప్పటివో యాభయ్ అరవై ఏళ్ళక్రితం సంగతులు, ఊళ్లూ, పేర్లూ నా వ్యాసాల్లో రాస్తుండడం చూసి, నాకు జ్ఞాపక శక్తి ఎక్కువ అని పొరబడుతుంటారు. రాత్రి అన్నంలో ఏ కూర తిన్నానో మరునాటికి నాకు గుర్తుండదని వాళ్లకు తెలియదు. ఈ మతిమరపు పలు సందర్భాలలో నాకు తలనొప్పులు తేవడమే కాకుండా ‘గర్విష్టి’ అనే బిరుదును కూడా కట్టబెట్టింది. ఇదలా వుంచితే..... నేను గుర్తు పట్టలేదన్న సంగతి తెలిసి కూడా శేఖర రెడ్డి గారు నొచ్చుకోలేదు. అది ఆయన గొప్పతనం. తిరిగి వెళ్లి మళ్ళీ నాదగ్గరకు వచ్చారు. ఈసారి వారి చేతిలో ముద్దులు మూటగట్టే ఒక బాబు వున్నాడు. ‘నా మనుమడు. మా అమ్మాయి, అల్లుడు కాలిఫోర్నియాలో వుంటారు. ఒక సెల్ఫీ తీసుకుంటాను’ అన్నారాయన. అప్పటికి కానీ నాకు లైట్ వెలగలేదు. ఆయన వంద్యాల ఫణి శేఖర రెడ్డి గారు. పక్కా తెలంగాణావాది. ఫేస్ బుక్ లో, వాట్స్ ఆప్ లో సుపరిచితులు. ఇన్నాళ్ళుగా ఆయన అమెరికాలో వుంటారని అనుకుంటూ వచ్చాను. మా ఇంటికి దగ్గరలోనే శ్రీనగర్ కాలనీలోనే ఉంటారుట. ఎవరో అన్నట్టు వరల్డ్ ఈజ్ వెరీ స్మాల్.
ఇవన్నీ రాసుకుంటూ, అసలు విషయం బెడ్ రూమ్ లో నిఘా కెమెరా ఎందుకు తీసేసానో చెప్పడం మరచిపోతానేమో.
ముందు చెప్పిన సినిమాలో మాదిరిగా రేపు పనివాళ్లకు చెప్పాల్సిన విషయాలు ముందుగానే ఒక గమ్ పేపరుపై రాసుకుని వుంచుకుంటాను. అది ఎక్కడ పెట్టానో గుర్తుండదు అని కూడా చెప్పాను. ఈ విషయం కోసం నిఘా కెమెరా ఆఫ్ చేయాల్సిన అవసరం లేదు కదా!
రాత్రి పూటే నిద్ర పోవాలనే నియమం నాకు లేదు. రోజులో ఎప్పుడు నిద్ర వస్తే అప్పుడే. ఒకరకంగా నిశాచరి బాపతు. ఎప్పుడు రాయాలనిపిస్తే అప్పుడే లేచి కూర్చుని రాస్తుంటాను.
నేను వేసుకోవాల్సిన మందులు నెలకోసారి తెప్పించుంటాను. రోజుకు ఎనిమిది రకాల మాత్రలు. రేపు వేసుకోవాల్సినవి ఈరోజు రాత్రే కత్తిరించి సిద్ధంగా వుంచుకుంటాను, తెల్లవారగానే పరగడుపున వేసుకునే వాటి కోసం ఒక చిన్న డబ్బా. బ్రేక్ ఫాస్ట్ ముందు, తర్వాత వాటికోసం కొంచెం పెద్ద డబ్బా, మధ్యాన్నం, సాయంత్రం వేసుకునేవి ఇంకొంచెం పెద్ద డబ్బాలో. ఇలా వేరుచేసి పెట్టుకోవడం వల్ల, మతిమరపు కారణంగా ఏ మాత్ర అన్నా వేసుకోవడం మరచిపోయిన సంగతి వెంటనే తెలిసిపోతుంది.
అర్ధరాత్రి లేచి కూర్చుని రాయడాలు, మాత్రల కత్తిరింపులు కెమెరాలో చూసిన వాళ్ళు నవ్వుకోరూ!
అందుకే, కన్సీల్ద్ కెమెరాల్లో ఇలాంటి దృశ్యాలు చూసే అవకాశం పిల్లలకు వుండకూడదని ఈ ఏర్పాటన్న మాట.
తోకటపా:
శ్రీ పరకాల ప్రభాకర్ చెప్పిన జోకు
ఈరోజు అంటే ఈరోజు అని కాదు, 2015లో ఈరోజు అని అర్ధం.
అంటే 2015, డిసెంబరు ఇరవై ఏడో తేదీ అన్నమాట.
హైదరాబాదు ప్రెస్ క్లబ్ లో వయోధిక పాత్రికేయ సంఘం పదేండ్ల పండగ జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల సమాచార సలహాదారులు శ్రీయుతులు కే.రమణాచారి, శ్రీ పరకాల ప్రభాకర్, రెండు రాష్ట్రాల ప్రెస్ అకాడమీ అధ్యక్షులు శ్రీయుతులు వాసుదేవ దీక్షితులు, అల్లం నారాయణ హాజరయి ప్రసంగించారు. ఈ సందర్భంగా పరకాల ప్రభాకర్ మాట్లాడుతూ సందర్భోచితంగా ఒక హాస్య గుళిక వదిలారు. వయోధికుల సమావేశం కదా!
“వయస్సు పైబడిన తరువాత ప్రతి వ్యక్తి జీవితంలో మూడు బాగా పెరిగిపోతాయి. మొట్టమొదటిది, అందరికీ తెలిసిందే. మతిమరపు. మిగిలిన రెండూ .....నా మతిమండా మరచిపోయాను సుమీ!”
కింది ఫోటో:
సైజులవారీ మాత్రల డబ్బాలు:



(ఇంకావుంది)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి