గ్రహణం (పగ) పట్టింది.
ఏదో
ఛానల్ లో మూడో నాలుగో జన్మల సినిమా వస్తోంది. చనిపోయిన మనుషులు అలా తారసపడే అవకాశం
ఉందా?
మా
అన్నయ్య రామచంద్ర రావు గారు ఫోన్ చేశారు.
‘ఎలా
వున్నావు? జలుబు
తగ్గిందా! జ్వరం లేదు కదా! పనివాళ్లు వస్తున్నారా? వంటమనిషి వచ్చింది కదా!’
రొటీన్
గా అనిపించే ఆ ప్రశ్నల్లో ఇతరులకు తెలియని ఆప్యాయత వుంది. ఇలాంటి అన్నయ్యలు ఎందరికి
వున్నారు?
నాకయితే వున్నాడు. ఏమున్నాలేకపోయినా ఈ జీవితానికి ఇది చాలు.
‘ఇవ్వాళ
చంద్రగ్రహణం. పలానా టైం లోగా భోంచేయి’
మిత్రుడు
అధరాపురం మురళీ కృష్ణ గారు కూడా ఇలాంటి సూచనే చేశారు ఆయన పోస్టులో.
‘ఈ రాత్రి
9.56 నుంచి 1.26 వరకు సంపూర్ణ చంద్రగ్రహణం. ఆ సమయంలో వీలయితే జపం
చేసుకోండి”
మా అన్నయ్య చెప్పింది విన్నాను. మురళీ కృష్ణ గారు
రాసిందీ చదివాను.
నా జపం నేను చేసుకున్నాను.
గ్రహణ సమయంలో ఏమి చేయరాదో అవన్నీ, మొదటి సంతానాన్ని
కడుపుతో వున్న మా ఆవిడతో చేయించిన ఘనుడిని.
ఘోరమైన తప్పులు
చేసి కూడా శిక్షలు పడకుండా తిరిగే ఘరానా నేరగాళ్ళు కొందరు మన మధ్యనే దర్జాగా
తిరుగుతుంటారు. అలాంటి వారి జాబితా తీస్తే మొదటి పేరు నాదే.
కొంచెం అటూ ఇటూగా నలభయ్
రెండేళ్ల కిందటి మాట. అప్పుడూ సంపూర్ణ సూర్యగ్రహణం వచ్చింది. మా ఆవిడ కడుపుతో
వుంది. చీకటి గదిలో కదలకుండా పడుకోమని పెద్దవాళ్ళ మాట. అలా చేయకపోతే పుట్టే బిడ్డ
అవకరంగా పుడుతుందని హెచ్చరిక లాంటి సలహా. ఇంటి మొత్తంలో
చిన్నవాడ్ని నేనే అయినా నా మాటే చెల్లితీరాలనే మొండి వాళ్ళలో నేనే పెద్దవాడిని.
ఎలా వింటాను? కానీ ఈ పంతాలు, పట్టింపుల్లో మానసికంగా నలిగిపోయేది మా ఆవిడే అనే సంగతి నేను
పట్టించుకోలేదు. గదిలో పడుకోవద్దు అనే దగ్గర ఆగిపోతే నేను నేనెలా అవుతాను.
పట్టుబట్టి గోధుమ పిండి కలిపించాను. రొట్టెలు చేయించాను. ఆ రోజల్లా అవసరం లేని
చాకిరీ చేయించాను. అంటే బట్టలు ఉతకడం, పిండి ఆరేయడం ఇలా
అన్నమాట. నిజానికి ఈ పనులు చేయడానికి ఇంట్లో పని పిల్ల వుంది. కానీ నా యుద్ధం
మూఢనమ్మకాలపైన. మా ఆవిడకు అది తొలి చూలు. సొంత బిడ్డపై ప్రయోగాలను ఏ ఆడది అయినా
సహిస్తుందా! కానీ ప్రేమించి పెళ్ళాడినందుకు నేను పెట్టే ఈ రకమైన క్షోభను అంతా పంటి
బిగువన ఓర్చుకుంది. నేను చెప్పినట్టే నడుచుకుంది. చుట్టపక్కాలు నా దాష్టీకాన్ని
తప్పుపట్టారు. కానీ నా దారి నాదే. ఆ రోజు అలా గడిచిపోయింది. మొదటి పిల్లాడు
పుట్టాడు ఎలాంటి శారీరక వైకల్యం లేకుండా. సూర్య గ్రహణం ఎలాటి ప్రభావం చూపనందుకు
పెద్దవాళ్ళు సంతోషపడ్డారు. కానీ నా మానసిక వైకల్యం మాటేమిటి?
పెళ్లి అనే ఒక
బంధంతో ఆడదానిపై మగవాడికి సర్వహక్కులు వచ్చేస్తాయా! ఆమెకు ఒక మనసు ఉంటుందని
గ్రహించలేని మగాడు మూఢాచారాలపై పోరాటం చేస్తున్నానని గొప్పలకు పోవడం వల్ల ప్రయోజనం
ఏమిటి? ఈ రకమైన మానసిక చిత్ర హింసలకు శిక్షలు ఉండవా?
వుండవు. నేనే సజీవ
సాక్ష్యం.
బహుశా గ్రహణం
అప్పుడు పగ పట్టి వుంటుంది. నా జీవన సహచరిని, ఎదిగివచ్చిన రెండో కుమారుడిని నా
నుంచి వేరు చేసి పగ తీర్చుకుంది.
నాకు ఇదే
కావాల్సింది. నన్నూ తీసుకుపోతే పూర్తి పగ తీరుతుంది.
కానీ పగ తీరాలి
అంటే బాధను పెంచాలి కదా!
అందుకే నా ఎనభయ్యవ ఏట కనపడని ఈ చంద్ర గ్రహణాన్ని
చూస్తున్నాను.
(07-09-2025)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి