5, జనవరి 2025, ఆదివారం

అయాం ఎ బిగ్ జీరో (53) - భండారు శ్రీనివాసరావు

 1974, అక్టోబర్  2.

దక్షిణ మధ్య రైల్వే అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కృష్ణా ఎక్స్ ప్రెస్ ప్రారంభోత్సవం ఆ రోజు జరగబోతోంది. ఆ రైల్వే జోన్ మొత్తంలో అతి వేగంగా నడిచే మొట్టమొదటి రైలును నాటి ముఖ్యమంత్రి జలగం వెంగళ రావు పచ్చ జెండా ఊపి ప్రారంభించబోతున్నారు. సికిందరాబాదు రైల్వే స్టేషన్ లో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. తాము ఆహ్వానించిన పత్రికల జర్నలిష్టులకు కూడా రైల్లో విజయవాడ వరకు  ప్రయాణానికి, తిరిగి రావడానికి ఏర్పాట్లు జరిగాయి.

సమయపాలనకు పెట్టింది పేరైన ముఖ్యమంత్రి వెంగళరావు సకాలంలోనే వచ్చారు. పచ్చ జండా పట్టుకుని సిద్ధంగా నిలబడ్డారు. రైల్లో తమకు కేటాయించిన సీట్లలో కూర్చోవాల్సిన జర్నలిష్టులు, ప్లాట్ ఫారం పై ముఖ్యమంత్రి ఏమైనా మాట్లాడుతారేమో అని భావించి తమ లగేజి బోగీలో వదిలేసి ప్లాట్ ఫారం మీదనే నిలబడ్డారు. ఇంతలో ముఖ్యమంత్రి జెండా ఊపడం, రైలు కదలడం ఒకేసారి జరిగాయి. ఇది ఊహించని కొందరు పాత్రికేయులు ప్లాట్ ఫారం మీదనే వుండి పోయారు. మరికొందరు సాహసించి కదులుతున్న రైలును ఎక్కేశారు. మేము ఎక్కకుండానే రైలును ఎలా బయలుదేరదీసారని కొందరు జర్నలిష్టులు అధికారులతో వాగ్వాదం పెట్టుకున్నారు. దాంతో అధికారులు రోడ్డు మార్గంలో వెళ్ళడానికి, తరువాతి స్టేషన్ లో వారిని ఎక్కించడానికి అప్పటికప్పుడు ఏర్పాట్లు చేశారు. రైలు ఎక్కలేని పాత్రికేయులు రైల్వే వారు సమకూర్చిన టెంపోవ్యాను ఎక్కారు. ఒకపక్క అత్యంత వేగంగా ప్రయాణించే కృష్ణా ఎక్స్ ప్రెస్ రైలు మార్గంలో దూసుకు వెడుతుంటే, మరో పక్క రోడ్డు మార్గంలో ఈ వ్యాను ప్రయాణం మొదలైంది. వ్యాను నకరేకల్ చేరే సమయానికి అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టుని బలంగా డీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు జర్నలిష్టులు మృత్యువాత పడ్డారు. మరో ముగ్గురు తీవ్రమైన గాయాల పాలై జీవితాంతం అవిటివారిగానే మిగిలిపోయారు.

చనిపోయిన వారిలో హైదరాబాదు ఆకాశవాణి విలేకరి తురగా కృష్ణ మోహనరావు గారు, తెలంగాణా న్యూస్ సర్వీసు విలేకరి అజీజ్, మలయాళ మనోరమకు చెందిన టీవీ ఆనంద్ వున్నారు. ఇండియన్ ఎక్స్ ప్రెస్ కు చెందిన గంటి ఎస్. మహదేవన్, డెక్కన్ క్రానికల్ న్యూస్ ఎడిటర్ జివికె మూర్తి కు తీవ్ర గాయాలు అయ్యాయి. రెహనుమా డెక్కన్ పత్రిక విలేకరి హిలాల్ ముర్తుజాకు కాలు తొలగించాల్సి వచ్చింది. నిజానికి అప్పుడు ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో పనిచేస్తున్న దాసు కేశవరావుగారు ఈ కార్యక్రమం కవర్ చేయాల్సి వుంది. అయితే ఆయన సీనియర్ కొలీగ్ మహదేవన్ గారికి  విజయవాడలో ఏదో సొంతపని వున్న కారణంగా ఆయన తనకు తానుగా ఈ బాధ్యత  నుంచి తప్పుకున్నారు. ఆవిధంగా అనుకోకుండా వెళ్ళిన  మహదేవన్ ప్రమాదానికి గురయ్యారు. ఆంధ్రజ్యోతి ప్రతినిధి ఆదిరాజు ఈ ప్రమాదం నుంచి తృటిలో తప్పుకున్నారు. కృష్ణా ఎక్స్ ప్రెస్ కదలడం గమనించిన ఆదిరాజు రైలు పూర్తి వేగం అందుకోక ముందే ఎగిరి దూకి బోగీలోకి ఎక్కారు. ఆ రోజుల్లో కమ్యూనికేషన్ సదుపాయాలు లేకపోవడం వల్ల ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

సరే! మళ్ళీ ప్రస్తుతానికి వస్తే,

కృష్ణా ఎక్స్ ప్రెస్ ప్రారంభోత్సవం గురించిన వార్త పత్రికకి ఇవ్వడానికి వచ్చిన ఆదిరాజు వార్త రాస్తూ రాస్తూ యు ఎన్ ఐ టిక్కర్ చూసి నిర్ఘాంతపోవడానికి కారణం అదే. ఆయనకు కూడా అప్పటివరకు ఈ ప్రమాదం గురించి తెలియదు. తర్వాత రైల్వే అధికారులతో మాట్లాడి, పూర్తి సమాచారం సేకరించి వార్త ఇచ్చారు. అప్పటివరకు సిగరెట్ మీద సిగరెట్ తాగడం తప్ప కప్పు కాఫీ కూడా తాగలేదు. అంతటి పని రాక్షసుడు ఆదిరాజు.

ఆ తర్వాత చాలా రోజులకు, నేను ఆఖరి నిమిషంలో కధాచిత్ గా దరకాస్తు చేసిన  ఆలిండియా రేడియో ఉద్యోగం, నకరేకల్ దుర్ఘటనలో  తురగా కృష్ణ మోహనరావు గారి ఆకస్మిక మరణం కారణంగా ఖాళీ అయిన పోస్టు. ఎమర్జెన్సీలో ప్రభుత్వ ఉద్యోగులు అందరు భయపడి పనిచేసిన కారణంగా కావచ్చు, నా అప్లికేషన్ సకాలంలో రేడియో వారికి చేరింది. కొంత కాలానికి ఇంటర్వ్యూ కు హైదరాబాదు రమ్మని పిలుపు వచ్చింది.

కింది ఫోటో:

తురగా కృష్ణ మోహనరావు గారు రాసిన మాట కచేరీ పుస్తకంపై ఆయన రేఖా చిత్రం



(ఇంకా వుంది)

2 కామెంట్‌లు:

  1. విస్మయం గొలిపే బాధాకరమైన సంఘటన ఇది. ట్రెయిన్ ను తదుపరి స్టేషన్ లో అందుకోవాలనే ప్రయత్నం నిజంగా దుస్సాహసమే.

    రిప్లయితొలగించండి
  2. దుస్సాహసమే కాదు, అనాలోచిత నిర్ణయం కూడా. ఆ రైలు మధ్యలో కాజీపేట, వరంగల్, డోర్నకల్, ఖమ్మం స్టేషన్లలో మాత్రమే ఆగుతుంది. తర్వాత చివరి స్టేషన్ విజయవాడ మాత్రమే. రోడ్డు మార్గంలో ఈ స్టేషన్లు ఏవీ లేవు, అందుకోవడానికి.

    రిప్లయితొలగించండి