2, జనవరి 2025, గురువారం

అయాం ఎ బిగ్ జీరో (52) - భండారు శ్రీనివాసరావు

 విషయం తెలియగానే, వెంటనే అమెరికన్ ఆసుపత్రికి వెళ్లాను. అదే మొదటిసారి అక్కడికి వెళ్ళడం. మధ్య మధ్య రమణి గారిని వెంటబెట్టుకుని వెళ్లి తానే పరీక్షలు చేయించుకుని వచ్చేది. అంచేత ఎలాంటి సమస్య లేకుండా వెంటనే అడ్మిట్ చేసుకున్నారు. నేను వెళ్ళే సరికే కానుపు అయిపోయింది. మగపిల్లవాడు. రమణి గారు నన్ను చూసి మెత్తగానే అంటించారు. ‘మీరు భలే వాళ్లండి బాబూ. నెలలు నిండిన ఆవిడని ఇంట్లో అలా వదిలేసి ఎలా వెళ్ళారండి అని మొహం మీదే అనేసారు. ఏదైతేనేం మొత్తం మీద కధ సుఖాంతం. ఆ సంతోషంలో నేను, అప్పుడే పుట్టిన పిల్లాడికి సంతోష్ అని పేరు పెట్టేశాను. చెప్పాను కదా! మా ఇంట్లో అంటే నా ఇంట్లో పిల్లలకు ఎవరికీ నామకరణాలు లేవు, బాలసారలు లేవు.  పెద్దవాడు మద్రాసులో ఆదివారం నాడు పుట్టాడు. సండే కాబట్టి సందీప్ అని పేరు పెట్టాను.

మా బామ్మ రుక్మిణమ్మ గారు కూడా ఇలాగే పేర్లు పెడుతుంటుంది. మా ఐదో అక్కయ్య పేరు అన్నపూర్ణ. మా మూడో వదిన పేరు కూడా అన్నపూర్ణ. అంచేత ఆమె పేరును అరుణగా మార్చేసింది. మా ఆవిడ పేరు దుర్గ. మొదటిసారి ఆమెను కంభంపాడులో చూసినప్పుడు,  దుర్గ కాదు, ఈ పిల్లది నిర్మలమైన మనసు, ఇక నుంచి ఈ పిల్ల పేరు నిర్మల అని అప్పటికప్పుడు నామకరణం చేసేసింది. అదే చివరికి ఖాయమైంది, పాసుపోర్టులోనే కాదు, డెత్ సర్టిఫికేట్ లో కూడా అదే పేరు.

మూడో రోజే డిశ్చార్జ్ చేశారు.  ఇంటికి తీసుకువచ్చాము. అప్పటి నుంచి మా ఇద్దరు  పిల్లల్ని ఇంటివాళ్ళే పెంచారు. ఇంటి ఓనరు రాములు  రమణి గార్లకు ముగ్గురు ఆడపిల్లలు, లక్ష్మి, ఝాన్సి, బుడ్డి, బబ్లూ. మా ఆవిడ ఆసుపత్రిలో ఉన్న మూడు రోజులు ఈ పిల్లలే మా పెద్ద పిల్లవాడు, అప్పటికి రెండేళ్ల వాడు, సందీప్ బాగోగులు చూసుకున్నారు.  తల్లికి సరిగా పాలు పట్టకపోవడం వల్ల, వాడు  పూర్తిగా డబ్బా పాల మీదే పెరిగాడు. ఆ రోజుల్లో అమూల్ స్ప్రే అని పాల డబ్బాలు వాడేవాళ్ళం. కొన్నాళ్ళు  వీటికి తీవ్రమైన కొరత వచ్చింది.  బెజవాడ వన్ టౌన్ లో ఒక షాపులో అధిక ధరలకు బ్లాకులో  అమ్మేవాళ్లు. అక్కడికి పోయి కొనుక్కుని వచ్చేవాళ్ళం.  మా మామగారు మద్రాసు నుంచి ఎవరైనా తెలిసిన వాళ్ళు వస్తుంటే వాళ్ళతో అమూల్ స్ప్రే పాల టిన్నులు ఒకేసారి డజను పంపించే వారు. రెండో వాడు సంతోష్ తో ఈ సమస్య ఎదురుకాలేదు. తల్లి పాలతోనే పెరిగాడు.

చాలీ చాలని జీతాలు. జీతం సరిగా లేకపోయినా సంఘంలో గౌరవ మర్యాదలు బోలెడు. ఆ తృప్తి కోసం కొంతా, వేరేదారి లేక కొంతా అదే గొర్రెతోక జీతపు  ఉద్యోగంలో కొనసాగాల్సి వచ్చింది. ఆ రోజుల్లో జ్యోతిలో పనిచేసే జర్నలిస్టులందరికి ఆంధ్రప్రభ ఓ ఆశారేఖ. ఏదో విధంగా అందులో కొలువు సంపాదించుకుంటే జీవితం కుదురుకుంటుంది అనే భరోసా ఆ వైపుగా ప్రయత్నాలు చేయడానికి దోహదం చేసింది. నిజానికి నండూరి రామమోహన రావు గారి దగ్గర పనిచేయడం అంత సులువు మరోటి వుండదు. ఆంధ్రప్రభ ఎడిటర్ పండితారాధ్యుల నాగేశ్వరరావు గారు మాకు బాగా   తెలిసిన వారే కాకుండా మా బావగారి తరపున బంధువు కూడా. వారి అన్నగారి కుమారుడు రమణారావుకు, పండితారాధ్యుల నాగేశ్వరరావు గారి అమ్మాయిని ఇచ్చారు. ఆ రోజుల్లో ఆయన తీవ్రమైన ఉబ్బసం జబ్బుతో సతమతమవుతున్నారు. చాలా రోజులు ఆఫీసుకు వెళ్ళకుండా ఇంటి నుంచే పత్రిక వ్యవహారాలు చూస్తుండేవారు. నేను మా ఆవిడ ఇద్దరం పదిరోజులకోమారు వాళ్ళ ఇంటికి  వెళ్లి కలిసే వాళ్ళం. మేము ఉన్నంతసేపు ఆయన దగ్గుతూనే వుండేవారు. అలాంటి పరిస్థితిలో ఏం మాట్లాడాలో, ఉద్యోగం ఎలా అడగాలో అర్ధం అయ్యేది కాదు. కానీ ఆయనే కష్టపడుతూ రెండు ముక్కలు సైగలతో చెప్పేవాళ్ళు. కాస్త ఉపశమనం దొరికి ఆఫీసుకు పోయిన తర్వాత నీ సంగతి చూస్తాను అని ఆయన అన్నట్టు అర్ధం చేసుకుని తిరిగి ఇంటిదారి పట్టేవాళ్ళం.   

ఈ లోగా ఎమర్జెన్సీ వచ్చి పడింది.

1975 జూన్ 25

దేశంలో ఎమర్జెన్సీ విధించిన చీకటి రోజది.

బెజవాడ ఆంధ్రజ్యోతిలో చేరి అప్పటికి నాలుగేళ్ళు గడిచాయి. వున్నట్టుండి 'ఎమర్జెన్సీ' అనే కొత్త పదం పత్రికాపారిభాషిక పదకోశంలో చేరింది. ఇంగ్లీష్ పత్రికలకు పరవాలేదు. తెలుగులో ఏమి రాయాలి. కొన్ని తెలుగు దినపత్రికలు 'అత్యవసర పరిస్తితి' అని అనువాదం చేసాయి. కానీ ఆంధ్రజ్యోతి ఎడిటర్ నార్ల వేంకటేశ్వర రావు గారిది ప్రత్యేక బాణీ. అందుకే ఆయన, అ కు దీర్ఘం పెట్టి, 'ఆత్యయిక పరిస్తితి' అని నామకరణం చేశారు.

ఆనాటి రాజకీయ పరిణామాల నేపధ్యంలో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ దేశంలో అత్యవసర పరిస్తితి విధించాలని నిర్ణయించారు. కేంద్ర మంత్రిమండలి జూన్ ఇరవై ఐదో తేదీ రాత్రి అత్యవసరంగా సమావేశమై ఎమర్జెన్సీ విధిస్తూ తీర్మానించింది. మంత్రివర్గ తీర్మానానికి అనుగుణంగా రూపొందించిన ఆర్డినెన్స్ పై నాటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ జూన్ ఇరవై అయిదు అర్ధరాత్రి అంటే మరి కాసేపట్లో ఇరవై ఆరో తేదీ ప్రవేశించే ఘడియకు కొన్ని నిమిషాల ముందు దానిపై సంతకం చేశారు. ఆ రోజుల్లో ఇప్పటిలా టీవీ ఛానల్లు లేవు. 'ఆకస్మిక సమాచారం' లేదా 'ఇప్పుడే అందిన వార్త' తెలుసుకోవాలన్నా, వినాలన్నా రేడియో ఒక్కటే దిక్కు. అంచేత ఆ అర్ధరాత్రి నిర్ణయం గురించి మరునాడు ఉదయం ఆరుగంటలకు ప్రసారం అయ్యే రేడియో ఇంగ్లీష్ వార్తల్లో కాని యావత్ దేశానికి తెలియని పరిస్తితి. ఆ మరునాడు పత్రికలన్నింటిలో 'ఎమర్జెన్సీ' అనేదే పతాక శీర్షిక. బెజవాడలో చాలామంది మిలిటరీ ప్రభుత్వం వచ్చిందని అనుకున్నారు కూడా.

దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులను వేల సంఖ్యలో అరెస్టు చేసి జైళ్ళలో పెట్టారు. పత్రికా వార్తలపై సెన్సార్ షిప్ విధించారు. పత్రికల సెన్సార్ షిప్ అంటే ఏమిటో అప్పటిదాకా పత్రికలకీ తెలియదు. అధికారులకీ తెలియదు. ఆ రోజుల్లో పత్రికలకి ప్రత్యేకించి తెలుగు దినపత్రికలకి నేటి మాదిరిగా అధునాతన ముద్రణాయంత్రాలు లేవు. ప్రతి అక్షరం ఏర్చి కూర్చి అచ్చుకు పంపాల్సిన రోజులు. కృష్ణా జిల్లా కలెక్టర్ గారు సంతానం గారి పనుపున ఆనాటి సమాచార శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ అయిన మా పెద్దన్నయ్య భండారు పర్వతాలరావు సెన్సార్ పనులు పర్యవేక్షించేవారు. ఏవార్త పత్రికలో ముద్రించాలి ఏది రాకూడదు అని ఆయనే నిర్ణయించేవారు. ఆ అధికారి కార్యాలయం గాంధీ నగర్ లో వుండేది. ఆంధ్రజ్యోతి ఆఫీసు లబ్బీపేటలో. ప్రతిరోజూ సాయంత్రం ప్రచురించే వార్తల్ని అచ్చులో కూర్చి అక్కడికి పట్టుకెళ్ళేవాళ్లు. కొన్నాళ్ళ తరువాత ఏది వేయాలో ఏది వేయకూడదో పత్రికలకే అలవాటు కావడంతో రోజూ తీసికెళ్ళే శ్రమ తగ్గిపోయింది. ఈలోపల ఇండియన్ ఎక్స్ ప్రెస్ అందరికీ ఓ దోవ చూపింది. వాళ్లు సంపాదకీయం ప్రచురించే జాగాను ఖాళీగా ఒదిలేయడం మొదలెట్టారు. దాంతో మిగిలిన వాళ్లు అందిపుచ్చుకుని సెన్సార్ అయిన వార్తల జాగాను ఖాళీగా తెల్లగా కనబడేట్టు ఒదిలేసి పత్రికలు ప్రచురించడం ప్రారంభించారు. ఈ నిరసన సులభంగానే ప్రజల్లోకి చేరింది. పత్రికలపై సెన్సార్ షిప్ గురించి జనం మాట్లాడుకోవడం మొదలెట్టారు. ఇదో కధ.

మరో వైపు ఎమర్జెన్సీ దమన కాండ ఉత్తర భారతంలో అమలు జరుగుతున్న తీరు గురించి పుంఖానుపుంఖాలుగా వదంతులు వ్యాపించేవి. దక్షిణ భారతంలో ప్రత్యేకించి కాంగ్రెస్ పాలనలో వున్న ఆంధ్రప్రదేశ్, కర్నాటకల్లో పరిస్తితి కొంత మెరుగు. ఈ రాష్ట్రాల్లో కూడా రాజకీయ అరెస్టులు బాగానే జరిగాయి. కానీ ఉత్తర భారతంలో మాదిరిగా నిర్బంధ కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు, ఇళ్ళ కూల్చివేతలు జరగలేదు. పైపెచ్చు, ప్రజానీకంలో ముఖ్యంగా బీదాబిక్కీకి అసలీ గొడవే పట్టలేదు. ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం అడగడానికీ, తీసుకోవడానికీ భయపడిపోయేవాళ్ళు. ఫైళ్ళు చకచకా కదిలేవి. తెల్లవారుతూనే రోడ్లు శుభ్రంగా వూడ్చేవాళ్ళు. రోడ్డుపక్కన మూత్రవిసర్జన అనేది కలికానికి కూడా కానరాకుండా పోయింది. ఎమర్జెన్సీ బాగా వుందని కూడా జనం అనుకోవడం ప్రారంభించారు. మొదట్లో ధరవరలు కూడా ఆకాశం నుంచి దిగివచ్చాయి. బ్లాకు మార్కెట్ మాయమయింది.

అయితే ఏ భయం అన్నా కొన్నాళ్ళే అని తర్వాత తేలిపోయింది. జనంలో అంతకు ముందు వున్న బెరుకు పోయింది. అధికారుల్లో అది అంతకు ముందే పోయింది. దాంతో కధ మళ్ళీ మొదటికి వచ్చింది. ఇదో కధ. ఒదిలేద్దాం.

ఒక రోజు మా పెద్దన్నయ్య ఒక పత్రికలో ఓ మూలన చిన్నగా వేసిన ఒక ఉద్యోగ ప్రకటన క్లిప్పింగు నాకు ఇచ్చాడు.

హైదరాబాదు ఆకాశవాణి కేంద్రంలో అసిస్టెంట్ ఎడిటర్ (రిపోర్టింగ్) ఉద్యోగం. బేసిక్ జీతం 325 రూపాయలు. జర్నలిజంలో మూడు నాలుగేళ్లు అనుభవం వున్న వాళ్ళు, తెల్లకాగితంపై వివరాలు రాసి  ఆ నెలాఖరు లోగా అప్లయి చేసుకోవాలి. వ్రాత పరీక్ష లేదు. నేరుగా అర్హులైన వారిని ఇంటర్వ్యూకి పిలుస్తారు.  అన్నయ్య నాకు ఆ క్లిప్పింగు  ఇచ్చాడు అంటే అర్ధం దరఖాస్తు పెట్టమని పరోక్షంగా సూచన అన్నమాట. చాలా రోజులు తర్జనభర్జనలు పడి, చివరకు  ఎల్లుండి ఆఖరు రోజు అనగా ఒక దరఖాస్తు మామూలు పోస్టులో  పంపి ఆ విషయం మరిచిపోయాను.   

కొన్ని నెలలు వెనక్కి వెడితే.

ఆ రోజు ఆఫీసులో పనిచేసుకుంటూ వుండగా ఆంధ్రజ్యోతి హైదరాబాదు ప్రతినిధి ఆదిరాజు వెంకటేశ్వర రావు గారు హడావిడిగా మెట్లెక్కి ఎడిటోరియల్ హాలులోకి వచ్చారు. ఆయన రావడం అంటే తుపాను వచ్చినట్టే. ఆదిరాజు గారిని పదిమందిలో వున్నా, వందమందిలో వున్నా గుర్తుపట్టవచ్చు. ఒక్క సివిల్ కోర్టు ఆవరణలో తప్పిస్తే కోటు వేసుకున్నవాళ్ళు బెజవాడ మొత్తం మీద కనబడరు. ఈయన ఎప్పుడూ ఫుల్ సూటు, టై. నిగనిగలాడే బూట్లు, ఒక చేతిలో బ్రీఫ్ కేసు, రెండో చేతి వేళ్ళ మధ్యలో వెలుగుతున్న సిగరెట్టూ. రావడం రావడమే ఒక కుర్చీ బల్ల దగ్గరకు లాక్కుని వార్త రాయడం మొదలు పెట్టారు. అంతవరకూ ఎవరితో మాటాపలుకూ లేదు. దీక్షగా రాస్తూ పోయారు. ఈ లోగా పక్కనే వున్న యూఎన్ఐ క్యాబిన్ నుంచి గంట వినపడింది. ఏదైనా అర్జంటు వార్త వచ్చినప్పుడు అలా గంట మోగుతుంది. ప్యూన్ వెళ్ళేలోగా ఆదిరాజుగారే పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ వార్తా సంస్థ పంపిన వార్త కాగితాన్ని చించుకుని వచ్చారు. దాన్ని చూస్తూనే మ్రాన్పడి పోయారు. ఏదో జరిగిందని ఆయన మొహంలోని ఆందోళన బట్టి తెలుస్తోంది కానీ ఏమి జరిగిందన్నది ఎవరికీ అర్ధం కావడం లేదు. అంతవరకూ రాసిన కాగితాలను డస్ట్ బిన్ లో పడేసి కొత్తగా రాయడం మొదలు పెట్టారు.  విషయం ఏమిటి అని అడిగే ధైర్యం ఎవరికీ లేదు. అందరం అలా చూస్తూ వుండిపోయాం.

కింది ఫోటో:

ప్రముఖ పాత్రికేయుడు ఆదిరాజు వెంకటేశ్వరరావు



(ఇంకా వుంది)    

1 కామెంట్‌:

  1. మీ మాస్కో డేస్ లను గుర్తు చేసుకోవచ్చండీ

    ఈ రష్యన్ అమ్మాయి రష్యా గాట్ టేలెంట్ లో తెలుగు సాంగ్ రా రా కు డాన్సు బ్రహ్మాండంగా చేసేస్తోంది

    https://youtu.be/vmsDCmJqfK4?feature=shared

    రిప్లయితొలగించండి