18, డిసెంబర్ 2024, బుధవారం

అయాం ఎ బిగ్ జీరో (42) - భండారు శ్రీనివాసరావు

 


 

వాస్తవానికి సమాజంలో వైద్యులది విశిష్టమయిన స్తానం. అందుకే డాక్టరును ‘డాక్టరు గారు’ అని గౌరవంగా

సంబోధిస్తారు. నలుగురిలో వారికి పెద్దపీటవేసి మన్నన చేస్తారు. రోగాలబారి నుంచి కాపాడే అపర ధన్వంతరులుగా, ప్రాణబిక్ష పెట్టే కలియుగ దైవాలుగా కొలుస్తారు. నాకిప్పటికీ గుర్తు. మా చిన్నతనంలో మా వూరికి వారానికోసారి, పొరుగూరు  ఆలూరుపాడు నుంచి రామకృష్ణయ్య గారనే ఓ డాక్టరుగారు సైకిలు మీద వచ్చేవారు. చిన్న చితకా జ్వరాలకు తనతో తెచ్చుకున్న తోలుపటకా సంచీ నుంచి మందు గోలీలు ఇచ్చి వైద్యం చేసేవారు. నాకు అప్పుడు తెలియదు కానీ ఆ డాక్టరు గారు చేసేది హోమియో వైద్యం. ఆయన వస్తూనే మా ఇంటి ముందు నులక మంచం మీద కూర్చుని ముందు మా ఇంట్లో వాళ్ళ యోగక్షేమాలు కనుక్కునే వారు. ఆయన వచ్చారు అని తెలియగానే ఒంట్లో నలతగా ఉన్న బీదా బిక్కీ రోగులు వచ్చేవారు. ఎవరి దగ్గర నుంచి ఇంత అని అడిగి డబ్బులు తీసుకోవడం నేను చూడలేదు.  పంటలు చేతికందినప్పుడు వూళ్ళోని పెద్ద పెద్ద ఆసాములు ఏడాదికోసారి కొలిచి ఇచ్చే ధాన్యం మినహా ఆ డాక్టరు గారు ఏనాడూ రోగులనుంచి ఫీజు వసూలు చేసిన దాఖలా లేదు. ఆయన వూరికి వస్తే చాలు దేవుడే నడిచివస్తున్నట్టుగా జనం భక్తి ప్రపత్తులు ప్రదర్శించేవారు. నాడి పట్టుకుని చూసి ‘ఇప్పుడెలావుందయ్యా రాముడూ’ అని ఆప్యాయంగా అడగగానే సగం రోగం చేతులతో తీసివేసినట్టు వుండేది. చుట్టుపక్కల అయిదారు వూళ్ళకు ఆయనే దిక్కు. సైకిల్ తొక్కుకుంటూ రోజుకో వూరు చుట్టబెట్టేవారు. ఆ రోజుల్లో సౌకర్యాలు అంతంత మాత్రమే. కరెంటు వుండేది కాదు. ఉక్కపోస్తున్నా, నులక మంచంమీద కూర్చుని తన మానాన తాను రోగులకు వైద్యం చేస్తుండేవారు. కళ్ళల్లో కారుణ్యం. మొహంలో చెదరని చిరునవ్వు. ఆయన హస్తవాసిపట్ల అందరికీ అపరితమయిన గురి. జనాలకు కొండంత ధైర్యం.

మళ్ళీ ఇలాంటి డాక్టరుని ఖమ్మం జిల్లా రెబ్బారం లోని మా రెండో బావగారు కొలిపాక రామచంద్రరావు గారింట్లో చూసాను. ఆయన్ని గొల్లపూడి డాక్టరు గారు అని పిలిచేవాళ్ళు. రెబ్బారం పక్కన వున్న గొల్లపూడి నుంచి సైకిల్ మీద చుట్టుపక్కల ఊళ్ళు తిరుగుతూ వైద్యం చేసేవారు.  

ఇంగ్లీష్ వైద్యం కావాలి అంటే నాలుగు మైళ్ళ దూరంలో వున్న పెనుగంచి ప్రోలుకో, మరో పక్క ఊరు వత్సవాయి కో వెళ్ళాలి. వానాకాలం వస్తే వాగులు, వంకలు పొంగి బండ్ల మీద పోవడం కష్టం అయ్యేది. పెనుగంచి ప్రోలుకు మా ఊరికీ మధ్య మునేరు.  ఎగువన పెద్ద వర్షం పడితే ఆ ఏటికి ఆకస్మిక వరదలు వచ్చేవి. పడవల మీద దాటి వెళ్ళాలి. పడవ ఎక్కాలంటే మా బోటి చిన్నపిల్లలకి నడుం దాకా నీళ్ళు వచ్చేవి. కాలి కింద ఇసుక కదిలి కొట్టుకు పోతామేమో అనే భయం వేసేది. ఇద్దరు పనివాళ్లు మా రెండు రెక్కలు గట్టిగా పట్టుకుని పడవ  ఎక్కించేవాళ్లు, పడవకు కూడా డబ్బులు ఇచ్చేపనిలేదు. ఏడాదికోసారి కళ్లాల సమయంలో ధాన్యం కొలిచి ఇచ్చేవాళ్ళు. పడవలో పోతుంటే ఎంతో హుషారుగా, మరెంతో భయంగా వుండేది.  ఒకవైపు పోతున్నట్టు కనబడి, మరో వైపు వెళుతున్న అనుభూతి. పడవ అంచున నిలబడి అటూ ఇటూ నడుచుకుంటూ పడవ నడిపేవాళ్ళు పెద్ద పెద్ద గడలతో తిరుగుతుంటే వీళ్ళకి నీళ్ళంటే భయం వుండదా అనిపించేది. సగం తడిసిన బట్టలతోనే పెనుగంచి ప్రోలు చేరేవాళ్ళం. ఆ వూళ్ళో మా బాబాయి వరుస అయిన డాక్టరు జగన్నాధం గారు చుట్టుపక్కల నలభయ్ గ్రామాలకు పెద్ద దిక్కు. పెద్ద వైద్యం కావాలంటే ఆయన దగ్గరికే పోవాలి. పచ్చటి శరీరచ్చాయ,  తెల్లటి మల్లెపూవులాంటి పంచె, లాల్చి, రిం లెస్ గోల్డ్ ఫ్రేం కళ్ళజోడు, మెడలో స్టెతస్కోప్. ఆయన చేయిపట్టి చూసాడు అంటే ఎంతటి రోగమైనా తగ్గిపోవాల్సిందే. డాక్టరు బాబాయి రాసే కొన్ని మందు గోలీలకోసం ఇరవై మైళ్ళ దూరంలో వున్న జగ్గయ్యపేట వెళ్ళేవాళ్ళు. ఆయనంటే అంత గురి. ఈనాడు సంపన్నులు నివసించే ప్రాంతాలలో కనిపించే ఇళ్ళ వంటి అధునాతన భవంతిని 1947 లోనే ఆయన కట్టుకోగలిగారు. అంటే ఆయన ప్రాక్టీసు ఏ స్థాయిలో వుండేదో అంచనా వేసుకోవచ్చు. ఆ వీధిని పెద్ద పోస్టాఫీసు వీధి అనే వారు. డాక్టరు బాబాయి ఇంటి పక్కనే వుండేది. చుట్టుపక్కల నలభయ్ ఊళ్ళ నుంచి బ్రాంచి పోస్టాఫీసుల్లో పని చేసే తపాలా బంట్రోతులు కాలి నడకన పెనుగంచి ప్రోలు వచ్చి, సార్టింగ్ సిబ్బంది ఇచ్చిన ఆయా గ్రామాల ఉత్తరాలను తడవని సంచుల్లో పెట్టుకుని మళ్ళీ అంత దూరాలు నడుచుకుంటూ తమ గ్రామాలకు వెళ్ళే వాళ్ళు. చాలా రోజులు ఖాళీ సంచులే. ఒక్క ఉత్తరం కూడా వుండేది కాదు. అయినా  సరే, ప్రతిరోజూ వారికి ఈ నడక తప్పదు. ఆ రోజుల్లో వారికి ఇచ్చే గౌరవ వేతనాలు పదీ పరక మాత్రమే.

జగన్నాధం బాబాయి ఇంటికి దగ్గరలో ముచ్చింతాల కరణం గారు పూర్ణచందర్ రావు గారి ఇల్లు. ఆయన అల్లుడే కొప్పరపు కవుల మనుమడు మా శర్మ గారు. సుప్రసిద్ధ పాత్రికేయుడు.

నేను బాగా పెద్దవాడిని అయ్యేదాకా మా ఊర్లో వైద్య సౌకర్యాలు అంతంత మాత్రమే. ఆలూరుపాడు డాక్టరు గారు చనిపోయిన తర్వాత ఊళ్ళో డాక్టరు అంటూ ఎవరూ లేకుండా పోయారు.

మరీ చిన్నతనంలో ఖమ్మం నుంచి బయలుదేరి మోటమర్రి స్టేషన్ లో దిగి మా ఊరు వెళ్ళే వాళ్ళం. అక్కడ సామాన్లు మోసే కూలీ బచ్చా అని ఒకడు ఎప్పుడూ కనిపించేవాడు. కొన్నేళ్ళ తర్వాత అతడు మా ఊరిలో ప్రత్యక్షమయ్యాడు. అందరూ అతడిని డాక్టర్ గారు అంటుంటే ఆశ్చర్యపోవడం మా వంతయింది. ఎక్కడ నేర్చుకున్నాడో తెలియదు, చిన్న చిన్న జ్వరాలకు గోళీల వైద్యం నేర్చుకున్నట్టున్నాడు. వాటి పేర్లు కూడా అతడికి తెలియదల్లే వుంది. ఎర్ర గోళీ ఒకటి పొద్దున్న వేసుకో, తగ్గకపోతే పచ్చ గోళీ రాత్రికి వేసుకో అని చెబుతుండేవాడు. అతడి మీద కొన్ని జోకులు కూడా ప్రచారంలో ఉండేవి. ధర్మామీటరు వంద చూపిస్తే, అంత తక్కువ జ్వరానికి  నా దగ్గర మందు లేదు, ఒక పని చేయండి ఈ పూట అన్నం పెట్టండి, సాయంత్రానికి జ్వరం పెరుగుతుంది. అప్పుడు ఈ మాత్ర వేయండి అని రోగి బంధువులకు చెబుతుంటాడు అని ప్రతీతి. కొన్నేళ్ళ తర్వాత అతడి  జాడ లేదు. ఎలా వచ్చాడో అలా మాయమై పోయాడు.  

మా లాంటి వెనుకబడిన ఊళ్లల్లోనే కాదు, హైదరాబాదు వంటి మహా నగరాల్లో కూడా వైద్యానికి సంబంధించిన చిత్రం పూర్తిగా మారిపోయింది.

రోగులు పెరిగారు. రోగాలు పెరిగాయి. వైద్యులూ పెరిగారు. ఇచ్చే మందులూ పెరిగాయి. వాటి ఖరీదులూ పెరిగాయి. పెరగనిదల్లా వైద్యులపట్ల రోగులకు వుండే భరోసా! వుండాల్సిన దిలాసా!!

వైద్యులకు రోగులకు నడుమ ఉండాల్సిన అనుబంధం క్రమంగా కనుమరుగవుతోంది. నాడి పట్టి చూసేవాళ్ళే లేరు.

ఇప్పుడు వైద్యం అనేది వైద్యుల చేతుల్లో నుంచి కార్పొరేట్ల హస్తాలలోకి వెళ్ళిపోయింది. ఇక వాళ్ళు మాత్రం ఏం చెయ్యగలరు?

 

కింది ఫోటో: (Courtesy Maa Sarma garu  and Komaragiri Sankraath)


పెనుగంచిప్రోలులో  డాక్టర్ జగన్నాధరావు గారు.












(ఇంకా వుంది)

 

 

   

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి