ఖమ్మంలో నా విద్యార్థి
జీవితం ఒక ఆటవిడుపుగా గడిచింది.
బెజవాడలో మొదలు
పెట్టిన బాపూజీ బాల సమాజ్ ని మళ్ళీ మామిళ్ళ గూడెంలో ప్రారంభించాము. ఏదో ఫంక్షన్ చేయడం కోసం విరాళాలు సేకరించాలనే
ప్రయత్నం చేశాము. పెద్దవాళ్లకు తెలియకుండా ఊళ్ళో వాళ్ళని అడగాలని జూపూడి ప్రసాద్
ఇంటికి దగ్గరలో వున్న నాగులవంచ దొరవారి బంగాళాకు వెళ్ళాము. (ఆయన అపోలో ఆస్పత్రి
చైర్మన్ ప్రతాప్ సి. రెడ్డి గారి బావమరది)
ఎంత కావాలి అని
అడిగారు మా చేతిలో చందా పుస్తకం చూడగానే. మాలో మేము మొహాలు చూసుకుని, పది అన్నాము. ‘పేరూ
గీరూ ఏం రాయనక్కరలేదు, ఇదిగో ఈ యాభయ్ తీసుకు వెళ్ళండి’ అంటూ ఒక నోటు చేతిలో పెట్టారు. అంత
డబ్బు ఊహించని మేము, విరాళాల సేకరణ అంతటితో ఆపేసాము. ఎందుకంటే కావాల్సిన డబ్బు కంటే ఎక్కువ
మొత్తం ఒక్క చోటనే మాకు దొరికింది.
ప్రభుత్వ
అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడం మా పెద్దన్నయ్య ఉద్యోగంలో ఓ భాగం. గ్రామాలకు
వెళ్లి న్యూస్ రీల్స్ చూపించడానికి ఆయన వ్యానులో ఒక ప్రొజెక్టర్, స్క్రీన్ స్టాండ్,
ప్రొజెక్టర్ నడిపే ఉద్యోగి సిద్ధంగా వుండేవారు. ప్రభుత్వ డాక్యుమెంటరీలు మాత్రమే
వేస్తె జనానికి ఆసక్తి వుండదని మామూలు బ్లాక్ అండ్ వైట్ తెలుగు సినిమాలు కూడా
చూపించేవాళ్ళు. ఖమ్మం గాంధీ పార్కులో ‘రసధుని’ పేరుతొ స్థానిక రేడియో
నిర్వహించారు. సినిమా పాటల నడుమ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను కేసెట్ లో
రికార్డు చేసి మైకులో సాయంత్రం ఓ గంటసేపు వినిపించేవారు. రేడియోని అనుకరిస్తూ
ఖమ్మం రసధుని కేంద్రం, ఇప్పుడు కొన్ని పాటలు వింటారు అని ఆ కేసెట్ ప్లే చేసేవారు. పార్కుకు
వచ్చిన జనానికి కొత్తగా అనిపించి ఆసక్తిగా వినేవారు. ఇది కాక మా రెండో అన్నయ్య రామచంద్రరావు
గారు ఎడిటరుగా ‘నెలవంక’ అనే గోడ పత్రిక నడపాలని సింగ్ సారుతో ఒక బోర్డు రాయించారు. బోర్డు
అయితే రాయించారు కానీ ఆ పత్రిక వెలుగు చూడలేదు. ఎవరైనా నెలవంక సంగతి ఏమిటి అని
అడిగితే, మా పెద్దన్నయ్య నేలవంక చూస్తోందని నవ్వుతూ చెప్పేవారు. రుద్రవరం
వెంకటేశ్వర్లు గారిది పొదుపు ఉద్యమ సంస్థలో ఉద్యోగం కాబట్టి పిల్లలను
ప్రోత్సహించడానికి నినాదాలు రాయించేవారు. ‘ఖర్చు
చేస్తే దండగ పొదుపు చేస్తే పండగ’ అని మా రెండో అన్నయ్య రాసిన నినాదానికి పదో
ఇరవయ్యో విలువ చేసే నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ ను జిల్లా కలెక్టర్ చేత బహుమతిగా
ఇప్పించారు. కాకపోతే దాన్ని డబ్బుల్లోకి మార్చుకోవాలి అంటే అయిదేళ్లు ఆగాలి. కొలిపాక
మధుసూదన రావు, హీరాలాల్ మోరియా, ఇట్క్యాల నీలకంఠరావు వంటి చాలామంది ఖమ్మం కవుల చేత రాయించి, పొదుపు పాటలు అనే
పేరుతొ ఒక పుస్తకంగా వేశారు. వై.ఎన్.
ప్రెస్ లో ముద్రించారు. నేను కూడా ఒక గేయం రాశాను. నా పేరు అచ్చులో చూసుకోవడం అదే మొదటిసారి. ‘పైస పైస
కూడబెట్టి పరికింపుమురా! అది ఇంతింతై ఎంతెంతో అయి వింతగొలుపురా!’ ఇలా వుండేవి రాతలు. ప్రాస వుంటే చాలు అదో అద్భుత కవిత్వం
అనుకునే రోజులు.
వెంకటేశ్వర్లు
గారు పిల్లలకోసం మా చేత ‘సంచయిక’ అనే ఒక బ్యాంకు మొదలు పెట్టించారు.
(దశాబ్దాల
తరువాత ఈ బ్యాంకుని మా పెద్దన్నయ్య కుమారుడు భండారు రాఘవ రావు తాను చదువుకునే
రోజుల్లో హైదరాబాదులో కొన్నేళ్ళు నిర్వహించాడు. ఇది ప్రభుత్వ పధకమే. పిల్లలకోసం పెట్టింది. డిబ్బీలో దాచుకున్న
చిల్లర డబ్బులని ఈ బ్యాంకులో దాచుకుంటే అవి మరో ప్రభుత్వ బ్యాంకులో డిపాజిట్ చేసి, సంచయిక బ్యాంకు
పేరుతో ఖాతా పుస్తకాలు పిల్లలకు ఇచ్చేవాళ్ళు. అలా దాచుకున్న డబ్బుపై వడ్డీ కూడా
చెల్లించే వాళ్ళు. ఈ పధకం ఈనాడు వుందో లేదో తెలియదు. ఇప్పటి ప్రభుత్వాలకి ప్రజలు పొదుపు
చేయడం ఇష్టం లేదు, ప్రజలకి అసలే అవసరం లేదు)
దసరా ఆడపిల్లల
పండగ. కానీ మగపిల్లలకు కూడా ఎంతో ఉత్సాహం. ఆడపిల్లలు అందంగా పేర్చే బతుకమ్మలకు కావాల్సిన
తంగేడు పూలు, చెరువుల్లో దొరికే తామర పూలు వగైరా సేకరించడం మా పని. ఒకసారి
పండక్కి బెజవాడ నుంచి శాయిబాబు కూడా ఖమ్మం వచ్చాడు. మనోహర్, పెద్దబాబు, రాజన్న, శాయిబాబు నేనూ అందరం కలిసి తంగేడు పూలకోసం చాలా దూరం బురాన్ పురం
వరకు వెళ్లాం. ఒకచోట తేనెటీగెల గుంపు మా వెంట పడింది. చేతుల మీద మొహం మీద తెగ
కుట్టాయి. అందరం లబోదిబో మంటూ ఇళ్లకు చేరాము. మా ఏడుపులు చూసి భయపడి, ఇంటికి పక్కనే
వున్న రాముల (డాక్టరు) మామయ్య ఇంటికి తీసుకు వెళ్ళారు. ఊరందరికీ ఆయన డాక్టర్
జమలాపురం రామారావు గారు. మా అందరికి
మాత్రం రాముల మామయ్య. ఆయన లక్ష్మారెడ్డి గారి బంగళాలో అద్దెకు వుండేవాడు. చాలా
పరిశుభ్రత పాటించే డాక్టరు. మనిషి చాలా నిదానం. ఇంట్లో ఉన్నంత సేపు కాళ్ళకు
పావు కోళ్ళు ధరించి తిరుగుతుండేవాడు.
చుట్టపక్కాల ఇళ్ళల్లో పెళ్ళిళ్ళు అయినప్పుడు, డాక్టరు మామయ్య ఇంటికి వెళ్లి,
పెళ్లికొడుకుకోసం పావుకోళ్లు తీసుకురమ్మనే వారు. అంచేత ఒకటికి రెండు జతల పావు
కోళ్ళు అదనంగా చేయించి పెట్టుకునేవారు. ఆయన క్లినిక్ లో అనేక సీసాల్లో రంగురంగుల నీళ్ళు
వుండేవి. నిజానికి అవి
మిక్సర్ (Combination
Drugs) అనే
ఔషధాలు. ప్రభుత్వ దవాఖానాలో కూడా రోగులకు ఇవే ఇచ్చేవాళ్ళు. పైగా రోగులు ఎవరి సీసాలు వాళ్ళే
తెచ్చుకోవాలి. రంగునీళ్ళ వైద్యం చేస్తారు
ఆ దవాఖానాకు పొతే అని వెక్కిరింతగా అనేవాళ్ళు.
తేనెటీగెలు
కుట్టిన బాధతో గొల్లుమంటున్న మమ్మల్ని చూసి, డాక్టరు మామయ్య ఏమాత్రం కంగారు పడకుండా,
నిదానంగా కాటన్ తో టింఛరు రాస్తే, ఆ మంటకి,
తేనెటీగెలు కుట్టిన బాధ నయం అనిపించింది. తర్వాత మా వంటి మీద ఏదో ఆయింటుమెంటు రాసి
ఉపశమనం కలిగించాడు.
ఆ వాడ
మొత్తానికి ఆయనే డాక్టరు. డాక్టరు బాబాయ్, డాక్టర్ మామయ్య అని పిలిచేవారు.
రాములు మామయ్య కుమార్తె జయశ్రీ కుమారుడు అమెరికాలో డాక్టరు. తాత వారసత్వాన్ని అంది
పుచ్చుకున్నాడు. అల్లుడు సత్యనారాయణ శర్మ గారు ఎస్ బి హెచ్ (ఇప్పుడు ఎస్ బి ఐ ) లో
మేనేజర్ గా రిటైర్ అయి ఖమ్మం ఎస్ ఎన్ మూర్తి తోటలో సొంత ఇల్లు కట్టుకుని సెటిల్
అయ్యారు.
రాముల మామయ్య
కొడుకు రాధాకృష్ణ నాకు తర్వాత ఖమ్మం
కాలేజీలో క్లాస్ మేట్. అదే నా అకడమిక్ కెరీర్ లో విశేషం. క్లాస్ మేట్స్ సీనియర్లు
అయ్యేవాళ్ళు. జూనియర్లు క్లాస్ మేట్స్ అయ్యేవాళ్ళు. క్లాస్ మేట్స్ అయిన జూనియర్లు మరుసటి
ఏడాది సీనియర్లు అయ్యేవాళ్ళు.
కారణం, నా
చదువుల ప్రయాణం సాగింది ఎం.ఎస్.ఎం. (మార్చి- సెప్టెంబరు- మార్చి) బండిలో.
కింది
ఫోటో:
(Photo Courtesy:
Sreemathi Jayasree G)
(ఇంకా వుంది)
భండారు వారూ,
రిప్లయితొలగించండిఖమ్మంలో మీరు మామిళ్ళగూడెంలో నివాసమా ?
అయితే మీది తెనాలే, మాది తెనాలే అన్నమాట 🙂 .
ఖమ్మంలో ఉద్యోగం చేస్తున్నప్పుడు నేను కూడా మామిళ్ళగూడెంలోనే బ్యాచిలర్ నివాసం లెండి. జగన్నాథ రావు గారనే ఒక టీచరు గారింట్లో ముందు గది ఇచ్చారు. మామిళ్ళగూడెంలో దాదాపు చివర్లో (ఆ రోజుల్లో … అంటే 1970వ దశకంలో) ఉండేది ఆ ఇల్లు. ఓ కప్పు కాఫీ కోసం మామిళ్ళగూడెం మెయిన్ వీధి మొత్తం దాటి, రైలు పట్టాలు దాటి స్టేషన్ వరకు వెళ్ళాల్సి వచ్చేది 😢. లంక మేత, గోదావరీత 😒.