‘మీ ఆఫీసు నుంచి
వీటిని దొంగిలిస్తున్నాను, మీకేమైనా అభ్యంతరమా’ అని అడిగేవాడిని. ‘నిక్షేపంగా
తీసుకువెళ్ళండి’ అనేవాళ్ళు, అప్పటివరకు ఉదయం వార్తావ్యాఖ్య చర్చను నిర్వహించిన టీవీ 5 ఎడిటర్లు విజయ్ నారాయణ, సాంబశివరావుగార్లు.
ప్రతి ఆదివారం ఉదయం మా సంభాషణ ఈ విధంగానే వుండేది, దాదాపు దశాబ్ద కాలానికి పైగా.
ఒకానొక రోజుల్లో
రోజుకు మూడాటలు, ఆదివారం నాలుగు ఆటలు అన్న చందాన హైదరాబాదులోని అన్ని టీవీ ఛానళ్ళ
చర్చలకు ఉదయం, సాయంత్రం అవసరమైతే మధ్యాన్నం, (ఎన్నికల ఫలితాల సమయం అయితే ఉదయం
నుంచి రాత్రి పొద్దుపోయేవరకు) వెడుతున్న
బంగారుకాలంలో (బంగారు కాలం అని ఎందుకు అంటున్నాను అంటే ఆ రోజుల్లో ఏ ఛానల్ అనే
నిమిత్తం లేకుండా విశ్లేషకులుగా వెళ్ళే జర్నలిస్టులు తమకు ఇష్టం వచ్చిన పద్దతిలో
అభిప్రాయాలు చెప్పగలిగే వెసులుబాటు ఉన్న కాలం కాబట్టి) ప్రతి ఆదివారం ఉదయం నాకు
టీవీ 5 లో ఉభయం. వచ్చిన అతిధులకు రానూ పోనూ వాహన సౌకర్యంతో పాటు, చక్కటి బ్రేక్
ఫాస్ట్ ఏర్పాటు చేసేవారు.
శనివారం ఉదయం
పదిన్నరకు ఫోను మోగిందంటే అది ఖచ్చితంగా టీవీ 5 న్యూస్ కో ఆర్డినేటర్ నిస్సార్ నుంచే.
'రేపు ఆదివారం ఉదయం మాకు టైం ఇవ్వాలి'
‘ప్రతి ఆదివారం మీకే కదా నా వారం, మళ్ళీ
మళ్ళీ చెప్పడం ఎందుకు అక్కర్లేదు నిస్సార్ అన్నా వినడు. ఇదే మాట ప్రతిసారీ, ప్రతివారం
చెప్పేవాడు. కల్మషం లేని నమ్రత అతడి మాటల్లో నాకు కనబడేది.
ఎన్నో ఏళ్ళుగా
ప్రతి శనివారం తప్పనిసరిగా నిస్సార్ నుంచి వచ్చే ఫోను ఇక నుంచి నాకు రాదని, ఫోన్ కాదు
ఎప్పుడూ నవ్వుతూ వుండే అతడి మొహాన్ని కూడా జీవితంలో ఇక చూడలేమని, ఓ రోజు పొద్దున్న మహా
టీవీకి వెడుతుంటే టీవీ 5 విజయ్ నారాయణ్ ఫోను చేసి చెప్పారు. నిస్సార్ కి అంతకు ముందు రాత్రి మాసివ్ హార్ట్ అటాక్ వచ్చి
కన్ను మూసాడని, సొంతూరు కర్నూలు జిల్లా
కొడుమూరుకు తీసికెళ్ళారని విజయ్ సమాచారం.
మూడు పదులు
దాటిన నిస్సార్ కి అప్పుడే నూరేళ్ళు నిండిపోయాయి. ఎంత కష్టమో అతడి కుటుంబానికి.
స్టుడియోలో చర్చ
ముగించుకుని అతిధుల విశ్రాంతి గదికి వచ్చేలోగా నిస్సార్ ఉపాహారం ఏర్పాట్లు అన్నీ
చేసి వుంచేవాడు.
తినడానికి
కాకపోయినా వినడానికి ఆ సమయం నాకు బాగా ఉపయోగపడేది. ఎందుకంటే అంతకు ముందు కెమెరా ఎదుట పొట్టు పొట్టయిన ఆయా రాజకీయ పార్టీల
ప్రతినిధులు, అన్నీ మరచిపోయి, అరమరికలు లేకుండా ఆఫ్ ది రికార్డు సంగతులు చాలా చెప్పేవాళ్ళు. అవి
చాలా ఆసక్తికరంగా వుండేవి. అలాంటివి దాదాపు వంద ఎపిసోడ్లు ‘వెలుగు చూడని వార్తలు’ పేరుతొ నా కంప్యూటర్ లో నిక్షిప్తం చేసి వుంచాను.
వాటిని బయట పెట్టడం అంటే వాళ్ళు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేసినట్టే
అవుతుందని వాటిని అలాగే వుంచేశాను.
సరే ! ఇంతకీ
నేను దొంగిలించి ఇంటికి తెచ్చేవి ఏమిటి అంటే, ప్రతి తెలుగు పత్రిక ప్రతి ఆదివారం
నాడు, తల్లి పత్రికతో వచ్చే పిల్ల పత్రికలని. మా ఇంటికి మూడు పత్రికలు వస్తాయి. మరో మూడు
తెలుగు పత్రికల పిల్ల పత్రికలను నేను టీవీ 5 నుంచి ఇంటికి పట్టుకుని
వెళ్ళే వాడిని. ప్రతి ఆదివారం నాడు అక్కడికి వెడతాను కనుక ఆ వీలు చిక్కేది. ఇక
ఆదివారం మధ్యాన్నం వరకు ఆ పత్రికల్లో వచ్చే గళ్ళ నుడికట్టు లను పూరిస్తూ కాలక్షేపం
చేయడం. తద్వారా మెదడుకు మేత, మతిమరపుకు చికిత్స సాధ్యం అవుతుందేమో అనేది నా ఆలోచన. లోగడ ఈ పని మా
ఆవిడ చేస్తుండేది. నేను టీవీ చర్చల నుంచి వచ్చేలోగా మొత్తం వాటిని పూర్తిచేసేది. రచన సాయి గారు తన పత్రికలో ప్రతి నెలా
ప్రచురించే గళ్ళ నుడి కట్టు ఈ విషయంలో నెంబరు వన్. దానికోసం కొన్నేళ్ళు నేను
సికిందరాబాదు రైల్వే స్టేషన్ కు వెళ్లి, హిగ్గిం బాదమ్స్ పుస్తకాల షాపులో రచన మేగజైన్ కొనేవాడిని. నా ఈ ఆసక్తి విషయం నా రేడియో సహోద్యోగి డి
వెంకట్రామయ్య గారి ద్వారా తెలుసుకున్న సాయి గారు రచన మాస పత్రికను చందా
కట్టకుండానే నెలనెలా నాకు పోస్టులో పంపించడం ప్రారంభించారు. ఇప్పుడు ఆ హిగ్గిం
బాదమ్స్ వున్నట్టు లేదు. రచన పత్రిక కూడా అచ్చులో రావడం మానేసింది. ఆన్ లైన్ లో
వస్తోందని ఎవరో అన్నారు కానీ, గళ్ళ
నుడికట్టు పూరించాలి అంటే కుదరని పని.
దాంతో అలాంటి మరో పత్రిక కోసం నా అన్వేషణ మొదలయింది. దర్శనం అనే మాస
పత్రికలో వెలువడే పద సంపద నుడికట్టు నన్ను ఆకర్షించింది. ఎడిటర్ పబ్లిషర్ దర్శనం
శర్మ నాకు దగ్గరివాడే. నేను రేడియోలో, తర్వాత దూరదర్సన్ లో ఎడిటర్ గా పనిచేసినప్పుడు, మరుమాముల
వెంకట రమణ శర్మ మాకు రంగారెడ్డి జిల్లా పార్ట్ టైం రిపోర్టర్ . చాలా సిన్సియర్ గా రిపోర్టులు
పంపేవాడు. ఒకసారి ఫోన్ చేసి చెబితే, ఎన్ని పనుల ఒత్తిడి వున్నా ఆ సాయంత్రం అతడు పంపే వార్త ప్రసారం
చేసేవాళ్ళం. రిటైర్ అయిన తర్వాత, అతడు
పంపే దర్శనం పత్రికలో ప్రచురించే క్రాస్ వర్డ్ పజిల్ తో ప్రతి
నెలా నాకు, మా ఆవిడకు కొంత అదనపు కాలక్షేపం. అంటే అందులో వచ్చే ఆధ్యాత్మిక
వ్యాసాలతో కాదు, కేవలం ఆ గళ్ళ నుడికట్టుతో మాత్రమే. ఇంత జీవితం గడిచిన తర్వాత మనకు
తెలియని ఆముష్మిక విషయాలు ఏముంటాయి కనక. నేనే ఎన్నో ఆధ్యాత్మిక వ్యాసాలు రాసాను
ఫేస్ బుక్ లో. దర్శనం పత్రికకి కూడా. ఒక మాస పత్రికను ఇరవై ఏళ్ల పాటు నడపడం అనేది కష్ట
సాధ్యమైన వ్యవహారమే. ఈ పనినే కాకుండా అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలను భారీ ఎత్తున దర్శనం
శర్మ ఒంటి చేత్తో నిర్వహించిన తీరు చూస్తే ఎవరైనా సరే శహభాష్ అనాల్సిందే. జ్వాలాతో
కలిసి రెండు మూడు సందర్భాలలో ఆ కార్యక్రమాలను ప్రత్యక్షంగా చూసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసేది. ఇన్నిన్ని
కార్యక్రమాలు ఎలా చేయగలుగుతున్నాడు అని అనిపించేది. ఇందుకు శర్మని మెచ్చుకుని తీరాలి. వెనకాల ఏ బలం లేని
శర్మకు, వీటిని ఇంత పకడ్బందీగా
నిర్వహించే బలం ఎలా సమకూరింది? ఆ దైవ బలం లేకుండా ఇది అసాధ్యం. అది అతడికి పుష్కలంగా వుంది.
దురదృష్టం
ఏమిటంటే, అనేక సంవత్సరాల పాటు, ఒకరకంగా చెప్పాలి అంటే, ఆ పత్రిక స్థాపించిన దగ్గర నుంచి మా ఇంటికి
క్రమం తప్పకుండా వచ్చిన పత్రిక, వున్నట్టుండి రావడం ఆగిపోయింది. చిరునామా సమస్య అనుకుంటే నేను
ఇల్లు మారింది కూడా లేదు. ఎక్కడ కనపడ్డా దర్శనం శర్మని అడిగే ప్రశ్న ఒక్కటే, దర్శనం పత్రిక
దర్శనం ఎప్పుడని. ‘వెంటనే’ అనే జవాబు ఠంచనుగా
వచ్చేది ఆయన నోట. ఒకటి రెండు సార్లు జ్వాలా ఇంట్లో కలిసినప్ప్దుడు కూడా గుర్తు
చేశాను. చందా ఎంతో చెప్పండి, జీ పే చేస్తాను అని మెసేజ్ లు కూడా పెట్టాను. బదులుగా పత్రిక నెట్ లింక్
పంపేవాడు. ఈ వయసులో ఆన్ లైన్ లో చదివే దృష్టి పాటవం నాకు లేదు అని జవాబు
ఇచ్చేవాడిని. కానీ దానికి జవాబు లేదు.
దశాబ్దాల క్రితం
శర్మ నాకు పరిచయం అయినప్పుడు నాకు వంద పనులు. ఆయనకు ఒక్కటే పని. దర్శనం ప్రత్యేక
సంచిక విడుదలకు ముఖ్యమంత్రి సమయం తీసుకునేటప్పుడు మాత్రం ఆయనకు నన్ను కలవడానికి
సమయం చిక్కేది. ఇప్పుడు ఆయనకు వెయ్యి
పనులు. నాకు ఒక్క పని కూడా లేదు. ఈ నిజాలు సరైన సమయంలో గుర్తు పెట్టుకోకపోకోవడం
కూడా నేనో పెద్ద జీరో కావడానికి కారణం.
ఇలా ఏళ్ళు
గడిచిపోయాయి కానీ ఆ పత్రిక జాడలేదు. పైగా వాళ్ళు నిర్వహించే ఆధ్యాత్మిక
కార్యక్రమాల ఆహ్వాన పత్రికలు మాత్రం పోస్టులో వచ్చేవి. అంటే చిరునామా సమస్య
కాదు. దాంతో ఇక విసుగుపుట్టి అడగడం
మానేశాను.
ఈ పిడకల వేట
దేనికంటారా!
గళ్ళనుడికట్టు
వైద్యం కంటే కూడా, ఇప్పుడు మొదలు పెట్టిన ఈ ‘అయాం ఎ బిగ్ జీరో’ రచనా వ్యాసంగం కొంత నాకు ఉపయోగపడుతోంది.
ముందుగానే చెప్పినట్టు చిన్నప్పటి విషయాలు చెప్పడానికి ఇప్పుడు, అప్పటి పెద్దవాళ్లు ఎవరూ లేరు. గుర్తు చేసే మా ఆవిడా లేదు. ప్రతి
చిన్న విషయం నాకు నేనుగా గుర్తు చేసుకోవాలి. కాళ్ళకు చేతులకు కసరత్తులు వున్నట్టే,
నేనిప్పుడు ప్రతి రోజూ కొన్ని గంటల పాటు నా మెదడుతో కసరత్తు చేస్తున్నాను. బుర్ర పొరల్లో
నిక్షిప్తం అయిన సంగతులను వెలికి తీయడానికి మెదడును చిలుకుతున్నాను. ఫోటోల కోసం
అన్వేషణలో, సాంకేతిక ప్రజ్ఞా పాటవం లేక
పోయినా, నాకు తెలిసిన పద్దతిలో నేను గంటలు గంటలు వెచ్చిస్తున్నాను. ఒక్క
మాటలో చెప్పాలి అంటే ఇది తప్ప మరో పని లేనట్టు అస్తమానం ఈ రచన కోసమే మొత్తం సమయం
వెచ్చిస్తున్నాను. అవసరమా అంటే నాకు అవసరమే అనిపిస్తోంది. ఎందుకంటే నిజంగా ఈ మతిమరపు ముదిరి నయం కాని పెద్ద
వ్యాధికి దారితీస్తే బాధ పడేది నేనే కదా! పిల్లల్ని బాధ పెట్టేది కూడా నేనే అవుతాను.
అన్ని విషయాలు ఓ
పక్క రాస్తూనే మధ్యమధ్యలో ఈ మతిమరపు గోల ఏమిటంటారా ! నాకు ఇద్దరు పిల్లలు, సందీప్ సంతోష్.
సందీప్ ఫోన్ చేస్తే ఏరా సంతోష్ ఏమిటి సంగతులు అంటాను. సంతోష్ ఫోన్ చేస్తే సందీప్
చెప్పు ఏమిటి విశేషం అనేవాడిని. పిల్లల పేర్లు కూడా తండ్రికి గుర్తు వుండకపొతే
దానిని మతిమరపు అనక ఏమంటారు చెప్పండి? ఇక వాళ్ళ పుట్టిన రోజులు, పెళ్లి రోజుల
సంగతి చెప్పక్కర లేదు.
అందుకే ఇది
కాలక్షేపం కాదు, నాకు నేనుగా నా మనసుతో చేస్తున్న, చేయిస్తున్న కసరత్తు. ఈ 78 ఏళ్ల వయసులో ఇది నా అవసరం. అంతే! ఏదో
పేరు కోసం కాదు, ప్రఖ్యాతి కోసం కాదు. ఈ వయసులో అవసరం లేనివి ఆ రెండే!
కింది ఫోటో:
పూర్తి అయిన
జీవిత పదబంధం.
ఆదివారం వచ్చిందంటే మా ఆవిడ నిర్మలకి నాలుగాటలు
సినిమా చూసిన సంబరం. పదబంధాలు, గళ్ళనుడికట్లు వాటితోనే పొద్దంతా గడిచిపోతుంది, ఆదివారంనాడు డైలీ సీరియళ్ళు టీవీల్లో రావనే బెంగ లేకుండా.
2019 జులై 29 తీసిన ఫోటో ఇది.
పక్కన మరో కుర్చీలో కూర్చుని కంప్యూటర్ పై పనిచేసుకుంటున్న నేను ఎందుకో లేచివచ్చి
ఈ ఫోటో తీశాను.
అదే ఆమె ఆఖరి
ఫోటో అవుతుందని ఆ ఉదయం ఆమెకూ తెలియదు, నాకూ తెలియదు.
ఆ కుర్చీ ఆ
టేబుల్ అలాగే వున్నాయి, ఆమె లేదు.
మూడు వారాల్లో
మనుషుల్ని మాయం చేసే శక్తి ఆ పరమాత్ముడికే వుంది.
(ఇంకా వుంది)
-
రిప్లయితొలగించండిప్రతి రోజూ కొన్ని గంటల పాటు నా మెదడుతో కసరత్తు చేస్తున్నాను..
కందపజ్యాలు ప్రాక్టీసు చేయండి మెదడు పదును తేలుతుంది న్యూరాన్స్ బ్రహ్మాండంగా ప్రతిరోజూ ఏక్టివ్ గా నిలదొక్కుకుంటాయి. :)