14, నవంబర్ 2024, గురువారం

నెహ్రూలో నెహ్రూను మాత్రమే చూడండి


(ఈరోజు జవహర్ జయంతి)

1964 తర్వాత జన్మించిన వారిలో చాలా మందికి నెహ్రూ అనే పేరు వినబడగానే  అవినీతితో కునారిల్లిన కాంగ్రెస్ పార్టీ గుర్తుకువస్తుంది. ఒకప్పుడు పసికూనగా వున్న స్వతంత్ర భారతానికి దిశానిర్దేశం చేసిన మహా నాయకుడని స్పురణకు రాదు.  బహుశా భారత దేశ రాజకీయ నాయకుల్లో నెహ్రూ మీద వచ్చినన్ని గ్రంధాలు కానీ, రచనలు కానీ ఒక్క గాంధీని మినహాయిస్తే ఎవరి మీద రాలేదు. కానీ నేటి యువతరానికి నాటి రచనలు చదివే తీరికా ఓపికా లేవు. ప్రతిదీ రెడీ రికనర్ లాగా ఇలా మీట నొక్కితే అలా కళ్ళ ముందు కనబడాలి. ఇది ఎంతవరకు పోయిందంటే ఒకసారి గూగుల్  లోకి వెళ్లి తెలుగుదేశం అధినేత గురించిన వివరాలు తెలుసుకోవడం కోసం  ఎన్టీఆర్ అని నొక్కి చూడండి, మచ్చుకు ఒకటో ఆరో పెద్దాయనవి, మిగిలినవి జూనియర్ ఎన్టీఆర్ వి కనబడతాయి. దీన్నే మనం చరిత్ర అనుకుంటున్నాం. 
దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాబట్టి, మహాత్మా గాంధీకి ప్రియతముడు కాబట్టి నెహ్రూ స్వతంత్ర భారత దేశానికి ప్రధమ ప్రధాన మంత్రి కాగలిగాడనే భావన నవతరంలో మెండుగా వుంది. అది నిజం కూడా. ఐతే,  ప్రధాని కావడానికి అవే   ఆయన అర్హతలు అనుకుంటే సుదీర్ఘ కాలం ఆ పదవిలో కొనసాగేవాడు కాదు. ఆయన్ని ప్రధాని పదవిలో ప్రతిష్టించిన మహాత్మా గాంధి, స్వతంత్రం వచ్చి  ఆరుమాసాలు కూడా తిరగకుండానే తుపాకీ గుళ్ళకు గురై కన్ను మూసాడు.  కేవలం మహాత్ముని ఆశీస్సులే నెహ్రూ పండితుడికి శ్రీరామ రక్ష అనుకుంటే 1964 లో నెహ్రూ తీవ్ర అస్వస్తతకు గురై కన్ను మూసేవరకు ఆయన ఆ పదవిలో కొనసాగగలిగివుండేవా రు కాదు.

నెహ్రూ మరణించిన రోజు నాకింకా బాగా జ్ఞాపకం వుంది. ఆ వార్త రేడియోలో వచ్చినప్పటినుంచి ఊరువూరంతటిలో పొయ్యి వెలిగించలేదు. ఆయన ఎవరో తెలియదు, ఎలా ఉంటాడో తెలవదు, తెలవడానికి ఇప్పట్లా టీవీలు లేవు. ఢిల్లీలో సాగుతున్న శవయాత్ర గురించి అదీ, ఇంగ్లీష్, హిందీ భాషల్లో ప్రత్యక్ష ప్రసారం  రేడియోలో  సాగుతుంటే కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు శోకసంద్రంలో మునిగిపోయింది. వారిలో ఎవ్వరికీ ఆయన ఒక కాంగ్రెస్ ప్రధానమంత్రి అనే స్పృహ లేదు.
ఒకప్పుడు పీ.ఎల్. 480 కింద అమెరికా పంపే గోధుమలు, పాల పిండితో పేదల కడుపు నింపుకునే దేశం చూస్తుండగానే సస్య విప్లవం, శ్వేత విప్లవం సాధించింది. ఆరోజుల్లో వి.ఎల్.డబ్ల్యు. అనే అతి చిన్న అధికారి ప్రతి ఊరికీ వచ్చి ఏపంటలు ఎప్పుడు వేసుకోవాలి అనే విషయాలను పల్లెటూరివాళ్ళకు వివరిస్తుంటే అందరూ చెవులు ఒప్పగించి వినేవాళ్ళు. ప్రతి ఉదయం, సాయంత్రం క్రమం తప్పకుండా ప్రసారం అయ్యే పాడిపంటలు కార్యక్రమాలు పంచాయతి రేడియోలో వింటూ దేశం పంటల దిగుబడిలో స్వయం సమృద్ది సాధించింది. భాక్రానంగల్ నాగార్జునసాగర్, శ్రీశైలం ఒకటా రెండా ఈనాడు దేశాన్ని పచ్చటి పైర్లతో కళకళలాడిస్తున్న ప్రాజెక్టులు అన్నీ నెహ్రూ పుణ్యమే. అంతెందుకు,  ప్రధాన మంత్రి మోడీ ప్రారంభించిన సర్దార్ సరోవర్ డాం కు శంఖుస్థాపన చేసింది ఆనాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ అని ఈ తరం మరచిపోకూడదు.
నెహ్రూ నుంచి మోడీ వరకు స్వతంత్ర భారతం అభివృద్ధి పధంలో ముందుకు సాగుతూనే వుంది. ఒక్కొక్క ప్రధాని తమదయిన శైలిలో జాతి నిర్మాణానికి తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. ఈనాడు మోడీ చేసే మంచిపనులను భావి భారతం గుర్తుపెట్టుకోవాలి. అలాగే గతంలో నెహ్రూ వంటి నాయకులు చేసి వెళ్ళిన గొప్ప పనులను ఈ తరం గుర్తు పెట్టుకోవాలి. 
దేశ ప్రగతికి  మన వంతు కృషి  ఏమీ చేయలేనప్పుడు కనీసం కృతజ్ఞతను వ్యక్తం చేయడం ద్వారా ఆ పని ఓ మేరకు చేయవచ్చు. 
నెహ్రూను విమర్శించడానికి ఆయన వ్యక్తిగత జీవితంలో అనేక కోణాలు వున్నాయి. కానీ ఒక దార్శనికుడిగా వేలెత్తి చూపలేని వ్యక్తిత్వం ఆయనది.
గాంధి, నెహ్రూ, పటేల్, అంబేద్కర్, వాజ్ పాయ్ వంటి వారిని  ఒక పార్టీకి చెందినవారిగా గుర్తిస్తున్నంత కాలం వాళ్ళ వ్యక్తిత్వాలను నిజాయితీగా అంచనా వేయడం కష్టం.



7 కామెంట్‌లు:

  1. ఇప్పుడు జనాలకి చరిత్రలు సోషల్ మీడియాలో చదవటం అలవాటైంది, లైబ్రరీలో చదవటం మానేసారు.

    రిప్లయితొలగించండి
  2. "నెహ్రూను విమర్శించడానికి ఆయన వ్యక్తిగత జీవితంలో అనేక కోణాలు వున్నాయి. కానీ ఒక దార్శనికుడిగా వేలెత్తి చూపలేని వ్యక్తిత్వం ఆయనది. - "

    కాదు. ఆయన వ్యక్తిగత జీవితం మాత్రమే కాదు. ఆయన భావజాలం, ప్రధానిగా తీసుకున్న నిర్ణయాలు అనేకం భారతదేశానికి
    ముఖ్యంగా హిందువులకు నష్టం కలిగించాయి అన్నది నిండు నిజం.

    ఏ వ్యక్తి కూడా విమర్శకు అతీతం కాదు. అతను చేసిన మంచిని మెచ్చుకున్నట్టే తప్పులను ఎత్తి చూపడం విమర్శించడం కూడా అవసరమే.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నెహ్రూ గొప్ప నాయకుడు, ఆయన పాలన లో దేశం అనేకరంగాలలో అభివృద్ధి చెందినది అన్న మాట నిజమే. అయితే కొన్ని ముఖ్య విషయాలలో ఆయన నిర్ణయాలు, చర్యలు విమర్శకు గురి అయ్యాయి.

      తొలగించండి
  3. ఆనాడు దేశాన్ని హిందూ దేశంగా ప్రకటించినట్లైతే నేను భారతదేశం ఉండేది కాదు .. చిన్న చిన్న దేశాలుగా విడిపోయి ఉండేది .. ముస్లిం దేశాలు అనేక రాష్ట్రాలను ఆక్రమించుకుని ఉండేవి

    రిప్లయితొలగించండి
  4. ఆనాడు స్వాతంత్రోద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన గాంధీ, నెహ్రూ లను .. నేటి కాంగ్రెస్ నాయకులకు బంధువులు, దోస్తులు అనే ఉద్దేశ్యంతో ఈనాడు తీవ్రంగా అవమానిస్తున్నారు.. నేటి పాలకులు, వారి అనుకూల శక్తులు,, ఇది పూర్తిగా అనుసరణీయం కాదు.. ఇది భావి తరాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది

    రిప్లయితొలగించండి