14, నవంబర్ 2024, గురువారం

అయాం ఎ బిగ్ జీరో అను నడిచివచ్చిన దారి ( 4 ) - భండారు శ్రీనివాసరావు

 మా నాన్నగారు రాఘవరావు (రాఘవయ్య గారు అనేవారు) వూరికి కరణం. పేరుకు బోలెడు ఆస్తి. వూరిచుట్టూ ఎటు చూసినా ఎంతదూరం వెళ్ళినా మా పొలాలే. ఐదో అక్కయ్య అన్నపూర్ణ అక్కయ్యను పక్కవూరు పెనుగంచిప్రోలు  పెద కరణం గారి అబ్బాయి కొమరగిరి  వెంకట అప్పారావుకుకు  ఇచ్చి పెళ్లి  చేశారు. ఈ సంగతి  ఇప్పుడెందుకంటే,  కొత్త అల్లుడు పొరుగూరు నుంచి  గుర్రం మీద అత్తగారింటికి మా ఊరు  వచ్చినప్పుడు ఆ గుర్రాన్ని మేతకు వొదిలేవారు. ఇక  అది తిరిగి మేసినంత మేరా మా పొలాలే. కానీ ఏం లాభం? వందల ఎకరాల భూమి మీద వచ్చే అయివేజు (ఆదాయం)  మాత్రం అంతంత మాత్రమే. కరణీకం మీద వచ్చే జీతం రాళ్ళు నాలుగే, ఇంటి ఖర్చుకు ఆధారం. వర్షాలు లేక పంటలు పండక రైతులు సర్కారుకు శిస్తుకట్టలేక ఇళ్ళూ పొలాలు వొదులుకుని వూళ్ళు వొదిలి వెళ్ళే రోజులవి.

అలాటి రోజుల్లో నా బాల్యం గడిచింది. అలాటి పల్లెటూరిలో నా  చిన్నతనం నడిచింది.

మా నాన్నకు  ఏడుగురు ఆడపిల్లలు.  నలుగురు మగపిల్లలం.

ఇంతమందికే కాదు, ఇంకా ఇంతమంది, ఇంట్లో  విస్తళ్ళు వేసే సమయానికి భోజనాలకు సిద్ధంగా వుండేవారు. పూటకూళ్ళ ఇల్లు లేని వూరు. ఎవరొచ్చినా చేయి కడిగేది వూరి కరణంగారింట్లోనే.

మా అమ్మా నాన్న, బామ్మ, ఆమె తల్లి గారు, పెనిమిటి వొదిలిపెట్టిన ఒక మేనత్త, ఇద్దరు జీతగాళ్ళు, వచ్చిపోయేవాళ్ళు ఇంతమందికి మా అమ్మే వండి వార్చేది. ఉదయం లేచిన దగ్గరనుంచి రాత్రి పొద్దుపోయేవరకు నడుం వాల్చే వీలు వుండేది కాదు. దీనికి తోడు నిప్పులు కడిగే ఆచారం మా బామ్మది. వూరి పొలిమేరలో చెరువుకట్ట దగ్గర వున్న మంచినీళ్ళ బావినుంచి తడి చీరెకట్టుకుని బిందెలతో నీళ్ళు పట్టుకురావడంతో మా అమ్మ రోజువారీ  డ్యూటీ మొదలయ్యేది.   

మా ఇల్లు పెద్ద భవంతి ఏమీ కాదు. ఈ ఇల్లు కట్టడానికి ముందు ఉన్న ఇల్లు మాత్రం చాలా పెద్ది.  మండువా లోగిలి అని చెబుతారు. మా తాతగారి కాలంలో ఆ ఇల్లు అగ్ని ప్రమాదానికి గురయింది. ఆ సంఘటనలో కాలిపోగా మిగిలిన కలపతో కొత్త ఇల్లు కట్టారని చెబుతారు. వసారాలో వేసిన పైకప్పులో కాలిన నల్లటి మచ్చలు కానవచ్చేవి. ముందు వసారా. పక్కన దక్షిణాన ఒక పడక గది, మధ్యలో పెద్ద హాలు, దానికి ఆనుకుని ఒక పెద్ద గది, వెనుకవైపు మళ్ళీ ఓ వసారా, పక్కన వంటిల్లు.  

అక్కడక్కడా గోడల్లోనే చిన్న చిన్న గూళ్ళు, వంటింట్లో రెండు ఇటుకల పొయ్యిలు, గోడకు రెండు చెక్క బీరువాలు, ఒకటి మడి బీరువా, ఆవకాయ కారాల జాడీలు పెట్టుకోవడానికి, రెండో బీరువాలో పెరుగు కుండలు, కాఫీ పొడి  పంచదార మొదలయినవి దాచుకునే సీసాలు. వాటితో పాటే పిల్లలకోసం తయారు చేసిన కారప్పూస, గవ్వలు, మణుగు బూరెలు వంటి చిరుతిళ్ళు. ఈ రెండు బీరువాలు తాకడానికి కూడా పిల్లలకు హక్కు వుండేది కాదు. మడి బీరువా మరీ అపురూపం. దానికి తాళం కూడా వుండేది కాదు, అందులోనే చిల్లర డబ్బులు దాచి పెట్టేవారు. పొరబాటున కూడా ఇంట్లో ఎవ్వరూ మైల బట్టలతో వాటిని తాకే సాహసం చేసే వాళ్ళు కాదు.

మా అమ్మగారు పొగచూరిన వంటింట్లో, కట్టెల పొయ్యి ముందు కూర్చుని,  ఒంటిచేత్తో  పదిమందికి వండి వార్చేది. ఆమె సామ్రాజ్యంలో రకరకాల పొయ్యిలు ఉండేవి. పాలు కాగబెట్టడానికి దాలిగుంటకాఫీ కాచుకోవడానికి బొగ్గులకుంపటి, వంట చేయడానికి మూడు రాళ్ల పొయ్యి, ఇలా దేనికి దానికి విడివిడిగా ఉండేవి. ఇక పెరట్లో బావి ప్రక్కన స్నానాలకోసం కాగులో నీళ్ళు మరగపెట్టడానికి మరో పెద్ద పొయ్యి సరేసరి. దాలిగుంట విషయం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వంటింటి వసారాలోనే ఓ మూలగా ఉండేది. నిప్పంటించిన పిడకలను ఆ దాలిగుంటలో దొంతరగా వేసి, పాలకుండని వాటిపై ఉంచిపైన ఒక రాతిపలకని దాలిగుంటకు మూతలా కప్పేవారు. సన్నటి సెగపై ఆ పాలు తీరిగ్గా కాగేవి. ఎరగ్రా కాగిన ఆ పాలపై  అరచేతి మందాన మీగడ కట్టేది.  మర్నాడు మా అమ్మ  కుండలోని  గడ్డ పెరుగుని ఒక గుంజకు కట్టిన కవ్వంతో చిలికేది. మజ్జిగపై తెట్టెలా కట్టిన తెల్లటి వెన్నని చేతుల్లోకి తీసుకుని, అరచేతిలో ఎగురవేస్తూ ముద్దగా చేసి, పక్కన నిలబడి ఆశగా చూసే చిన్నపిల్లలకి చిన్న చిన్న వెన్నముద్దలుపెట్టేది. ఆహా ఏమి రుచి! అని లొట్టలు వేస్తూ తినేసి ఆటల్లోకి జారుకునేవాళ్ళం. మగవాళ్ల సంగతేమో కానీ, ఆడవాళ్లకి ఆ రోజుల్లో చేతినిండా పనే. భోజనాలు కాగానేఅంట్లగిన్నెలు సర్దేసివంటిల్లు ఆవుపేడతో అలికేవారు. బాదం ఆకులతో విస్తళ్ళు కుట్టేవారు. రోకళ్లతో వడ్లు దంచేవారు. ఇంటికి దక్షిణాన ఉన్న రోటిపై కూర్చుని పప్పు రుబ్బేవారు. ఈ పనులు చేయడానికి విడిగా పనిమనుషులు ఉన్నా వారితో కలిసి ఈ పనులన్నీ చేసేవారు. శ్రమతెలియకుండా పాటలు పాడుతుండేవాళ్ళు. విలువ కట్టలేని వారి శ్రమా, విలువ కోరని వారి నిబద్ధతా చిన్న నాటి జ్ఞాపకాల దొంతర్లలో పదిలంగా ఉండిపోయాయి.

 వంటింటి వసారాలోనుంచి పెరట్లోకి గుమ్మం వుండేది. దానికింద వలయాకారంగా మెట్లు. కింద తులసి కోట. ఒక వైపు బాదం చెట్టు. అక్కడ అంతా  నల్ల చీమలు. ఎర్రగా పండిన బాదం పండ్లు కొరుక్కు తింటే భలే బాగుండేవి. ఇక బాదం పప్పు రుచే వేరు. దానికి పక్కనే  పున్నాగ చెట్టు. నేలరాలిన పూలు భలే మంచి వాసన వేసేవి. మా అక్కయ్యలు వాటిని సుతారంగా మడిచి మాలలు కట్టుకునే వాళ్ళు. మేము వాటితో బూరలు చేసి వూదేవాళ్ళం. దగ్గరలో ములగ చెట్టు. కొమ్మల నుంచి ములక్కాడలు వేలాడుతూ కనిపించేవి. అక్కడే రెండు బొప్పాయి చెట్లు కవల పిల్లల్లా ఉండేవి.

రెండో వైపు కొంచెం దూరంలో గిలక బావి. ఆ బావి చుట్టూ చప్టా. పక్కనే రెండు పెద్ద గాబులు (నీటి తొట్టెలు). ఒకటి స్నానాలకి, రెండోది బట్టలు ఉతకడానికి, అంట్లు తోమడానికి. స్నానాల గాబు పక్కనే వేడి నీళ్ళ కాగు. అక్కడే చెంబుతో వేడి నీళ్ళు,  గాబు లోని చల్ల నీళ్ళు సరిపాట్లు చేసుకుంటూ పిల్లలు స్నానాలు చేసేవాళ్ళు. మగవాళ్లు తుండు గుడ్డలు కట్టుకుని  బావిదగ్గర నిలబడి, పనివాళ్ళు నీళ్ళు తోడి ఇస్తుంటే నలుగు పిండితో వొళ్ళు రుద్దుకుంటూ స్నానాలు చేసేవాళ్ళు. నాకు బాగా బుద్ధి తెలిసే వరకు  ‘సబ్బు’ గృహ ప్రవేశం చేయలేదు.  బావి దగ్గర నుంచి వెనుక పెరట్లోకి చిన్న చిన్న కాలువలు ఉండేవి. నాలుగయిదు అరటి చెట్లు ఉండేవి. అరటి గెల ఒక దిక్కుకు కాస్తే ఇంటికి అరిష్టమని ఆ గెల వేసిన  చెట్టుని కొట్టేసేవారు.  ఇంట్లోకి అవసరం అయ్యే కాయగూరల్ని, ఆకు కూరల్ని అక్కడే పండించే వాళ్ళు. చుట్టూ కంచెగా వున్న  ముళ్ళ కంపకు కాకరపాదులు పాకించే వాళ్ళు, తేలిగ్గా ఓ పట్టాన కాయలు తెంపుకు పోవడానికి వీల్లేకుండా. అక్కడే మాకు పెద్ద పెద్ద బూడిద గుమ్మడి కాయలు, మంచి గుమ్మడి కాయలు కనబడేవి. అంత  పెద్దవి అక్కడికి ఎలా వచ్చాయో అని ఆశ్చర్యపడేవాళ్ళం. నాకు పొట్ల పందిరి ఇష్టం. పందిరి మీద అల్లుకున్న తీగె నుంచి పొట్ల కాయలు పాముల్లా వేలాడుతుండేవి. పొట్లకు పొరుగు గిట్టదు అనేది మా బామ్మ. పొరుగున మరో కూరగాయల పాదు వుండకూడదట.

బచ్చల పాదులు అంటే కూడా పిల్లలకు ఇష్టం. ఎందుకంటే వాటికి నల్లరంగుతో చిన్నచిన్న పళ్ళు (విత్తనాలు) కాసేవి. వాటిని చిదిమితే చేతులు ఎర్రపడేవి. నెత్తురు కారుతున్నట్టు ఏడుస్తూ పెద్దవాళ్ళని భయపెట్టే వాళ్ళం. బెండకాయలు, దొండకాయలు దొడ్లోనే కాసేవి. దొండపాదు మొండిది అనేవాళ్ళు. ఒకసారి వేస్తే చచ్చినా చావదట. ఇందులో యెంత  నిజం వుందో తెలవదు. ఆ పెరడు మధ్యలో రాణీ గారి మాదిరిగా కరివేపాకు చెట్టు వుండేది. నిజంగా చెట్టే. చాలా పెద్దగా, ఎత్తుగా  వుండేది. ఊరి మొత్తానికి అదొక్కటే కరివేపాకు చెట్టు కావడం వల్లనేమో ఊరందరి దృష్టి దానిమీదనే. మా బామ్మగారిది నలుగురికీ పంచి పెట్టే ఉదార స్వభావమే కాని, మడి పట్టింపు జాస్తి. మైల గుడ్డలతో కరివేపాకు చెట్టును ముట్టుకోనిచ్చేది కాదు. దాంతో ఎవరూ చూడకుండా ఎవరెవరో దొంగతనంగా కరివేపాకు రెబ్బలు తెంపుకు పోయేవాళ్ళు.  

బావి పక్కనే కంచెను ఆనుకుని విశాలమైన ఖాళీ స్థలం వుండేది. వెనుక వైపు దక్షిణం కొసన బండ్లు వెళ్ళడానికి రాళ్ళు పరచిన ఏటవాలు దారి వుండేది. అక్కడే జుట్టు విరబోసుకున్న రాక్షసి లాగా పెద్ద చింత చెట్టు. పగలల్లా ఆ చెట్టు కిందనే ఆడుకునే వాళ్ళం కాని పొద్దుగూకేసరికి చిన్న పిల్లలం ఎవరం ఆ ఛాయలకు పోయేవాళ్ళం కాదు. చింత చెట్టుకు ఓ పక్కన ఎరువుల గుంత వుండేది. గొడ్ల సావిట్లో పోగుచేసుకు వచ్చిన చెత్తనూ, పేడను అందులో వేసేవాళ్ళు. సాలు చివర్లో వాటిని జల్లబండ్లకు ఎత్తి పంట పొలాలకు ఎరువుగా వేసేవాళ్ళు. కనీసం యాభయ్, అరవై  బండ్ల ఎరువు పోగు పడేది.

(పెంకుటిల్లు కావడం, పాతపడి, తరచుగా రిపేర్లు చేయాల్సిరావడం, అంత పెద్ద ఇంట్లో మా మూడో వదిన గారు అరుణ వదిన  ఒంటరిగా ఉండాల్సిరావడం ఇత్యాది కారణాలతో పిల్లలు రఘు, రమేష్, సాయి పూనుకుని పాతఇల్లు పడగొట్టి పొందికగా, ఆధునికంగా వుండే ఒక డాబా ఇంటిని ఈ మధ్యనే కట్టించారు. తాతల కాలంలో కట్టిన ఇల్లు ఇప్పుడు మా జ్ఞాపకాలకే పరిమితం)

(కింది ఫోటోలు: తాతలు కట్టించిన పాత పెంకుటిల్లు, ఆ ఇంటి ముందు మా రెండో వదిన గారు విమలాదేవి, మా ఆవిడ నిర్మలాదేవి,  పిల్లలు కట్టించిన కొత్త డాబా ఇల్లు)






(ఇంకా వుంది)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి