18, నవంబర్ 2024, సోమవారం

అయాం ఎ బిగ్ జీరో అను నడిచివచ్చిన దారి ( 9 ) - భండారు శ్రీనివాసరావు

 బాల్యం. ప్రతి మనిషి జీవితంలో ఓ అద్భుత భాగం. కష్టాలున్నా బాధ్యతలు వుండవు. సుఖాలు అనుభవించడమే కాని వాటిని ఎలా సంపాదించుకోవాలనే తాపత్రయం వుండదు. ప్రేమను పూర్తిగా పొందడమే కాని తిరిగి పంచే పూచీ వుండదు.

గుర్తుండకపోయినా, బాల్యంలో పడ్డ ముద్రలు పెద్దయిన తరువాత కూడా ప్రభావాన్ని చూపిస్తాయి.

నా చిన్నప్పటి విషయాలు గురించి పెద్దవాళ్ళు చెప్పగా వినడమే కాని గుర్తున్నవి తక్కువ. గుర్తుంచుకోవాల్సినవి కూడా తక్కువేనేమో!

ఏడుగురు ఆడపిల్లలు, ముగ్గురు మొగపిల్లల తరువాత పదకొండోవాడిని నేను. అందరిలోకి  చిన్నవాడిని అని అందరూ గారాబం చేయడంతో మంకుతనం, ముట్టె పొగరు, కర్ణుడి కవచకుండలాల మాదిరిగా సహజసిద్దంగా అలవడ్డాయి. పెద్దలను ఎగర్తించి మాట్లాడ్డం, అనుకున్నది దొరికే దాకా గుక్క పట్టి ఏడ్వడం నా చిన్నతనం గురించి మా పెద్దల జ్ఞాపకాలు. ముఖ్యంగా అన్నం తినేటప్పుడు నెయ్యి కోసం చేసిన యాగీ అంతాఇంతా కాదు. కుడిచేతిలో నెయ్యి పోస్తుంటే అది వేళ్ళ సందుల్లోనుంచి కారిపోయేది. చేతినిండా నెయ్యి వేయలేదని గుక్క తిరగకుండా ఏడుపు.  గుక్కపట్టడం అనేది ఈనాటి తల్లులకు, పిల్లలకు బహుశా తెలియకపోవచ్చు. ఊపిరి కూడా పీల్చుకోకుండా అదేపనిగా ఆపకుండా ఏడ్వడం వల్ల ఒక్కోసారి పిల్లలు కళ్ళు తేలవేసేవాళ్ళు. అందుకే గుక్క పట్టే పిల్లలంటే తలితండ్రులు భయపడేవాళ్ళు. వాళ్ళు ఏది అడిగితే  అది ఆలోచించుకోకుండా చేతిలో పెట్టేవాళ్ళు. నా గుక్క సంగతి తెలుసు కనుక,   ఇక ఇది పని కాదనుకుని ఒక చిన్న వెండి గిన్నెలో నెయ్యి నింపి ప్రత్యేకంగా నా కంచం పక్కన పెట్టడం అలవాటు చేశారట. వయసు పెరిగిన కొద్దీ ఆ నెయ్యి అలవాటు కొంతవరకు పోయింది కానీ మొండితనం మాత్రం, ఎందుకు నచ్చానో తెలియదు కాని,  నాతోనే ఉండిపోయింది. పైగా తనకు తోడుగా ‘మాట తూలడం’ అనే తోబుట్టువును తోడు తెచ్చుకుంది. నిజానికి ఈ రెండూ లేకపోతే నేనూ ఒక ఆదర్శ పురుషుడిని అయ్యేవాడిని. కాని కొందరికి కొన్ని ఇలాటి ‘రోల్డ్ గోల్డ్ ఆభరణాలు’ ఆ దేవుడే తగిలిస్తాడు. ‘పుటక- పుడకలు’ సామెత అందుకే పుట్టిందేమో! అయితే  నేను పుట్టి పెరిగిన వాతావరణం మాత్రం  దీనికి పూర్తిగా విరుద్ధం. అందరు శాంత స్వభావులే. వారి మధ్య నా బాల్యం గడిచింది. కానీ వారి మంచితనం నాకు వంటబట్టలేదు.

“మా కుటుంబం మొత్తంలో మా చిన్న తాతగారు   భండారు సుబ్బారావుగారి తరహానే  వేరు. సుబ్బయ్య తాతగారిది  ఆధ్యాత్మిక దృక్పధం. జాలిగుండె. ఎవరికి కష్టం వచ్చినా చూడలేడు. కాకపొతే ప్రధమ కోపం. కాని అది తాటాకు మంటలాంటిది.  ఇట్టే ప్రజ్వరిల్లినా మళ్ళీ అట్టే చల్లారిపోయేది. చిన్నతనంలో చాలా దుడుకు మనిషి అని పేరు కాని పెద్దయిన తరువాత  చాలా మారిపోయాడు.

 పిల్లలు లేని కారణంగా వూళ్ళో అందర్నీ పిల్లలుగా చూసుకునే వారు. కష్టసుఖాలు గమనించి, అడగకుండానే  సాయం చేస్తూ  వుండేవారు. చివరికి మా రెండో అన్నయ్య రామచంద్రరావును చాలా చిన్నతనంలోనే  దత్తు తీసుకున్నారు. మా అన్నయ్యకు మాత్రం మా తాతయ్య మంచితనం వచ్చింది.

మా తాతయ్య సతీసమేతంగా తరచుగా తీర్ధయాత్రలు చేస్తుండేవారు. కాశీ రామేశ్వరాలు తిరిగివచ్చిన పుణ్యశాలి. ఆయన భార్య సీతమ్మ గారు  కందిబండ వారి ఆడపడుచు. భర్తకు జడియడమే సరిపోయేది. ఆ రోజుల్లో భార్యలపై చేయిచేసుకోవడం వుండేది. కాని మా తాతగారికీ, నాన్నగారికీ అది అలవడలేదు. అయితే మా చినతాతలిద్దరికీ ఆ అలవాటు వుండేది. సుబ్బయ్య తాతగారు మాత్రం ఆవేశంలో ఏదయినా తప్పుచేస్తే  వెంటనే పశ్చాత్తాపం చెందేవాడు. ఎవరిమీద అయినా చేయి చేసుకుంటే, ముందు బావి దగ్గరకు వెళ్లి తలస్నానం చేసి జందెం మార్చుకునేవాడు. అంతేకాదు. ఆ కొట్టిన వాడిని పిలిపించి మానెడు జొన్నలు ఇచ్చి పంపేవాడు. బీదాబిక్కీ ఎవరికయినా పనిదొరక్కపోతే, ‘ఇవాళ సుబ్బయ్యగారితో నాలుగు దెబ్బలు తిన్నా బాగుండు’ అనుకునేవారు. అంతేకాదు ఎవరయినా అప్పు అడగడమే తరువాయి, లేదనకుండా వెంటనే వందా రెండొందలు  ఇచ్చేవాడు. అసలు, వడ్డీ కలిపి ఎంతవుతుందో లెక్క కట్టి, ఎవరికెంత ఇచ్చిందీ వివరాలన్నీ పెన్సిల్ తో గోడమీద రాసేవాడు. ఒకసారి మరచిపోయి సున్నం కొట్టించాడు. అంతే!  మొత్తం పద్దులన్నీ మాఫీ. అప్పులు మాఫీ చేసే విషయంలో చరణ్ సింగుకు దోవ చూపించింది సుబ్బయ్య తాతయ్యే అనవచ్చు. సంగీతం అంటే చెవి కోసుకునేవాడు. ఆ తాలూకా మొత్తంలో మొదటిసారి గ్రామ ఫోన్ కొన్నది మా తాతయ్యే. పెద్ద పెద్ద గాయనీ గాయకులు పాడిన పాటలు, జావళీల రికార్డులు ఆయన దగ్గర వుండేవి.  గ్రామఫోన్లో దెయ్యపు పిల్ల దాక్కుని ఆ  పాటలు పాడుతోందని ముందు ఊళ్లోవాళ్ళు చాలా భయపడ్డారు. ఆయనకు కొంత కొంత  చట్టం తెలుసు. తనకు తెలిసిన పరిజ్ఞానంతో తీర్పులు చెప్పేవాడు. ఇక దానికి తిరుగుండేది కాదు. సుబ్బయ్యగారు ఎవరికీ అన్యాయం చేయదు అనేది ఊరివారి నమ్మకం.   

"ఒకసారి రైల్లో వెడుతున్నప్పుడు ఆయనకు  ఒక యువ సాధువు  కలిశాడు. ఆయన వర్చస్సు, పాండిత్యం చూసి మా చిన తాతగారు ముగ్ధుడై ఆయనను కంభంపాడు తీసుకు వచ్చారు. ఆ సన్యాసి పేరు శ్యాం ప్రకాష్ బ్రహ్మచారి. ఆయనను అంతా కాశీ స్వాములవారు అనేవారు.

ఆయన మా వూళ్ళో ఒక ఆశ్రమం స్థాపించారు. స్వామివారు హోమియో వైద్యం కూడా చేసేవారు. ఆయన బోధనలు విని మా తాతగార్లు,  తలా కొంత పొలం ఆయన గారి ఆశ్రమానికి దానంగా ఇచ్చారు. అందులో కొంత భాగంలో ఆయన తన ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అందులోనే  ఒక వేద పాఠశాలను కూడా నిర్వహించారు. అదంతా బహుశా  1930-40 ప్రాంతాల్లో కావచ్చు. ఆ కార్యకలాపాలతో  మండాలపాటి నరసింహారావుగారికీ,  విజయవాడ న్యాయవాది శ్రీ  దంటు శ్రీనివాసశర్మ గారికీ సంబంధం వుండేది. మా సుబ్బయ్య తాతగారు సతీ సమేతంగా కొన్నాళ్ళు ఆశ్రమంలోనే కాపురం పెట్టారు.    స్వాములవారు అక్కడే ఒక ఆలయాన్ని నిర్మించి, కాశీ నుంచి తెచ్చిన శివలింగాన్ని అక్కడ ప్రతిష్టించారు. అదిప్పుడు శిధిలావస్థకు చేరుకోవడంతో, కొన్నేళ్ళ క్రితం మా రెండో అన్నయ్య భండారు రామచంద్రరావు పూనిక వహించి, ఆ గుడిని  ఓ మేరకు అభివృద్ధి చేసి, ఒక  పూజారిని నియమించి ఆ ఖర్చుల నిమిత్తం ప్రతి నెలా కొంత మొత్తం పంపుతున్నాడు. ఆశ్రమం మాత్రం కాలగర్భంలో కలిసిపోయింది. దానికి మా పూర్వీకులు ఇచ్చిన పొలం ప్రభుత్వం తీసుకుని ఆ  ప్రదేశంలో షెడ్యూల్డ్ కులాలవారికోసం ఒక పెద్ద కాలనీ నిర్మించింది. దానం చేసిన స్థలం అలా ఒక సత్కార్యానికి ఉపయోగపడడం సంతోషదాయకం.  అసందర్భం అనిపించినా ఇక్కడ ఒక విషయాన్ని ప్రస్తావించక తప్పదు.

నా వయసు డెబ్బయి తొమ్మిది. నేను పుట్టేనాటికే మా ఊళ్ళో ఓ మిషనరీ పాఠశాల వుండేది. అది పూరిపాకలో కాదు. మంచి భవంతిలో. నిజంగా ఇది ఆశ్చర్యం కలిగించే విషయం.

నేను చదువుకున్న బడి నడి ఊళ్ళో వుంది. పూరిల్లు. వర్షం వస్తే సెలవు. అలా వుండేది.

మా తాతగారు భండారు సుబ్బారావు గారు ఓ స్వామీజీకి తనకున్న భూమిలో ఇరవై ఎకరాలు దానం చేసి ఆయనకు ఓ ఆశ్రమం కట్టించి ఇచ్చారు. ఊళ్ళోని రైతులు కూడా, మరో ఇరవై ఎకరాల దాకా సాయం చేశారు. కాశీ నుంచి తెచ్చిన శివలింగాన్ని స్వామీజీ ఆ ఆశ్రమంలో ప్రతిష్టించి ఓ చిన్న గుడి కట్టించారు. కొన్నాళ్ళు వైభవంగానే రోజులు గడిచాయి.

కాలక్రమంలో స్వామీజీ కాలం చేశారు. ఆశ్రమం పాడు పడింది. మా తాతగారు చనిపోయారు. గుళ్ళో దీపం పెట్టేవాళ్ళు కరువయ్యారు. ఆశ్రమానికి సాయం చేసిన మా కుటుంబంలోని వాళ్ళు కూడా పై చదువులకు, ఉద్యోగాలకు నగరాలకు తరలిపోవడంతో పరిస్థితి మరింత అధ్వాన్నం అయింది. మా తాతగారు దత్తు తీసుకున్న మా రెండో అన్నయ్య భండారు రామచంద్రరావు గారు ఓ ఇరవై ఎకరాలు గుడి పేరున వుంచి, దాన్ని ఆ పూజారికే వదిలివేశారు. దానిపై వచ్చిన ఆదాయం (కౌలు డబ్బులు) తో జీవనం గడుపుతూ, గుడి బాగోగులు చూడమని అప్పగించారు. ఆ భూములపై ఇప్పుడు మాకు ఎటువంటి హక్కులు లేవు.

మిగిలిన ఇరవై ఎకరాలను ప్రభుత్వానికి అప్పగిస్తూ అక్కడ ఓ ఎస్సీ కాలనీ నిర్మిస్తే బాగుంటుందని నాటి జిల్లా కలెక్టర్ కు ఓ లేఖ రాసారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రిటైర్ అయిన జంధ్యాల హరినారాయణ గారు అప్పుడు కృష్ణా జిల్లా కలెక్టర్.

ఆ ఉత్తరం చూసి ముందు ఆయన నమ్మలేదు. ఎస్సీ కాలనీల కోసం భూముల సేకరణకు తమ సిబ్బంది కాళ్ళకు బలపం కట్టుకుని తిరుగుతుంటే ఒక్కళ్ళూ భూములు ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. ఎవరీయన ఏకంగా ఇరవై ఎకరాలు దఖలు పరుస్తూ ఉత్తరం రాశారని ఆశ్చర్యపోతూ మా ఊరు వచ్చి స్వయంగా పరిశీలించి వెళ్ళారు. బహుశా ఆయన హయాములోనే అనుకుంటా జిల్లా మొత్తంలో ఓ పెద్ద ఎస్సీ కాలనీ మా ఊళ్ళో వెలిసింది.

ఇదంతా ఎందుకు అంటే..

పొరబాట్లు ఎక్కడ ఎలా జరిగాయో తెలిపేందుకు. అప్పటికే మూడు గుళ్ళు వున్న మా ఊళ్ళో మరో గుడి కట్టడానికి భూములు ఇచ్చిన రైతులు తర్వాత ఆ గుడిలో దేవుడిని పట్టించుకోలేదు. ఊళ్ళో బడి దిక్కూ మొక్కూ లేకుండా వుంటే దాని సంగతి పట్టించుకోలేదు.

అదే సమయంలో మిషనరీ వారు ఎక్కడో విసిరేసినట్టున్న మా ఊరువంటి ఓ మారు మూల గ్రామంలో ఓ మంచి పాఠశాల కట్టించారు. అక్కడ చదువుకున్న పిల్లలు జీవితంలో ఎంతో ఎదిగి వచ్చారు.

గుడి ప్రాధాన్యతను నేను తక్కువ చేసి చెప్పడం లేదు. కానీ సమాజానికి కావాల్సిన వాటిని అందించడంలో మన ధార్మిక సంస్థలు తగినంత కృషి చేయడం లేదు. కోట్ల కోట్ల ఆస్తులు కలిగిన సంస్థలు కూడా చదువుకూ, ఆరోగ్యానికీ ప్రాముఖ్యం ఇవ్వడం లేదు. ఏదైనా అంటే అది ప్రభుత్వాల బాధ్యత అంటారు.

కంచిపీఠం, రామకృష్ణ మఠం వంటివాళ్ళు చక్కని విద్యాలయాలు, వైద్యాలయాలు నిర్వహిస్తున్న సంగతి వాస్తవమే. కానీ విస్తృత హిందూ సమాజపు విద్య, వైద్య అవసరాలని అవి తీర్చగలిగే స్థాయిలో లేని మాట కూడా నిజమే. ఎందుకంటే హిందూ ధర్మ పరిరక్షణ అనేది మొదటి ప్రాధాన్యంగా అవి కార్య కలాపాలు నిర్వహిస్తున్నాయి.

విద్య, వైద్య రంగాల ప్రాధాన్యత గుర్తించిన మిషనరీ సంస్థలను నమ్ముకుని పైకి వచ్చిన వాళ్ళు మతం మారితే మనం తప్పుపడుతున్నాము. వాళ్ళని దూరం చేసుకుని, వాళ్ళే దూరం జరిగారని అనుకుంటే లాభం ఏమిటి?

అయితే, మతం మార్చుకుని కూడా ప్రభుత్వ సదుపాయాలను, సౌకర్యాలను అనుభవించడం అనేది పూర్తిగా ఖండించాల్సిన విషయం. ఇందులో భేదాభిప్రాయం లేదు. ఉండరాదు. సరే! ఇది తెగే అంశం కాదు. అసలు విషయానికి వస్తాను.

మా నాన్నగారికి సుస్తీ చేసిన సమయంలో సుబ్బయ్య తాతయ్య ఎంతో ఆదుకున్నాడు. అప్పులన్నీ తీర్చి వేసాడు. చికిత్స గురించి శ్రమ పడేవాడు. అప్పుడు మా పెద్దన్నయ్యకు పదిహేడు ఏళ్ళు ఉంటాయేమో. మా నాన్నకు ఎక్కడో  భద్రాచలం దగ్గర అడవుల్లో కోయవాళ్లు ఇచ్చే పసరు పనిచేస్తుందని ఎవరో చెబితే, తనకు ఇటువంటి వాటిల్లో నమ్మకం లేకపోయినా, తాను ఎన్నడూ  వెళ్ళని ప్రదేశాలకు ఒంటరిగా ప్రయాణం చేసి ఆ మూలికల మందు వచ్చాడు. తన చదువును ఫణంగా పెట్టి మా నాన్న కోసం ఆ పల్లెటూరులోనే వుండిపోయాడు. నిజమైన కష్ట జీవి.  సుబ్బయ్య తాతయ్యను బాగా దగ్గరగా చూసిన వాడు.

భోలాశంకరుడుగా పేరున్న సుబ్బయ్య తాతయ్య గారికి చివరి రోజుల్లో భగవంతుడు పరీక్షలు పెట్టాడు. ఆయన భార్య సీతమ్మగారు పక్షవాతంతో తీసుకుని మరణించింది. ఆయనకు  కూడా పెద్దతనంలో ఒక కాలూ చేయీ పడిపోయింది.  అంతకు ముందే తాను దత్తు తీసుకున్న మా రెండో అన్నయ్యకు, మాకు రెండిళ్ళ అవతల వుండే చామర్తి వీరభద్రరావు మామయ్య అమ్మాయి విమలాదేవితో చాలా సింపుల్ గా వివాహం జరిపించాడు. కట్నకానుకల ప్రసక్తి లేదు. అసలు మా ఇంట్లో ఎప్పుడూ ఈ గోల లేదు.  అంతకు ముందే మా పెద్దన్నయ్య వివాహం జరిగింది ఒక తాటాకు పందిరి కింద.  మా పెద్ద వదినగారు సరోజినిదేవిది  మేనరికం పెళ్లి.

పెళ్ళయిన కొత్తల్లో ఇద్దరు అన్నయ్యలు ఒకరు ఉద్యోగం నిమిత్తం,  మరొకరు చదువుల కోసం మా వదినలను ఇంట్లో పెద్దవారయిన  సుబ్బయ్య తాతయ్య, బామ్మ, అమ్మలను కనిపెట్టి చూడడానికి  మా ఊరిలోనే ఉంచారు. ఇంట్లో కరెంటు సంగతి అటుంచి మరుగు దొడ్డి కూడా వుండేది కాదు. పైగా పాములు, తేళ్ళ బాధ ఒకటి. విస్తళ్ళ కట్ట తీయబొతే అక్కడ ఒక పాము,  ఇంటి దూలానికి చుట్ట్టుకుని ఇంకో పాము. ఇంట్లో హమేషా జీతగాళ్ళు వుండేవాళ్ళు కాబట్టి, భయంతో  కేక వేయగానే వచ్చి వాటిని చంపడమో, పట్టుకుని బయట వదిలేయడమో చేసేవాళ్ళు. నేను మధ్య మధ్య మార్చి పరీక్షలు తప్పుతూ, సెప్టెంబర్ పరీక్షలకు తయారు అవుతాను అనే మిషతో  మా ఊర్లో నెలల తరబడి వుండిపోయేవాడిని. ఒకసారి అరుగు మీద కూర్చొన్నప్పుడు మండ్రగబ్బ కుట్టింది. ఆ బాధ వర్ణనాతీతం. ఏడ్చి మొత్తుకుంటుంటే మా బామ్మ ఎవరినో పిలిపించి తేలుమంత్రం వేయించింది. అలాంటి ఇంట్లో, కొత్తగా కాపురానికి వచ్చిన  మా ఇద్దరు వదినలు ఎంతో ఓపికగా పెద్దవారికి సేవచేసేవారు. మట్టి ఇల్లు. అప్పటికి బండలు వేయించలేదు. ప్రతిరోజూ వంటింటిని ఆవుపేడతో అలికేవారు.  పక్షవాతంతో మంచానపడిన మా సుబ్బయ్య తాతయ్యకు మా రెండో వదిన గారు విమల స్వయంగా అన్నం తినిపించడం నాకు బాగా గుర్తు. ఇప్పుడు వాళ్ళూ పెద్దవాళ్లు అయ్యారు. ఆనాటి సేవల పుణ్యం  ఇప్పుడు  అక్కరకు వస్తోంది. వారి సౌశీల్యం, సహనం మళ్ళీ మా కుటుంబంలోకి అడుగుపెట్టిన  కోడళ్ళకు రావడం మా  అదృష్టం. కంటికి రెప్పలా కనిపెట్టుకుని చూస్తున్నారు.  

కింది ఫోటో:

దత్తు తీసుకున్న మా రెండో అన్నయ్య రామచంద్రరావుతో సుబ్బయ్య తాతయ్య, సీతం బామ్మ.



ఇంకా వుంది.    

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి