ప్రతి
ఇంటికి ఒక ఇలవేలుపు ఉంటాడు. నాకు సంబంధించినంతవరకు మా ఇంటి ఇలవేలుపులు ఇద్దరు. ఒకరు మా పెద్దన్నయ్య భండారు పర్వతాల
రావు గారు. రెండోవారు మా రెండో అన్నయ్య భండారు రామచంద్రరావు గారు.
పొతే, మా పెద్దన్నయ్య భండారు పర్వతాల
రావు గారంటే నాకెంత గౌరవం వుందో
అంతకుమించి రెట్టించిన కోపం కూడా వుంది.
(శ్రీరాముడి మీద భక్త రామదాసుకు కోపం వచ్చినట్టు. అది సభక్తిక ఆగ్రహం)
గౌరవం ఎందుకంటే ఆయన్ని మించి
గౌరవించతగిన గొప్పవ్యక్తి ఈ సమస్త
భూప్రపంచంలో నాకు మరొకరు ఎవ్వరూ లేరు. ఇక
కోపం ఎందుకంటే, ఆయన బతికి వున్నప్పుడు ‘చెన్నా టు
అన్నా’ అనే పుస్తకం రాస్తుంటానని ఎప్పుడూ చెబుతుండేవాడు. మొదటిసారి చెన్నారెడ్డి
ముఖ్యమంత్రి అయినప్పుడు పీఆర్వో ఆయనే. ఆ రోజుల్లో పీఆర్వో, అన్నా, సీపీఆర్వో అన్నా, ప్రెస్ సెక్రెటరీ అన్నా సమస్తం ఆయనే. తరువాత అంజయ్య, భవనం వెంకట్రాం, కోట్ల విజయ భాస్కర రెడ్డి, ఆ తదుపరి మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రభుత్వానికి నేతృత్వం వహించిన
నందమూరి తారక రామారావు, ఇలా ఏకంగా వరుసగా అయిదుగురు
ముఖ్యమంత్రులకు పౌరసంబంధాల అధికారిగా పనిచేసిన అనుభవం ఆయనది. అందుకే ఆ పుస్తకం
పేరు అలా పెట్టాడు. కానీ రాయకుండానే
దాటిపోయాడు. అదీ నాకు కోపం. ఆయన ధారణశక్తి అపూర్వం. ఒక విషయం విన్నా,
చదివినా ఎన్నేళ్ళు అయినా మరచిపోడు. తారీఖులతో సహా గుర్తు. ఇక విషయం వివరించడంలో, మా అన్నయ్య అనికాదుకానీ, ఆయనకు ఆయనే సాటి. ఇంగ్లీష్, తెలుగు భాషలు కొట్టిన పిండి. రాసినా, మాట్లాడినా అదో అద్భుతమైన శైలి. అన్నింటికీ మించి వెలకట్టలేని నిబద్ధత. అలాటివాడు అలాటి పుస్తకం రాశాడు అంటే గొప్పగా వుండి
తీరుతుందనే నమ్మకం అందరిదీ. ఒక విషయం,
తమ్ముడిని
కాకపోయుంటే ఇంకా గొప్పగా పొగిడేవాడిని.
ఎందుకో ఏమిటో కారణం తెలవదు. గొప్ప
ఆధ్యాత్మిక గ్రంధాలు ఎన్నో ఒంటి చేత్తో రాశాడు కానీ, రాజకీయాల జోలికి వెళ్ళలేదు. నేల మీద చాప
వేసుకుని కూర్చుని, కాగితాల బొత్తి తొడమీద పెట్టుకుని వందల,
వేల పేజీలు
రాస్తూ పోయాడు. పైగా రాసినవన్నీ
రిఫరెన్సుకు పనికి వచ్చే గ్రంధాలు. కంప్యూటరు లేదు, ఇంటర్ నెట్ లేదు. టైప్ చేసేవాళ్ళు లేరు. ప్రూఫులు దిద్దేవాళ్ళు లేరు,
ఎందుకంటే రాసిన విషయాలు అటువంటివి, పేర్కొన్న శ్లోకాలు అటువంటివి. తభావతు రాకూడదు, స్ఖాలిత్యాలు వుండకూడదు.
ఒంటిచేత్తో అన్నదందుకే. నరసింహస్వామి
తత్వం గురించి అవగాహన చేసుకుని రాయడానికి దేశంలో ఎక్కడెక్కడో వున్న నరసింహ
క్షేత్రాలు సందర్శించాడు. కోల్కతా,
చెన్నై వంటి నగరాలలోని గ్రంధాలయాల చుట్టూ తిరిగి రాసుకున్న నోట్స్ తో
అద్భుత గ్రంధాలు వెలువరించాడు. ఏ ఒక్క పుస్తకాన్నీ అమ్ముకోలేదు. అటువంటి వాటిపట్ల
మక్కువ వున్నవారికి ఉచితంగా కానుకగా ఇచ్చేవాడు. ఆ క్రమంలో ఒకరకమైన ఆధ్యాత్మిక
చింతనలో మునిగిపోయాడు. బహుశా మానసికంగా ఒక
స్థాయికి చేరిన తరువాత ఆయనకు ఈ పారలౌకిక విషయాలు అన్నీ పనికిమాలినవిగా అనిపించాయేమో
తెలవదు.
ఇప్పుడు ఇన్నాళ్ళకు అనిపిస్తోంది ఆయన
చేసిన పని సబబేనని. ఏవుంది ఈ రాజకీయాల్లో. రాసింది ఒకళ్ళు మెచ్చుతారా, ఒకళ్ళు నచ్చుతారా! అందరూ గిరిగీసుకుని కూర్చున్నారు. ఒకరు మెచ్చింది
మరొకరు నచ్చరు. తమ మనసులో వున్నదే రాయాలంటే ఇక రాయడం ఎందుకు? అసలు ఇంత అసహనం ఎందుకో అర్ధం
కాదు. ఈ స్థాయిలో రాజకీయ నాయకుల పట్ల, సినీ
హీరోల మాదిరిగా అభిమాన దురభిమాన ప్రదర్శనలు ఎందుకోసం? రవ్వంత వ్యతిరేకత
ధ్వనించినా సహించలేని పరిస్తితి. చరిత్ర తెలియాలంటే జరిగింది జరిగినట్టు
చెప్పేవాళ్ళు వుండాలి. వాళ్ళు చెప్పింది వినేవాళ్ళు వుండాలి. అప్పుడే చరిత్ర,
చరిత్రగా రికార్డు అవుతుంది. కానీ ఈ ముక్కలు ఎవరి చెవికీ ఎక్కడం
లేదు.
ఇవన్నీ చూస్తున్న తరువాత మళ్ళీ మళ్ళీ అనిపిస్తోంది ఆయన రాజకీయం రాయకపోవడం రైటే
అని.
అయితే, నేను ఈ శీర్షిక మొదలు పెట్టినప్పుడు
కొందరు ఇదే విషయం అడిగారు. నీ వృత్తి జీవితంలో పూర్ణభాగం రాజకీయులతో గడిచింది కదా!
మరి నువ్వయితే ఏం చేస్తావ్ అని. ఓ పది, పదిహేనేళ్ల క్రితం ఇది మొదలు పెట్టి వుంటే,
నిస్సంకోచంగా వున్నది వున్నట్టు రాసేవాడిని. ఈనాడు, మారిన పరిస్థితుల్లో నేనే కాదు, నిజాయితీతో
పనిచేసే ఏ జర్నలిస్టుకు ఈ అవకాశం లేదు. విరుచుకుపడడానికి అన్ని పక్షాల వారు
ఎప్పుడు కాచుకునే వుంటారు. వారి నుంచి కాచుకోవడం ఎలా అన్నదే పెద్ద టాస్క్. తెలుగు రాజకీయాలను గురించి అన్ టోల్డ్ స్టోరీస్
నా దగ్గర వంద వరకు వున్నాయి. అవన్నీ ఎవరికో ఒకరికి మనస్తాపం కలిగించేవే. ఆ సంగతి
నాకు తెలుసు. వెయిట్ చేయండి. నేనూ రాస్తాను, ఎలా రాస్తానో చూద్దురు కానీ అని కాస్త
విసురుగానే జవాబు చెప్పాను. అలా రాసే ఓపిక
వుంది. కానీ ఆ మాత్రం వ్యవధానం నాకు ఆ పైవాడు ఇవ్వాలి.
ఇక విషయానికి వస్తే, మా పెద్దన్నయ్య ఎన్నో రాస్తూ, మరెన్నో
చెబుతుండేవారు. ఏ ఒక్కరికోసమో కాకుండా, జనాంతికంగా. నిజంగా అవన్నీ శ్రద్ధగా
విని రాసుకుని అక్షరబద్ధం చేస్తే దాన్ని
మించిన రచన మరొకటి వుండదు. ఆయన ఏది చెప్పినా నేను మనసు పెట్టి వినేవాడిని. కానీ ఏం
లాభం? ఏనుగుని సృష్టించిన ఆ
సృష్టికర్త ఆ పెద్ద జంతువుని శాకాహారిని చేశాడు. లేకపోతే ఈ ప్రపంచం ఏమై వుండేది.
అలాగే నా విషయంలో. నాకు మతిమరపు అనే
శాపాన్ని ప్రసాదించాడు. రాయడం అనే శక్తి వుంది కానీ అన్నీ గుర్తు వుండాలి కదా! అదే నాలోని పెద్ద లోపం.
నార్ల గారు చెప్పేవారు. తెలియనిది, గుర్తు లేనిది ఊహించి రాయకు అని.
అందుకే, అన్నయ్య రాసిన వాటిని, అముద్రితాలను
సయితం సేకరించడం, ఎవరి నోటి నుంచయినా, వాళ్ళు నాకంటే చిన్నవాళ్లు అయినా సరే, ఆయన మాటలు
వినబడితే, మళ్ళీ జాగ్రత్తగా నోట్ చేసుకోవడం అలవాటు చేసుకున్నాను. ఆయన చెప్పిన మాటలు, రాసిన
రాతలు నా ప్రతి రచనలో కనపడతాయి. కాబట్టి
నా పేరుతో వచ్చిన రచనలకు ఏమైనా కీర్తి ప్రతిష్టలు అంటూ వస్తే, నేను గుండె మీద చేయి
వేసుకుని చెబుతున్నాను, వాటిల్లో సింహభాగం మా అన్నయ్యకే చెందుతుంది.
మా అన్నయ్య మంచి గుణాలు ఏవీ నాలో లేవు.
కానీ, నిజాయితీగా రాయడం మాత్రం ఆయన నుంచే నేర్చుకున్నాను.
చాలా సంవత్సరాలక్రితం ఆయన ఒక వ్యాసం
రాసారు. “డబ్బు కావాలా? దరిద్రం పోవాలా” అనేది దాని శీర్షిక.
“ఒకానొక గర్భదరిద్రుడు దేవునిగూర్చి గొప్ప తపస్సు చేస్తాడు.
ఆయన ప్రత్యక్షమై వరం కోరుకోమంటాడు.
భక్తుడు తన పరిస్తితి చెబుతాడు.
దేవుడప్పుడు చిరునవ్వు నవ్వి, ‘’డబ్బు కావాలా ? దరిద్రం పోవాలా ?’ అని అడుగుతాడు.
దాంతో భక్తుడికి కళ్ళు తెరిపిళ్ళు పడతాయి.
“దరిద్రం అంటే డబ్బు లేకపోవడం కాదు, డబ్బున్న దరిద్రులు కూడా లోకంలో చాలామంది వున్నారు. వాళ్ళకంటే తానే మిన్న
అని తెలుసుకుంటాడు.”
మా అన్నయ్య చిన్న కుమార్తె చిరంజీవి వాణి ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ వుంటుందిలా.
“చిన్నప్పుడు తాతయ్య తద్దినానికి కంభంపాడు వెళ్ళినప్పుడు నాన్న వరండాలో కూర్చుని మాట్లాడుతుంటే వూళ్ళో ఎంతో మంది వినడానికి వచ్చేవారు. నాన్న ఎవరి అభిరుచికి తగ్గట్టు అ అంశం వారితో ముచ్చటి పెడుతుంటే వినేవాళ్ళు అయస్కాంతంలా అతుక్కుపోయి వింటూ వుండేవాళ్ళు. నాన్న మాట్లాడే మాటల్లో రెండు విషయాలు చోటు చేసుకునేవి కావు. ఒకటి ఆత్మస్తుతి, రెండోది పరనింద.”
ఆయన చేసినవి చిన్నా చితకా ఉద్యోగాలు కావు. అయిదుగురు ముఖ్యమంత్రులకు (చెన్నా టు అన్నా అంటే చెన్నారెడ్డి,అంజయ్య, భవనం, కోట్ల, ఎన్టీఆర్ ) పీఆర్వో గా పనిచేశారు, వాళ్లకి
మాట రాకుండా, తను మాట పడకుండా.
సమాచార శాఖ డైరెక్టర్ గా, ఆంధ్రా బ్యాంక్ చీఫ్ పీఆర్వో గా, ఫిలిం
డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేసి 1993లో రిటైర్ అయ్యారు. ఆడపిల్లల పెళ్ళిళ్ళ
కోసం పెన్షన్ లో మూడింట రెండు వంతులు ముందుగానే
అమ్ముకున్నాడు. బహుశా ఆయన తనకోసం చేసుకున్న పైరవీ
ఇదొక్కటేనేమో. సాధారణంగా ఒప్పుకోని రూల్స్ ని పక్కన పెట్టించి పెన్షన్ డబ్బులు తీసేసుకున్నాడు. సీనియర్ అధికారి హోదాలో పెద్ద మొత్తాన్ని పించనుగా పొందే అవకాశాన్ని
వదులుకున్నాడు. (ఆయన చనిపోయిన తరువాత ఎప్పుడో రెండు దశాబ్దాల పిదప జ్వాలా
నరసింహారావు పూనికతో, మా వదిన గారికి ఫ్యామిలీ పెన్షన్ పునరుద్ధరించారు)
రిటైర్ అయిన తర్వాత, పెన్షన్ కూడా లేని స్థితిలో తన శేషజీవితం పుట్టపర్తిలో గడిపారు. ఆయన ఎందుకలాంటి
నిర్ణయం తీసుకున్నారో నాకయితే ఇప్పటికీ అర్ధం కాదు. ఈ
నిర్ణయం తీసుకోవడానికి కారణం, ఒక వయసు వచ్చిన తర్వాత వానప్రస్థాశ్రమం
మాదిరిగా అన్నీ వదులుకుంటూ అక్కడికి చేరాడేమో అనిపిస్తుంది. ఆయన్ని చూడడానికి హైదరాబాదు
నుంచి ఒకసారి పుట్టపర్తి వెళ్ళాము.
ప్రధాన వీధిలో ఆశ్రమానికి కొంచెం
దూరంగా ఓ చిన్న డాబా ఇల్లు. ఇరుకు దారి. చిన్న చిన్న మెట్లెక్కి వెళ్ళాలి. ఒకటే
గది. అందులోనే ఓ పక్కగా గ్యాస్ స్టవ్. వంట సామాను. ఊరంతా ఎక్కడ చూసినా బాబా
ఫోటోలు. చిత్రం! ఆయన గదిలో ఒక్కటి కూడా లేదు. ఒకప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయంలో
పనిచేసేటప్పుడు పరమహంస గారు పరిచయం. వారు బాబా గారికి సన్నిహితులు. ఆశ్రమం లోపల కాటేజీ సంపాదించుకోవడం
పెద్ద పని కాదు. కానీ అలాంటివి అన్నయ్యకు ఇష్టం వుండవు. ఊళ్ళో ఎక్కడికి వెళ్ళినా
మా అన్నయ్యా, వదిన నడిచే తిరిగేవారు. ఇలా అవసరాలు
తగ్గించుకుంటూ, అనవసరాలను వదిలించుకుంటూ జీవితం
గడపడానికి ఎంతో మానసిక పరిణితి వుండాలి. సాయంకాలం ఆశ్రమంలో భజనకు
వెళ్ళేవాళ్ళు. ముందు వరసలో కూచునే వీలు
వున్నా, కావాలని వెళ్లి చిట్టచివర గోడనానుకుని కూచునేవాడు. బాబాని
కలుసుకోగల అవకాశాలు ఉన్నప్పటికీ ఆయన ఎప్పుడూ ఆ ప్రయత్నం చేయలేదు. భజన సమయం
మినహాయిస్తే పగలూ రాత్రీ ఆ గదిలో కింద
కూచుని, కాలు మీద కాలు వేసుకుని, తొడమీద
కాగితాల బొత్తి పెట్టుకుని అనేక
ఆధ్యాత్మిక పత్రికలకు వ్యాసాలు
రాస్తుండేవాడు. దగ్గరలోని ఓ దుకాణంలో కాగితాలు కొంటూ వుండేవాడు. ఒకసారి ఆ షాపువాడు
ఎవరితోనూ అంటుంటే ఆ మాటలు మా వదిన చెవిలో పడ్డాయి.
“ఎవరండీ
ఈయన. ఎప్పుడు వచ్చినా దస్తాలకు దస్తాలు కొనుక్కుని వెడతారు.”
పుట్టపర్తిలో వున్నప్పుడు అన్నయ్య
రాసిన అనేక రచనల్లో సాయిగీత ఇదొకటి.
దీనికి కొంత పూర్వరంగం వుంది. భగవాన్ సత్య సాయి బాబా తన జీవిత కాలంలో చేసిన
అనేకానేక అనుగ్రహ భాషణల్లో జాలువారిన
హితోక్తులను, సూక్తులను అంశాల వారీగా వడపోసి, ఒక్క
చోట గుదిగుచ్చి, భగవద్గీతలో మాదిరిగా అధ్యాయాలుగా
విడగొట్టి టీకా టిప్పణి (టీక అంటే ఒక పదానికి గల అర్థం. టిప్పణి అంటే టీకకు టీక.
అంటే అర్థాన్ని మరింత వివరించి సుబోధకం చేయడమన్నమాట)తో సహా తయారు చేసిన బృహత్
గ్రంధం అది. అదొక బృహత్తర కార్యక్రమం. బాబాగారి ప్రసంగాల టేపులు తెప్పించుకుని
వినాలి. వింటూ నోట్స్ రాసుకోవాలి. వాటిని ఓ క్రమంలో అమర్చుకోవాలి. ప్రూఫులు కూడా
దిద్దుకుని మేలు ప్రతి సిద్ధం చేసుకోవాలి. ఇంత ప్రయత్నం సాగిన తర్వాత కూడా పడ్డ
శ్రమ అంతా బూడిదలో పన్నీరు అయ్యే అవకాశాలు వున్నాయి.
బాబా గురించి లేదా ఇతరులు ఆయన గురించి రాసిన రచనలు సత్యసాయి ట్రస్టు ప్రచురించాలి అంటే
వాటికి బాబా గారి ఆమోదం వుండాలి.
అందుకోసం పరమ హంస గారు చాలా శ్రమపడి ఆ
పుస్తకాన్ని డీటీపీ చేయించి, కవర్
పేజీతో సహా డమ్మీ కాపీని తయారు చేయించి, ఒక రోజు భజన ముగించి బాబా విశ్రాంతి
మందిరంలోకి వెళ్ళే సమయంలో, ఆ డమ్మీ కాపీని బాబా చేతుల్లో ఉంచారు. బాబా ఆ పుస్తకంలో
కొన్ని పుటలు పైపైన చూస్తూ, ఏమీ చెప్పకుండా దాన్ని తీసుకుని గదిలోకి వెళ్ళిపోయారు. అంతే!
మళ్ళీ బాబా తనంత తానుగా ఆ ప్రసక్తి
తెచ్చే వరకు ఆ ప్రస్తావన ఆయన ముందుకు తెచ్చే వీలుండదు. రోజులు గడిచిపోతున్నాయి
కానీ బాబా దాన్ని గురించి మాట్లాడక పోవడంతో ఇక అది వెలుగు చూసే అవకాశం లేదు అని
నిరుత్సాహ పడుతున్న సమయంలో హఠాత్తుగా ఒక రోజు బాబా ఆ పుస్తకం డమ్మీ కాపీని పరమహంస
గారికి ఇచ్చి, వేరెవరో ఎందుకు మనమే దీన్ని ప్రింట్
చేద్దాం అన్నారు. ఆ విధంగా సాయిగీత పుస్తకాన్ని సత్యసాయి పబ్లికేషన్స్ వారే
ప్రచురించారు. బాబా నోటి వెంట వెలువడిన సూక్తులు కాబట్టి అన్నయ్య ఆ పుస్తకం మీద
కనీసం సంకలన కర్త అనికూడా తన పేరు వేసుకోవడానికి సమ్మతించలేదు. సాయిగీత ప్రతులన్నీ అమ్ముడు పోయాయి. ఆసక్తి
కలిగినవారికోసం దాని లింక్ vedamu.org అనే వెబ్ సైట్ లో ఉంచినట్టు పరమహంస
గారు చెప్పారు. ఆధ్యాత్మిక విషయాల్లో అన్నయ్య అనురక్తిని గమనించి సత్య సాయి
పబ్లికేషన్స్ వారు ప్రచురించే సనాతన సారధి బాధ్యతలు అప్పగించాలని కొన్ని
ప్రయత్నాలు జరిగినా, దానికి కూడా ఆయన ఒప్పుకోలేదు. రాయడం
అనే బాధ్యత తప్పిస్తే వేరే బాధ్యతలు మోసే ఆసక్తి తనకు లేదని చెప్పారు. బాబాని
చూడడానికి పుట్టపర్తికి వచ్చే విదేశీయులకు తెలుగు నేర్పే బాధ్యతను అన్నయ్య
స్వచ్చందంగా నెత్తికి ఎత్తుకున్నారని, ఇంగ్లీష్ తెలిసిన తమకు ఇంగ్లీష్ లోనే
తెలుగు నేర్పేందుకు ఆయన ఎంచుకున్న పద్దతులను ఒక విదేశీ మహిళ డాక్యుమెంట్ చేసింది
కూడా.
విషాదం ఏమిటంటే భౌతికపరమైన సంపదలను ఆయన
కూడబెట్టలేదు, దాచుకోలేదు. ఆలాగే ఆధ్యాత్మిక పరమైన
రచనలు ఎన్నో చేసి వాటిని కూడా దాచుకోలేదు.
భౌతిక ప్రమాణాల ప్రకారం నిర్ధనుడుగా
దాటిపోవడం బాధ్యతారాహిత్యమే కావచ్చు. నైతిక విలువల కోణంలో చూస్తే అది
తప్పనిపించదు. ఆయన చూపించి వెళ్ళిన దారిలో మేము కొంత దూరం నడవగలిగినా జన్మధన్యమే.
కాకతాళీయమే కావచ్చు, 480 పేజీల
సాయిగీత పుస్తకంలో ఆఖరి వాక్యం ఇలా రాశాడు:
శ్రీరస్తు! శుభమస్తు! విజయోస్తు!
‘సాయి’జ్య సాయుజ్య ప్రాప్తిరస్తు!
చివరికి తన జీవనయానాన్ని
పుట్టపర్తిలోనే ముగించాడు. దానికి ముందు సినిమాల్లో క్లైమాక్స్ మాదిరిగా ఒక సంఘటన
చోటు చేసుకుంది. బహుశా అదే ఆయన ఆకస్మిక మరణానికి కారణమేమో!
2006వ సంవత్సరం ఆగస్టు 14 వ తేదీ ఉదయం
తెల్లవారుతుండగానే పుట్టపర్తి నుంచి మా అన్నయ్య ఒక్కరే హైదరాబాదు వచ్చారు. ఆయన మొహంలో ఎన్నడూ కనబడని
ఆందోళన. రాత్రంతా నిద్ర లేకుండా బస్సులో. పైగా రిజర్వేషన్ కూడా లేకుండా డెబ్బయ్
ఏళ్ళ పైబడిన వయసులో చాలా దూరం నిలబడే ప్రయాణం. అంచేత అలసట వల్ల అలా వున్నారేమో
అనుకున్నాం.
కానీ కారణం అది కాదు. ఆయన ఆందోళనకు కారణం దివాలా తీసిన ఒక ప్రైవేటు సహకార బ్యాంకు
తాలూకు లీగల్ నోటీసు.
‘మీరు తీసుకున్న రుణం ఒక్క పైసా కూడా ఇంతవరకు చెల్లింపు చేయలేదు, కావున మీ మీద కోర్టు ద్వారా చర్య తీసుకోబోతున్నాం’ అనేది సారాంశం.
గతంలో ఆయన హైదరాబాదులో వున్నప్పుడు
ఉన్న ఇంటి చిరునామా అందులో వుంది. జీవితంలో ఎవరికీ బాకీ పడరాదు అనే సిద్దాంతంతో
బతికిన మనిషికి ఇది పెద్ద షాకే.
స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా చీఫ్ జనరల్
మేనేజర్ గా రిటైర్ అయిన మా రెండో అన్నయ్య రామచంద్రరావు గారు,
బంధువు, అడ్వొకేట్ రావులపాటి శ్రీనివాసరావు అందరం కలిసి నాంపల్లిలో సహకార బ్యాంకుల వ్యవహారాలు చూసే అధికారి కార్యాలయానికి వెళ్లాం. ఆఫీసులో
సిబ్బంది పెద్దగా లేరు. సంబంధిత అధికారి ఆర్చుకుని తీర్చుకుని వచ్చేసరికి చాలా
పొద్దు పోయింది. రాత్రంతా ప్రయాణం చేసి పొద్దున్న ఏదో పేరుకు ఇంత బ్రేక్ ఫాస్ట్
చేసి రావడం వల్ల మా అన్నయ్య మరీ నీరసించి పోయాడు. మొత్తం మీద ఆ అధికారి వచ్చాడు.
మేము చెప్పింది విన్నాడు. ‘ఎక్కడో ఏదో పొరబాటు జరిగింది, మీరేమీ కంగారు పడకండి, మీకు ఈ అప్పుతో ఏమీ సంబంధం లేదు’ అనే
ధోరణిలో మాట్లాడాడు. ‘మనలో మన మాట ఈ బ్యాంకులో ఇలాంటివి ఎన్నో జరిగాయి, ఒక్కొక్కటీ మెల్లగా బయట పడుతున్నాయి’ అని కూడా అన్నాడు.
మేమందరం ఊపిరి పీల్చుకున్నాం, ఒక్క మా అన్నయ్య తప్ప. బ్యాంకును మోసం చేశారు అని వచ్చిన తాఖీదే ఆయన్ని
ఇంకా కలవరపెడుతున్నట్టుంది. మంచి మనిషికి ఓ మాట చాలు.
ఆ సాయంత్రమే మళ్ళీ పుట్టపర్తి ప్రయాణం.
వద్దన్నా వినలేదు. వదిన ఒక్కతే వుంటుంది అన్నాడు. ఇక తప్పదు అనుకుని ఆర్టీసీ
పీఆర్వో కి ఫోను చేసి డీలక్స్ బస్సులో సీటు పెట్టించాను. ఆ రాత్రే ఆయన
వెళ్ళిపోయాడు. అదే ఆయన్ని ఆఖరుసారి ప్రాణాలతో చూడడం.
సరిగ్గా వారం గడిచింది. ఆగస్టు 21వ తేదీన కబురు వచ్చింది, మాట్లాడుతూ మాట్లాడుతూ దాటిపోయాడని.
మా పెద్దన్నయ్య పర్వతాలరావు గారికి కూడబెట్టిన ధనం అంటూ ఏమీ లేదు.
కానీ జన్మతః వచ్చిన మానధనం మాత్రం పుష్కలంగా
వుంది.
మా పెద్దన్నయ్యకు అనేకరంగాల వారితో సన్నిహిత పరిచయం వుండేది. చాలామంది ఆయనకు తెలుసు, ఆయనకూ
చాలామంది తెలుసు. కానీ, ఆయన ఈ లోకంలో లేరన్న సంగతి వారిలో
చాలామందికి తెలవదు. ఇప్పటికీ చాలా
మంది అడుగుతుంటారు, మీ అన్నగారు ఎలావున్నారని? అంటే అంత నిశ్శబ్దంగా ఆయన
దాటిపోయారన్నమాట. ఆయన లేరన్న భావం మా ఇంట్లో ఎవ్వరికీ లేదు కాబట్టి నిజం చెప్పలేకా, అబద్ధం ఆడలేకా ఒక నవ్వు నవ్వి తప్పుకుంటూ వుంటాను.
భగవంతుడు ఆయనకు అష్టైశ్వర్యాలు
ఇవ్వకపోయినా, అనాయాస మరణం మాత్రం ప్రసాదించాడు.
కింది ఫోటో:
మా అన్నయ్యలు భండారు పర్వతాలరావు, భండారు
రామచంద్రరావు వారి నడుమ మా మేనకోడలు శారద భర్త, మాజీ ఐపిఎస్ అధికారి, ప్రసిద్ధ రచయిత
రావులపాటి సీతారాంరావు,
కుడిపక్కన చెవి ఒగ్గి వింటున్న నేను .
ఇంకావుంది
పుణ్యజీవి.
రిప్లయితొలగించండిAs on August 21, 2006 there have been recorded the experiences of 671 devotees of Bhagavan Sri Sathya Sai from almost all parts of the world and uploaded on to this site. This has been the single handed, dedicated and devoted effort of Sri Bhandaru Parvatala Rao, an outstanding public relations person, profound researcher, prolific writer, and spiritually enlightened.
రిప్లయితొలగించండిHe will be remembered by the prosterity by his research works on Lord Narasimha Avatar and his record of the experiences of the Divinity of Bhagavan Sri Sathya Sai of hundreds of devotees across the globe.
A rationalist in his convictions, he turned a very ardent devotee of Bhagavan Sri Sathya Sai after taking his residence at Puttaparthi about five years ago.
He merged into the Divine all of a sudden on August 21, 2006.
He is no more in his physical frame though his Spirit will always hover the experiences of the devotees of Bhagavan Sri Sathya Sai, whom he had met, recorded their experiences and uploaded on to this site.
It is certainly difficult, nay impossible, to find a very highly evolved spiritual soul like him to record the experiences of the devotees dispassionately, and with no exaggeration or understatement.
You are really great
రిప్లయితొలగించండి