ఆవు వెంట దూడలు కూడా (మా అక్కయ్య వెంట మేము) వచ్చాయని మా బావగారు అప్పుడప్పుడు జోక్ చేస్తుండేవారని మా అన్నపూర్ణక్కయ్య చెబుతుండేది. ముందు మా పెద్దన్నయ్య, తర్వాత నేను, ఆ తర్వాత పెళ్ళికావాల్సిన మా ఏడో అక్కయ్య భారతి ఇలా అందరం మా సరసక్కయ్య వెంట బావగారి ఇంటికి చేరినవాళ్ళమే. అలా పైకి నవ్వులాటకు అన్నా, పెట్టుపోతల విషయంలో ఆయనది వెన్నపూస మనస్తత్వం. నిజానికి నా చదువు ఒక దారికి రావడానికి అయినా, మా ఏడో అక్కయ్యకు పెళ్లి సంబంధం కుదిర్చి పెళ్లి చేయడంలో అయినా, మా బావగారి పాత్ర గొప్పది. ఆయన ఇంటి పేరిట వారు, నూజివీడు జమీందార్ దగ్గర దివానుగా పనిచేసిన తుర్లపాటి భైరవేశ్వరరావు గారు ఆయనకు జ్ఞాతులు. ఆయనకు బెజవాడ గాంధీ నగర్ లో విజయ ఫిలిమ్స్ ఎదురుగా ఒక పెద్ద మేడ వుంది. ఆయన కుమారుడు పాండురంగారావు మద్రాసులో ఆటోమొబైల్ ఇంజినీరింగ్ చదువుతున్నాడు. ఏడో అక్కయ్యకు ఆ సంబంధం ఖాయం చేశారు. అప్పటికి మా నాన్నగారు కాలం చేశారు. మా పెద్దన్నయ్య పర్వతాల రావు గారే అంతా నెత్తిన వేసుకుని పెళ్లి జరిపించారు. మా పెద్ద వదిన గారి పెద్దనాన్న కొండపల్లి రామచంద్ర రావు గారెకి బెజవాడ విజయ టాకీసు ఎదురు రోడ్డులో పెద్ద మేడ వుండేది. ఇప్పుడు దాని ముందు షాపులు వచ్చినట్టున్నాయి. ఆ ఇంటి ముందు జాగాలో పెళ్లి పందిరి వేసి (అప్పటికి షామియానాలు లేవు) పెళ్లి చేశారు. మా వూరి నుంచి హనుమయ్య గారనే వంట బ్రాహ్మణుడు బెజవాడ వచ్చి, గాడి పొయ్యి తవ్వి గుండిగెలతో వంటలు వండడం నాకు గుర్తు. మద్రాసులో చదువుతున్న మా బావగారి స్నేహితులు చాలామంది పెళ్ళికి రావడంతో మా వాళ్ళు కంగారు పడుతుంటే, హనుమయ్య గారు తాపీగా ఏం పర్వాలేదు మరో పాతికమంది వచ్చినా ఏం లోటు రాకుండా చూసుకుంటానని హామీ ఇచ్చి అన్నట్టుగానే పెళ్లి వారి నుంచి ఏ మాటా రాకుండా చూశారు. భైరవేశ్వర రావు గారు వయసులోనే కాకుండా మనిషి కూడా చాలా పెద్దమనిషి. లోటుపాట్లను పెద్దమనసు చేసుకుని, మనసులోనే పెట్టుకుని శుభకార్యంలో ఎలాంటి అపశ్రుతి దొర్లకుండా హుందాగా వ్యవహరించారు. ఆ విధంగా మా ఏడో అక్కయ్య వివాహం కూడా జరిగి పోయింది. ఇద్దరు అక్కయ్యలది ఒకే ఊరు కావడంతో నాకు చాలా వెసులుబాటుగా వుండేది.
ఈ పెళ్లి జరగడానికి చాలా కాలం క్రితమే మా నాన్నగారు రాఘవయ్య గారు ఏదో తెలియని జబ్బుకు గురై మంచాన పడి, కాలం చేశారు. మనిషి చనిపోవడం అంటే ఏమిటో నాకు తెలియని చిన్న వయస్సులోనే కన్ను మూసాడు.
కంభంపాడులో చనిపోతే, యాభయ్ మైళ్ళ దూరంలో వున్న బెజవాడకు ఆ కబురు అందడానికి రెండు రోజులు పట్టింది. కబురు మోసుకొచ్చిన బ్రాహ్మడు ఏదో చెప్పడం, మా అక్కయ్య గుండెలు బాదుకుంటూ ఏడవడం లీలగా గుర్తు. బస్సు పట్టుకుని పెనుగంచిప్రోలు వెళ్లి, బండి కట్టుకుని కంభంపాడు చేరే సరికి, దహన కార్యక్రమాలు పూర్తయి, కర్మతంతు మొదలయింది. కర్తగా మా పెద్దన్నయ్య పర్వతాలరావు గారు గుండుతో కనబడ్డారు. వచ్చిన చుట్టపక్కాలు నన్ను పొదివి పట్టుకుని ఏడుస్తుంటే, ఏమీ అర్ధం చేసుకోలేని వయస్సు. అప్పటినుంచి మా నాన్నగారి ఆబ్దీకాలు ఏటా పెడుతూనే వచ్చాము. కంభంపాడులో ఈ తద్దినాలకు ఒక ఉత్సవ రూపం కలిగించిన ఘనత మా మూడో అన్నయ్య వెంకటేశ్వరరావుది. డిసెంబరులో వచ్చే ఈ తద్దినానికి చుట్టపక్కాలందరికీ నవంబరు నుంచే పిలుపులు వెళ్ళేవి. తద్దినాలకు పిలుపులు ఏమిటని అంతా ఆశ్చర్యపోయేవారు. ఉత్త పిలుపులతో సరిపుచ్చకుండా పదేపదే వరస ఉత్తరాలు రాసి అందరికీ గుర్తు చేసేవాడు. ఏడుగురు అక్కయ్యలూ, బావలూ, వారి పిల్లలూ, నలుగురం అన్నదమ్ములం అందరం ఏటా ఒకచోట కలిసే సందర్భంగా మారిపోయింది మా నాన్న తద్దినం. మా చిన్నక్కయ్య నవ్వుతూ అనేది, మా ఇంట్లో పెళ్ళిళ్ళు తద్దినం లాగా సింపుల్, తద్దినాలు మాత్రం పెళ్ళిళ్ళు లాగా చాలా పెద్దఎత్తున జరుగుతాయని. పక్కజిల్లా ఖమ్మం జిల్లా రెబ్బవరంలో వుండే మా రెండో బావగారు రామచంద్ర రావు గారు రెండు గుడిసె బండ్లలో పెద్ద పెద్ద గిన్నెల్లో తోడు పెట్టిన పెరుగు, వాళ్ళ తోటలో పండిన పండ్లు, కాసిన కాయకూరలు పెట్టి ముందు రాత్రే ఆ బండ్లను బయలుదేరతీసేవారు. కుటుంబం అంతా బస్సులో బొమ్మకల్లు చేరే సరికి ఆ బండ్లు కూడా అక్కడికి చేరేవి. బస్సు దిగి ఆ బండ్లు ఎక్కి వత్సవాయి మీదుగా, వేములవరం, అక్కడి నుంచి బళ్లబాటలో కంభంపాడు చేరుకునే వారు. మా ఇంటి బ్రాహ్మణులు ఇంగువ వెంకటప్పయ్య గారు చాలా శాస్త్రీయంగా ఆ కార్యక్రమం చేసేవారు. దాంతో భోజనాల వేళ మించిపోయేది. చివరికి ఇది అందరికీ అలవాటయి పోయింది. తద్దినం భోజనం అంటే సాయంత్రం నాలుగు దాటాల్సిందే. ఇక ఊరబంతి పూర్తయ్యేసరికి రాత్రి బాగా పొద్దు పోయేది. పెట్రోమాక్స్లైట్లు పెట్టి చిన్న పిల్లలనాటికలు, డాన్సులతో ఊరివారందరికీ మంచి కాలక్షేపం అయ్యేది. దశాబ్దాలపాటు ఈ బరువును మా మూడో అన్నయ్య, బాధ్యతను మా పెద్దన్నయ్య మోశారు. వారిద్దరూ కన్ను మూసిన తరువాత, తద్దినం పెట్టేవాడి తమ్ముడి పాత్ర నుంచి కర్త పాత్రకు మారాను. మా మూడో అన్నయ్య వెంకటేశ్వర రావు గురించి కొంత చెప్పాలి. మా అమ్మ చనిపోయిన తర్వాత ఆయన పూనుకుని ఊరి పొలిమేరలో వున్న మా తోటలో అమ్మా నాన్నల గుడి కట్టించాడు. దీనికి మా పెద్దన్నయ్య పర్వతాల రావు గారు అమ్మపర్తి అని నామకరణం చేశారు. అందులో వారి విగ్రహాలను ప్రతిష్టించాడు. ఆ ప్రదేశం మా కుటుంబానికి రాజ్ ఘాట్. ఎవరం మా ఊరు వెళ్ళినా, అమ్మా నాన్నల గుడికి వెళ్లి దండం పెట్టుకుని రావడం ఆనవాయితీగా మారింది.
విషాదం ఏమిటంటే చనిపోయిన మా పెద్దన్నయ్య, మూడో అన్నయ్య స్మారక స్తూపాలు కూడా ఆ చెంతనే నిర్మించాల్సి రావడం.
కింది ఫోటోలు:
కంభంపాడులో మా అమ్మా నాన్నల గుడి. చనిపోయిన మా అన్నగార్ల స్మారక స్తూపాలు. మా నాన్నగారి అంతిమ ఘడియల్లో మా బావగారు హనుమంతరావు గారు తన దగ్గర వున్న కెమేరాతో తీసిన మా నాన్న అస్పష్ట చిత్రం. దీని ఆధారంగా మా రెండో అన్నయ్య రామచంద్ర రావుగారు ఒక చిత్రకారుడి సాయంతో గీయించిన మా నాన్న గారి ఊహా చిత్రం.
(ఇంకా వుంది)
మీ ఇంట్లో తద్దినం కూడా పెళ్లి లా చేస్తారు అని అక్కయ్య అన్న మాట నిజం ఎందుకంటే ఆ వంకన అన్ని కుటుంబాలు కలుస్తాయి 🌹🌹
రిప్లయితొలగించండి