చిన్నప్పుడు నాకు మా వూరిలో అక్షరాభ్యాసం చేసినదెవరో తెలియదు.
తెలిసినదల్లా మాష్టారంటే శివరాజు అప్పయ్య పంతులు గారు.
ఎనభై తొమ్మిది నిండి తొంభయ్యో పడిలో, ఏ రోగం రొష్టు బారినపడకుండా అనాయాస మరణానికి నోచుకున్నారు. నలుగురికి విద్యాదానం చేసిన పుణ్యం ఆయనకు ఆవిధంగా అక్కరకు వచ్చింది. మాకు ఇంత అక్షరభిక్ష పెట్టిన మహానుభావుడు దాటిపోయాడు. నిజంగా మహానుభావులకు మాత్రమే లభించే సునాయాస మరణం ఆయనకు దక్కింది.
అప్పయ్య గారు నాకు తెలిసిన మొట్టమొదటి న్యూస్ రీడర్ కూడా.
మాచిన్నప్పుడు, గూడా సుబ్రహ్మణ్య శాస్త్రి గారనే పంచాంగ రచయిత ఒక్కరే చందా కట్టి ఆంధ్రపత్రిక దినపత్రికను పోస్టులో తెప్పించేవారు. ఆ పేపరు మరునాడు సాయంత్రానికి కాని మా వూరు చేరేది కాదు. వూరు మొత్తానికీ అదే పేపరు. అప్పయ్య మాస్టారు వూరి నడిబొడ్డున నిలబడి ఆ పత్రికలోని వార్తలను అన్నింటినీ తన కంచు కంఠంతో చదివి వినిపించేవారు. వినే మా బోంట్లకు అచ్చు రేడియోలో వార్తలు విన్నట్టే వుండేది.
అప్పయ్య మాస్టారు ఇప్పుడు లేరు, ఆయన జ్ఞాపకాలు ఆయన దగ్గర ఓనమాలు దిద్దుకున్న మా వంటి వారిదగ్గర పదిలంగా వున్నాయి.
గరుభ్యోనమః 🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి