5, సెప్టెంబర్ 2024, గురువారం

ఈ లోకమే ఒక అద్దె ఇల్లు


“ఇంటి అద్దెలు భరించలేకపోతున్నాను, ఒక ఇల్లు ఇప్పించండి” అని అడిగాను
ముఖ్యమంత్రిని. ఒకరిని కాదు, ఇద్దరు ముఖ్యమంత్రులను. వాళ్ళూ ఇలా అడగ్గానే అలా ఇచ్చేసారు. 

1975 లో బెజవాడ ఆంధ్రజ్యోతి వదిలి హైదరాబాద్ ఆలిండియా రేడియోలో చేరాను అన్నమాటే కానీ,
రాజధాని నగరంలో ఇళ్ళ అద్దెలు నన్ను బెంబేలెత్తించాయి. ఆ సమయంలో ఎవరో చెబితే, రెంట్
కంట్రోల్ ఆక్ట్ కింద ప్రభుత్వానికి ధరఖాస్తు పెట్టుకుని, ఆ కాపీ నాటి  ముఖ్యమంత్రి జలగం వెంగళ రావు గారికి ఇచ్చాను.
గంటలో రెవిన్యూ అధికారులనుండి కబురు, వెంటనే దోమలగుడా వెళ్లి, పలానా ఇంటిని
స్వాధీనం చేసుకోమని. నేనూ మా ఆవిడా సంబరపడుతూ దోమలగూడాలో వున్న ఆ ఇంటికి
మేముంటున్న చిక్కడపల్లి నుంచి రిక్షాలో  ఎగురుకుంటూ వెళ్ళాము. అప్పుడు మేము అద్దెకు
వుంటున్న ఇంటితో పోలిస్తే అది చాలా పెద్ద భవంతి. కిరాయి మాత్రం మేము చెల్లించే
దానిలో నాలుగోవంతు కూడా లేదు. ‘ఆహా ఏమి అదృష్టం’ అనుకునే లోపల భోరున ఏడుపులు
వినవచ్చాయి. ఇంటివాళ్ళట. ఆ ఒక్క ఇల్లూ రెంటు కంట్రోలు కిందకు పోతే వాళ్ల పని అంతే
అట. మాకు ఏం చెయ్యాలో అర్ధం కాలేదు. ఇటు చూస్తే అధికారులు తొందరపెడుతున్నారు. అటు
చూస్తే ఇంటివాళ్ల ఏడుపులు గాభరా పెడుతున్నాయి. చివరికి ఆ ఇల్లు మాకు అక్కరలేదని
అధికారులతో చెప్పాము. ‘ముఖ్యమంత్రి పేషీతో వ్యవహారం కుదరదంటే కుదరద’న్నారు. నేను
గట్టిగా చెప్పడంతో, ఆ ఇల్లు మాకు నచ్చలేదని నాచేత కాగితం రాయించుకుని వెళ్ళిపోయారు.

గవర్నమెంట్ కేటాయించిన ఇంట్లోనే వుంటున్నానని బహుశా వెంగళరావు గారు  అనుకుండేవారేమో! ఎప్పుడయినా కనబడ్డప్పుడు ‘ఇల్లు వసతిగా వుంది కదా!’ అనేవారు. నేను అవుననీ కానీ, కాదనీ కానీ అనకుండా తలపంకించి
వూరుకుండేవాడిని. మొదటి ఇంటి కధ ఆ విధంగా ముగిసింది. 

చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్రానికి రెండో పర్యాయం ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ మనసులో

ఇంటి పురుగు తొలిచింది. ఆయన్ని కలిసి, అద్దెలు భరించడం కష్టంగా వుంది ఓ ఇల్లు ఇప్పించండి అని అడిగేశాను. ఆయన చిన్నగా నవ్వి, అదెంత భాగ్యం అన్నట్టు చూసి ఓ అధికారికి నన్నూ, నా పనీ ఒప్పచెప్పారు. ఇల్లు అంటే నా ఉద్దేశ్యం గవర్నమెంటు క్వార్టర్ అని.
అదయితే ఎంచక్కా  తక్కువ అద్దె కట్టుకుంటూ కాలక్షేపం చేయొచ్చని నా ఆలోచన.  ఆ అధికారికి నా తరహా నచ్చలేదు. క్వార్టర్ అయితే రేపు రిటైర్ కాగానే ఖాళీ చేసిపోవాలి అన్నాడు. నేనన్నాను. 'అదే మంచిది. నేను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిని. ఈ ఒక్క మినహాయింపు ఇచ్చి క్వార్టర్ అలాట్ చేస్తే నాకూ ఇబ్బంది వుండదు,
ముఖ్యమంత్రి గారికి కూడా మాట రాదు. నాకు క్వార్టరే  కావాలి అన్నాను. పిచ్చి బ్రాహ్మడిలాగున్నావే అన్నారాయన
వెక్కిరింతగా. వాతావరణం చల్లబరచడానికి, ‘నిజమే, క్వార్టర్ సరిపోదు, ఫుల్లు కావాలి’ అన్నాను. ఆయన పెద్దగా నవ్వేశాడు. 

ఎర్రమంజిల్ కాలనీలో ఐ.జే. 2 క్వార్టర్ నా పేరు మీద అలాట్ చేస్తూ మర్నాటికల్లా 
ఆర్డర్ వచ్చింది. 

2005 డిసెంబరులో దూరదర్సన్ నుంచి  రిటైర్ అయ్యేదాకా తక్కువ అద్దె కట్టుకుంటూ, అటూ ఇటూ ఐ.ఏ.ఎస్. అధికారులు, ఐ.పి.ఎస్. అధికారులు వుండే ఆ  కాలనీలో, సెకండ్ క్లాస్ టిక్కెట్టుతో ఫస్ట్ క్లాస్ బోగీలో ప్రయాణం చేస్తున్న ఫీలింగుతో సందేహిస్తూ కాలం  గడిపాము. 

మొత్తం కాలనీలో అధికారిక వాహనం కానీ, సొంత కారు కానీ లేని ఇల్లు మాదే. కారు షెడ్డు ఖాళీగా వుండేది.

అయిదుగురు ముఖ్యమంత్రులకు పీఆర్వోగా పని చేసి రిటైర్ అయిన మా పెద్దన్నయ్య పర్వతాల రావు గారు సొంత ఇల్లు లేకుండానే దాటి పోయారు.
తన ఉద్యోగ పర్వంలో కోట్ల రూపాయల ఇంటి రుణాలు మంజూరు చేసి స్టేట్ బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్ గా రిటైర్ అయిన మా రెండో అన్నయ్య రామచంద్ర రావు గారికి అమెరికాలో వుంటున్న అబ్బాయి కొనేంతవరకు సొంత ఇల్లు లేదు.
ఇద్దరు ముఖ్యమంత్రుల వద్ద  పదేళ్ళకు పైగా సీపీ ఆర్వో గా పని చేసిన మితృడు జ్వాలా నరసింహారావు కు కొడుకు కొనే దాకా స్వంత ఇల్లు అమరలేదు.
ఇంకా నేనెంత?
అసలు ఈ లోకంలో అందరూ నివసిస్తోంది అద్దె ప్రపంచంలో. పై వాడు ఎప్పుడు ఖాలీ చేయమంటే అప్పుడు తట్టాబుట్టా సదురుకోకుండానే ఖాళీ చేసి వెళ్ళిపోవాలి.

టపాని మించిన తోక టపా:
ఇది రాయడం కోసమే అసలు టపా.
78 ఏళ్ల వయసులో హైదరాబాదుకు వేల మైళ్ళ దూరంలో ఎక్కడో అమెరికాలో పశ్చిమ కొసన వున్న సియాటిల్ నగరం బెల్ వ్యూ లో MADRONA PARK కాలనీలో మా పెద్దవాడు కొనుక్కున్న ఇంటిలో  విశ్రాంతి తీసుకుంటూ వున్నప్పుడు ఈ పాత విషయాలు అన్నీ సినిమా రీలులా కళ్ళ ముందు తిరిగాయి. ఏది ఎప్పుడు ప్రాప్తమో అప్పుడే దొరుకుతుంది.
అమెరికాలో అందరి ఇళ్లు ఇంచుమించు ఇలాగే అనేకంటే ఇంతకంటే గొప్పగానే వుంటాయి. ఇండియా మధ్య తరగతి కళ్ళతో చూసే నా బోంట్లకి  ఇదే గొప్ప అనేలా వున్న మాట నిజం. 
నా పడక గది చాలా విశాలం. ఆనుకునే హోమ్ థియేటర్ హాలు, కాఫీ బార్, దీనికి తోడు అసలు బార్, మసాజు చైర్, బాత్ టబ్ వున్న రెస్ట్ రూమ్, అన్నింటికీ మించి నా మంచం పక్కనే గోడకు నాకు తోడుగా మా ఆవిడ ఫొటో.
ఇంతకంటే ఏం కావాలి?

చివరాఖరులో ఒక చిన్న మాట:
ఒక తరం జర్నలిస్టులు రిటైర్మెంట్ తర్వాత కొంత ఆర్థికంగా స్థిరపడడానికి కారణం వారి ప్రయోజకత్వం కాదు. వారి పిల్లలు విద్యా బుద్ధులు నేర్చుకుని జీవితంలో పైకి ఎదగడం.

10 కామెంట్‌లు:

  1. టపా బావుందండి
    విలేకరి గా వుండటం వల్ల ఇన్ ఫర్మేషన్ ఫ్లో లో ఫస్ట్ లైన్ లో వుండడం వల్ల వాటిని సద్వినియోగం చేసుకుని లైఫ్ కొంత బాగుపడేటట్టు చేసుకునే సామర్థ్యం కూడా కావచ్చు


    రిప్లయితొలగించండి
  2. ఏమిటి, చేతిలో మందు గ్లాసే ?
    "సేద' దీరుతున్నారా? చీర్స్ 👍🙂

    రిప్లయితొలగించండి
  3. "యిల్లుయిల్లనియేవు
    యిల్లునాదనియేవు |
    నీయిల్లుయెక్కడే చిలుకా ?"

    ("కన్యాశుల్కం" నాటకంలో కరటక శాస్త్రి గారి శిష్యుడు పాడే తత్వం 🙂)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వినరా గారండి
      షహరు కో ఇల్లున్న మీ లాంటి వాళ్లు పాడుకోవచ్చుగాని ఇల్లసలు లేని‌వారలకు ఓ ఇల్లన్నది మహా యోగము యాగం సుమండీ

      తొలగించండి
    2. "అజ్ఞాత" గారండి (10:11 am),
      మీరెవరో గానీండి నా గురించి పూర్తిగా అపోహలో ఉన్నట్లున్నారు‌ సుమండీ.

      నేనేమీ నావికుడను కానండి రేవుకో సెటప్పో, ఇల్లో ఉండడానికి 🙄😟.

      తొలగించండి
  4. పెద్దవాళ్ళతో పరిచయాలు ఉపయోగించుకుని క్వార్టర్స్ లాంటి సదుపాయాలు బాగానే పొందారు మీరు. మరదే లౌక్యం అంటే.

    రిప్లయితొలగించండి
  5. ఈ బ్లాగులో ఇదే కథ చదవడం ఇప్పటికి పదో సారి. ఎన్ని సార్లు దీన్ని recycle చేస్తారు?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రష్యా కబుర్లు , అద్దె ఇంటి కథ అలా రిపీట్ అవుతుంటాయి. చానల్స్ లో అవే సినిమాలు మళ్ళీ మళ్ళీ చూపుతారు కదా అలాగ.

      తొలగించండి
  6. అమరావతి రాజధానికి అనువైన ప్రాంతం కాదు అని శివరామకృష్ణ కమిటీ స్పష్టంగా చెప్పింది. ఆకాశ హర్మ్యాలు రాజధాని ఎంతమాత్రం అవసరం లేదు. ప్రస్తుతం ఉన్న భవనాలు చాలు. 2000 ఎకరాల భూమి సరిపోతుంది. వివిధ జిల్లాల్లో శ్రీ సిటీ వంటి ప్రత్యేక వాణిజ్య పారిశ్రామిక వాడలు ఏర్పాటు చేస్తే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి.

    రిప్లయితొలగించండి
  7. అద్దె ఇంటి కథలనపుడపుడు తిరగ
    బోత బెట్టును; మరల ద్రిప్పును జిలేబు
    ల వలె రష్యా విశేషములనటునిటు; వి
    లేకరుల జీవనము గూర్చి లెస్స బలుకు

    రిప్లయితొలగించండి