20, సెప్టెంబర్ 2024, శుక్రవారం

చివరి మూడు రోజులు



సెప్టెంబర్ 22 ఆదివారం ఉదయం అమెరికా నుంచి తిరుగు ప్రయాణం.
సియాటిల్ నుంచి బయలుదేరి సాల్ట్ లేక్ సిటీ మీదుగా రాత్రంతా విమానంలో ప్రయాణం చేసి  బాల్టిమోర్ ఎయిర్పోర్ట్ చేరుకునే సరికి ఉదయం ఆరుగంటలు. మా మూడో అన్నయ్య కుమారుడు సత్య సాయి వచ్చి మమ్మల్ని ఇంటికి తీసుకు వెళ్ళాడు. రాత్రి నిద్ర మొత్తం బుధవారం పగటి వేళ బాకీ తీర్చుకున్నాము. 
ఎందుకంటే మర్నాడు గురువారం ఆ మర్నాడు శుక్రవారం హెక్టిక్ స్కెడ్యూలు. మా అన్నయ్య పిల్లలు అమెరికాలో వుండడం వల్ల నా ప్రయాణం నల్లేరు మీద బండిలా సాగుతోంది. ప్యాంటు జేబులో దువ్వెన తప్ప చేతి సంచీ బరువు కూడా నన్ను మోయనివ్వడం లేదు. 
ఒకరకంగా చెప్పాలి అంటే గవర్నర్ గారి పర్యటన మాదిరిగా వుంది. అన్నీ ఎరెంజ్ చేసి కారు, విమానం ఎక్కమంటారు.
గురువారం అంతా అమెరికా రాజధాని వాషింగ్ డీ సీ అంతా కలయ తిరిగాము. Nations' most famous adress వైట్ హౌస్ మా ప్రియారిటీ.
సెక్యూరిటీ హడావిడి వుంటుందని అనుకుంటూ వెడితే అక్కడ ముగ్గురు నలుగురు సాయుధ పోలీసులు మాత్రమే కనిపించారు. ముందుగా ఆన్ లైన్లో బుక్ చేసుకుంటే విజిటర్లను లోపలకు కూడా  అనుమతిస్తున్నారు.
విచిత్రం ఏమిటంటే వైట్ హౌస్ కు వెళ్ళే మార్గంలో పేవ్ మెంట్ మీద ఇద్దరు బిచ్చగాళ్ళు కనిపించారు. అదే దోవలో పేవ్ మెంట్ పై వచ్చే నవంబర్ లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో  పోటీ పడుతున్న కమలా హారిస్, డొనాల్డ్ ట్రంప్ చిత్రాలు వున్న టోపీలు, టీ షర్టులు అమ్ముతున్నారు.
అమెరికా పార్లమెంట్, లింకన్ మెమోరియల్, వాషింగ్ టన్ మెమోరియల్ (ఎత్తైన స్థూపం) చూసాము. 
అమెరికా రాజధానిలో మేము చూసినంతవరకు ఆకాశ హర్మ్యాలు కానరాలేదు. దానికి కారణం వాషింగ్ టన్ మెమోరియల్ స్థూపం కంటే మించి ఎత్తైన భవనాలు నిర్మించరాదని చట్టం వుందని చెబుతారు.
సాయంత్రం తిరిగి బాల్టి మోర్ వస్తూ రీగన్ ఎయిర్పోర్ట్ సమీపంలో గ్రెవెల్లీ పాయింట్ అనే ఒక టూరిస్ట్ ప్రాంతానికి వెళ్ళాము. అప్పటికే అక్కడ వందకు పైగా వాహనాలు పార్కింగు ఏరియాలో ఆగిఉన్నాయి. విమానాశ్రయం నుంచి బయలుదేరే లేదా అక్కడ ల్యాండ్ అయ్యే విమానాలను ఆ పాయింట్ నుంచి చాలా దగ్గరగా చూడవచ్చు.
హైదరాబాదు బేగంపేటలో ఎయిర్పోర్ట్ వున్నప్పుడు దగ్గరలో ఒక ఫ్లై ఓవర్ మీద నిలబడి,  ఇలానే వచ్చిపోయే విమానాలను జనం ఆసక్తిగా చూసిన సంగతులు గుర్తుకు వచ్చాయి. 
విమానాలను కనుక్కున్న దేశం అమెరికా. ఎగిరే విమానాలను దగ్గర నుంచి చూడాలని వందలమంది కార్లలో తరలి వెడుతున్న దేశం అమెరికా. చిత్రంగా అనిపించడంలో ఆశ్చర్యం ఏముంది?.
అయితే ఒక విషయం ఒప్పుకుని తీరాలి. 
ఎంత చిన్న విషయాన్ని అయినా పర్యాటక ఆకర్షణగా మార్చి జనాలను రప్పించడంలో వారి తెలివితేటలు అమోఘం.
ఇక రేపు అంటే శుక్రవారం ఉదయం న్యూయార్క్ ప్రయాణం.
అమెరికాలో పర్యాటక ప్రదేశాలు చుట్టబెట్టాలి అంటే  ముందు సిద్ధపడాల్సింది కాలి నడకకు.

2 కామెంట్‌లు:

  1. వైట్ హౌస్ జూలో సింహం వున్నట్టు చువ్వల వెనుక వుందేమిటండీ ?


    రిప్లయితొలగించండి
  2. వైటు హౌజు ముందు చలువ అద్దాలతో స్టైలుగా మహేశ్ బాబు లాగా పోజు ఇచ్చారు. బాగుంది. విషాదం నుంచి కొంతమేరకు ఊరట పొంది తిరిగి స్వదేశం చేరుకుంటున్నారు. సంతోషం. మీ అమెరికా యాత్ర లో చక్కగా మీకు సకల సౌకర్యాలను కల్పించిన మీ బంధువర్గం వారు అభినందనీయులు.

    రిప్లయితొలగించండి