25, డిసెంబర్ 2023, సోమవారం

అమ్మకు డబ్బెందుకు? – భండారు శ్రీనివాసరావు

 అనసూయ, అనసూయమ్మగా రూపాంతరం చెందడానికి ఎక్కువ కాలం పట్టలేదు. పూర్వకాలం కనుక చాలా చిన్నతనంలోనే పెళ్ళిచేసి కాపురానికి పంపారు. వరసకాన్పులతో వయసుకు మించిన పెద్దరికం వచ్చిపడింది. ఆమె పేరు అనసూయకు అమ్మను చేర్చి అందరూ ఆమెను అనసూయమ్మ అనే పిలవడం మొదలెట్టారు. పెనిమిటి పోవడంతో బస్తీలో పిల్లల ఇంటికి చేరింది. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. కొన్నాళ్ళు పెద్దవాడి దగ్గరా, మరికొన్నాళ్ళు చిన్నవాడి దగ్గరా హాయిగా కాలం వెళ్ళిపోతోంది. అనసూయమ్మ గారికేం, ఎత్తుకెత్తుగా చూసుకునే పిల్లలు, నోరు తెరిచి అడిగే పనే లేదు, కొండమీద కోతిని అయినా తెచ్చి ఇవ్వగల సమర్ధులు ఆమె పిల్లలు. కోడళ్ళు కూడా అత్తగారిని  అపురూపంగా చూసుకునేవారు.  ఇది అది అని కాకుండా దేశంలోని పుణ్యక్షేత్రాలు  అన్నీ ఓపికగా  చూపించారు. అనసూయమ్మ మరిది కొడుకు అమెరికాలో ఉంటాడు. అతడికి కూడా ఆమె అంటే ఎంతో ఆపేక్ష. ఒకసారి వీసా ఇప్పించి తన వెంట ఆ దేశం తీసుకువెళ్లి ఓ ఆరు నెలలు ఆ దేశం  అంతా తిప్పాడు. ఎక్కడో మారు మూల పల్లెటూర్లో పుట్టి, బస్సు రైలు ఎక్కడమే గగనం అనుకునే అనసూయమ్మ,  ఏకంగా విమానంలో ఫస్ట్ క్లాసులో అమెరికా వెళ్లి రావడం చుట్టపక్కాల్లో ఆమె స్థాయిని పెంచింది.

ఇంతకంటే ఒక ఆడజన్మకు ఇంకేం కావాలి అనేవారు ఇరుగింటిపొరుగింటి అమ్మలక్కలు.

వయసు మీద పడిన అనసూయమ్మ ఒకరోజు పెద్దవాడి వడిలోనే తలపెట్టుకుని అనాయాసంగా కన్ను మూసింది. ఎంత పుణ్యాత్మురాలో అని అన్ని నోళ్ళు ఆమెని కొనియాడాయి.

అయితే కాపురానికి వచ్చినప్పటి నుంచి ఆమెకు ఒక కోరిక వుండేది. మామగారు తన కొద్ది సంపాదనలోనే కొన్ని డబ్బులు భార్యకు ఇచ్చేవాడు. పిల్లలు, మనుమలు, మనుమరాండ్రు ఇంటికి సెలవుల్లో వచ్చి తిరిగి వెడుతూ కాళ్ళకు దణ్ణం పెట్టినప్పుడు, మగడు ఇచ్చిన  డబ్బులు పావలా, అర్ధా వారిచేతిలో పెట్టేది. అప్పుడు  ఆ పిల్లల కళ్ళల్లో, అత్తగారి కళ్ళల్లో కనిపించే మెరుపును, తృప్తిని అనసూయ గమనించేది. తను పెద్ద అయినప్పుడు చిన్నపిల్లలు దగ్గరకు వస్తే, అత్తగారిలాగానే ఎంతో కొత్త మొత్తం చిన్నపిల్లల చేతిలో పెట్టాలని ఎంతోకాలంగా మనసులో గూడు కట్టుకుంటున్న ఈ చిన్న కోరిక తీరకుండానే ఆమె దాటిపోయింది.

అమ్మను దగ్గరుండి అన్నీ కనుక్కుంటున్నాం అనే భావనలో, అమ్మకు డబ్బు అవసరం ఏమిటి అనుకుంటూ ఉన్న  అనసూయమ్మ పిల్లలకు ఇంత చిన్న విషయం తట్టకపోవడం అనసూయమ్మ చేసుకున్న ఒకే ఒక దురదృష్టం.

25-12-2023       

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి